వనపర్తి: సంతలో కూరగాయల వ్యాపారం చేస్తూ నాలుగు పైసలు సంపాదించుకోవాలనుకున్నారు ఆ దంపతులు. సొంత ఆటోలో మార్కెట్‌కు వెళ్లి.. కూరగాయలు తెచ్చి.. గ్రామాల్లో జరిగే వారాంతపు సంతల్లో విక్రయించి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.. గత పదేళ్లుగా సాగుతున్న ఈ వ్యాపారానికి ఆదివారం తెరపడింది. బతుకు పోరులో దంపతులు ఓడిపోయారు. వీరి ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో భార్యాభర్తలు ఇద్దరూ విగతజీవులుగా మారారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో రేవల్లి మండలం నాగపూర్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..
వారాంతపు సంతలో విక్రయాలు..
పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లకు చెందిన వడ్డె నాగేశ్వర్‌రావు(55), నాగలక్ష్మమ్మ(50) భార్యాభర్తలు. కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకువచ్చి ఆయా గ్రామాల్లో వారాంతపు సంతల్లో విక్రయిస్తారు. ఈ క్రమంలో ఆదివారం రేవల్లి మండలం నాగపూర్‌లో సంత ఉండడంతో ఉదయం భార్యాభర్తలు సొంత ఆటోలో వెన్నచర్ల నుంచి కూరగాయలు తీసుకువచ్చేందుకు నాగర్‌కర్నూల్ బయలుదేరారు. రేవల్లి మండలం నాగపూర్ సమీపంలో ఆటో, ఎదురుగా వస్తున్న నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. దీంతో ఆటో పల్టీ కొట్టడంతో ఆటో నడుపుతున్న నాగేశ్వర్‌రావు ఎగిరి బస్సు ముందు టైరు కింద పడగా.. నాగలక్ష్మమ్మ ఆటోలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందారు. వీరితోపాటు ఆటోలో కూలీ డబ్బుల కోసం వెళ్తున్న వెన్నచెర్లకు చెందిన భార్యాభర్తలు వంక రాజు, లక్ష్మిలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని సమీపంలోని రేవల్లి కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అనంతరం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి తలకు బలమైన గాయమైంది. ఈ సంఘటనతో వీరి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు..
ప్రమాద విషయం తెలుసుకున్న వనపర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎంపీపీ జానకిరాంరెడ్డి, రేవల్లి ఎస్‌ఐ సురేష్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను రేవల్లి కమ్యూనిటీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన లక్ష్మి ఫిర్యాదు మేరకు వేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ నారాయణపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో మేనేజర్ రాజీవ్‌ప్రేమ్‌కుమార్ రేవల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాగేశ్వర్‌రావు, నాగలక్ష్మమ్మ దంపతులకు కుమారుడు సత్యం, కూతురు నాగలక్ష్మి ఉన్నారు. అంత్యక్రియల కోసం తక్షణ సాయంగా ఆర్టీసీ తరపున రూ.10 వేలు అందజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎక్కువ సందర్భాల్లో కుమారుడు సత్యం తల్లిదండ్రులతో కలిసి ఆటోను నడుపుతుంటాడు. కానీ మూడు రోజుల క్రితం ఆయన మిర్యాలగూడలో బంధువుల ఇంటికి వెళ్లడంతో తండ్రి ఆటోను నడిపి దుర్మరణం పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment