WANAPARTHY district
-
హైదరాబాద్- బెంగుళూరు హైవేపై ఘోర ప్రమాదం
సాక్షి, వనపర్తి జిల్లా: హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద మందడి మండలం వెల్టూర్ స్టేజి సమీపంలోని జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళుతున్న షిఫ్ట్ కారును వెనక నుండి డీసీఎం ఢీకొట్టడంతో కారు ముందు వెళ్తున్న ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన లారీని కారు ఢీ కొట్టింది.దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 108 అంబులెన్స్‌లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో పదేళ్ల బాలుడు, మరో మహిళ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కారులో వెళ్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాపం ఏ కష్టమొచ్చిందో.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
సాక్షి, వనపర్తి జిల్లా: జిల్లా కేంద్రంలోని తాళ్ల చెరువులో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వివాహిత అనుమానాస్పద మృతిమరో ఘటనలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆత్మకూరులోని స్థానిక బీసీకాలనీలో నివాసముంటున్న శ్రావణి(30) సోమవారం మధ్యాహ్నం 3:30గంటల సమయంలో చీరతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.విషయాన్ని గమనించిన భర్త పరశురాములు ఆమెను కిందకి దించి చుట్టుపక్కలవారికి, భార్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకొని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతిరాలికి ఒక కుమారుడు, ఒక కూతరు ఉన్నారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.భర్తే హతమార్చాడంటూ ఫిర్యాదు తమ కూతురు శ్రావణిని భర్త పరశురాములే హతమార్చాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివమాల దీక్షలో ఉన్న అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పేర్కొన్నాడు. -
బలిజపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన 9 మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్
-
వనపర్తి జిల్లాలో బస్సు ప్రమాదం
-
అర్ధరాత్రి ఘోర ప్రమాదం
కొత్తకోట: అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెరకు లోడుతో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ గరుడ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కొత్తకోట ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ గరుడ బస్సు 48 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో ముమ్మళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై చెరకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన గరుడ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గాడ్ల ఆంజనేయులు (42), క్లీనర్ తుప్పతూర్తి సందీప్‌యాదవ్ (19), వడ్డె శివన్న(47) అనే ప్రయాణికుడు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 16 మందికి తీవ్రగాయాలు కాగా వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన వారిని బంధువులు హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు తరలించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. కాగా, ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. భారీగా నిలిచిన ట్రాఫిక్ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంటలపాటు వాహనాలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, కొత్తకోట సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. భారీ క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు. మృతుల్లో బస్సుడ్రైవర్ ఆంజనేయులుది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం కాగా.. క్లీనర్ సందీ‹ప్‌యాదవ్ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునగలవేడు వాసి. ప్రయాణికుడు శివన్నది ఏపీలోని అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలం వెంకటంపల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఆంజనేయులు, క్లీనర్ సందీప్ మృతిచెందడంతో హైదరాబాద్‌లోని మియాపూర్ డిపో సిబ్బంది వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చదవండి: అద్దె బస్సులు కొంటాం! -
కూతురి ప్రేమ వ్యవహారం.. కుటుంబం పరువుపోతుందని..
పెబ్బేరు: కళ్లల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన కూతురిని ఓ తండ్రి పొట్టనపెట్టుకున్నాడు. కూతురి ప్రేమ వ్యవహారంతో కుటుంబం పరువుపోతుందని భావించి క్షణికావేశంలో ఆమెను పొడిచి చంపాడు. ఈ సంఘటన మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లిలో చోటుచేసుకుంది. పాతపల్లికి చెందిన బోయ రాజశేఖర్, సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రెండోకూతురు గీత(15) పెబ్బేరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు, గీత ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసి రాజశేఖర్ తన కూతురిని మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీపావళి పండుగకు కుటుంబసభ్యులతో కలసి గీత అమ్మమ్మ ఊరైన వనపర్తి మండలం చందాపూర్‌కు వెళ్లింది. సోమవారం సాయంత్రం తండ్రి, కూతురు పాతపల్లికి తిరిగి వచ్చేశారు. రాత్రి సమయంలో బయటికి వెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చిన గీతను తండ్రి కొట్టాడు. మంగళవారం ఉదయం కూడా తండ్రి, కూతురు మధ్య గొడవ జరిగింది. క్షణికావేశానికిలోనైన రాజశేఖర్ చేతికి దొరికిన పదునైన ఆయుధంతో కూతురు గొంతు, చెవి, మెడ కింద భాగంలో పొడిచాడు. ఆ తర్వాత తన వ్యవసాయ పొలానికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన గీత నానమ్మ శంకరమ్మ రక్తపు మడుగులో పడి ఉన్న మనుమరాలిని చూసి కేకలు వేసింది. చుట్టుపక్కలవారు వచ్చి రాజశేఖర్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, కొత్తకోట ఇన్చార్జ్ సీఐ కేఎస్ రత్నం, ఎస్ఐ రామస్వామి, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. తండ్రిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా తానే నరికి చంపినట్లు అంగీకరించాడు. పోలీసులు గీత మృతదేహాన్ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
లోన్ యాప్ ఘోరం.. రూ.2 వేలతో మొదలుపెట్టి ప్రాణాలు తీశారు..
కొత్తకోట రూరల్: ఆన్లైన్ లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. వనపర్తి జిల్లా కొత్తకోట విద్యానగర్‌కాలనీకి చెందిన దాసరి శేఖర్(32) కారుడ్రైవర్. నాలుగు నెలల క్రితం తన సెల్‌ఫోన్‌కు గుర్తు తెలియనివ్యక్తి ఫోన్ చేసి లోన్ కావాలంటే లింక్ పంపిస్తాం.. డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. దీంతో శేఖర్ గతనెల 18న రూ.2 వేలు తీసుకున్నాడు. తాను తీసుకున్న రూ.2 వేలతోపాటు అదనంగా రూ.200 వారంరోజుల్లోగా చెల్లించాడు. శేఖర్‌కు డబ్బు అవసరం లేకున్నా యాప్ నిర్వాహకులు మరో రూ.2,500 జమచేశారు. మళ్లీ వారంలోగా ఆ డబ్బుకు కొంత మొత్తాన్ని జతచేసి తిరిగి చెల్లించా డు. ఇంకా అదనంగా డబ్బులు చెల్లించాలని నిర్వాహకులు వేధించడం మొదలుపెట్టారు. మార్ఫింగ్ చేసిన శేఖర్ ఫొటోలను అతని స్నేహితుడి భార్యకు పంపారు. దీంతో శేఖర్ రూ.30 వేలకుపైగా చెల్లించాడు. అయినా వేధింపులు ఆగకపోవ డంతో అవమానానికి గురైన శేఖర్ ఆదివారంరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. శేఖర్‌కు భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, అంతకుముందు సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పాలని శేఖర్ తన స్నేహితుడికి ఫోన్ చేసి మొరపెట్టుకున్న ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
వనపర్తి జిల్లాలో కాజ్ వే దాటుతూ ముగ్గురు గల్లంతు
-
వాగు దాటుతూ.. బైక్‌తో సహా కొట్టుకుపోయి..
వనపర్తి/మదనాపురం: దసరా పండుగ కోసం తన ఇంటికి వచ్చిన చిన్నమ్మ, ఆమె కూతురిని బైక్‌పై దిగబెడుతున్న యువకుడు సహా మొత్తం ముగ్గురు సరళాసాగర్ దిగువ వంతెన వాగు ఉధృతికి గల్లంతయ్యారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రానికి సమీపంలో జరిగింది. మదనాపురం తహసీల్దార్ నరేందర్, ఎస్ఐ మంజునాథరెడ్డి తెలిపిన వివరాలివి. ఈనెల 4వ తేదీన దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్లకి చెందిన సంతోషమ్మ (35), ఇంటర్ చదివే ఆమె కూతురు పరిమళ (17), కొత్తకోట పట్టణంలో వెల్డింగ్ పనిచేసే అక్క కుమారుడు సాయికుమార్ (25) ఇంటికి దసరా పండుగకు వచ్చారు. తిరిగి వారిని స్వగ్రామానికి పంపించేందుకు శుక్రవారం సాయికుమార్.. చిన్నమ్మ, చెల్లిని బైక్‌పై ఎక్కించుకుని బయల్దేరాడు. మదనాపురం రైల్వేగేట్ దాటాక సరళాసాగర్ సైఫన్ల నుంచి వచ్చే వరద నీరు ప్రవహించే లోలెవల్ వంతెన వరకు వచ్చారు. రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయినా.. శుక్రవారం వరద ఉధృతి తగ్గటంతో రాకపోకలు ప్రారంభించారు. దీంతో సాయికుమార్ కూడా వాగు దాటేందుకు ప్రయత్నించాడు. కొంతదూరం వెళ్లాక.. వరద ఉధృతికి బైక్ వంతెన నుంచి వాగులోకి బైక్‌తో సహా ముగ్గురు పడిపోయారు. వారి ఆర్తనాదాలు విన్న కొందరు యువకులు వాగులోకి దిగి కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారు తిరిగి ఒడ్డుకు చేరుకున్నారు. ఈ సంఘటనను ప్రత్యక్ష సాక్షులు ఫోన్లో వీడియో తీశారు. ఆత్మకూరు మండలానికి చెందిన జాలర్లను రప్పించి గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సంఘటనపై కలెక్టర్ షేక్ యాష్మిన్ బాషా అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
వైఎస్సార్ పాలన స్వర్ణయుగం: షర్మిల
మదనాపురం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలన స్వర్ణయుగమని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర ఆదివారం వనపర్తి జిల్లా మదనాపురం మండలం నుంచి మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు తిరిగి కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్కవర్గాన్ని కూడా ఆదుకున్న పాపాన పోలేదన్నారు. ఇచ్చిన ప్రతి హామీ మోసమేనని, ప్రతి పథకం అబద్ధమేనని విమర్శించారు. ప్రతిపక్షం గట్టిగా ఉంటే కేసీఆర్ అరాచకాలు సాగేవి కాదని షర్మిల అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలివ్వండని అడిగితే ఈ జిల్లా మంత్రి నిరంజన్‌రెడ్డి హమాలీ పని చేసుకోండి అని చెబుతున్నారని, డిగ్రీలు, పీజీలు చదివి హమాలీ పనిచేసుకుంటే.. మంత్రి పదవి నీకెందుకని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న అర్హులందరికీ రూ.3 వేల పింఛన్ ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు అమ్ముడుపోయిన పార్టీలని, ప్రతిపక్షం గట్టిగా ఉంటే కేసీఆర్ అరాచకాలు సాగి ఉండేవి కావన్నారు. -
మాట్లాడుకుందామని పిలిచి.. అత్యాచారం.. ఆపై హత్య
రాజేంద్రనగర్/మైలార్‌దేవ్‌పల్లి/ఖిల్లా ఘనపురం: పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలు సాయిప్రియ(20)ను చంపి, కేఎల్ఐ కాల్వలో పూడ్చిపెట్టిన కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సాయిప్రియను ప్రియుడు శ్రీశైలం అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు తేలింది. మాట్లాడుకుందామని తన స్వగ్రామం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటకు పిలిపించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడితో పాటు సహకరించిన వ్యక్తిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా మానాజీపేట ప్రాంతానికి చెందిన బత్తిని అంజన్న 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం శంషాబాద్‌కు వలసవచ్చారు. డెయిరీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన చిన్న కుమారుడు బత్తిని శ్రీశైలం(23) ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ కావడంతో మానాజీపేటలో డెయిరీ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శ్రీశైలానికి మిత్రుల ద్వారా హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు చెందిన కావటి వెంకటేశ్ కూతురు సాయిప్రియ(20)తో పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని శ్రీశైలం ఇరు కుటుంబాలకు చెప్పాడు. దీనికి అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు. అమ్మాయి ఉన్నత చదువులు చదవాల్సి ఉందని ఇప్పుడే పెళ్లి చేసే ఆలోచన లేదని తెలిపారు. చంపి.. కాల్వలో పూడ్చి.. ఇదిలా ఉండగా, కరోనా కాలంలో ప్రేమికుల మధ్య సంబంధాలు తెగిపోయాయి. మళ్లీ మూడు నెలల క్రితం సాయిప్రియ, శ్రీశైలంల మధ్య సెల్‌ఫోన్ సంభాషణలు, చాటింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 5న మాట్లాడుకుందామని చెప్పి సాయిప్రియను శ్రీశైలం మానాజీపేటకు రమ్మన్నాడు. సాయిప్రియ కళాశాలకు వెళ్తున్నానని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వరకు రాగా.. అక్కడి నుంచి శ్రీశైలం బైక్‌పై మధ్యాహ్నం మానాజీపేటలోని తన షెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అనంతరం సమీపంలోని మబ్బు గుట్ట దగ్గరికి తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. ఆపై చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి తన మేనత్త కుమారుడు శివతో కలిసి గుట్ట దగ్గరకు చేరుకుని కేఎల్ఐ కాల్వ దగ్గర గుంత తవ్వి అందులో పూడ్చిపెట్టారు. సాయిప్రియ బ్యాగ్‌ను షెడ్లోనే భద్రపరిచారు. అనంతరం ఎవరికి ఇంటికి వారు వెళ్లారు. తండ్రి ఫిర్యాదుతో.. సాయిప్రియ సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్లో ఆమె తండ్రి వెంకటేష్ ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులతో వివరాలు సేకరించగా.. శ్రీశైలంపై అనుమానం ఉన్నట్లు చెప్పారు. దీంతో పోలీసులు బుధవారం ఖిల్లాఘనపురం పోలీసుల సహకారంతో శ్రీశైలంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తానే చంపానని అంగీకరించాడు. గురువారం సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక తహసీల్దార్ భానుప్రకాష్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం చేశారు. నిందితుడు శ్రీశైలం, అతడికి సహకరించిన శివను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కాగా, నిందితులిద్దరిని కస్టడీ కోరుతూ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి.. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురిని దారుణంగా హత్య చేసిన నిందితుడితో పాటు సహకరించిన వారందరిని ఉరి తీయాలని సాయిప్రియ కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. విదేశాల్లో ఉన్నత చదువు చదవాలని సాయిప్రియ లక్ష్యం అని అందుకు అనుగుణంగా తాము ప్రయత్నిస్తున్న దశలో ప్రేమ పేరుతో శ్రీశైలం మోసం చేసి హత్య చేశాడని ఆరోపించారు. -
బస్టాండ్ బాత్రూంలో ప్రసవం.. పుట్టిన కొద్దిసేపటికే ఆడశిశువు మృతి
సాక్షి, వనపర్తి: బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణి మార్గమధ్యంలో బస్టాండ్ బాత్రూంలోనే ప్రసవించ గా.. పుట్టిన కొద్దిసేపటికే ఆడశిశువు చనిపోయింది. తల్లి ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉంది. ఈ సంఘ టన వనపర్తి జిల్లా కొత్తకోటలో మంగళవారం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా నాగవరం గ్రామానికి చెందిన చంద్రకళ, చంద్రయ్యల కూతురు మంజుల వివాహం గతేడాది ఆత్మకూర్ మండలం తిపుడంపల్లికి చెందిన కృష్ణయ్యతో జరిగింది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కృష్ణయ్య తన భార్యతో కలిసి అక్కడే ఉంటున్నారు. మంజుల ప్రస్తుతం 8 నెలల గర్భవతి. ఆమె ప్రతినెలా వనపర్తి ఏరియా ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. మంగళవారం మంజుల వనపర్తి ఆస్పత్రికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి తిరిగి హైదరాబాద్‌కు బస్సులో బయల్దేరింది. కొత్తకోటకు వచ్చే సరికి పురిటినొప్పులు రావడంతో అక్కడి బస్టాండ్‌లో దిగింది. స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. బాత్రూంకు వెళ్లిన మంజుల అంబులెన్స్ వచ్చేసరికి అందులోనే ప్రసవించింది. ఆడశిశువు పురిటిలోనే కన్నుమూసింది. అంబులెన్స్ సిబ్బంది మంజులను కొత్తకోట పీహెచ్‌సీకి తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షించి ఆమె ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. -
నీటి మడుగులో కాచుకున్న మొసలి.. రిస్కు చేసి గొర్రెను కాపాడి!
వనపర్తి: గొర్రెను నోట కరుచుకుని నీటిలోకి జారుకుంటున్న మొసలితో పోరాడి తీవ్రంగా గాయపడ్డాడొక కాపరి. మొసలి దాడి చేసిన గొర్రె చిన్న గాయంతో ప్రాణాలు దక్కించుకోగా.. దాన్ని కాపాడిన కాపరి ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రాంపురం శివారు ప్రాంతంలోని కృష్ణా నదిలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. పెబ్బేరు మండలం రాంపురం గ్రామానికి చెందిన కొరి రాములు, బీసన్నలకు చెందిన 300 గొర్రెలను మేత కోసం నెల రోజుల క్రితం కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ పొలాల్లో గొర్రెలను మేపుకొని కృష్ణా నదిలోని గుంతల్లో నిల్వ ఉన్న నీటిని తాగిస్తుండేవారు. ఎప్పట్లాగే శుక్రవారం సాయంత్రం వేళ గొర్రెలను నదిలో నీరున్న గుంతల వద్దకు తీసుకెళ్లారు. గుంపులోని ఒక గొర్రె నీటిని తాగేందుకు వెళ్లగా.. మడుగులోని మొసలి దానిపై దాడి చేసింది. గొర్రె అరుపులు విన్న కాపరి కొరి రాములు చేతిలోని కర్రతో మొసలిపై దాడి చేశాడు. దీంతో మొసలి గొర్రెను వదిలేసి కాపరిపై దాడి చేసి.. అతని రెండు చేతులు, కడుపు భాగంలో గాయపరిచింది. కాపరి చేతుల్ని నోట కరుచుకొని నీటిలోకి మొసలి లాక్కెళ్తుండగా.. రాములు అరుపులు విన్న సహచర కాపరి బీసన్న రాళ్లతో దానిపై దాడి చేశారు. దీంతో మొసలి రాములును వదిలి నీటిలోకి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన రాములును 108 అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యానికి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం తన తండ్రి పరిస్థితి నిలకడగానే ఉందని రాములు కుమారుడు మల్లేశ్ తెలిపాడు. రాములు అధైర్యపడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సహచర కాపరి బీసన్న తెలిపాడు. -
లైంగికంగా వేధిస్తున్నాడని మామను కొట్టి చంపిన కోడలు
గోపాల్పేట: లైంగికంగా వేధిస్తున్నాడంటూ మామను ఓ కోడలు కొట్టి చంపింది. దీనికి ఆమె తమ్ముడు సహకరించాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలను ఇన్చార్జ్ ఎస్పీ రంజన్‌రతన్ కుమార్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. గోపాల్పేట మండలంలోని చెన్నూరుగ్రామానికి చెందిన నెంబర్ రాములు(50), కొండమ్మ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురికి గతంలోనే పెళ్లి కాగా హైదరాబాద్‌లో ఉంటోంది. కొడుకు ప్రశాంత్ నాలుగు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన చంద్రకళను కులాంతర వివాహం చేసుకున్నాడు. ప్రశాంత్ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి ఇటీవల స్వగ్రామానికి వచ్చారు. ప్రశాంత్ మానసికస్థితి సరిగాలేదు. ఈ క్రమంలో కొంతకాలంగా కోడలిని మామ లైంగికంగా వేధించసాగాడు. ఈ విషయమై వీడియో రికార్డు కూడా చేసింది. హైదరాబాద్‌లో ఉంటున్న తన తమ్ముడు శివకు విషయం చెప్పింది. సోమవారం మధ్యాహ్నం మామను పొలం వద్దకు పిలిపించి శివ, చంద్రకళ కలసి తీవ్రంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని రాములును స్థానిక పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయించారు. అనంతరం కుమారుడికి సమాచారం అందించారు. అయితే రాములు పరిస్థితి విషమించడంతో జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మృతుడి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మంగళవారం ఉదయం గోపాల్పేట పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్ జరిగిందనే ప్రచారం జరిగింది. దీనిపై తప్పుడు ప్రచారం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఆస్తిని కాజేయాలనే ఇలా చేశారు నెంబర్ రాములు కొడుకుతోపాటు భార్యకు మతిస్థిమితం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. వీరి ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో పథకం ప్రకారమే ప్రశాంత్‌ని చంద్రకళ కులాంతర వివాహం చేసుకుందని బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే మామ వేధిస్తున్నాడని చిత్రీకరించారన్నారు. మంగళవారం కోడలి తల్లి అంజనమ్మ, సోదరి శశికళ ఇళ్లపై నెంబర్ రాములు బంధువులు, గ్రామస్తులు దాడిచేసి ఒకవైపు కూల్చేసి వారిని చితకబాదారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని గ్రామపంచాయతీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచారు. అనంతరం ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ ఆనంద్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. పోలీసుల సహకారంతో వారిని అక్కడి నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
CM KCR: దేశం కోసం పోరాటం
‘తెలంగాణ కోసం కొట్లాడినం.. తెచ్చుకున్నాం.. ముఖం కొంత తెల్లతెల్లగైంది.. ఆకలిచావులు, ఆత్మహత్యలు లేవు. కరువులు రావు.. వలసలు ఉండవు. ఇతర ప్రాంతాల వారు మనవద్దకు వచ్చి బతకాలి. ఎడారిగా ఉన్న పాలమూరులో పాలపొంగులు కనిపిస్తున్నాయి. మరింత పటిష్టమైన అభివృద్ధి చేస్తాం. దేశ రాజకీయాలను చైతన్యపరిచి బంగారు భారతదేశాన్ని తయారు చేసేందుకు పురోగమిద్దాం. వనపర్తి సభ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుదాం’ – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘ఈ మధ్య దేశంలో గోల్మాల్ గోవిందంగాళ్లు తయారయ్యారు. ప్రజ లకు మత, కులపిచ్చి లేపి దుర్మార్గమైన రీతిలో రాజకీయాలను మంటగలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అది జరగనివ్వను. మనందరం దేశం కోసం పోరాటం చేసేందుకు సిద్ధం కావాలి. ప్రజలంతా బాగుపడాలి’ అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. వనపర్తి జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం కేసీఆర్ నూతన కలెక్టరేట్ వెనుక భాగంలో వైద్య కళాశాల నిర్మించనున్న స్థలంలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ‘ఏ జిల్లాకు వెళ్లినా.. దేశం కోసం పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా రు. మంచిని పెంచేందుకు ప్రాణం ఇచ్చేందుకు తయారుగా ఉన్నా. బుద్ధి తక్కువ పార్టీలు, వెద వలు దేశాన్ని, భారతజాతిని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మతం, కులం అనే భయంకరమైన కేన్సర్ వ్యాధి మన వరకు రానివ్వొద్దు. గ్రామాల్లో ఈ విషయంపై చర్చబెట్టాలి. మత పిచ్చిగాళ్లను, బీజేపీని బంగాళాఖాతంలో బొందపెట్టాలి. వారికి బుద్ధి చెప్పేందుకు తెలంగాణ జాగృతం కావాలి’ అని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటున్నామని ఇప్పుడు విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోకి వలసలు పెరిగాయి ‘రాష్ట్ర సాధన కోసం 2001లో జెండా పట్టినప్పుడు ఎన్నో అవమానాలు జరిగాయి. దేనికీ బెదరకుండా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. అన్ని జిల్లాలు అభివృద్ధి పథంలో ఉన్నాయి. చాలా సంతోషం’ అని కేసీఆర్ అన్నారు. ‘చాన్నాళ్ల తర్వాత ఇటీవల గద్వాలకు వచ్చినా. పాలమూరు పచ్చదనాన్ని చూద్దామని బస్‌లో వచ్చాను. దద్దమ్మ నాయకులు మధ్యలో వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి అద్భుతంగా లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాం’ అని వివరించారు. ఎక్కడ చూసినా ధాన్యం రాశులు, కల్లాలు, పంటలు కనిపించాయని చెప్పారు. గతంలో పాలమూరు నుంచి 14–15 లక్షల మంది వలసలు వెళ్లేవారని.. ప్రస్తుతం దేశంలోని 11 రాష్ట్రాల నుంచి ప్రజలు తెలంగాణకు పనికోసం వస్తున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే 15–16 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని.. దీంతో నా పాలమూరు బంగారు తునక అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: (అసెంబ్లీ వేదికగా అద్భుత ప్రకటన: సీఎం కేసీఆర్) మన తలసరి ఆదాయం మిన్న: తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లే అయ్యిందని.. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణ తలసరి ఆదాయం బాగుందని కేసీఆర్ వెల్లడించారు. విద్యుత్ వినియోగం, మౌలిక రంగాల్లో వాళ్లకంటే ముందున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ వస్తే విద్యుత్ ఉండదని అన్నారని గుర్తు చేశారు. మనం ఏర్పాటు చేసుకున్న సమీకృత కలెక్టరేట్ భవనాలు మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా లేవని చెప్పారు. 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాలకు ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనేనని.. దేశంలో మరే రాష్ట్రం లేదని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు 13వేల మెగావాట్ల పైచిలుకు పీక్ లోడ్ ఉంటే తెలంగాణలో ప్రస్తుతం 14వేల మెగావాట్ల పీక్ లోడ్ ఉందని, దీన్నిబట్టి రాష్ట్రం విద్యుత్‌ను ఏస్థాయిలో వినియోగించుకుంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. గిరిజనుల రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే.. ప్రధాని మోదీ అడకనపెట్టి కూర్చొన్నాడని సీఎం విమర్శించారు. అదేవిధంగా వాల్మీకి బోయల డిమాండ్ మేరకు వారిని ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో కేంద్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. సీఎం సభలో హైలైట్స్.. పాలమూరుపై కేసీఆర్ కవిత ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు వచ్చిన సమయంలో చూసి నేను, జయశంకర్ సార్ కన్నీళ్లు పెట్టుకున్నాం. గోరటి పాటలో మాదిరిగా ఉంది. ఇప్పుడు అభివృద్ధిలో ముందంజలో ఉంది. దీనిపై నేను కవిత రాశా. ‘వలసలతో వలవల.. విలపించిన కరువు జిల్లా.. పెండింగ్ ప్రాజెక్టులను వడి వడిగా పూర్తి చేసి.. చెరువులన్నీ నింపి.. పన్నీటి జలకమాడిన పాలమూరు తల్లి పచ్చని పైటగప్పుకుంది..’అని కేసీఆర్ చదివి వినిపించారు. ఆడబిడ్డలకు శుభాకాంక్షలు ‘ఈ రోజు అంతర్జాతీయ ఆడబిడ్డల దినం.. మహి ళా దినోత్సవం.. ఈ సందర్భంలో మన రాష్ట్ర, దేశ, ప్రపంచ మహిళలందరికీ నా తరఫున, మన రాష్ట్రం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నా. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా! ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో, గౌరవించబడుతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు. నీళ్ల నిరంజనుడు వనపర్తి జిల్లా అయితదని కలలోనైనా ఊహించారా.. నిరంజన్‌రెడ్డి లాంటి మిత్రుడు నాకు ఉండటం అదృష్టంగా భావిస్తున్నా.. నీళ్ల నిరంజన్‌రెడ్డి అని మీరే అన్నారు. నిన్నటి అసెంబ్లీ సమావేశాల రోజు కూడా నా దగ్గరకు వచ్చి తండా రోడ్ల నిర్మా ణాలకు నిధులు కావాలని, కర్నెతండా లిఫ్ట్ కావాలని సంతకం పెట్టించాడు. ఇప్పుడు నాలుగు వరుసల బైపాస్ రోడ్డుకు రూ.200 కోట్లు అయినా సరే కేటాయిస్తాం. మర్రి, గువ్వల కొట్టేటట్టు ఉన్నారు.. నిరంజన్‌రెడ్డి గొంతు మీద కత్తి పెట్టి నిధులు మంజూరు చేయించుకుంటడు. వనపర్తి జిల్లా బాగా అభివృద్ధి చెందింది.. సంతోషం. మర్రి, గువ్వలకు కోపం వస్తున్నట్లు ఉంది.. నన్ను కొట్టేటట్టు ఉన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. త్వరలో నాగర్‌కర్నూల్‌కు వస్తాం. మన ఊరు–మన బడికి శ్రీకారం సీఎం కేసీఆర్ వనపర్తిలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో ‘మన ఊరు–మనబడి’కి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఈ పథకానికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. నేను సైతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. ప్రభుత్వ బడులను సకల సౌకర్యాలతో అభివృద్ధిపరిచి ప్రతి విద్యార్థి నాణ్యమైన ఉన్నత చదువులు చదివేందుకు వీలుగా చేపట్టిన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం వనపర్తికి గర్వకారణమన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం 12.38 గంటలకు హెలికాప్టర్లో వనపర్తికి చేరుకున్నారు. చిట్యాలలో వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రా రంభించారు. అనంతరం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 1.21 గంటలకు మన ఊరు–మన బడి పైలాన్‌ను ఆవిష్కరించారు. స్టేజీ ఎక్కి 45 సెకన్లు మాత్రమే మాట్లాడారు. అక్కడి నుంచి టీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుని 1.42 గంటలకు ప్రారంభించారు. ఆ తర్వాత నూతన సమీకృత కలెక్టరేట్‌కు చేరుకుని 1.56 గంటలకు ప్రారంభించారు. కలెక్టర్ యాస్మిన్ బాషను ఆమె సీట్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులతో సమీక్ష అనంతరం సాయంత్రం 4.15 గంటలకు వైద్య కళాశాలను ప్రారంభించారు. సాయంత్రం 4.45 గంటలకు నాగవరం శివారులో నిర్వహించిన సభాస్థలికి చేరుకున్నారు. 5.24 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. -
అసెంబ్లీ వేదికగా అద్భుత ప్రకటన: సీఎం కేసీఆర్
నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నాం.. నేడు అసెంబ్లీ వేదికగా అద్భుత ప్రకటన చేయనున్నాం. ఉదయం 10 గంటలకు అందరూ టీవీలు పెట్టుకొని చూడండి – వనపర్తి సభలో సీఎం కేసీఆర్ ‘‘తెలంగాణలో ఎన్నో పనులు ప్రజలు అడగక ముందే చేసుకున్నాం. ఇప్పుడు నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నాం. బుధవారం అసెంబ్లీ వేదికగా నిరుద్యోగుల కోసం అద్భుత ప్రకటన చేయనున్నాం. ఉదయం పది గంటలకు అందరూ టీవీలు పెట్టుకుని చూడండి. తెలంగాణ ప్రగతి కోసం చివరి ఊపిరి, రక్తం బొట్టు దాకా టీఆర్ఎస్ పని చేస్తుంది..’’ మంగళవారం వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన ఈ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించింది. ముఖ్యమంత్రి ఏం చెబుతారు? ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామంటారా? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు? ఎప్పుడో మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతిని ప్రకటిస్తారా? ఎంత ఇస్తారు? అనే చర్చకు తెరతీసింది. రాజకీయ వర్గాల్లో సైతం ఉత్కంఠ నెలకొంది. అయితే 60 వేల వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని, ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రకటన ఉండవచ్చని తెలుస్తోంది. సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వనపర్తి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ల జారీపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయవచ్చనే చర్చ జరుగుతోంది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా కొలువుల భర్తీకి వార్షిక క్యాలెండర్ ప్రకటిస్తామంటూ ఇచ్చిన హామీని సైతం ప్రస్తావించే అవకాశముందని చెబుతున్నారు. ఉపాధ్యాయ, పోలీసు కొలువులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2020 డిసెంబర్ 13న కేసీఆర్ ప్రకటన చేశారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించిన తర్వాత ఏర్పడనున్న ఖాళీల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్లు జారీ చేయాలని కూడా అప్పట్లో ఆదేశించారు. అయితే పదోన్నతుల ప్రక్రియ ముగిసిన తర్వాత నియామకాల అంశం మరుగున పడిపోయింది. గతేడాది కరోనా రెండోవేవ్ రావడం, ఆ తర్వాత కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగాల పునర్విభజన చేపట్టాల్సి రావడంతో ఆ ప్రక్రియకు ఫుల్స్టాప్ పడింది. అయితే కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం బదిలీల ప్రక్రియ సైతం ఇటీవల పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీకి అన్ని అడ్డంకులు తొలగినట్టయింది. కమిటీతో మళ్లీ మొదటికి.. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు పూర్తయిన తర్వాత ప్రభుత్వం చేసే ప్రకటన కోసం నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, కేడర్ స్ట్రెంగ్త్ అవసరాలు, ఖాళీల భర్తీపై అధ్యయనానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్ శేషాద్రి అధ్యక్షతన పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు గత జనవరి 16న కేసీఆర్ ప్రకటించడంతో నియామకాల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్టు అయింది. జిల్లాల్లో ఖాళీలను గుర్తించడంతో పాటు ఆర్డీఓలు, వీఆర్వోలు, వీఆర్ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి? కొత్త జిల్లాలు, కొత్త మండలాల్లో పని ఒత్తిడికి తగ్గట్టు కొత్తగా పోస్టుల అవసరాన్ని గుర్తించడం వంటి అంశాలపై అధ్యయనం జరపాలని అప్పట్లో కమిటీకి సూచించారు. ఈ నేపథ్యంలో కొలువుల భర్తీపై ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించే పనిని ఈ కమిటీ ప్రారంభించింది. కానీ నిర్దిష్టమైన కాలవ్యవధి నిర్ణయించకపోవడం, విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో కమిటీ నివేదిక ఎప్పుడు ఇస్తుందో అన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో కాలయాపనకే ఈ కమిటీని వేశారనే విమర్శలు సైతం వచ్చాయి. అయితే ఉన్నట్టుండి ముఖ్యమంత్రి నిరుద్యోగులు గురించి చేసిన ప్రకటన నేపథ్యంలో.. ఈ కమిటీ ఆగమేఘాల మీద నివేదిక సమర్పించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలావుండగా..నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్ర బడ్జెట్ 2022–23లో ఎలాంటి నిధులను ప్రతిపాదించకపోవడంతో దీనిపై సీఎం ప్రకటన ఉండే అవకాశాలు లేనట్టేనని సమాచారం పునర్విభజన తర్వాత 85 వేల ఖాళీల గుర్తింపు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొత్తం 1.32 లక్షల పోస్టులను భర్తీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తెలంగాణ వచ్చాక తొలి నాలుగేళ్లలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయగా, దాదాపుగా గడిచిన మూడేళ్ల కాలంలో ఎలాంటి నోటిఫికేషన్లు జారీ కాలేదు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల పునర్విభజన పూర్తైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 85 వేల వరకు ఖాళీలను గుర్తించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. 1.91 లక్షల పోస్టులు ఖాళీ అన్న తొలి పీఆర్సీ రాష్ట్రంలో 39 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గతేడాది ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులు ఉండగా.. 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, ఏకంగా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ప్రధానంగా విద్యా శాఖలో 23,798, హోంశాఖలో 37,182, వైద్య శాఖలో 30,570, రెవెన్యూ శాఖలో 7,961, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది. -
రేపు కీలక ప్రకటన.. 10 గంటలకు టీవీ చూడండి: సీఎం కేసీఆర్
సాక్షి, వనపర్తి జిల్లా: తెలంగాణలో ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాలోని నాగవరం బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, వనపర్తి.. జిల్లా అవుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదని.. ఇప్పుడు వనపర్తి జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. చదవండి: మారనున్న బడుల స్వరూపం.. ‘మన ఊరు- మన బడి’కి సీఎం కేసీఆర్ శ్రీకారం ‘‘గతంలో పాలమూరు జిల్లాలో పరిస్థితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవి. తెలంగాణ రాకముందు మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. తెలంగాణ వచ్చాక మహబూబ్‌నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలమైంది. పాలమూరు జిల్లా పాలుగారుతోంది. హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ధాన్యపు రాశులతో కళకళలాడుతోందని’’ సీఎం అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. పాలమూరు ప్రాంత అభివృద్ధి క్సోం నిరంజన్‌రెడ్డి ఎంతో కష్టపడి పనిచేశారు. నిరంజన్‌రెడ్డి ఈసారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలని సీఎం పేర్కొన్నారు. రేపు(బుధవారం) అసెంబ్లీలో తాను ఓ కీలక ప్రకటన చేయబోతున్నానని కేసీఆర్ తెలిపారు. నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని కోరుతున్నానన్నారు. -
మారనున్న బడుల స్వరూపం.. ‘మన ఊరు- మన బడి’కి సీఎం కేసీఆర్ శ్రీకారం
సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆయనకు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా చిట్యాలలో ఏర్పాటు చేసిన నూతన మార్కెట్ యాడ్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం పైలాన్ బాలుర ప్రభుత్వం పాఠశాలలో ఆవిష్కరించారు. చదవండి: నన్ను ఎవరూ భయపెట్టలేరు. దేనికీ భయపడను: తెలంగాణ గవర్నర్ తమిళిసై అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసే కార్యక్రమానికి వనపర్తి వేదికగా శ్రీకారం చుట్టామని సీఎం అన్నారు. సర్కారు బడుల్లో చక్కటి వసతులు కల్పిస్తున్నాం. విద్యార్థులంతా శ్రద్దగా చదువుకోవాలని సీఎం సూచించారు. మేమంతా సర్కారు బడుల్లో చదివామన్నారు ‘‘వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్‌లో చాలా చక్కటి వసతులు పాఠశాలల్లో ఏర్పాటవుతాయన్నారు. భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: బడి.. బాగు.. కాగా, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి గత ఏడాదితో పోలిస్తే, ఈసారి రూ.2,477 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. ముఖ్యంగా మన ఊరు–మన బడి కార్యక్రమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ.7,289 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మహిళా యూనివర్సిటీకి, అటవీ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించింది. గత ఏడాది విద్యారంగం కేటాయింపులు రూ.13,608 కోట్లు ఉంటే.. ఈసారి ఈ పద్దు రూ.16,085 కోట్లకు చేరింది. ఉన్నత విద్యకు గత ఏడాది రూ.1,873 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.2,357.72 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు గత ఏడాది రూ.11,735 కోట్లు ఉంటే, ఈసారి ఇది 13,725.97 కోట్లకు పెరిగింది. మొత్తం మీద రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగం వాటా గత ఏడాది 6.1 శాతంగా ఉంటే, ఈసారి 6.2 శాతంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. -
‘మన ఊరు–మన బడి’కి ఇక్కడి నుంచే శ్రీకారం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు–మన బడి’కి లాంఛనంగా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. వనపర్తిలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ ఇందుకు వేదిక కానుంది. దీంతోపాటు వనపర్తి మండలంలోని చిట్యాలలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు, నాగవరంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, పట్టణంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే నాగవరంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. కాగా, కలెక్టరేట్ ప్రాంగణంలోనే కర్నెతండా ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, నీటిపారుదల శాఖ సీఈ కార్యాలయానికి శంకుస్థాపన చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నూతన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన తర్వాత సాయంత్రం మెడికల్ కాలేజీకి కేటాయించిన స్థలంలో జరగనున్న బహిరంగ సమావేశంలో సీఎం ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. పోలీసుల పటిష్ట బందోబస్తు సీఎం పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి వనపర్తికి చేరుకోనుండగా.. సాయంత్రం 5.30 గంటలకు తిరుగు పయనం కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. ఎనిమిది మంది ఎస్పీల పర్యవేక్షణలో 1,840 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు లక్ష మందిని బహిరంగసభకు తరలించేలా ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. -
వనపర్తి జిల్లా పెబ్బేరులో విషాదం
-
వనపర్తిలో విషాదం.. బిడ్డలతో తల్లి ఆత్మహత్య
సాక్షి, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లాలోని పెబ్బేరులో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో జూరాల కాలువలో దూకింది. ఇది గమనించిన స్థానికులు ఒకరిని రక్షించగా.. తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
పిల్లలతో సహా జూరాల కాల్వలో దూకిన మహిళ
పెబ్బేరు: కుటుంబ కలహాలతో ఓ వివాహిత, ముగ్గురు పిల్లలతో కలిసి జూరాల కాల్వలో దూకిన సంఘటన ఆదివారం రాత్రి వనపర్తి జిల్లా పెబ్బేరులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పెబ్బేరు పట్టణానికి చెందిన తెలుగు వాకిటి స్వామి, భవ్య ఏడేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు జ్ఞానేశ్వరి (5), నిహారిక (1), కుమారుడు వరుణ్ (4) ఉన్నారు. వివాహం జరిగిన కొన్నేళ్లు సంతోషం గా ఉన్న భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరి గాయి. ఈ నేపథ్యంలో తరచూ గొడవ పడుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన భవ్య (30) ఆదివారం రాత్రి వనపర్తి రోడ్డు మార్గంలోని జూరాల ప్రధాన కాల్వలో ముగ్గురు పిల్లలతో కలిసి దూకింది. గమనించిన స్థానికులు వెంటనే వరుణ్‌ను కాపాడారు. తల్లి, ఇద్దరు అమ్మాయిలు కాల్వలో గల్లంతవడంతో పోలీసులకు సమాచారం అందించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. ఇప్పటి వరకు ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రామస్వామి తెలిపారు. -
బీఈడీ పూర్తి .. ఉద్యోగ శిక్షణకు డబ్బు లేదని.. ‘ఎంతపని చేస్తివి కొడుకా..’
కొత్తకోట రూరల్: ఆ యువకుడు రెండేళ్ల క్రితమే బీఈడీ పూర్తి చేశాడు. ప్రస్తుతం పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. త్వరలో ఉద్యోగ ప్రకటన వస్తుందని భావించి శిక్షణ తీసుకోవాలనుకున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో డబ్బుల్లేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేన్‌కు చెందిన సంద కురుమూర్తి (25) పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కరోనా కారణంగా కళాశాల మూసివేయడంతో తల్లిదండ్రులు వెంకటమ్మ, సంద పెద్దబాలయ్యతో కలిసి గ్రామంలోనే ఉంటున్నాడు. తల్లిదండ్రులు గ్రామంలో వ్యవసాయంతో పాటు రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటుందని కురుమూర్తి భావించాడు. అందుకు శిక్షణ తీసుకోవడానికి డబ్బుల్లేవన్న ఆవేదనతో శుక్రవారం ఉదయం కొత్తకోట శివారు వెంకటగిరి ఆలయం సమీపంలోకి చేరుకుని పురుగు మందు తాగాడు. వెంటనే హైదరాబాద్‌లో ఉంటున్న తమ్ముడు మహేష్‌కు వీడియో కాల్ చేసి చెప్పాడు. అతనిచ్చిన సమాచారంతో హుటాహుటిన తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని కురుమూర్తిని బైక్‌పై కొత్తకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. ఎంతపని చేస్తివి కొడుకా.. ‘కూలీనాలీ చేసి పెద్ద చదువులు చదివిస్తే కుటుంబానికి అండగా ఉంటావనుకుంటే ఇలా చేస్తివి కొడుకా..’అంటూ తల్లిదండ్రు లు రోదించడం అక్కడి వారిని కలచివేసిం ది. ‘ఇలా అయితదనికుంటే అప్పోసప్పో చేసి డబ్బులు తెచ్చిచ్చే వాళ్లం. ఎంత పని చేస్తివి..’అంటూ కన్నీరు మున్నీరయ్యారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వలో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు పిల్లలతో పాటు ఓ వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకెళ్లారు. ఇందులో ఓ బాలుడు మృతి చెందగా, ముగ్గురిని స్థానిక రైతులు కాపాడారు. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని నందిమళ్లలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నందిమళ్లకు చెందిన మహమూద్ తన కొడుకు మౌలాలి, అదే గ్రామానికి చెందిన సలావుద్దీన్, ఆరిఫ్ (10) అనే పిల్లలను వెంట పెట్టుకుని జూరాల ఎడ మ కాల్వలో స్నానం చేయడానికి వెళ్లాడు. అందరూ కలసి ఈత కొడుతుండగా ఒక్క సారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ప్రవాహ వేగానికి మౌలాలి, సలావుద్దీన్, ఆరిఫ్ కొట్టుకుపోతుండడంతో.. మహమూద్ వెంటనే తన కొడుకు మౌలాలి, సలావుద్దీన్‌లను కాల్వ ఒడ్డువైపు నెట్టేశాడు. అదే సమయంలో మహమూద్ సైతం నీటి ప్రవాహం లో కొట్టుకుని పోతుండగా, చిన్నారుల కేకలకు అక్కడే ఉన్న కురుమూర్తి, లంకాల మల్లేశ్‌లు కాల్వలో దూకి మహమూద్‌ను, ఇద్దరు పిల్లలను కాపాడారు. అప్పటికే నీటి ప్రవాహానికి ఆరిఫ్ కొట్టుకుపోయాడు. 3 గంటల పాటు గాలింపు.. ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆరీఫ్ కోసం నందిమళ్లకు చెందిన జాలర్లు, యువకులు కాల్వలో గాలింపు చేపట్టారు. దాదాపు 3 గంటల పాటు వెతికి నీటిలో విగతజీవిగా పడి ఉన్న ఆరిఫ్ (10) మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. నీటిలో గల్లంతైన తమ కొడుకు ఆరి ఫ్ మృతి చెందాడనే వార్త వినగానే అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వారి రోద న పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మహేశ్‌గౌడ్ తెలిపారు. -
మాంసమే నైవేద్యంగా..
పెబ్బేరు రూరల్: అన్ని హనుమంతుడి ఆలయాల్లో సిందూరం, తమలపాకులు, టెంకాయలతో ప్రత్యేక పూజలు చేయడం చూస్తుంటాం. కానీ, చింతలకుంట ఆంజనేయస్వామికి మాత్రం మాంసం, మద్యాన్ని నైవేద్యంగా ఉంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం నుంచి 8 కి.మీ. దూరంలో పాతపల్లి శివారులో చింతలకుంట ఆంజనేయస్వామి కొలువుదీరాడు. ఇక్కడ ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మూడు రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. తాము కోరుకున్న కోరికలు తీరిన భక్తులు కోళ్లు, పొట్టేళ్లను స్వామి వారికి బలిస్తారు. దీంతోపాటు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు స్వామివారి సన్నిధిలో పొట్టేళ్లను బలిచ్చి పూజలు చేస్తారు. శుక్రవారం పలువురు భక్తులు కోళ్లను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. చరిత్ర..: ఈ ఆలయం చుట్టుపక్కల చింతచెట్లు ఎక్కువగా ఉండడంతో అప్పట్లో రాక్షసులు ఎక్కువగా సంచరించేవారట. మనుషులు, పశుపక్షాదులను చంపుతుండటంతో ప్రజలు రక్షించాలని హనుమంతుడిని వేడుకోవడంతో ఆయనే ఇక్కడ కొలువై రాక్షసకాండకు ముగింపు పలికాడని చెబుతారు. ఈక్రమంలోనే రాక్షసులంతా హనుమంతుడిని వేడుకోవడంతో.. భక్తులు వారి ఇష్టపూర్తితో తనకు జంతువులను బలి ఇస్తారని, వాటితో కడుపు నింపుకోవాలని, మనుషుల జోలికి వెళ్లవద్దని చెప్పినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. అయితే శ్రీరంగాపూర్ మొదటి పరిపాలన రాజు వాసుదేవరావు సైతం తాను అనుకున్నది నెరవేరడంతో గుడిని నిర్మించారు. గుడి సమీపంలో చింతల చెరువు ఉండటంతో చింతలకుంట ఆంజనేయస్వామి అని పేరొచ్చిందని చెబుతారు. -
మానవత్వం మోసుకెళ్లింది..
సాక్షి, వనపర్తి: మానవత్వం మరిస్తే బతుకుకర్థమే లేదు. తోటి మనిషికి సాయపడితే కలిగే సంతోషాన్ని మించిన సంపదా లేదు. ఒక మంచిపనితో ఎందరి మనసుల్లోనో చోటును ఆస్తిగా సంపాదించుకున్నాడీ వ్యక్తి. వనపర్తి మండలం చందాపూర్‌లో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్లు ఇస్తున్నారని చెప్పడంతో ఓ దివ్యాంగుడు హడావుడిగా వెళ్తూ దారిలో పడిపోయాడు. ఆ చోటునుంచి కదలలేకపోయాడు. అటుగా వెళ్తున్న మరో పింఛన్‌దారుడు గమనించి సదరు దివ్యాంగుడిని కార్యాలయం వరకు ఎత్తుకొని వెళ్లి మానవత్వాన్ని చాటాడు. బుధవారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చదవండి: ‘మిల్లెటు’ బండెక్కి వచ్చేత్తమూ.. -
వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలనుకున్నారు.. కానీ..
సాక్షి, గోపాల్పేట (వనపర్తి): నాలుగు నెలల ఆ గర్భిణి, కుటుంబసభ్యులు ఎంతో సంతోషంగా కాలం గడుపుతుండగా వాటర్ హీటర్ రూపంలో మృత్యువు గర్భిణిని కబళించింది. ఈ విషాదకర సంఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ నవీద్ తెలిపిన వివరాలిలా.. బుద్దారానికి చెందిన అంజన్నమ్మ, తిరుపతిగౌడ్ కూతురు రవిసుధ (22)ను మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన నరేందర్‌గౌడ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ జీవితం సంతోషంగా సాగుతోంది. వారికి ఇప్పటికే 14నెలల బాబు ఉండగా.. ప్రస్తుతం రవిసుధ నాలుగు నెలల గర్భిణి. ఈక్రమంలో రోజులానే ఇంట్లో శనివారం నీరు వేడి చేసేందుకు నీటితో నిండిన బకెట్లో హీటర్‌ను ఉంచారు. అదే సమయంలో ఇల్లు శుభ్రం చేస్తున్న రవిసుధ చెయ్యి అనుకోకుండా హీటర్ ఉంచిన బకెట్‌కు తగిలింది. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. చదవండి: (చిట్టమ్మ పెంచుకున్న పొట్టేలే.. ‘ఊపిరి’ తీసింది!) భర్త నరేందర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా, రవిసుధ తల్లిదండ్రులు.. తమ కూతురు వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలన్న ఆశతో సొంత గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. కానీ, అనుకోని రీతిలో తమ కూతురు వారిని వీడిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
కాలినడకన వెళ్తుంటే కాటేశారు
పాన్‌గల్: కాలినడకన పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థినిని కామాంధులు అటకాయించి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం మల్లాయపల్లిలో చోటు చేసుంది. మల్లాయపల్లికి చెందిన విద్యార్థిని(14) పాన్‌గల్ మండలం చింతకుంటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. స్కూల్‌కు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో స్వగ్రామం నుంచి రోజూ స్నేహితులతో కలసి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లి వస్తోంది. రోజులాగే మంగళవారం ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి పాఠశాలకు వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన వివాహితులైన నాగరాజు, అనిల్ రెండు వేర్వేరు బైక్‌లపై వచ్చి స్కూల్ వద్ద వదిలేస్తామని వారిని నమ్మించారు. అనిల్ ఇద్దరు బాలికలను తన బైక్‌పై ఎక్కించుకుని ముందు వెళ్లగా, నాగరాజు మరో బాలికను ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు బాలికలను స్కూల్ వద్ద వదిలిపెట్టి తిరిగి వచ్చిన అనిల్ సైతం బాధితురాలిపై అఘాయిత్యం చేశాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బాధితురాలిని భయపెట్టి వెళ్లిపోయారు. బాధితురాలు ఏడుస్తూ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు విషయం చెప్పడంతో వారు కుటుంబసభ్యులు, మల్లాయపల్లి సర్పంచ్ జయకళకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగన్న తెలిపారు. నాగర్‌కర్నూల్ ఎస్పీ మనోహర్, వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్ సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు, ఆధారాలను సేకరించారు. నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. -
23న వనపర్తికి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరిపై ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలోసీఎం కేసీఆర్ ఈ నెల 20 నుంచి తలపెట్టిన జిల్లా పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈనెల 19 నుంచి ప్రారంభం కావాల్సిన సీఎం జిల్లాల పర్యటన, ఈ నెల 23 నుంచి మొదలవుతుంది. ఈ నెల 23న వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. వనపర్తిలో కొత్త మార్కెట్ యార్డు, రెండు పడకల గదుల ఇళ్ల ప్రారంభంతో పాటు వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల, కర్నెతండా ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధనా కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, నీటి పారుదల శాఖ సీఈ కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ జరిగే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. నూతన ఎమ్మెల్సీలకు అభినందన.. గవర్నర్ కోటాలో ఇటీవల శాసన మండలికి ఎన్నికైన అసెంబ్లీ మాజీ స్పీకర్ మదుసూధనాచారితో పాటు స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీను సీఎం అభినందించారు. ఎమ్మెల్సీలు భానుప్రసాద్, ఎల్.రమణ, తాతా మధు, డాక్టర్ యాదవరెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి తదితరులు కేసీఆర్‌ను కలిశారు. బ్రీవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన గజ్జెల నగేశ్.. ముఖ్యమంత్రికి సాష్టాంగ నమస్కారం చేయగా, కార్పొరేషన్లకు నామినేట్ అయిన ఎర్రోళ్ల శ్రీనివాస్, సాయిచంద్, దూదిమెట్ల బాలరాజు తదితరులను కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. -
ముసురు వానకు పాడైన పంట.. ఆగిన రైతు గుండె
ఖిల్లాఘనపురం: వరి పంటకోత దశలో ముసురు వానకు పాడైపోయిందనే బెంగతో ఓ రైతు గుండెపోటుకు గురై మృతిచెందాడు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురానికి చెందిన చెరక పెద్దనర్సింహ (65)కు మూడెకరాల పొలం ఉంది. అందులో వరి సాగు చేశాడు. కాగా, సోమవారం కోత మిషన్ తో పంటను కోయిస్తుండగా ముసురువాన కురిసింది. దీంతో సగమే కోసి మిగతాది మొత్తం బురదగా ఉండటంతో, వాహనం దిగబడుతుందని మధ్యలోనే వదిలేసి వెళ్లారు. దీంతో ఆ రైతు ఆందోళనకు గురయ్యాడు. ముందుగా కోసిన ధాన్యాన్ని కేజీబీవీ సమీపంలోని ప్రైవేట్ ప్లాట్లను చదును చేసుకుని రాశిగా పోసుకున్నాడు. రాత్రి అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి దాటాక పెద్దనర్సింహకు గుండెనొప్పి రావడంతో తోటి రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. -
ధాన్యం తడిసిందని.. మహిళా రైతు బలవన్మరణం
ఆత్మకూర్/నేలకొండపల్లి: కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకోగా.. నెలరోజులైనా కాంటా వేయలేదని మనస్తాపానికి గురైన మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వనపర్తి, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం జూరాలకు చెందిన పద్మ (36) మూడెకరాల పొలంలో వరి సాగుచేశారు. వారం రోజులు ధాన్యం ఆరబెట్టి గ్రామంలో ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రంలో 15 రోజుల క్రితం తూకం వేయించారు. కొనుగోలు చేసి న ధాన్యం తరలించే వరకు రైతులదే బాధ్య త అని చెప్పడంతో రేయింబవళ్లు ధాన్యం బస్తాల వద్దే ఆమె కాపలా కాసింది. ఈనెల 16, 17 తేదీల్లో కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయింది. ఇంకెన్ని రోజులు ఇలా కాపలా కాయా లంటూ ఐకేపీ నిర్వాహ కులతో సోమవారం సాయంత్రం వాగ్వాదానికి దిగింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. మంగళవారం తెల్లవారుజామున ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం చెందింది. నెలరోజులైనా కాంటా వేయలేదని.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కౌలు రైతు గడ్డం లింగయ్య నెల రోజుల క్రితం మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చా డు. ధాన్యాన్ని ఆరబెట్టి ప్రతిరోజు కాపలా కాస్తూ తనకిచ్చిన సీరియల్ నంబరు ప్రకా రం కాంటా వేయించుకునేందుకు ఎదురుచూస్తున్నాడు. అయితే తనకంటే వెనుక తీసుకొచ్చిన దళారుల ధాన్యాన్ని మాత్రం కాంటా వేస్తున్నారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేని లింగయ్య తీవ్ర మనస్తాపంతో మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి రైతులు అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇలా రోజుల తరబడి తిప్పించుకోవడం ఏమిటని ఆగ్రహించిన రైతులు తహసీల్దార్ కార్యాల యం ఎదుట ధర్నా చేశారు. ఇకపై వేగంగా కాంటాల ప్రక్రియ పూర్తి చేయిస్తామని తహసీల్దార్ హామీనివ్వడంతో వారు ఆందోళన విరమించారు. చదవండి: స్ఫూర్తిమంతంగా నిలిచిన మహిళా సర్పంచ్ -
విషాదం: వనపర్తిలో ఐదుగురు మృతి
సాక్షి, వనపర్తి: పండగ పూట జిల్లాలోని గోపాల్పేట మండలం బుద్దారంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి పాత మట్టి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వనపర్తి జిల్లా ఇంచార్జ్ , నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సాయి శేఖర్, వనపర్తి ఏసీపీ షాకీర్ హుస్సేన్, సీఐ సూర్య నాయక్, ఎస్సై రామన్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇంటి యజమాని ఆయిన్ కోమటి చెవ్వ నరసింహ సంవత్సరం క్రితం మరణించడంతో తద్దినానికి శనివారం నలుగురు కుమారులు, నలుగురు కోడళ్లు, మనుమల్లు,మనుమరాళ్లు తమ ఇంటికి వచ్చారు. శనివారం రాత్రి కుంటుంబ సభ్యులు మొత్తం పది మంది ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఇంటి మిద్దె కూలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు ఒకే కుంటుంబానికి చెందిన చెవ్వా మనెమ్మ (68), చెవ్వా సుప్రజ(38), వైష్ణవి(21), రింకి(18) ,చెవ్వా ఉమాదేవి(38)గా పోలీసులు గుర్తించారు. -
విష ప్రయోగమా.. క్షుద్ర పూజలా..?
వనపర్తి/గోపాల్పేట: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో శువ్రకారం ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. పోస్టుమార్టం ప్రాథమిక అంచనా ప్రకారం విష ప్రయోగం వల్ల మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తుండగా.. గుప్త నిధి కోసం క్షుద్ర పూజలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన హాజిరా బీ (62)కి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. వారిలో పెద్దకుమార్తె, రెండో కుమార్తె, కుమారుడు నాగర్‌కర్నూల్‌లో, చిన్నకూతురు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 11వ తేదీన హాజిరా బీ నాగర్‌కర్నూల్‌లో తన మనవడు, మనవరాలి జన్మదిన వేడుకలు నిర్వహించి మరుసటి రోజు కూతురు అస్మా (39), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా (11)తో కలసి నాగపూర్‌కు వచ్చారు. శుక్రవారం ఉదయం అదే గ్రామానికి చెందిన హాజిరా బీ బంధువు యూసుఫ్ అనారోగ్య సమస్య కారణంగా ట్యాబ్లెట్ (మాత్ర) కోసం వారి ఇంటికి వెళ్లగా.. ఇంట్లో వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు విగతజీవులుగా పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే నాగర్‌కర్నూల్‌లో ఉండే హాజిరా బీ కుమారుడు కరీం పాషాకు, గ్రామస్తులకు విషయం చెప్పాడు. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. ఇంటి పరిసరాలను పరిశీలించారు. వంట గదిలో హాజిరా బీ, డైనింగ్ హాలులో అస్మా, హాలులో హసీనా, ఇంటి వెనుక గుంత వద్ద ఖాజా పాషా మృతదేహాలు ఉన్నాయి. అన్ని మృతదేహాల వద్ద కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పూలు, అత్తరు తదితర వస్తువులు ఉన్నాయి. అయితే క్షుద్ర పూజలేమైనా జరిగాయా అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇంట్లో గుప్త ని«ధి కోసం తవ్విన దాఖలాలు ఉన్నాయని మృతుల బంధువులు, గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు మృతదేహాలు వేర్వేరు ప్రదేశాల్లో పడి ఉండటం, మృతదేహాలపై ఎక్కడా గాయాలు లేకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. 2014లో ఓసారి.. కొన్నేళ్లుగా తన ఇంటి ఆవరణలో నిధి ఉన్నట్లు నిద్రలో కనిపిస్తుందని హాజిరా బీ తరచూ చెప్పేదని గ్రామస్తులు తెలిపారు. 2014లో ఒకసారి కుటుంబ సభ్యులంతా ఇంటి ఆవరణలో ఉన్న నిధి కోసం తవ్వేందుకు యత్నించగా.. బంధువులు, గ్రామస్తులు మందలించడంతో అప్పట్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఎస్పీ విచారణ ఎస్పీ కె.అపూర్వరావు, డీఎస్పీ కిరణ్‌కుమార్ ఈ ఘటనపై విచారణ జరిపారు. మృతుల బంధువులతో మాట్లాడారు. ప్రాణాలు తీసుకునేంత ఇబ్బందులు లేవని వారు తెలిపారు. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో వివరా లు సేకరించే ప్రయత్నం చేశారు. డాగ్ ఘటనా స్థలం నుంచి సమీపంలోని రెండు ఇళ్లలోకి వెళ్లి తిరిగి అక్కడికే వచ్చి ఆగింది. గుప్త నిధులు బయటకు తీసేందుకు గతంలో పెద్దకొత్తపల్లి ప్రాంతం నుంచి ఓ వ్యక్తిని రప్పించినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా ఎవరినైనా పిలిపించారా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. మృతుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నా రు. ఘటనా స్థలంలో ఉన్న వస్తువులను ఫోరె న్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మృతుడు ఖాజాపాషా ఫోన్ కాల్ డేటాను సేకరించి గడిచిన ఎవరెవరితో మాట్లాడారనే కోణంలో విచారణ చేస్తున్నామని సీఐ సూర్యానాయక్ తెలిపారు. రేవల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా.. విష ప్రయోగం వల్లే నలుగురు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని సీఐ వెల్లడించారు. -
ఒకే ఇంట్లో నలుగురి అనుమానాస్పద మృతి
-
ఒకే ఇంట్లో నలుగురి అనుమానాస్పద మృతి
సాక్షి, వనపర్తి జిల్లా: ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో వేర్వేరు చోట్ల పడి ఉన్న మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి ఆవరణలో కుంకుమ,పసుపు, అగరబత్తీలు, నిమ్మకాయలు పడి ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బుస్.. బుస్..
కొత్త జిల్లాలు ఏర్పడటంతో ఆయా జిల్లాకేంద్రాల్లో నివసించేవారి సంఖ్య అధికమైంది. దీంతో శివారు ప్రాంతాలు కూడా ఆయా పట్టణాల్లో కలిసిపోయాయి. చెట్టు, గుట్ట, పుట్టా అనే తేడా లేకుండా కొత్త వెంచర్లు వెలుస్తుండటం, నిర్మాణాలు చేపడుతుండటంతో పాములు ఇళ్లల్లోకి దూరుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోనిజనం భయపడుతున్నారు.వనపర్తిలో స్నేక్ సొసైటీ ఉండటంతో ఆ ప్రాంత వాసులు సొసైటీ సభ్యులను ఆశ్రయిస్తున్నారు. గతేడాది వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు జనావాసాల్లోకి వచ్చిన 836 పాములను స్నేక్ సొసైటీ వారు పట్టుకొని సురక్షితంగా అడవిలో వదిలేశారు. పూరి గుడిసెలు, కొత్త నిర్మాణాలు, ఇటుక బట్టీలు, ఫంక్షన్ హాళ్లు, బైక్‌లు, కార్లు, ట్రాక్టర్లలో దూరిన పాములను పట్టుకోగా.. అందులో ఎక్కువశాతం నాగుపాములే ఉండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత విష పూరితమైన సాస్కెల్డ్ వైపర్ పామును కూడా పట్టుకొన్నారు. వర్షాకాలంలో.. వర్షాకాలంలో అధికంగా పాములు బయటకు వస్తుంటాయి. పట్టణ శివారు ప్రాంతాల్లో చాలాచోట్ల ఇళ్ల నడుమ ఖాళీ స్థలాలు ఉండటం.. అవి పొదలు, రాళ్లు, పుట్టలతో నిండిపోతున్నాయి. నిర్మానుష్యంగా ఉన్న సమయంలో అవి బయటికి వస్తున్నాయి. కనిపిస్తే స్నేక్ సొసైటీకి సమాచారం ఇవ్వడం, లేదంటే అప్పుడప్పుడు పాముకాటుకు గురవుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి.. వర్షాకాలం ప్రారంభమైనందున పొలాలకు వెళ్లే రైతులు, ప్రజలు రాత్రిళ్లు చెప్పులు, టార్చిలైట్‌తో వెళ్లడం మంచిది. పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు. తీవ్ర ఒత్తిడికి లోనైతే రక్తపోటు పెరగటంతో పాటు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. నాటు వైద్యం, మంత్రాలు అంటూ సమయం వృథా చేస్తే ప్రాణాలకే ప్రమాదం. పాముకాటుకు గురికాగానే పైభాగం గుడ్డతో కట్టాలి. అయిదు నిమిషాలకు ఓసారి విప్పి మళ్లీ కట్టాలి. త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లేలా చూడాలి. సొసైటీ ఆధ్వర్యంలో విషపూరితమైన సాస్కెల్డ్ వైపర్ పామును మూడు సార్లు పట్టుకున్నాం. ఎవరికైనా పాము కనిపిస్తే చంపకుండా 9985545526 నంబర్‌ను సంప్రదించాలి.– కృష్ణాసాగర్, స్నేక్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి స్నేక్ సొసైటీ సహకారంతో.. జనావాసాల్లోకి వచ్చిన 836 పాములను జిల్లా స్నేక్ సొసైటీ సభ్యులు పట్టుకున్నారు. అందులో 406 నాగు, 70 కట్ల పాములు, 6 రక్తపింజరిలు, 3 సాస్కెల్ వైపర్, 115 జెర్రిపోతులు, 80 నీరుకట్టలు, 40 ట్రీస్నేక్, 111 పుడుపాములున్నాయి. వీటిని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో వదిలేశారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన సాస్కెల్డ్ వైపర్ పాము వనపర్తి శివారులోని గిరిజన బాలికల కళాశాల మరుగుదొడ్డిలోకి దూరింది. చూసిన విద్యార్థినులు స్నేక్ సొసైటీకి సమాచారమిచ్చారు. వారు సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలారు. అలాగే తిరుమలయ్య గుట్టలో ఫారెస్ట్ అధికారులు ఎండిపోయిన చెట్లను లెక్కించే క్రమంలో చెట్టు తొర్రలో ఉన్న పామును పట్టుకున్నారు. -
మరో పిల్లల మర్రి!
పాలమూర్ జిల్లా, నవాబుపేట: పాలమూర్ జిల్లాలో మరో పిల్లలమర్రి వెలుగులోకి వచ్చింది. వందల ఏళ్ల క్రితం ఏర్పడ్డ మర్రి చెట్టు ఉన్న కొత్తపల్లి అప్పట్లో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండటం, జిల్లాకేంద్రానికి దూరం కావటంతో మరుగునపడింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ఈ గ్రామం నవాబుపేట మండలంలోకి వచ్చింది. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అందంగా కనిపిస్తోంది. మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్లు, జిల్లాకేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ మహావృక్షం ఉంది. ఈ చెట్టు నీడన ఆంజనేయస్వామి ఆలయం.. ఆలయానికి ఎదురుగానే వృక్షం మొదలు ఉంది. ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాలని మండలవాసులు కోరుతున్నారు. గోసాయి మర్రిగా.. గతంలో ఈ వృక్షం కింద గోసాయిలుగా పిలవబడే సాధువులు చాలామంది తపస్సు చేస్తూ ఈ ప్రాంతవాసులకు కనిపించటంతో గోసాయి మర్రిగా పిలుస్తారు. నాటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్ల దృష్టికి ఈ మర్రి గురించి వివరించామని.. అప్పటి పరిస్థితుల్లో వెలుగులోకి రాలేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుత పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. అభివృద్ధి చేయాలి.. చరిత్ర గల మర్రి చెట్టు. ఇప్పటికే చాలావరకు అంతరించింది. ఆదరణ లేకపోతే మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. చెట్టు నీడన పురాతన ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. పర్యాటక మంత్రి చొరవ చూపితే అభివృద్ధి చెందుతుందని మా ఆకాంక్ష. – నీరజారెడ్డి, సర్పంచ్, కొత్తపల్లి -
కత్తితో దాడి.. ధైర్యంగా వీడియో చిత్రీకరించిన చిన్నారి
వనపర్తి: మానవత్వాన్ని పక్కన పెట్టి ఆస్తుల కోసం విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడుతున్న రోజులు దాపురించాయి. ఇందుకు నిదర్శనం గోపాల్పేట మండలం బుద్దారంలో చోటుచేసుకున్న ఘటనే. ఆస్తి కోసం ఓ వృద్ధురాలిపై సమీప బంధువే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటనతో ఒక్కసారిగా జిల్లా ప్రజలు ఉలికిపడ్డారు. చివరకు బాధితురాలు రత్నమ్మ (60) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘర్షణను ఆపేందుకు ఓ వ్యక్తి యత్నించి గాయాలపాలయ్యాడు. అదే గ్రామానికి చెందిన ఓ చిన్నారి ధైర్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించిన వీడియో ఈ సంఘటన ఎంత అమానవీయంగా ఉందనేందుకు అద్దం పడుతోంది. సాటి మనిషి రక్తం మడుగులో పడి ఉన్నా.. కసితీరా కత్తితో దాడి చేస్తారా.. అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేలా ఒల్లు జలదరించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేస్తోంది. ఆలస్యం కావడానికి కారణమేమిటి? రత్నమ్మ (60), భర్త అనంతరావుపై బంధువులే దాడి చేస్తున్నారని గ్రామస్తులు వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి సమాచారం ఇస్తే.. మండల కేంద్రానికి 5కి.మీ. ఉన్న బుద్దారానికి చేరుకునేందుకు గంట సమయం ఎందుకు పట్టిందనే దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలో ప్రధాన నిందితులతో గోపాల్పేట పోలీసులకు లోపాయికారీ ఒప్పందాలు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలకు మరింత బలాన్నిస్తున్నాయి. భూముల ధరలకు రెక్కలు జిల్లాల ఏర్పాటు, సమృద్ధిగా సాగునీటి వనరులు పెరగటంతో వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాలు, గ్రామాల్లోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఇటీవల కాలంలో ఆస్తి పంచాయితీలు, భూముల్లో వాటాలు, హక్కులపై కోర్టులో, పోలీస్ స్టేషన్లలో కేసులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఓ నిండుప్రాణం గాలిలో కలిసిపోయింది. గాయపడిన మహిళ మృతి గోపాల్పేట (వనపర్తి): భూ వివాదంలో బుధవారం దాడికి గురై హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బుద్దారానికి చెందిన రత్నమ్మ (60) గురువారం మధ్యాహ్నం మృతి చెందిందని ఎస్ఐ రామన్‌గౌడ్ తెలిపారు. ఈ దాడికి పాల్పడిన అర్జున్‌రావు, శేషమ్మ, నరేందర్‌రావు, ప్రశాంత్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా జడ్జి ఎదుట ప్రవేశపెట్టామన్నారు. అనంతరం నలుగురిని మహబూబ్‌నగర్ జైలుకు తరలించామన్నారు. బుద్దారంలో పోలీసుల పహారా భూ వివాదంలో హత్యకు గురైన రత్నమ్మ (60) సంఘటనతో బుద్దారం గ్రామస్తులు కోపోద్రిక్తులయ్యారు. ఇలాంటి గొడవలు లేకుండా చూడాలని మహిళలు, గ్రామస్తులు గురువారం రాత్రి రోడ్డుపై గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. సీఐ సూర్యనాయక్, ఎస్ఐ రామన్‌గౌడ్ అక్కడికి చేరుకుని మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని వారికి సర్ది చెప్పారు. కరోణా వైరస్ ప్రబలుతున్నందున ఇలా గుమికూడవద్దని సూచించడంతో పరిస్థితి సద్దుమణిగింది. గ్రామంలో పోలీసులు పహారా కాశారు. నిందితులకు శిక్షపడేలా చూస్తాం బుద్దారం ఘటనపై సమగ్ర విచారణ చేస్తాం. ఈ కేసులో నిందితులకు శిక్షపడేలా చూస్తాం. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. భవిష్యత్‌తో ఇలాంటివి పునరావృత్తం కాకుండా తగు చర్యలు తీసుకుంటాం. – కె.అపూర్వారావు, ఎస్పీ, వనపర్తి -
సినిమా షూటింగ్‌లా చూస్తున్నారే గానీ..
గోపాల్పేట(వనపర్తి): సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. కళ్ల ముందు ఓ మనిషిని (అందులోనూమహిళ) కత్తితో విచక్షణారహితంగా దాడి చేస్తున్నా సినిమా షూటింగ్‌లా చూస్తున్నారే గానీ వారించేవారు కరువయ్యారు. జిల్లాలోని గోపాల్పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన అర్జున్‌రావు అదే గ్రామానికి చెందిన అనంతరావు భార్య రత్నమ్మ(60)పై మటన్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలైన రత్నమ్మను వనపర్తి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బుద్దారానికి చెందిన అర్జున్‌రావుకు 375, 376 సర్వే నంబర్లలో 2.28గుంటల భూమి ఉండేది. ఈ భూమిని 2010లో అనంతరావు మధ్యవర్తిగా ఉండి దాయాది కుటుంబసభ్యులకు అమ్మించాడు. 2018లో 2.28 ఎకరాల అమ్మిన భూమి సమీపంలోని 405, 406 సర్వే నంబర్లలోని 13గుంటలు, 15గుంటల భూమిని వేరొకరి పేరుమీద పట్టా చేయించాడని అర్జున్‌రావు ఆరోపిస్తూ గ్రామ పెద్దల వద్ద ఇటీవల పంచాయితీకి పెట్టాడు. ‘నీ పొలం అమ్మినట్లయితే నా పొలంలో 28గుంటలు తీసుకో’ అని అనంతరావు గ్రామస్తుల సమక్షంలో కాగితంపై రాసిచ్చాడు. అప్పటినుంచి తనకు రాసిచ్చిన ప్రకారం భూమిని ఇవ్వాలని వాదనలు జరిగాయి. ఈ విషయంపై ఐదురోజుల కిందట గోపాల్పేట పోలీస్‌స్టేషన్‌లో అర్జున్‌రావు ఫిర్యాదు చేశారు. (మహిళపై కత్తితో పదేపదే దాడి) రెండు కుటుంబాలకు చెందిన వారు కూర్చొని మాట్లాడుకోవాలని ఎస్ఐ రామన్‌గౌడ్ సూచించారు. ఈ విషయంపై బుధవారం ఉదయం గ్రామంలోని పాలకేంద్రం వద్ద అర్జున్‌రావు అతని భార్య శేషమ్మ, కొడుకు నరేందర్‌రావు, అతడి మనువడు ప్రశాంత్‌రావు కలిసి అనంతరావుతో వాదనలకు దిగాడు. ఇది కాస్త ఘర్షణలకు దారితీసింది. గొడవ పెరగడంతో అర్జున్‌రావు అనంతరావు తలపై కర్రతో కొట్టాడు. ఈ క్రమంలో అనంతరావు భార్య రత్నమ్మ అడ్డువచ్చింది. అప్పటికే ఆవేశంగా ఉన్న అర్జున్‌రావు వెంట తీసుకున్న మటన్ కత్తితో రత్నమ్మను విచక్షణారహితంగా నరికాడు. అడ్డుకోబోయిన స్థానికుడు మేకల సహదేవుడుపై కత్తితో దాడి చేయగా ఆయన గాయపడ్డాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు 100డయల్ చేసి సమాచారం చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు రత్నమ్మ భర్త అనంతరావు ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన అర్జున్‌రావు, అతని భార్య శేషమ్మ, కొడుకు నరేందర్‌రావు, మనువడు ప్రశాంత్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామన్‌గౌడ్ చెప్పారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అపూర్వరావు, డీఎస్పీ కిరణ్‌కుమార్, సీఐ సూర్యనాయక్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసున్నారు. చూస్తుండి పోయిన జనం బుద్దారంలో ఉదయం బాధితురాలు రత్నమ్మపై అర్జున్‌రావు కత్తితో దాడి చేస్తుండగా అక్కడ దాదాపు పది నుంచి 15మంది వరకు ఉన్నారు. సహదేవుడు ఒక్కడే ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ మిగిలిన వారు ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. పథకం ప్రకారమే కత్తి, కర్రతో దాడి వనపర్తి క్రైం: బుద్దారం ఘటనపై బుధవారం సాయంత్రం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ కిరణ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. తమకు తెలియకుండా భూమి విషయంలో మోసం చేశాడని, బంధువులపై కోపం పెంచుకుని పథకం ప్రకారమే అర్జునయ్య తమ బంధువులైన అనంతరావుపై కర్రతో దాడి చేశారు. అడ్డోచ్చిన భార్య రత్నమ్మలపై మటన్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు చెప్పారు. ప్రాణాలతో కోట్టుమిట్టాడుతున్న ఆమెను, గాయపడిన అనంతరావును వనపర్తి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం నిందితులను వారి తోటలో అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో వనపర్తి సిఐ సూర్యనాయక్, వనపర్తి, గోపాల్పేట ఎస్ఐలు వెంకటేష్‌గౌడ్, రామన్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
మహిళపై కత్తితో పదేపదే దాడి
సాక్షి, వనపర్తి: రెండు కుటుంబాల మధ్య మూడేళ్లుగా నలుగుతున్న భూవివాదం మారణాయుధాలతో దాడులు చేసుకునేవరకు వెళ్లింది. ఈ ఘటన జిల్లాలోని గోపాల్పేట మండలం బుద్దారంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అర్జున్‌రావు అనే వ్యక్తి అనంతరావు, రత్నమ్మ దంపతులపై కత్తితో అతి దారుణంగా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు. రత్నమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అనంతరావు దంపతులపై అర్జున్‌రావు దాడి చేస్తున్న సమయంలో చుట్టూ పదుల సంఖ్యలో జనం ఉన్నా ఎవరూ అడ్డుకోకపోవడం శోచనీయం. ఇక అర్జున్‌రావు రత్నమ్మపై కత్తితో దాడి చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (పోలీసులమంటూ ప్రేమజంటపై దౌర్జన్యం) -
స్తంభంపైనే మృత్యువాత
వనపర్తి రూరల్: వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. వనపర్తి మండంలోని కడుకుంట్లలో ఆంజనేయులు అనే రైతు సోమవారం ఉదయం గ్రామ శివారులోని తన పొలంలో మోటర్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని కోరడంతో స్థానికంగా హౌస్వైరింగ్, ప్లంబింగ్ పనిచేసే వారాల వెంకటేశ్వర్లు (48) సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేసి స్తంభం ఎక్కాడు. అయితే ఈ స్తంభానికి మరో ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా అవుతున్న విషయం తెలియక వెంకటేశ్వర్లు, కనెక్షన్ ఇచ్చే ప్రయత్నంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలు ఇది గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని కిందకు దించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ షేక్‌షఫీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలో వెంకటేశ్వర్లుతోనే స్థానిక లైన్మాన్ అశోక్ చాలాసార్లు స్తంభాలను ఎక్కించి విద్యుత్ పనులు చేయించినట్టు గ్రామస్తులు తెలిపారు. దీనిపై లైన్మాన్ అశోక్‌ను వివరణ కోరగా.. తనకు సమాచారం ఇవ్వకుండా స్తంభం ఎక్కడంతోనే ఈ సంఘటన చోటుచేసుకుందన్నారు. -
నా భార్యను కాపాడండి..
వనపర్తి క్రైం: పొట్ట కూటి కోసం వలస వచ్చిన జంటతో ఓ యజమాని నాలుగు నెలలు పని చేయించుకొని డబ్బులివ్వకుండా ముఖం చాటేశాడు. లాక్డౌన్ సమయంలో పని లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక.. తినడానికి తిండి లేక నానా అవస్థలు పడ్డారు. తీవ్ర అనారోగ్యానికి గురైన భార్యను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు భర్త. పరిస్థితి విషమంగా ఉంది.. పట్టణానికి తీసుకెళ్లండని వైద్యులు సూచించటంతో ఏం చేయాలో పాలుపోక ఆస్పత్రి బయట చెట్టుకింద కూర్చొని భార్యను పట్టుకొని భర్త కన్నీరుమున్నీరుగా విలపించిన సంఘటన జిల్లాకేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్ జిల్లా పలమనేరు మండలం గంటావురు గ్రామానికి చెందిన శ్యామల, నరేశ్ దంపతులు జిల్లాలోని పెబ్బేరు మండలం చెలిమిళ్ల సమీపంలో బాతులను మేపడానికి జంటకు నెలకు రూ.10 వేల వేతనానికి వచ్చారు. యజమాని గణేశ్ మాయమాటలు నమ్మి అడ్వాన్స్ కూడా తీసుకోలేదు. నాలుగు నెలలుగా పని చేయించుకొని వారికి డబ్బులివ్వకుండా ముఖం చాటేశాడు. లాక్డౌన్ సమయంలో శ్యామల అనారోగ్యం బారిన పడటంతో 20 రోజుల కిత్రం జిల్లా ఆస్పత్రిలో చేర్పించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. చేతిలో డబ్బులు, తినడానికి తిండిలేక ఏం చేయాలో పాలుపోక గుత్తేదారుకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఊరుగాని ఊరిలో ఏం చేయలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, కళ్ల ముందే చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్న భార్యను చూస్తూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ‘నా భార్యను కాపాడండి..’ అంటూ రోదించడం కనిపించింది. ఆదుకున్న దాతలు.. వలస జంట సొంత గ్రామానికి వెళ్లడానికి పట్టణ ఎస్ఐ వెంకటేశ్‌గౌడ్ రూ.5 వేలు, రూరల్ ఎస్ఐ రూ. 1,000, కౌన్సిలర్ బ్రహ్మంచారి రూ.2,500, బీజేపీ నాయకుడు నారాయణ రూ.రెండు వేలు, కౌన్సిలర్ పరశురాం రూ.రెండు వేలు, జనతాల్యాబ్ రాహూల్ రూ.1,000, అంబులెన్స్ రఘు రూ.రెండు వేలు అందజేశారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
వనపర్తి ,అమ్రాబాద్ (అచ్చంపేట): వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ బీసన్న సోమవారం తెలిపిన వివరాలు.. మండలంలోని మన్ననూర్‌కు చెందిన బుడగజంగం ఆంజనేయులు(22) అదే గ్రామానికి చెందిన బాలమ్మ(అలియాస్ బాలమణి) అనే మహిళతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. విషయం తెలిసిన ఆంజనేయు లు తల్లి నారమ్మ, మామ శ్రీనివాసులు ఇద్దరినీ పంచాయతీ పెద్దల సమక్షంలో మందలించారు. ఇదే క్రమంలో మామ శ్రీనివాసులు తన కుమార్తెతో ఆంజనేయులుకు పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. పెళ్లి విషయమై ఈ నెల 5న వివాహేతర సంబంధం పెట్టుకున్న బాలమ్మతో ఆంజనేయులు చెప్పాడు. అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. పెళ్లి విషయమై బాలమ్మ ఆంజనేయులుతో గొడవ పడి ఇంట్లో ఉన్న కత్తితో గొంతు కోసింది. ఆంజనేయులు చనిపోయాక గోనె సంచిలో కట్టి ఇంటి సమీపంలో ఎస్బీఐ బ్యాంకు పక్కన గల డ్రెయినేజీ కల్వర్టులో పడేసింది. విషయం తెలియని ఆంజనేయులు కుటుంబీకులు ఈ నెల 6వ తేదీన యువకుడు అదృశ్యమైనట్లు అమ్రాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 8వ తేదీన మన్ననూర్ ఎబీఐ ఎదుట కాల్వ నుంచి దుర్గందం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా మృతదేహం లభ్యమైంది. ఆంజనేయులు మృతదేహంగా గుర్తించి విచారణ చేపట్టారు. బాలమ్మ హత్య చేసినట్లు నేరం ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘ఖిల్లా’లో దొంగల హల్చల్
ఖిల్లాఘనపురం (వనపర్తి): అర్ధరాత్రి వేళలో కొందరు దొంగలు ఓ గ్రామం, గిరిజన తండాలో దొంగతనాలకు పాల్పడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. తాళం వేసి ఇంటిపై పడుకోగా, తాళం విరగ్గొట్టి ఇంట్లోకి చొరబడి నగదుతో పాటు బంగారు ఆభరణాలు చోరీ చేశారు. మండలంలోని సల్కెలాపురంలో ఆదివారం మధ్యరాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్కెలాపురం గ్రామానికి చెందిన తూడి జగన్నాథరెడ్డి కుటుంబీకులు ఆదివారం రాత్రి భోజనాలు ముగించుకుని ఇంటికి తాళం వేసి ఇంటిపై పడుకున్నారు. మధ్యరాత్రి సమయంలో దొంగలు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచుకున్న 23 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.2.30లక్షల నగదును దోచుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. అదేవిధంగా గ్రామానికి సమీపంలో ఉన్న గిరిజన తండాలో ఓ ఇంటి వరండాలో నిద్రిస్తున్న గిరిజన యువకుడి సెల్‌ఫోన్ దొంగతనానికి గురైనట్లు తండావాసులు పోలీసులకు తెలిపారు. డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలన.. బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించినట్లు సమాచారం తెలుసుకున్న కొత్తకోట సీఐ మల్లికార్జున్‌రెడ్డి, ఖిల్లాఘనపురం ఎస్ఐ రామస్వామి సోమవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్‌స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్ టీంలతో పరిశీలించి బీరువా, సమీపంలోని సామాన్లు తదితర వాటిపై ఫింగర్‌ప్రింట్స్‌ను తీసుకున్నారు. అలాగే గిరిజన తండాలో పోలీసులు పరిశీలించి తండావాసులతో వివరాలు సేకరించారు. -
కరోనాకు నో ఎంట్రీ..
వనపర్తి క్రైం: ఎవరి నోట విన్నా.. ఎక్కడ చూసినా కరోనా.. కరోనా.. ఈ పేరు వింటేనే హడలెత్తిపోయే పరిస్థితి దాపురించింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ వైరస్.. ఎవరి నుంచి ఎప్పుడెలా వ్యాప్తిస్తుందో అర్థం కాక నిత్యం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో వనపర్తి జిల్లాలో మొదటి నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాకుండా వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తున్నారు. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పక్క జిల్లా అయిన జోగుళాంబ గద్వాలలో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వనపర్తి జిల్లా మాత్రం పటిష్ట చర్యలు చేపడుతూ గ్రీన్‌జోన్ దిశగా అడుగులు వేస్తోంది. నమోదు కాని కేసులు.. జిల్లాలో ఇప్పటికే విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల ను ంచి, మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని గుర్తించి, అనుమా నం ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మ ర్కజ్ వెళ్లి జిల్లాకు వచ్చిన 10మందికి రెండుసార్లు క రోనా పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్ అని తేలింది. అయినప్పటికీ వారిని హోంక్వారంటైన్లో ఉంచి వై ద్యులచే పర్యవేక్షిస్తున్నారు. శనివారం మహరాష్ట్ర నుంచి జిల్లాలోని తండాకు వచ్చిన 6మందిని అధికారులు గుర్తించి, హోం క్వారంటైన్లో ఉంచారు. కరోనా కేసు లు నమోదుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు. పక్కా ప్రణాళికతో.. జిల్లాకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారిని గ్రామ టీం సభ్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ, జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఒక టాస్క్ఫోర్సుటీం, 14 మండల టీంలు, 349 గ్రామ టీంలు పనిచేస్తున్నారు. వైద్యాధికారి, రెవెన్యూ, పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 62మంది వైద్యులు, 75మంది నర్సులు, 817మంది పారామెడికల్ సిబ్బంది కరోనా నియంత్రణ కోసం పని చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఏరియా ఆస్పత్రిలో 20బెడ్లతో ఐసోలేషన్, 5బెడ్లతో ఐసీయూ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే నాగవరం దగ్గర ఉన్న ఐటీసీ భవనంలో 100 బెడ్లతో, మర్రికుంట గిరిజన జూనియర్ కళాశాల భవనంలో 50 బెడ్లతో క్వారంటైన్లు ఏర్పాటు చేయగా, శ్రీరంగాపురంలో 20బెడ్లతో ఐసోలేషన్ ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ శ్రీనివాసులు తెలిపారు. నాగవరం ఐటీసీ, మర్రికుంట గిరిజన భవనంలోని క్వారంటైన్లో 15మంది ఉంచి, వారికి వైద్యులచే చికిత్సలు అందిస్తున్నారు. అలాగే వారికి మూడు పూటలా భోజన వసతి కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 2,117మంది హోంక్వారంటైన్లో ఉన్నారు. జిల్లాకు 30వేల మాస్కులు రాగా, అన్ని పీహెచ్‌సీలకు పంపించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి గుర్తింపు.. జిల్లాకు ఇతర రాష్ట్రాలు, పక్కా జిల్లాల నుంచి వచ్చిన వారిని అధికారులు గుర్తించారు. గద్వాల నుంచి 70మంది జిల్లాకు రాగా, కర్నూల్ నుంచి 10మంది వచ్చారు. అలాగే మహరాష్ట్ర, కేరళ, గోవా, పూణే నుంచి 2 వేల మంది జిల్లాకు రాగా, ఒక్క మహరాష్ట్ర నుంచి జిల్లాలోని 40 తండాలకు 1,500 మంది వచ్చారు. వారిని అధికారులు గుర్తించి హోంక్వారంటైన్లో ఉండేలా చూస్తున్నారు. శనివారం మహరాష్ట్ర నుంచి జిల్లాలోని ఓ తండాకు 6మంది నడుచుకుంటూ, వాహనాల్లో వచ్చారు. వారిని అధికారులు గుర్తించి.. 14రోజుల పాటు ఇంట్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నిరంతరం నిఘా.. కలెక్టర్.యాస్మిన్ భాష పర్యవేక్షణలో నిరంతరం గ్రామాల్లో కరోనా కేసులపై వాచ్ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారిని గుర్తించి, వారిని హోంక్వారంటైన్లో 14రోజుల పాటు ఉండేలా చూస్తున్నాం. అనుమానం ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలి. – డాక్టర్ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ సేఫ్ జోన్‌గా జిల్లా.. మొదటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో ప్రజలు ఊపిరి పిల్చుకుంటున్నారు. కానీ పక్క జిల్లాలైన గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లాకు ఎవరూ వచ్చిన వారిని వెంటనే గుర్తిస్తున్నారు. అనంతరం వారిని హోంక్వారంటైన్లో ఉండేలా చూస్తున్నారు. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన 10మందికి రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. అలాగే వారి 63మంది ప్యామిలీ సభ్యులు, వారితో కాంటాక్టు అయిన 193మందికి కరోనా పరీక్షలు నిర్వహించినా నెగెటివ్ అని తేలింది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన ఓ వ్యక్తి భార్య, పిల్లలు 46మందిని కలిశారు. వారిని ఇంట్లోనే ఉండేలా చూస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన 63మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 2,117మంది 14రోజుల పాటు హోంక్వారంటైన్లో ఉంచి పర్యవేక్షించారు. -
నిల్..! సేఫ్ జోన్లో వనపర్తి జిల్లా
వనపర్తి టౌన్: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంటోంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో బెంబేలెత్తుతున్న తరుణంలో జిల్లాలో మొదటి నుంచి కూడా ఒక్క కేసుకూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లోనే ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన పది మందితో పాటు వారి బంధువులు 66మందిని కలుపుకుని 63 రక్త నమూనాలను అధికారులు పరీక్షల నిమిత్తం పంపారు. వాటి ఫలితాలు రెండు మూడు రోజుల్లో రావాల్సి ఉంది. దీంతోపాటు ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి జిల్లావాసులు స్వగ్రామాలకు రావడంతో వారిని క్వారంటైన్లో ఉంచారు. వారికి సంబంధించి గతనెల 23 నుంచి 29 మంది నివేదికలు రాగా, ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో అని అ«ధికార యంత్రాంగం రక్షణ చర్యలను కట్టుదిట్టం చేసింది. ఇప్పటివరకు ఒక్క కేసు లేకపోయినా లాక్డౌన్ పూర్తి వరకు స్వీయ నిర్బంధం పక్కాగా అమలు చేస్తే ఇదే స్ఫూర్తితో వనపర్తి జిల్లాను కరోనా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు ఈనెల 30వరకు ఉన్న లాక్‌డౌన్‌కు సహకరించాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ఇతరప్రాంతాల నుంచి వచ్చినవారిని వెంటనే గుర్తించి హోం క్వారంటైన్‌కు పంపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహాయంతో జిల్లాలో కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా సమాచారం అందేలా జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండంటంతో మొదట్లో పెద్దసంఖ్యలో ఉన్న హోం క్వారంటైన్ బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మాస్కులు ధరించాల్సిందే.. కరోనా కట్టడిలో భాగంగా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు, అత్యవసర పనిమీదæ బయటకు వచ్చే వాళ్లు కచ్చితంగా మాస్కులు ధరించేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఈ మేరకు మాస్కులు ప్రతిఒక్కరూ ధరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకులు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు, నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు మాస్కులు లేకుండా వెళితే ఇబ్బందులు తప్పడంలేదు. మాస్కుల కొరత దృష్ట్యా తొలి విడతగా ఒక్క వనపర్తి మున్సిపాలిటీ దాతల సహకారంతో 3వేల మాస్కులు తయారీ చేసేందుకు మహిళా సంఘాలకు కావాల్సిన వస్త్రం సమకూర్చడంతో తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు తొలి విడతగా వెయ్యి మాస్కులను మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు పంపిణీ చేశారు. మాస్కులు లేకుంటే నిత్యావసరాల సరుకులు విక్రయంచవద్దని వ్యాపారులు ఇదివరకే కలెక్టర్ హెచ్చరించారు. దీంతో మాస్కుల తయారీకి దాతలు ముందుకు రావడం, కొందరు రుమాలుతో అడ్డుపెట్టుకోవడం విధిగా పాటిస్తున్నారు. అదే విధంగా ప్రజల సౌకర్యార్థం టీడీపీ తరఫున 2వేల మాస్కులను అందజేయడంతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి వాటిని పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. అనుమానిత లక్షణాలు ఏ మాత్రం ఉన్నా వెంటనే అప్రమత్తం కావాలని, ఎక్కడెక్కడ తిరిగారో, ఎలాంటి అసౌకర్యంగా ఉందో వైద్యులకు వివరించాలి. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి.– మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, వనపర్తి -
ఆ ఘటనను రాష్ట్రం మొత్తం ఆపాదించలేం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న సమయంలో పోలీసులు చేసిన లాఠీఛార్జ్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వనపర్తి ఘటనను రాష్ట్రం మొత్తం ఆపాదించలేమని తేల్చి చెప్పింది. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం హైకోర్టుకు లేదని పేర్కొంది. ప్రజలు రోడ్లపైకి ఎందుకు వచ్చారో.. అత్యవసరమా లేదా అనేది చూడాలని తెలిపింది. వనపర్తి ఘటనపై ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఘటనపై 17 లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. -
కీచక టీచర్‌కు దేహశుద్ధి చేసిన గ్రామస్ధులు
-
వరుడికి భారీ షాకిచ్చిన పెళ్లి కూతురు!
కొత్తకోట రూరల్: జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో తనకు పెళ్లి ఇష్టం లేదని వధువు పెళ్లికి నిరాకరించింది. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చర్లపల్లిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని పామాపురం గ్రామానికి చెందిన నందిని అదే మండలం చర్లపల్లికి చెందిన వెంకటేశ్‌ల పెళ్లి శుక్రవారం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఉదయం 8.10 గంలకు ముహూర్తం ఉండటంతో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. తీరా జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి నందిని తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. దీంతో పెళ్లికి వచ్చినవారందరూ అవాక్కయ్యారు. నందినిని ఆమె మేనబావ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఈ వివాహానికి నిరాకరించిందని నిర్ధారణకు వచ్చిన వరుడి బంధువులు వధువు మేనబావపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు వచ్చి, జరిగిన విషయం తెలుసుకుని అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయొద్దని ఇరు కుటుంబాలకు సర్ది చెప్పారు. -
అమెరికాలో నిశ్చితార్థం.. మదనాపురంలో వియ్యం
మదనాపురం (కొత్తకోట): పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి పెళ్లి సంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో.. ఉద్యోగం చేసేందుకు అమెరికాకు వెళ్లిన ఓ అమ్మాయి, అబ్బాయి నిశ్చితార్థం వేడుకలను అక్కడ స్నేహితుల సమక్షంలో రింగులు మార్చుకున్నారు. అదే సమయంలో ఇక్కడ వారి తల్లిదండ్రులు తాంబూలాలు పుచ్చుకున్నారు. వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన అనురాధ, జక్కుల నాగన్న యాదవ్ దంపతుల కుమార్తె సావ్వీశృతి 2013 నుంచి అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ కాలనీకి చెందిన శ్రీవాణి, ఐలయ్యయాదవ్ దంపతుల కుమారుడు వంశీకృష్ణ కూడా అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. (ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి) తాంబూలాలు మార్చుకుంటున్న తల్లిదండ్రులు ఇద్దరూ తెలుగువారు కావడంతో ఇటీవల ఇరు కుటుంబాల తల్లిదండ్రులు అక్కడికి వెళ్లినప్పుడు పెళ్లి సంబంధం కుదిర్చారు. సంప్రదాయాల ప్రకారం నిశ్చితార్థం చేయాలనుకున్నారు. అయితే అక్కడ ఇద్దరికీ ఉద్యోగరీత్యా సెలవులు దొరకలేదు. దీంతో అనుకున్న సమయానికి భారత కాలమాన ప్రకారం గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు గురుస్వామి గోపాలకృష్ణ వేద మంత్రాలను సెల్ఫోన్లో చదువుతుండగా.. అమెరికాలో ఇద్దరూ రింగులు మార్చుకున్నారు. ఆ దృశ్యాలను ఇక్కడి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు తిలకించారు. అదే సమయంలో ఇరు కుటుంబాల తల్లిదండ్రులు, బంధువులు తాంబూలాలను మార్చుకుని, లగ్నపత్రిక రాసుకున్నారు. -
ధాన్య భాండాగారం పాలమూరు: స్పీకర్ పోచారం
సాక్షి, వనపర్తి : పేదవాడి ఆత్మగౌరవం సొంతింటితో పెరుగుతుంది.. దీనిని గుర్తించిన సీఎం కేసీఆర్ వందశాతం సబ్సిడీతో రెండు పడకల ఇంటిని పేదవారికి కట్టించేందుకు పూనుకున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం పేదవాడి సొంతింటి కలను అడ్డం పెట్టుకుని ప్రజాధనం స్వాహా చేసిన సంఘటనలు ఊరూరా కనిపిస్తాయన్నారు. నిజమైన ఇల్లు లేని పేద కంటుంబాలన్నింటికీ.. విడతల వారీగా.. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లబ్దిదారుడికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. నేరుగా గృహప్రవేశం చేసుకునేలా సీఎం ఈ పథకాన్ని రూపొందించారన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘణపురం మండలం ఈర్లతండా, కర్నెతండా, రేవల్లి మండలం చెన్నారంలో రూ.5.20 కోట్లతో నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లను, జిల్లా కేంద్రంలో రూ.60 లక్షలతో అభివృద్ధి చేసిన మున్సిపల్ పార్కులు, రూ.95 లక్షలతో నిర్మించిన కూరగాయల మార్కెట్, పాన్‌గల్ మండలం కొత్తపేట క్రాస్‌రోడ్ వద్ద బస్òÙల్టర్, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సాగునీరు లేక బీడు.. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ తిండిపెట్టేంత సాగుభూమి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉందన్నారు. అలాంటి పాలమూరుపై పాలకుల చిన్నచూపుతో కావాల్సిన మేర సాగునీరందక వేలాది ఎకరాల భూమి బీడుగా మారిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత వలస జిల్లాగా పేరున్న పాలమూరును పాడిపంటలతో సస్యశ్యామలం చేసేందుకు కొత్త ప్రాజెక్టులు, కాల్వలు, చెరువుల దురస్తు, సమాంతర కాల్వల బ్రాంచ్ కెనాన్స్ మంజూరు చేయటంతో పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పచ్చని పంటలే దర్శనమిస్తున్నాయన్నారు. పాలమూరులోని పారుతున్న జీవనది కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఎక్కువ భూ భాగానికి సాగునీరు తీసుకువచ్చేందుకు జూరాల, భీమా, కేఎల్ఐ ప్రాజెక్టుల నుంచి పాత కాల్వలకు తోడుగా కొత్తగా కాల్వలను తవి్వంచి వ్యవసాయాన్ని పండగలా చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని, అందుకే ఆయనకు నీళ్ల నిరంజన్‌రెడ్డి అనే పేరువచ్చిందన్నారు. 42 లక్షల మందికి ఆసరా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 42 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తూ వృద్ధులు, వికలాంగులకు భరోసా ఇస్తుందని స్పీకర్ చెప్పారు. ఇందుకు ప్రతినెలా ప్రభుత్వం రూ.12 వేల కోట్లు వెచ్చిస్తోందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, సీఈఓ నర్సింహులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, ఎస్పీ అపూర్వరావు, మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సభ్యుడు సామ్యనాయక్, సింగిల్ విండో అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు సాయిరెడ్డి, రంగారెడ్డి, సత్యం, రమేష్ కృష్ణయ్యగౌడ్, రాజు, పురుషోత్తం, చెన్నారం సర్పంచ్ రమే‹Ù, రేవల్లి ఎంపీపీ సేనాపతి, జెడ్పీటీసీ సభ్యుడు భీమయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇళ్లు.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 1,400 డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి నియోజక వర్గంలో ఇప్పటికే దాదాపుగా మంజూరైన అన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. ఖిల్లాఘనపురం మండలంలో 100 ఇళ్లకు గాను 67 ఇళ్లు పూర్తిచేయడంతోపాటు మరో 33 ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతుతన్నాయన్నారు. నియోజకవర్గానికి మరో వెయ్యి ఇళ్ల మంజూరుకు కృషిచేస్తామన్నారు. కర్నెతండాతోపాటు ఎత్తైన ప్రాంతాల్లోని బీడు భూములకు కర్నెతండా లిఫ్టు ద్వారా వచ్చే వానాకాలం నాటికి సాగునీరు అందిస్తామన్నారు. ఈ లిఫ్టు మంజూరుకు సీఎంను కోరినట్లు మంత్రి చెప్పారు. -
కాసుల గలగల
వనపర్తిటౌన్: వనపర్తి ఆర్టీసీకి సంక్రాంతి కలిసి వచ్చింది. ఏన్నాడు లేని రీతిలో ఆదాయం ఆర్టీసీకి సమకూరింది. ఎనిమిది రోజుల్లో రూ.143.52 లక్షల ఆదాయం రాబట్టింది. రోజువారీగా వచ్చే ఆదాయం కంటే అదనంగా ఆదాయం సమకూరడంతో పాటుగా ఈనెల 20వ తేదీ ఒక్కరోజునే రూ.22 లక్షల ఆదాయం సమకూరింది. ఒక్కరోజు వనపర్తి ఆర్టీసీ రూ.22లక్షల ఆదాయం రాబట్టడం డిపో చరిత్రలోనే ఇది తొలిసారి అని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రోజువారి కంటే అదనంగా, పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను అధికంగా చేరవేయడంతో ఈ ఆదాయం సమకూరింది. పండుగకు ముందు, తిరుగు ప్రయాణాల్లో ఆదాయం సమకూర్చుకునేందుకు ఈనెల 11నుంచి ఆర్టీసీ అదనంగా 160 ట్రిప్పులు బస్సు సర్వీసులునడిపింది. ప్రత్యేక బస్సులను ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నడిపేందుకు ఆర్టీసీ తీసుకున్న చొరవతో అదనపు ఆదాయం ఆర్జించింది. రోజు వచ్చే ఆదాయం రూ.14.50 లక్షలు కాగా, పండుగ సీజన్లో రూ.17.94 లక్షల ఆదాయం వచ్చింది. ఇలా ఈనెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రూ.కోటి 43లక్షల 52వేలు వసూలు చేసింది. డిపోలో సంబరాలు వనపర్తి ఆర్టీసీ డిపోలో మంగళవారం సంబరాలు చేసుకున్నారు. ఈనెల 20వ తేదీన ఒక్కరోజే రూ.22లక్షల ఆదాయం రావడంతో అధికారులు, ఉద్యోగులు స్వీట్లు తినిపించుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమష్టి కృషి వల్లే ఆర్టీసీకి రీజియన్‌లో అత్యధిక ఆదాయం సమకూరిందని డీఎం దేవదానం, ఏడీఎం దేవేందర్‌గౌడ్ అన్నారు. -
కలహాల మంటలు..
చిన్నంబావి (వనపర్తి జిల్లా): కుటుంబ కలహాలు వారి జీవితాలను బలితీసుకున్నాయి. జీవితాంతం తోడుండాల్సినవాడే కర్కశంగా మారి నిప్పంటించాడు. వివరాలిలా ఉన్నాయి.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారిపల్లిలోని బడికల జయన్న (44)కు సింగోటానికి చెందిన వరలక్ష్మితో 22 ఏళ్లక్రితం వివాహమైంది. వీరికి కూతురు గాయత్రి (17)తో పాటు కుమారుడు సృజన్ ఉన్నారు. భార్య స్థానికంగా అంగన్వాడీ టీచర్‌గా, భర్త వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూతురు కొల్లాపూర్‌లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే జయన్న కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకుని తరచూ ఇంట్లో గొడవపడేవాడు. రెండు నెలల క్రితం అతను తీవ్రంగా కొట్టడంతో భార్య వరలక్ష్మి కూతురుతో కలసి పోలీసుస్టేషన్లో కేసు పెట్టింది. అనంతరం పెద్దమనుషుల సమక్షంలో రాజీ కుదిర్చినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి తాగొచ్చి మరోసారి గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్య, కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో చెలరేగిన మంటల నుంచి జయన్న తప్పించుకునేందుకు యత్నించగా తలుపులు తెరుచుకోలేదు. అంతలోనే భార్య, కూతురు కలసి అతడిని పట్టుకోవడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వారంతా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కూతురు, తండ్రి గురువారం ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం భార్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
‘కరకట్ట పునర్నిర్మాణ పనులు చేపడతాం’
సాక్షి, వనపర్తి: జిల్లాలోని మదనాపురం మండలంలో ఉన్న సారళాసాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి పెరగడంతో మంగళవారం గండిపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరళాసాగర్ కరకట్టకు గండిపడటంపై సాంకేతిక నిపుణులతో విచారణ చేయిస్తామని ఆయన తెలిపారు. కరకట్టకు గండిపడటం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. రబీలో సాగుకు సన్నద్దమైన రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 4, 200 ఎకరాలకు నీరందిస్తామని.. ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు వెంటనే చేపడతామని ఆయన పేర్కొన్నారు. చదవండి: సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ గండి -
సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ గండి
సాక్షి, వనపర్తి: జిల్లాలోని మదనాపురం మండలం సమీపంలో ఉన్న సరళాసాగర్ ప్రాజెక్టుకు వదర నీరు పోటెత్తటంతో మంగళవారం గండిపడింది. దీంతో కరకట్ట తెగి నీరు వృధాగా పోయింది. కరకట్ట తెగడంతో వరద నీరు రోడ్డు మీదికి చేరింది. దీంతో కొత్తకోట-ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీగా వదర నీరు చేరింది. సరళాసాగర్ ప్రాజెక్టు ఆసియాలోనే మొట్టమొదటి సైఫన్ సిస్టమ్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించి కొట్టుకుపోయిన ప్రాజెక్టు గండిని పూడ్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
శ్రీకాంత్ మృతిపై సీబీఐతో విచారణ చేపట్టాలి
సాక్షి, వనపర్తి: గురుకుల విద్యార్థి శ్రీకాంత్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని మాదిగ ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర కో కన్వీనర్ గద్వాల కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని యూటీఎఫ్ జి ల్లా కార్యాలయంలో గురుకుల విద్యార్థి మృతిపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మదనాపురం ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, అధ్యాపకులు వాస్తవాలను తొక్కిపెడుతున్నారని ఆరోపించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఈ నెల 7న విద్యార్థి మృతి చెందితే.. విద్యార్థి, ప్రజా సంఘాలు, మృతుని తల్లిదండ్రుల కళాశాలను సందర్శించగా పలు అనుమానాలు వెలుగు చూసినట్లు గుర్తు చేశారు. తోటి విద్యార్థులు కొందరు అధ్యాపకులపై అనుమానాలు వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని, రాత్రివేళల్లో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంటుందని, పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని, రాత్రివేళలో చాలా మం ది విద్యార్థులు బయటకు వెళ్తున్నారని పలు గురుకులాల నుంచి రిపోర్టు అందిందన్నారు. కే వీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ అద్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయా సంఘాల అధ్యక్షులు, నాయకులు వెంకటస్వామి, వెంకటయ్య, లక్ష్మయ్య, గట్టుస్వామి, నాగన్న, సన్నయ్య, భగత్, గంగన్న, నారాయణ, గణేష్, రాము, చెన్నకేశవులు, ప్రశాంత్, వంశీ, నిరంజన్, రవిప్రసాద్, వెంకటస్వామి, శ్రీనివాసులు, ఆంజనేయులు, అరవింద్, వీరప్ప పాల్గొన్నారు. సీబీఐతో విచారణ చేపట్టాలి పెబ్బేరు (కొత్తకోట): గురుకుల విద్యార్థి శ్రీకాంత్ మృతిపై సీబీఐ విచారణ చేయాలని మంగళవారం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు ప్రశాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాంత్‌ది ముమ్మాటికి హత్యనే అన్నారు. దీనిపై ప్రభుత్వం సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టి కారుకులైన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు విద్యార్థి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, తక్షణమే రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు అభి, ప్రసాద్, మహేష్ పాల్గొన్నారు. -
మంత్రి నిరంజన్‌రెడ్డి ఇంటి ముట్టడి
సాక్షి, వనపర్తి: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సోమవారం అఖిలపక్షం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు సంయుక్తంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె శిబిరం నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ర్యాలీగా వెళ్లారు. అప్పటికే మంత్రి ఇంటికి చేరుకునే రోడ్డును పోలీసులు ఇనుప బోర్డులతో మూసివేశారు. దీంతో కార్మికులు, అఖిలపక్షం నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటిని ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులకు, కార్మికుల మధ్య స్వల్పంగా తోపు లాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే అడ్డంగా ఉంచిన ఇనుప బోర్డులు కిందపడ్డాయి. దీంతో కార్మికులు కేకలు, వేస్తూ, పరుగులు తీస్తూ మంత్రి ఇంటిని ముట్టడించారు. ముట్టడికి అనుమతిలేదని పోలీసులు వారించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పోరాటం ఆగదని తెలిపారు. కార్మికుల పొట్టగొట్టే ఆలోచనలతో కాకుండా.. వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆర్.గోపిగౌడ్ కోరారు. మంత్రి నిరంజన్‌రెడ్డి స్థానికంగా లేకపోవడంతో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జేఏసీ కన్వీనర్ గోపిగౌడ్ చదివి కార్మికులకు వినిపించారు. అనంతరం మంత్రి పీఏ ఆసీఫ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ సూర్యనాయక్ నేతృత్వంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, పట్టణ కార్యదర్శి గోపాలక్రిష్ణ, డి.కురుమయ్య, నందిమల్ల రాములు, టీడీపీ అశోక్, ఎన్.రమేష్, కాంగ్రెస్ సతీష్, న్యాయవాది మోహన్‌కుమార్, సీపీఐ డి.చంద్రయ్య సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నోటికి నల్లగుడ్డతో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ
సాక్షి, వనపర్తి: ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని పోలీసుల నిర్భందాలతో ఆపాలనుకోవడం ప్రభుత్వ అవివేక చర్య అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆర్.గోపిగౌడ్, సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాశ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 37వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని సమ్మెశిబిరం నుంచి ఆర్టీసీ కార్మికులు మూతికి నల్లగుడ్డలు కట్టుకుని బస్టాండ్ మీదుగా, రాజీవ్‌చౌక్, బస్ డిపోరోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆర్టీసీ డిపోఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలో ట్యాం క్‌బండ్‌లో పోలీసులు వ్యవహరించిన తీరు తెలంగాణ సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. పోలీసుల తీరు అమానుషమని, సమైక్య పాల కుల హయాంలోకంటే దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా డిమాండ్లు సా ధించే వరకు పోరు ఆపబోమని అన్నారు. న్యా యస్థానాలు సూచించినా, 36 రోజులుగా ఏకధాటిగా ప్రజలు పోరాటం చేస్తున్నా.. ప్రభు త్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటని నిలదీశారు. ఆర్టీసీని రక్షించాలనే ఉద్దే శం ప్రభుత్వానికి ఉంటే చర్చలకు ఎందుకు పిలవడం లేదన్నారు. ఆర్టీసీని నిర్మూలించాలనే ఆశయంతోనే ప్రభుత్వ పెద్దలు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలతో పదుల సంఖ్యలో కార్మికులు అమరులు అవుతు న్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆర్టీసీని బతికించుకునేందుకు రెండు నెలలుగా ఆర్టీసీ కార్మికులు పస్తులతో పోరాటం చేస్తున్నార ని అన్నారు. తెలంగాణపోరాట స్ఫూర్తితోనే ఆర్టీ సీని కాపాడుకునేంత వరకు ప్రజాస్వామ్యపద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఆర్టీసీపై ఉన్నతాధికారులు హైకోర్టుకు ఇస్తున్న నివేదికలతోనే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు వెంకటయ్య, రమేష్, వీవీమూర్తి, శ్రీలత, ప్రభరాణి, లక్ష్మీ, రేణుక, చపలతిరెడ్డి, నందిమల్ల నాగరాజు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కోట్లాది ఆస్తులపై కేసీఆర్ కన్ను
సాక్షి, వనపర్తి: ఆర్టీసీకి చెందిన కోట్లాది ఆస్తులపై కేసీఆర్ కన్నేశారని, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ఆర్టీసీ వనరులను పంచిపెట్టేందుకే సంస్థలను నిర్వీర్యం చేస్తున్నా రని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక, ఆర్థిక విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు పట్టణంలోని ధర్నాచౌక్‌లో ఆందోళన చేపట్టి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆర్టీసీ చరిత్రలో ఇంత పెద్ద సమ్మె ఎప్పుడూ జరుగలేదని, ముందస్తు ప్రణాళికతో అన్ని లెక్కలు సరిచూసుకొని ఆర్టీసీని ప్రైవేటీకరణ చేపట్టి ఆ సంస్థ ఆస్తులను తనకు కావాల్సినవారికి కట్టబెట్టు కోవడమే లక్ష్యంగా కేసీఆర్ కుట్ర పన్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఆర్టీసీ కార్మికులను ఆ సంస్థను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ద్రోహులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. హైకోర్టు హెచ్చరించినా వినరెందుకు? ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టు పలు మార్లు ప్రభుత్వ తీరును, అధికారుల తీరును తప్పుబట్టినా తీరు మారడంలేదని చిన్నారెడ్డి విమర్శించారు. అలాగే కేంద్రంలో మోదీ సర్కార్ ఆర్థిక నిపుణులతో చర్చింకుండానే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందన్నారు. మాజీ ప్రధాని, ఆర్థిక నిపుణులు మన్మోహన్ అన్నట్లు దేశ జీడీపీ 3 శాతానికి పడిపోయిందని, మేకిన్ ఇండియా, ఇండియా స్టార్టప్ లాంటి నినాదాలతో హోరెత్తించడం తప్ప కేంద్రం చేసిందేమి లేదన్నారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు నిలువరించే యత్నంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం చిన్నారెడ్డితో పాటు పలువురుని మాత్రమే లోపలికి అనుమతించగా వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, వివిధ మండలాలు నాయకులు, పట్టణ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
పగలంతా మూత.. రాత్రివేళ రీసైక్లింగ్
సాక్షి, వనపర్తి: నిరుపేద కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంతో కొందరు అక్రమ వ్యాపారానికి తెర లేపారు. రైస్ మిల్లుల యజమానులతో కుమ్మక్కై గ్రామాల్లో రూ.10 లకే బియ్యాన్ని సేకరించి దానిని రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా మార్చి అధిక రేట్లకు అమ్ముకుని లక్షలు గడిస్తున్నారు. ఈ విషయం గురించి అధికారులకు అందరికి తెలిసినా.. కొందరు నేరుగా ఫిర్యాదులు చేసినా ఇన్నాళ్లూ అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. అయితే ఇటీవల పాన్‌గల్ మండలం సీఎంఆర్ అనుమతి పొందిన పరమేశ్వరీ రైస్ మిల్లులో పెద్దఎత్తున అక్రమ రేషన్ బియ్యం నిల్వలను స్వయంగా కలెక్టర్ గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ విషయం మరువకముందే మరో ఘరానా దళారుల బాగోతం వెలుగు చూస్తోంది. కొత్తకోట కేంద్రంగా.. ఈ రేషన్ దందా శ్రీరంగాపూర్ మండలానికి చెందిన ఇద్దరు, గద్వాల జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి చేస్తున్నారు. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ వినియోగదారుల నుంచి బియ్యం సేకరించడానికి కొందరిని నియమించుకున్నారు. వారంతా రాత్రి సమయాల్లో వాహనాల్లో గ్రామాలకు వెళ్లి బియ్యాన్ని సేకరించి కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ శివారులోని ఓ రైస్ మిల్లులోకి తరలిస్తారు. ఇదివరకే ఆ రైస్ మిల్లుకు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మరో ట్రేడర్ పేరుతో సీఎంఆర్ అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యంను ఆ రైస్ మిల్లుకు పంపించారు. సదరు మిల్లుకు కెటాయించిన సీఎంఆర్ కెటాయింపులకు అనుగుణంగా వారు రైస్ ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉంది. సరఫరా చేసే రైస్ స్థానంలో గ్రామాల్లో చోటా దళారులు సేకరించిన రేషన్ బియ్యం పంపించి రీసైక్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎంఆర్ అనుమతి కూడా.. కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ శివారులోని సప్తగిరి రైస్ మిల్లును మరో వ్యక్తి లీజుకు తీసుకుని వేరే పేరు సాయిచరణ్ ట్రేడర్స్ పేరుతో సీఎంఆర్ అనుమతి పొందారు. అనుమతి తీసుకున్న వ్యక్తికి బదులు ఇతరులు మిల్లు వద్ద కార్యకలాపాలు చేస్తూ అక్రమ దందాకు తెరలేపినట్లు సమాచారం. ఈ రైస్ మిల్లుకు సివిల్ సప్లయ్ అధికారులు 2114.660 మెట్రిక్ టన్నుల వరిధాన్యం సీఎంఆర్ కోసం అలాట్మెంట్ చేశారు. ఫలితంగా 1416.822 మెట్రిక్ టన్నుల రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 1266.340 రైస్ ప్రభుత్వానికి సరఫరా చేశారు. ఇంకా 150.482 మెట్రిక్ టన్నుల రైస్ ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉన్నట్లు ఎన్‌పోర్స్‌మెంటు టీడీ వేణు తెలిపారు. కార్యకలాపాలన్నీ రాత్రివేళే.. రీసైక్లింగ్ రేషన్ దందా కార్యకలాపాలను పూర్తిగా రాత్రి సమయంలోనే చేస్తారని తెలుస్తోంది. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట మండలాల్లోని గ్రామాల నుంచి ఆటోల్లో రాత్రి సమయాల్లో రేషన్ బియ్యం ఈ మిల్లులోకి చేర్చి ప్రభుత్వ ముద్ర ఉండే బ్యాగుల్లోకి రేషన్ బియ్యంగా మార్చి ప్రభుత్వానికి సరఫరా చేస్తారనే విమర్శలు ఉన్నాయి. నేషనల్ హైవే 44కు ఆనుకుని ఉన్న కారణంగా అక్రమార్కులకు రీసైక్లింగ్ రేషన్ దందా చేయటం చాలా సులభమైందని చెప్పవచ్చు. నామమాత్రంగా తనిఖీలు ఈ మిల్లులో అక్రమ రేషన్ దందా యదేచ్ఛగా కొనసాగుతుందని ఫిర్యాదులు రావటంతో సివిల్ సప్లయ్ అధికారులు నామమాత్రంగా దాడులు చేశారు. దీంతో జిల్లాస్థాయి అధికారి ఒకరు కొత్తకోట తహసీల్దార్‌ను మిల్లును తనిఖీ చేయాలని ఆదేశించటంతో మిల్లు వద్దకు వెళ్లిన తహసీల్దార్ లోపల కొన్ని బ్యాగులు ఉండటాన్ని గమనించి మిల్లును సీజ్ చేశారు. లోపల ఉన్న బియ్యం రేషన్ బియ్యమా.. కాదా అని తెలుసుకునేందుకు తహసీల్దార్ టెక్నికల్ విభాగం అధికారులకు సిఫారస్ చేశారు. మా దృష్టికి రాలేదు రేషన్ బియ్యం రిసైక్లింగ్ చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఇదివరకే కలెక్టర్‌కు ఫిర్యాదులు వస్తే కొత్తకోట తహసీల్దార్ మిల్లును తనిఖీ చేశారు. అక్కడ ఉన్న బస్తాలతో సహా మిల్లుకు సీల్ వేశారు. టెక్నికల్ అధికారులతో విచారణ చేయించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. మిల్లులో ఉన్న బియ్యం బస్తాలు ఇదివరకే ప్రభుత్వానికి పంపించాం. రిటర్న్ చేసినవని డీటీ ఎన్‌ఫోర్స్‌మెంటు వేణు తెలిపారు. – రేవతి, డీఎస్ఓ ఇలాచేస్తే.. నిజాలు తెలుస్తాయి సప్తగిరి రైస్ మిల్లుకు ఆరు నెలలుగా వచ్చిన కరెంటు బిల్లులను పరిశీలిస్తే ఎంతమేరకు మిల్లులోని మిషన్లు నడింపించారో తెలుస్తోంది. ప్రతి మిల్లుకు సాధారణంగా మిషన్లు నడిస్తే తక్కువలో తక్కువ రూ.లక్షలోపు బిల్లు వస్తుంది. కానీ ఈ మిల్లుకు గడిచిన నెల విద్యుత్ మిల్లు కేవలం రూ.12,197 మాత్రమే వచ్చింది. ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తే నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంటుంది. అలాగే అమరచింత మండలానికి చెందిన దాసరి రాజశేఖర్ అనే వ్యక్తి అక్రమ రేషన్ దందా చేస్తూ ఏడుసార్లు పట్టుబడ్డాడు. అతనిపై కేసు కూడా నమోదు అయ్యింది. కౌన్సిలింగ్ ఇచ్చినా మారకపోవటంతో ఎస్పీ స్వయంగా అతనిపై పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. ఇలాంటివారు జిల్లా వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. లోతుగా విచారణ చేస్తే అక్ర మార్కుల లిస్టు బయటపడుతుంది. -
ఆ మూడు ఇళ్లకు జరిమానా వేయండి: మంత్రి
సాక్షి, వనపర్తి: 30రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి జిల్లాలో రెండు గ్రామాల్లో పర్యటించారు. హెలిక్యాప్టర్‌లో జిల్లాకు చేరుకున్న మంత్రి దయాకర్‌రావు చిట్యాల గ్రామంలో మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి భోజనం చేశారు. అనంతరం చిట్యాల గ్రామంలో పర్యటించారు. లోపించిన పారిశుద్ధ్యంను చూసి అసహనం వ్యక్తంచేశారు. ఓ ఇంటి ముందు పెంటకుప్పను ఏర్పాటు చేయటం, ఓ కిరాణంషాపు ఎదురుగా స్థలంలో చెత్తాచెదారం నిండి ఉండటం చూసిన మంత్రి అధికారులపై మండిపడ్డారు. మంత్రి గ్రామానికి వస్తున్నాడని తెలిసినా ఇంత నిర్లక్ష్యం ఏమిటని ప్రశ్నించారు. అధికారులకు నోటీసులు.. ఓ గృహిణితో మంత్రి మాట్లాడుతూ ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మించుకున్నారా..? వాడుతున్నారా అని ప్రశ్నించగా.. ఆమె మరుగుదొడ్డిలేదని, బహిర్భూమికి వెళ్తామని చెప్పారు. ఒక్కసారిగా మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓడీఎఫ్ జిల్లా అంటే ఇదేనా అని డీపీఓను ప్రశ్నించారు. మరో ఇంటికి వెళ్లిన మంత్రి ఇంకుడుగుంతలను పరిశీలించారు. లేకపోవటంతో చిట్యాల గ్రామంలో ఇంటింటికీ ఇంకుడుగుంతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. డీఆర్డీఓను వెంటనే నిర్మాణం చేయిస్తామని సమాధానం ఇచ్చారు. 30 రోజుల ప్రణాళికా కార్యక్రమంలోనే పని చేయకుంటే ఎప్పుడు పని చేస్తారంటూ డీఆర్డీఓ గణేష్, డీపీఓ రాజేశ్వరిని, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ను ప్రశ్నించారు. వెంటనే వీరికి నోటీసులు జారీ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌కు సూచించారు. గ్రామంలో మిషన్ భగీరథ తాగునీరు రావటం లేదని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురావటంతో తాగునీరు ఎందుకు రావటంలేదని మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్ను మంత్రి ప్రశ్నించారు. గంట నుంచి గ్రామంలో ఓ మంత్రి పర్యటిస్తుంటే రావాలని తెలియదా అంటూ ఎస్ఈని మందలించారు. ఇంటి ఆవరణ శుభ్రంగా ఉంచుకోని వారికి, పెంటకుప్ప ఏర్పాటు చేసిన వారికి జరిమానా వేయాలని అధికారులకు సూచించారు. చిట్యాల గ్రామాన్ని అధికారులు పట్టించుకోవటం లేదా సర్పంచు ఏం చేస్తున్నారు. ఎందుకింత పూర్ ప్రోగ్రేస్ అంటూ మండిపడ్డారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య కమిటీ ఏర్పాటు నామమాత్రంగా చేశారా అని మంత్రి ప్రశ్నించారు. కమిటీ సభ్యులలో ఒకరిని వేదికపై పిలిచి ఎందుకు గ్రామంలో నివాసగృహాల ఎదుట అపరిశుభ్రత ఉందని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏం చేద్దామని అడిగారు. జరిమానాలు వేసి కచ్చితంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య నివారణ చర్యలు, శ్రమదానం కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు శ్రమదానం చేస్తే వారికి రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు రుణాలు ఇప్పిస్తామని మంత్రి దయాకర్‌రావు వెల్లడించారు. గ్రామంలో శ్రమదానం చేసిన వారిపేర్లను, ఆర్థిక సాయం చేసిన వారి పేర్లను గ్రామ పంచాయతీ కార్యాలయంలో బోర్డులు ఏర్పాటు చేసి పేర్లు రాయాలని సూచించారు. అనంతరం పెద్దగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. వనపర్తి మార్కెట్‌యార్డు మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామాల అభివృద్ధి కోసం రూ.పది లక్షల విరాళం ప్రకటించారు. రూ.5లక్షల చెక్కును మంత్రి దయాకర్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్రహం, జెడ్పీ చైర్మన్లు ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, సరిత, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, పీసీసీఎఫ్ శోభ, ఏ.కె. సిన్హా, జేసీ డి.వేణుగోపాల్, డీఆర్ఓ వెంకటయ్య ఉన్నారు. -
ఇన్నాళ్లకు మోక్షం.. సత్ఫలితాలిస్తున్న పవర్ వీక్
సాక్షి, వనపర్తి: మా ఊర్లో విద్యుత్ సంభం ఒరిగింది.. వైర్లు వదులుగా అయ్యాయి.. స్థంభాలు దెబ్బతిని కూలిపోయేలా ఉన్నాయి... ఇలా గతంలో ఆయా గ్రామాల్లో గ్రామస్తులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విద్యుత్ కార్యాలయానికి ఫిర్యాదు చేసేవారు. అంతంతమాత్రంగానే స్పందన ఉండేది. ఎంతకూ గ్రామాలకు రాని విదుత్ శాఖ అధికారులు ప్రస్తుతం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30రోజుల ప్రణాళిక కార్యక్రమంలో గ్రామంలో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఒరిగిన స్థంభాలను సరిచేస్తున్నారు. వదులుగా ఉన్న వైర్లను తీసి కొత్తవైర్లు బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నారు. స్తంభాలు పాతుతున్నారు. కొత్తగా అవసరమైన చోట అడిగిందే తడువుగా తీసుకుని వచ్చేస్తున్నారు. చూస్తుండగానే ఒక్కో గ్రామంలో రెండుమూడు రోజుల్లో విద్యుత్ సమస్యలు కొలిక్కివస్తున్నాయి. ఏళ్లుగా చీకట్లో ఉండే గడిపిన కాలనీలలో ప్రస్తుతం ఎల్ఈడీ లైట్లు వెలుగుతున్నాయి. ఈ పరిస్థితిపై ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 22,284 సమస్యలు గుర్తింపు జిల్లాలోని 225 గ్రామ పంచాయతీల్లో విద్యుత్ శాఖకు సంబంధించి మొత్తం 22,284 సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గడిచిన 24 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన సమస్యలలో అధికారులు 7,361 సమస్యలను పరిష్కరించారు. రోజువారీగా రిపోర్టులు తయారు చేసి విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు నివేదిక ఇస్తారు. సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు పవర్ వీక్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గుర్తించిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు రూ.8.50 కోట్ల నిధుల ను వనపర్తి జిల్లాకు కేటాయించారు. గుర్తించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ఈ నిధులు వినియోగిస్తున్నారు. సరిపోకుంటే మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి గ్రామంలో థర్డ్‌వైర్.. జిల్లాలో థర్డ్‌వైర్ కొన్ని గ్రామాల్లో ఉంటే, మరికొన్ని గ్రామాల్లో లేవు. విద్యుత్ దీపాలను అమర్చేందుకు ఉపయోగించే ఈ థర్డ్వైర్ను ప్రతి జనావాస ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు విద్యుత్‌శాఖ అ«ధికారులు కృషి చేస్తున్నారు. ఏళ్లనాటి సమస్యలు పరిష్కారం పవర్ వీక్ కార్యక్రమం వలన దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ప్రతి ఏటా ఇలాంటి పవర్‌వీక్ కార్యక్రమం నిర్వహించాలి. చాలాచోట్ల శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్థంభాల స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. వదులుగా.. ఉన్న వైర్లను బిగించారు. – శేఖర్ నాయుడు, రాయినిపల్లి, పానగల్ మండలం ప్రతి సమస్యను పరిష్కరిస్తాం పవర్‌వీక్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల పరిధిలో గుర్తించి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. సమస్యల పరిష్కారం కోసం రూ.8.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మరికొన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే.. సుమారు 7,400 సమస్యలను పరిష్కరించాం. గ్రామాల్లో మాసిబ్బంది నిత్యం పని చేస్తూనే ఉన్నారు. – లీలావతి, ట్రాన్స్‌కో డీఈఈ -
రోగులకు స్టెరాయిడ్స్ దారుణం
సాక్షి, వనపర్తి: రోగం నయం చేసేందుకు అనుభవ రాహిత్యంతో రోగులకు స్టెరాయిడ్స్ ఇవ్వడం దారుణమని, దీనివల్ల వారి శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని డీఎంహెచ్ఓ డా. అల్లె శ్రీనివాసులు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంబీ గార్డెన్స్‌లో జిల్లాలోని ప్రాథమిక మెడికల్ ప్రాక్టీషనర్స్‌కు వైద్యసేవలు అందించడంపై అవగాహన కల్పించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగితే సహించేదిలేదని హెచ్చరించారు. కొందరు మంచిసేవలు అందిస్తున్నారని, మరికొందరు డబ్బుకు ఆశపడి పరిధికి మించి చికిత్స చేస్తున్నారని అన్నారు. ఎండీ స్థాయి వైద్యులే ఇవ్వడానికి భయపడే చికిత్సలు, మందులను గ్రామాల్లో పీఎంపీలు యథేచ్ఛగా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి 14 ఆస్పత్రులను సీజ్ చేశామని చెప్పారు. రోగులు వైద్యసేవలకు వస్తే మీ పరిధిలోనే వైద్యం అందించాలని సూచించారు. అప్పటికీ మెరుగు కాకుంటే రెఫర్ చేయాలన్నారు. 40– 60శాతం కమీషన్ల ప్రకారం దోపిడీకి పాల్పడుతున్న ల్యాబ్‌లను సీజ్ చేసినట్లు చెప్పారు. జ్వరంతో బాధపడుతున్న 24మందికి పీఎంపీ సెలైన్స్ ఎక్కించడం దారుణమని అన్నారు. అందుకే సీజ్ చేశామని తెలిపారు. జిల్లాలో కలెక్టర్ నిఘా ఉందని చెప్పారు. ఇప్పటికైనా పరిధిలో ఉండకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా నుంచి పక్క రాష్ట్రానికి తీసుకెళ్లి అబార్షన్ చేయడం, లింగనిర్ధారణ చేసి భ్రూణహత్యలకు పాల్పడం కొందరు చేస్తున్నారని, ఇంకొందరు కేవలం మగపిల్లలు పుట్టేందుకు చికిత్సలు అందిస్తామని నమ్మబలికి రూ.లక్షలు వసూలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై నిఘాఉందని, అలాగే మొబైల్ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు పట్టుబడితే వదిలిపెట్టబోమని చెప్పారు. కార్యక్రమంలో డీపీహెచ్‌ఓ డా.రవిశంకర్, ఇన్చార్జ్ డీఐఓ డా.శంకర్, సిబ్బంది నర్సింహారావు, మద్దిలేటి, పీఎంపీ జిల్లా కమిటీ అధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి డానియేల్, పట్టణ అధ్యక్షుడు గంధం ప్రసాద్, సురేష్, బాషానాయక్, ఇంతియాజ్, పీఎంపీలు పాల్గొన్నారు. -
కొత్త తరహా దోపిడీకి బిల్ కలెక్టర్ల తెర
సాక్షి, వనపర్తి: వనపర్తి పురపాలికలో కుళాయి బిల్లుల చెల్లింపులో కొత్త తరహా దోపిడీకి కొందరు మున్సిపల్ అధికారులు తెరలేపారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా రూ.వేలకు వేలు కాజేస్తున్నారు. పుర ఆదాయానికి గండికొడుతూ తమ జేబులను నింపుకుంటున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వనపర్తి పురపాలికలో కుళాయి బిల్లుల చెల్లింపులో కొత్త తరహా దోపిడీకి కొందరు మున్సిపల్ అధికారులు తెరలేపారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా రూ.వేలకు వేలు కాజేస్తున్నారు. పుర ఆదాయానికి గండికొడుతూ కొందరు అధికారులు తమ జేబులను నింపుకుంటున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమాయక ప్రజలే లక్ష్యంగా ప్రతినెలా రూ.వేలల్లో పుర ఆదాయానికి గండికొడుతున్నారు. నల్లా కనెక్షన్ తీసుకున్న వారు ప్రతినెలా రూ.100 మునిసిపాలిటీకి విధిగా చెల్లించాలి. కానీ పురపాలక అధికారులు బకాయి వసూళ్లలో ఆలసత్వం ప్రదర్శించడం వల్ల ఏళ్ల తరబడి పేరుకుపోయాయి. ఈనేపథ్యంలోనే ఒకేసారి రూ.5వేలు, రూ.10వేలు, రూ.20వేలు చెల్లించేందుకు వస్తుంటారు. తప్పుడు లెక్కలతో ఈ ఆదాయాన్ని కొందరు పురపాలికకు దక్కకుండా చేస్తున్నారు. ఈ వ్యవహారం ‘సాక్షి’ నిఘాతో బయటపడింది. దోపిడీ ఇలా.. నల్లా యజమానులు 2, 5, 10, 15ఏళ్ల నల్లా బకాయి చెల్లించేందుకు మునిసిపాలిటీకి వస్తే బిల్లు స్వీకరించే అధికారులు మాయ చేస్తున్నారు. 2019మార్చి నుంచి బిల్లు ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిందని చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి 2020 మార్చివరకు బిల్లును ఆన్లైన్లోనే తీసుకుంటామని అంటున్నారు. డబ్బుచెల్లిస్తే రశీదు కూడా ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ట్విస్ట్ ఇక్కడే మొదలవుతోంది. ఈ ఏడాది కంటే ముందు మీరు నల్లా కనెక్షన్ తీసుకున్నారు కాబట్టి అంతకుముందు సంవత్సరాల బిల్లులను మ్యాన్వల్ రశీదులో రాసిస్తామంటూ డబ్బులు తీసుకుంటున్నారు. ఎంత చెల్లించారో అంత రశీదు కూడా ఇస్తున్నారు. కానీ అధికారుల వద్ద ఉన్న మ్యాన్వల్ రికార్డుల్లో రూ.వేలల్లో బిల్లు తీసుకుని రూ.వందల్లో నమోదు చేస్తున్నారు. మిగతా డబ్బులను కాజేస్తున్నారు. ఒకే నంబర్లతో ఉండే రెండు బిల్లు బుక్కులు వారివద్ద పెట్టుకుంటున్నారు. వాస్తవంగా అధికారులు ఒకేసారి కార్బన్ సాయంతో బిల్లు రాయాల్సి ఉంటుంది. కానీ అలా రాయడం లేదు. ఇలా కొత్తదందాకు తెరలేపారు. భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బందులే.. ఈ వ్యవహారం వల్ల ఇప్పటికే బిల్లులు చెల్లించిన వారికి భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవనున్నాయి. బిల్లు చెల్లించినట్లు రశీదుతో ప్రజలు పుర కార్యాలయానికి వచ్చి చూడలేరనే ధైర్యంతో ప్రజలకు ఇచ్చే రశీదులో ఒకలా, అధికారుల వద్ద ఉండే రశీదులో మరోలా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం నల్లాబిల్లుల చెల్లింపు కౌంటర్ వద్ద వసూలు చేసే అధికారులు భవిష్యత్‌లో బదిలీ అయినా లేదా మరో ఏదైనా సమస్య ఉత్పన్నం అయినా ప్రజలకే ఇబ్బందులు రానున్నాయి. నల్లా బిల్లుల కౌంటర్ వద్ద ఉండే అధికారులు కొందరు గ్రూప్‌గా ఏర్పడి ఈ తంతంగం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వనపర్తిలో మొత్తం 10వేల వరకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 7,500 ఆన్లైన్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా వాటి వివరాలు సరిగా లేకపోవడంతో వాటి నమోదుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వెలుగులోకి వచ్చింది ఇలా వనపర్తికి చెందిన తెలుగు సుకన్య 2012 సంవత్సరం నుంచి నల్లాబిల్లు చెల్లించలేదు. నెలకు రూ.100 చొప్పున మొత్తం రూ.9,600 బిల్లు చెల్లించేందుకు ఈనెల 5న మునిసిపాలిటీకి వచ్చింది. అధికారులు 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చివరకు రూ.1,300 బిల్లు రశీదును ఆన్లైన్ ద్వారా కట్ చేశారు. మిగతా రశీదులో గత సంవత్సరాలకు సంబంధించి రూ.8,700 ముట్టినట్లు రశీదు నంబర్ 005560 రాసి ఇచ్చారు. అధికారుల వద్దఉన్న బిల్బుక్కులో అదే నంబర్ రశీదులో మాత్రం రూ.200 మాత్రమే ముట్టినట్లు రాసుకున్నారు. రికార్డులోనూ రూ.200 రాశారు. విచారిస్తాం.. నల్లా బకాయిల సేకరణలో పూర్తిగా డబ్బులు తీసుకుని, రికార్డులో తక్కువగా నమోదు చేయడం వంటివాటికి తావుండదు. ఒకవేళ పూర్తిగా డబ్బులు తీసుకుని తక్కువగా నమోదు చేస్తే తప్పకుండా విచారణ చేస్తాం. వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటాం. – రజినీకాంత్‌రెడ్డి, పుర కమిషనర్, వనపర్తి -
ప్రాణం పోయినా మాట తప్పను
వనపర్తి టౌన్: పట్టణంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రాణం పోయినా పేదలకు ఇచ్చే మాట తప్పనని, రెండు రోజులు అటో..ఇటో జరగచ్చు కానీ, ఇచ్చిన మాటను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పను అని పేర్కొన్నారు. పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు అందించేందుకు శనివారం జిల్లాకేంద్రంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ, కౌన్సిలర్ల జోక్యం ఉండదని, పూర్తి పారదర్శకతతో అధికారులే చేపట్టేలా చూస్తానన్నారు. పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. కేసీఆర్ గెలిచినా పింఛన్ పెంచడం లేదని పలువురు అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. పొడిచే పొద్దు మారినా.. కేసీఆర్ ఇచ్చిన మాట తప్పబోరని, ఎన్నికల కోడ్ నిబంధనల కారణంగా పింఛన్ల పెంపులో జాప్యం జరిగిందన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కుట్రలను భగ్నం చేసి విలువైన ఆస్తులను కాపాడి ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కబ్జాలను నిర్మూలించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని కొనియాడారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించనుందన్నారు. కొత్త పురపాలక చట్టం ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధుల్లో బాధ్యత పెంచిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతామహంతి, జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, గొర్రెల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, పుర మాజీ చైర్మన్, అధికారులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి పేరు నిలబెట్టాలి వనపర్తి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డిపో లీజుకు ఇచ్చిన పెట్రోల్ బంక్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ మేరకు రిబ్బన్ కట్ చేసిన ఆయన మాట్లాడుతూ డిపోను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు వ్యాపార సముదాయ దుకాణాల ఏర్పాటుకు అనుగుణంగా రూపొందించాలని డీఎం దేవదానంకు సూచించారు. కార్యక్రమంలో కల్వరాజు, జ్యోతిబాబు, డిపో అధికారులు దేవేందర్‌గౌడ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారు’
సాక్షి, వనపర్తి : రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటోందని కేసీఆర్ అన్నారు. వనపర్తిలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎవరి జాతకాలు ఏంటో ఎన్నికల తరువాత తెలుస్తుందన్నారు. దేశంలో ప్రాంతీయపార్టీల హవా నడుస్తోందని, ఎన్డీయేకు 150, కాంగ్రెస్ 100 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే.. దేశ రాజకీయ గమనం మార్చుతామని, ఫెడరల్ ఫ్రంట్‌లో మనమే కీలకపాత్ర పోషిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో చాలా మంది నాయకులు తమతో కలిసివస్తారని తెలిపారు. ప్రజా దర్భారులుపెట్టి సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథ దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడిని ఎవరూ అడ్డుకోలేదన్నారు. సర్పంచ్ కూడా మోదీలాగా మాట్లాడరని కేసీఆర్ ఫైర్ అయ్యారు. నిన్న పాలమూరులో మోదీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడరని అన్నారు. వారు అభివృద్ది చేస్తానంటే నేను అడ్డుపడ్డానని అబద్దాలు చెబుతున్నారని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24వేలకోట్లు ఇవ్వాలని స్వయంగా నీతిఆయోగ్ సూచించినా.. ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఐదేళ్లలో ఏం చేశారో చెపొచ్చుకదా అని మోదీపై విమర్శలు గుప్పించారు. దేశంలో రైతులకు 24గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చేది కేవలం తెలంగాణే అని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు డబ్బులు ఇవ్వాలని మోదీకి 500ఉత్తరాలు రాశానన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇన్ని అబద్దాలు చెప్పొచ్చా అని విమర్శించారు. -
దేశంలో ప్రాంతీయపార్టీల హవా నడుస్తోంది
-
హత్యకు దారితీసిన ఆధిపత్య పోరు
సాక్షి, వనపర్తి క్రైం: ఇద్దరి మధ్య కొనసాగిన ఆధిపత్య పోరు చివరికి ఒకరి హత్యకు దారితీసింది. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి వనపర్తిలో చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వనపర్తిలోని పీర్లగుట్లకు చెందిన బల్రాం కుమారుడు రాఘవేంద్ర అలియాస్ రఘు (28), సాయినగర్కాలనీకి చెందిన అరుణ్‌యాదవ్ గతంలో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. గత ఆరు నెలల నుంచి ఎవరికి వారుగా విడిపోయి.. ఆధిపత్య పోరును కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో వేడుకలకు వేర్వేరుగా హాజరయ్యారు. అక్కడ వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో అరుణ్‌యాదవ్‌తోపాటు ఉన్న మరికొందరు రఘుపై దాడిచేశారు. అక్కడి నుంచి బైక్‌పై తీసుకువచ్చి రామాలయం వద్ద పడేశారు. అంతటితో ఆగక పెద్దబండ రాయితో అతని తలపై మోదారు. వెంటనే చుట్టు పక్కల వారు రఘును ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. అపంతనం అరుణ్‌యాదవ్ తనంత తానుగా పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. హత్య సంఘటనలో నిందితుడితోపాటు.. అతని సోదరుడు, మరో నలుగురు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి ఇంట్లో వస్తువుల ధ్వంసం రఘును హత్య చేశాడనే కోపంతో వనపర్తి పట్ట ణం సాయినగర్‌కాలనీలో ఉన్న నిందితుడు అరుణ్‌యాదవ్ ఇంట్లో ఉన్న వస్తువులను మంగళవా రం రాత్రి పలువురు ధ్వంసం చేశారు. ఓ ఇన్నోవా, కారు అద్దాలు పగులగొట్టారు. అనంతరం రఘు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆస్పత్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో డీఎస్పీ సృజన, సీఐ సూర్యానాయక్ అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. బుధవారం రఘు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనలో అనుమానం ఉన్న పలువురిని పోలీసులు విచారిస్తున్నారు. రఘు తల్లి మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. లీడర్లుగా ఎదగాలనే ఆశతో.. లీడర్లుగా ఎదగాలనే ఆశతో వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఒకరి మధ్య ఒకరికి మనస్పర్థలు పెరిగాయి. అది కాస్త హత్యకు దారితీశాయి. ఈ హత్య ప్రమేయంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. 2018 డిసెంబర్ 31న అర్ధరాత్రి పట్టణంలోని సంతబజార్ దగ్గర ఒక యువకుడిని కొందరు హత్య చేశారు. అది మరవక ముందే మరో హత్య సంఘటన జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఇరుకు గదులతో ‘వంట’కు తంటా!
సాక్షి, మదనాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆరుబయటే వండుతున్నారు. ఆరుబయట కట్టెలపొయ్యిపై వండుతుండంతో విద్యార్థుల కళ్లు మండుతున్నాయి. చదువులపై దృష్టి సారించలేకపోతున్నారు. మధ్యాహ్న భోజనం వండేందుకు ప్రత్యేక వంటగదులు కట్టించాలని, సిలిండర్లు సరఫరా చేయాలని వంట ఏజెన్సీలు కోరుతున్నాయి. మండలంలో ఇదీ పరిస్థితి.. మండలంలో 19 ప్రాథమిక పాఠశాలు 4జిల్లా పరిషత్ పాఠశాలలు, 1 యూపీఎస్ పాఠశాల, 1 కస్తూర్బాగాందీ బాలికాల పాఠశాల, 1 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు ఉన్నాయి. మొత్తం 2110 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకు రావాలన్న ఆలోచనతో ప్రణాళికలు రూపొందించారు. కానీ ఆచరణలో సమగ్రంగా అమలు చేయడం లేదు. ఆరు బయటే వంట.. ప్రధానంగా మదనాపురం మండల కేంద్రంతో పాటు దుప్పల్లి ద్వాకరనగరం ,నర్సింగపురం కరివెన, తదితర గ్రామాల్లో వంట గదులు చిన్న గా ఉండటం తో నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వంట చేసే సమయం లో వంట చెరుకు వలన వచ్చె పొగ బయటకు పోక పోవడంతో ఆగది పోగతో కమ్ముకుంటుందని చెబుతున్నారు.దీంతో తాము గదుల్లో వంట చేయడం లేదని నిర్మాణ సమయంలో సరిౖయెన పారదర్శకాలు పాటించ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో గత్యంతరం లేక బయట వంట చేసి కొన్ని సమయాల్లో ఆరు బయటనే అన్నము వడ్డిస్తున్నామని పలువరు అంటున్నారు. కుక్కల స్వైరవిహారం పాఠశాల లో ప్రహరీ లేని చోట మదనాపురం పీఎస్ సంతబజార్, గోపన్‌పేట పీఎస్, కరివెన పీఎస్, గోవిందహళ్లీ పీఎస్, బౌసింగ్తండాపీఎస్, పెద్దతండా పీఎస్ తదితర పాఠశాలల్లో మధ్యాహన భోజన సమయంలో పందులు, కుక్కలు సైర విహారం చేస్తాయి. ఈ విషయమై విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబందిత అధికారులు స్పందించి ఆరు బయట వంట చేయకుండా నిర్వాహకులకు అవగాహన కల్పించా లని విద్యావంతులు కోరుతున్నారు. -
మెకానిక్ అరుణ
సాక్షి, కొత్తకోట: మెకానిక్‌లు అంటే పురుషులే ఎక్కువగా ఉండటం మనం చూస్తుంటాం. పెద్ద పెద్ద వాహనాలకు టైర్లు విప్పి పంక్చర్ చేయడం.. గాలి పట్టించడం పురుషులకే కష్టంగా ఉంటుంది. కానీ వీటన్నింటిని సునాయసంగా చేస్తోంది ఓ మహిళ. ఒకవైపు భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ.. పిల్లల చదువు, కుటుంబ పోషణకు అండగా నిలుస్తోంది. కొత్తకోట మండల కేంద్రానికి చెందిన అరుణ. అడ్డాకుల మండలం కాటారం గ్రామానికి చెందిన అరుణకు కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన మద్దిలేటితో ఎనిమిదేళ్ల క్రిందట వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఆర్థిక స్థోమత లేక పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. భర్త మద్దిలేటి వాహనాల టైర్ల పంక్చర్లు చేస్తూ జీవనం గడుపుతున్నాడు. అయితే మద్దిలేటి వద్దకు రోజురోజుకు పంక్చర్లు చేసుకునే వారి సంఖ్య ఎక్కువైంది. దీనికితోడు ఇంట్లో ఖర్చులు సైతం అధికమయ్యాయి. దీంతో పనిచేస్తున్న భర్తను చూసిన అరుణ మొదట టైర్లు విప్పడానికి కావాల్సిన సామగ్రిని అందజేసేది. అలాగే మెల్లగా ద్విచక్రవాహన టైర్లను విప్పడం మొదలుపెట్టింది. అలా ఒక్క బైక్ టైర్లనే కాకుండా ఆటో, కారు, వ్యాను, లారీ టైర్లను విప్పుతూ పంక్చర్లు చేస్తూ తోడుగా ఉంటుంది. రుణం ఇచ్చి ఆదుకోవాలి స్వయం కృషిని నమ్ముకొని పనులు చేసుకుంటున్న మాలాంటి వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. కష్టపడి పనిచేస్తూ బతికే వారు సమాజంలో గౌరవంగా జీవించాలనుకుంటారు. రుణం ఇస్తే దుకాణాన్ని మరింత పెద్దగా చేసి ఆర్థికంగా మెరుగుపడి మా పిల్లలను బాగా చదివించుకుంటాం. – అరుణ, మెకానిక్, కొత్తకోట -
తాళ్ల చెరువును తోడేస్తుండ్రు...
సాక్షి, వనపర్తి: ఓవైపు చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి నాటి గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేస్తుంటే, కొందరు చెరువుల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారు. ఇటీవల మరమ్మతు చేసిన వనపర్తి జిల్లా కేంద్రంలోని తాళ్ల చెరువు ఓ వైపు ఆక్రమణకు గురైంది. మరోవైపు అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కొందరు రియల్ వ్యాపారులు చెరువులోని మట్టిని తరలించుకుపోయి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషమై స్థానికులు అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొంచి ఉన్న ముప్పు చిన్ననీటి పారుదల నిబంధనల ప్రకారం చెరువు కట్టకు పదిమీటర్ల దూరం వరకు కనీసం పూడికతీత పనులు చేపట్టనివ్వరు. చెరువుకట్టకు సమీపంలో గోతి ఎక్కువగా చేస్తే నీరు నిల్వ అయిన సమయంలో కట్ట కిందభాగం నుంచి అవతలికి నీరు వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీంతో క్రమక్రమంగా కట్టబలహీనపడి తెగిపోయే పరిస్థితులు వస్తాయి. ఇంత ప్రమాదం ఉన్నా.. అధికారులతో ఎలాంటి అనుమతి తీసుకోకుండా ప్రభుత్వ ఆధీనంలోని చెరువులో నుంచి కొందరు రియల్ వ్యాపారులు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ చెరువు కింద ప్రస్తుతం ఆయకట్టు చాలా తక్కువగా ఉంది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చిన్నపాటి తాళ్ల చెరువును మినీ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని ఏడాది పొడవునా.. నీటితో నిల్వ ఉంచి భూగర్భజలాలను పునఃరుద్ధరించాలని అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది. తాళ్ల చెరువు అభివృద్ధి పనుల కోసం ఎస్టిమేట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులకు మౌకిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్షం రోజుల్లో ఎస్టిమేట్ సిద్ధమయ్యే సమయంలో రియల్ వ్యాపారులు చెరువులో మట్టితవ్వకాలకు తెగబట్టారు. సుమారు 2వేల ట్రాక్టర్ల వరకు మట్టిని తరలించినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యమే తాళ్ల చెరువులో కొందరు ఓ ప్రొక్లెయినర్, సుమారు పది ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని చెరువుకు సమీపంలో నివాసం ఉండేవారు చిన్ననీటి పారుదలశాఖ అధికారులకు ఫోన్లో సమాచారం అందించారు. దీనికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఓ ఉన్నతస్థాయి అధికారి సమాధానం ఇచ్చారని సదరు వ్యక్తి తెలిపారు. సమాచారం ఇచ్చిన వారిని ప్రశ్నలతో ఎదురుదాడి చేయటానికి ప్రయత్నించటం విస్మయానికి గురిచేసిందని ‘సాక్షి’తో వాపోయారు. అక్రమణల పర్వం ఇలా.. ఇప్పటికే తాళ్ల చెరువు వాగు ఆక్రమణకు గురైంది. 1999, 2008లో రెండుసార్లు కురిసిన భారీ వర్షాలకు నీరంతా నిండి ఇళ్లలోకి, రోడ్లపైకి వచ్చాయి. 1999లో చోటుచేసుకున్న సంఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు గతంలో చోటుచేసుకున్న విషయం తెలిసినా.. అధికారులు చెరువుల విషయంలో అలసత్వం ప్రదర్శించటం ఏమిటని పలువురు అసహనం వ్యక్తంచేశారు. గతంలో చెరువులో నుంచి అలుగుపారడంతో పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్, శ్వేతానగర్, దామోదర్ కాలనీ, బ్రహ్మంగారివీధి, శంకర్‌గంజ్, రాంనగర్ కాలనీ, రామాటాకీస్, బంగారం దుకాణాలు, ఆర్అండ్బీ కార్యాలయం, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, టౌన్‌పోలీస్‌స్టేషన్ జలమయం అయ్యాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం రియల్ వ్యాపారులు చేసిన తవ్వకాలతో భవిష్యత్‌లో కట్టకు ఏదైనా ప్రమాదం జరిగితే సంభవించే నష్టాన్ని ఊహించటం కష్టమే. వెంటనే చర్యలు తీసుకుంటాం తాళ్ల చెరువులో మట్టి తవ్వకాల గురించి ఇప్పటికే స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే చెరువును సందర్శిస్తాం. అక్రమ మట్టి తరలింపును అడ్డుకుంటాం. మినీట్యాంక్‌బండ్ తరహాలో తాళ్ల చెరువును అభివృద్ధి చేసేందుకు ఎస్టిమేట్లు త్వరలో పూర్తి చేస్తాం. – భరత్, అసిస్టెంట్ ఇంజనీర్, వనపర్తి -
ఏక్ ‘నిరంజన్’..!
సాక్షి, వనపర్తి: ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. దీంతో రెండు నెలలకు పైగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. సీఎం కేసీఆర్ శుక్రవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించడంతో పాటు ఈనెల 19న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకుంటారో ఇంకా తేలకున్నా.. కేవలం 10 మందికి మాత్రమే అవకాశం కల్పించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తుండగా జాబితాలో ఎవరి పేరు ఉంటుందనేది సస్పెన్స్‌గా మారింది. సింగిరెడ్డి ఖాయం !? వనపర్తి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇదే ప్రచారం సాగుతుండగా.. తొలి విస్తరణలో పది మందికే స్థానం కల్పించనున్నట్లు తెలుస్తుండడంతో ఆయన ఒక్కరికే పదవి దక్కుతుందని చెప్పొచ్చు. ఇక గత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డికి ప్రస్తుత కేబినెట్లో చోటు దక్కుతుందా, లేదా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడవగా కేసీఆర్ కేబినెట్లో కేవలం హోంమంత్రిగా మహమూద్ అలీ ఒక్కరికే అవకాశం కల్పించారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. మంత్రివర్గ విస్తరణపై రేపు, మాపంటూ ప్రచారం జరిగినా సీఎం కేసీఆర్ మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా కేసీఆర్ గవర్నర్‌ను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించడంతో సస్పెన్స్ తొలిగిపోయినా మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆశావాహులు అధికం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. కొల్లాపూర్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రమే ఓడిపోయిన విషయం విదితమే. దీంతో మంత్రి పదవి రేసులో జూపల్లి లేనట్లయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ 50 వేల పైచిలుకు భారీ మెజార్టీ సాధించారు. దీంతో మంత్రి పదవుల ఆశించే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. విధేయుడికే అవకాశం 2001 సంవత్సరంలో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించిన నాటి నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆయనకు విధేయుడిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ జెండాను ముందుగా భుజాన వేసుకుంది ఆయనే. పార్టీ బలోపేతం కోసం విశేష కృషి చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నడిచిన ఆయన 2014 ఎన్నికల్లో స్వల్ఫ తేడాతో ఓడిపోయారు. లేదంటే టీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలోనే నిరంజన్ రెడ్డికి చోటు దక్కేది. అయితే, కేసీఆర్‌కు విధేయుడు కావడంతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించి కేబీనేట్ హోదా కల్పించాడు. ఈ సందర్భంగా ఆయన మంత్రుల నియోజకవర్గాలకు ఏ మాత్రం తగ్గకుండా నిధులను రాబట్టి పలు అభివృద్ధి పనులను పూర్తి చేయించారు. దీంతో 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 51 వేల మెజార్టీతో ఆయన గెలుపొందారు. దీంతో ఈసారి ఆయనను మంత్రి పదవి వరించే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మరొకరికి.. ఈసారి మంత్రివర్గ విస్తరణలో కేవలం పది మందికే అవకాశం కల్పించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే మలి విడత మంత్రివర్గ విస్తరణలో ఇంకొందరికి స్థానం కల్పిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాత్రమే మంత్రిగా అవకాశం కల్పిస్తారని సమాచారం. ఆ తర్వాత మరో విడతలో మాజీ మంత్రి లక్షారెడ్డితో పాటు ఇతరుల పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. -
పురపాలికల్లో ‘స్వచ్ఛ సర్వేక్షన్’
సాక్షి, కల్వకుర్తి టౌన్: కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న స్వచ్ఛ సర్వేక్షన్ –2019 పోటీలకు పురపాలికలు ముస్తాబవుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన కార్వే కన్సల్టెన్సీ బృందం సభ్యులు ఆయా మున్సిపాలిటీల్లో పర్యటిస్తూ, స్వచ్ఛతపై వివరాలు సేకరిస్తారు. ఈ బృందం కాలనీల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించడంతోపాటు స్థానికుల నుంచి వివరాలు తీసుకుని కేంద్రానికి పంపిస్తారు. వీరు సేకరించే వివరాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంక్‌లను ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షన్–2019 పోటీలకు తొమ్మిది పురపాలికలు, ఒక మేజర్ మున్సిపాలిటీలు సన్నద్ధం అవుతున్నాయి. పోటీల్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించేందుకు అధికార యంత్రాగం కసరత్తు ప్రారంభించింది. స్వచ్ఛత ప్రణాళికపై దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల కేంద్రం థర్ట్ పార్టీ బృందం రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలలో సర్వే నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు స్వచ్ఛ సర్వేక్షన్‌లోని మార్గదర్శకాలపై శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు స్వచ్ఛ సర్వేక్షన్‌లోని మార్గదర్శకాలపై శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లకు దిశానిర్దేశం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నగరాలు, పట్టణాలను స్వచ్ఛమైన నివాస ప్రాంతాలుగా మార్చాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీలలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. గతంలో 2016, 2017, 2018లో సాధించిన ర్యాంకుల కంటే ఉత్తమంగా 2019 ఏడాదిలో ర్యాంకు సాధించాలన్న సాధనలో ప్రత్యేక ప్రణాళిక లక్ష్యాల తయారీలో నిమగ్నమయ్యారు. మిగిలింది 25 రోజులే.. దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షన్–2019 పోటీలో 4,231నగరాలు, పట్టణాలు పోటీపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోటీ పెరిగింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అధికారులు విరామం లేకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, శ్రమిస్తూ ఉత్తమ స్వచ్ఛ నగర కల సాకారం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వచ్చే జనవరి 4 నుంచి ఫిబ్రవరి 4వ తేదీలలో ఎప్పుడైనా స్వచ్ఛ సర్వేక్షన్ థర్డ్ పార్టీ క్యూసీఐ బృందాలు నగరాలు, పట్టణాలను తనిఖీ చేస్తాయి. స్వచ్ఛ సర్వేక్షన్‌కు వస్తున్న బృందాల్లో అసెసర్లు, నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ప్రజల అభిప్రాయాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రత, దేవాలయాలు, మసీదు, చర్చీలు, ఆర్టీసీ బస్ స్టేషన్లు, రైలు స్టేషన్లు, చెత్త సేకరిస్తున్న విధానం, అందుకు వినియోగిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, సేకరించిన చెత్త నిత్వ కేంద్రాలు, చెత్త ప్రాసెసింగ్ తదితర వివరాలను మదింపు చేస్తారు. ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా ప్రజలను ప్రశ్నించి, వివరాలు రాబడుతారు. స్వచ్ఛ సర్వేక్షన్ నిర్వహించే అధికారులు, క్యూసీఐ అధికారులు ప్రతి మున్సిపాలిటీని నాలుగు విభాగాలుగా విభజించి, వాటికి తగిన మార్కులను కేటాయిస్తారు. అందులో సర్వీస్ లెవల్ చెంచ్ మార్కుకు 1,250 మార్కులు, థర్డ్ పార్టీ అసెసర్ల పరిశీలన ద్వారా 1,250 మార్కులు, సిటిజన్ ఫీడ్ బ్యాక్ ద్వారా 1,250 మార్కులు, సర్టిఫికెట్, ఓడీఎఫ్, గ్యార్బేజీ, ఫ్రీసిటీ, కెపాసిటీ బిల్డింగ్ ద్వారా 1,250మార్కులను కేటాయించి, ర్యాంకులు ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లాలో గతేడాది ర్యాంక్‌లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మేజర్ మున్సిపాలిటీ మహబూబ్‌నగర్‌తో పాటు పురపాలికలు నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, నారాయణపేట, బాదేపల్లి, అయిజ, గద్వాల, షాద్‌నగర్ ఉన్నాయి. లక్ష జనాభాకు తక్కువ ఉన్న మున్సిపాలిటీలను జోనల్ ర్యాంకింగ్ ద్వారా, లక్ష జనాభాకు పైబడి ఉన్నవారిని నేషనల్ ర్యాంకింగ్ ద్వారా ప్రకటిస్తారు. 2018లో ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్లో మహబూబ్‌నగర్ మేజర్ మున్సిపాలిటీ జాతీయ ర్యాంకుల్లో 2,253.33 మార్కులతో 161 స్థానంలో నిలిచింది. జోనల్ ర్యాంకింగ్‌లో ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న షాద్‌నగర్ మున్సిపాలిటీ 2,416 మార్కులతో 12ర్యాంకు సాధించింది. అలాగే నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ 2,207 మార్కులతో 33వ స్థానంలో, కొల్లాపూర్ 1,942 మార్కులతో 99వ ర్యాంక్, అచ్చంపేట 1814 మార్కులతో 161, గద్వాల 1,592 మార్కులతో 333, నారాయణపేట 1,577 మార్కులతో 352, బాదేపల్లి 1,50తో 409, వనపర్తి1,432 మార్కులతో 541, కల్వకుర్తి 1,363తో 635, అయిజ 1,224తో 818ర్యాంకుల్లో నిలిచాయి. ప్రజలను జాగృతం చేయాలి.. పురపాలికల్లో బహిరంగ మలమూత్ర విసర్జనను వంద శాతం నిషేధించాలి. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలి. వేరు చేసేలా పారిశుద్ధ్య కార్మికులు బాధ్యతగా తీసుకొని చేయించుకోవాలి. ప్రజల ఫీడ్‌బ్యాక్ నివాసాల పరిశుభ్రతపై అప్రమత్తం చేయాలి. గతేడాది కంటే బహిరంగ మలమూత్ర విసర్జనలో అన్ని మున్సిపాలిటీలు ఓడీఎఫ్‌ను ప్రకటించాయి. ఇంటింటా తడి, పొడి చెత్త వంద శాతం జరగడం లేదు. సేకరించిన తడిచెత్తను శుద్ధీకరణలో బాగా వెనకబడిపోయాం. ప్లాంట్లు నిర్మించడంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శించారు. అంతేగాక ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలను ఓడీఎఫ్‌గా ప్రకటించినా, బహిరంగ మలమూత్ర విసర్జన మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది. చాలా మంది ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో ఇంకా బయటికే మలమూత్ర విసర్జనకు వెళుతున్నారు. అధికారులు మాత్రం గొప్పగా ఓడీఎఫ్ ప్రకటించామని చేతులు దులుపుకుంటున్నారు.సెఫ్టిక్ ట్యాంకులు లేకుండా చాలా ఇళ్ల నుంచి మలమూత్ర వ్యర్థాలు మురుగుకాల్వలోకి పారుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం నిషేధంలో ఉంది. ఈ పరిమాణాలు మార్పులకు గండి కొట్టనున్నాయి. అందువల్ల అధికార యంత్రాంగం స్వచ్ఛ సర్వేక్షన్పై శ్రమించి, ప్రజలను జాగృతం చేయాల్సి అవనసరం ఎంతైనా ఉంది. -
ఓటర్లు ప్రలోభాలకు గురికావొద్దు
సాక్షి,వనపర్తి క్రైం: ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం వనపర్తి మండలం కాశీంనగర్ గ్రామంలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిసెంబర్ 7న జరిగే పోలింగ్‌లో జిల్లాలోని ఓటర్లందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. డబ్బు, మద్యానికి ఓటును అమ్మకోకుండా నిజాయితీగా వేయాలని చెప్పారు. ఓటు వేసే ముందు విజ్ఞతతో ఆలోచించి గ్రామాభివృద్ధికి, తద్వారా రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడేవారికి ఓటు వేయాలని అన్నారు. ఈ ఎన్నికల్లో దివ్యాంగ ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. వారిని తీసుకెళ్లేందుకు రవాణా సదుపాయం, పోలింగ్ కేంద్రాల వద్ద మూడు చక్రాల సైకిల్, సహాయకులు ఉంటారని, తాగునీరు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు, గర్భిణులు, వృద్ధులు, బాలింతలు తదితరుల కోసం ప్రత్యేకించి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామని, ప్రతిఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం తమ ప్రదర్శన ద్వారా ఓటు విలువ తెలుసుకో..ఓటు హక్కు వినియోగించుకో అనే నృత్య రూపాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ అప్జల్, డిప్యూటీ తహసీల్దార్ కొండన్న తదితరులు ఉన్నారు. -
ఓటర్లు ప్రలోభాలకు గురికావొద్దు.. కలెక్టర్ పిలుపు
సాక్షి, వనపర్తి క్రైం: ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం వనపర్తి మండలం కాశీంనగర్ గ్రామంలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిసెంబర్ 7న జరిగే పోలింగ్‌లో జిల్లాలోని ఓటర్లందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. డబ్బు, మద్యానికి ఓటును అమ్మకోకుండా నిజాయితీగా వేయాలని చెప్పారు. ఓటు వేసే ముందు విజ్ఞతతో ఆలోచించి గ్రామాభివృద్ధికి, తద్వారా రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడేవారికి ఓటు వేయాలని అన్నారు. ఈ ఎన్నికల్లో దివ్యాంగ ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. వారిని తీసుకెళ్లేందుకు రవాణా సదుపాయం, పోలింగ్ కేంద్రాల వద్ద మూడు చక్రాల సైకిల్, సహాయకులు ఉంటారని, తాగునీరు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు, గర్భిణులు, వృద్ధులు, బాలింతలు తదితరుల కోసం ప్రత్యేకించి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామని, ప్రతిఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం తమ ప్రదర్శన ద్వారా ఓటు విలువ తెలుసుకో..ఓటు హక్కు వినియోగించుకో అనే నృత్య రూపాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ అప్జల్, డిప్యూటీ తహసీల్దార్ కొండన్న తదితరులు ఉన్నారు. -
ఓటరన్నా.. జర భద్రం!
సాక్షి, వనపర్తి టౌన్ : మంచి నేతను ప్రతినిధిగా ఎన్నుకోవాలన్నా... సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ఓటర్లు తీర్పే కీలకం. నేతల తలరాతలను మార్చేది, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేది ఓటే. అయితే, ఆ ఓటును బాధ్యతగా గుర్తిచేలా, ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేలా వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రలోభాలకు లొంగొద్దని కోరుతూ ఓటు హక్కును తప్పక వినియోగించుకునేలా అవగాహన కల్పించే చిత్రాలతో పాటు ఫిర్యాదు చేయాల్సిన నంబర్లతో పోస్టర్లు ముద్రించారు. ఈ పోస్టర్లను కలెక్టర్ ఆదేశాలతో వనపర్తి డీఎం దేవదానం ఆధ్వర్యాన సోమవారం బస్సులకు అంటించారు. -
కాంగ్రెస్ గెలుపునకు కృషి
సాక్షి,పాన్‌గల్: కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం కార్యకర్తలు ఐకమత్యంతో కృషి చేయాలని పార్టీ బీసీ సంఘం జిల్లా నాయకులు దేవేందర్‌నాయుడు, సుధాకర్‌యాదవ్, యుగంధర్‌గౌడు అన్నారు. సోమవారం మండలంలోని రేమద్దుల, కిష్టాపూర్, దావాజిపల్లి, మాందాపూర్, కదిరెపాడు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. అధిష్టానం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి కేటాయించినా విజయం ఖాయం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు కార్యకర్తలు వివరించాలన్నారు. దీంతో పాటు మండలం నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరినట్లు ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తక్కువ సంఖ్యలో చేరిన వందల సంఖ్యలో చేరినట్లు చెప్పుకుంటున్నారన్నారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ బుచ్చారెడ్డి, ఆశోక్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమంపై నిఘా నేత్రం
సాక్షి, అమరచింత: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో నిఘాను మరింత పటిష్టం చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులతో పాటు వార్డెన్లు, సిబ్బంది పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భా గంగానే జిల్లాలోని 18 ఎస్సీ హాస్టళ్ల పాటు నా లుగు కళాశాల విద్యార్థుల హాస్టళ్లలో సైతం సీసీ కె మెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో రోజువారి విద్యార్థుల దైనందిన పరిస్థితులను తె లుసుకోవడమే కాకుండా వారు అనుసరిస్తున్న ప ద్ధతులను మానిటరింగ్ చేసే అవకాశం ఉండటంతో హాస్టల్ వార్డెన్లకు మరింత బాధ్యత పెరిగినట్లయింది. మానిటరింగ్‌కు పెద్దపీట జిల్లాలో 18 సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల్లో 2,100 మంది విద్యార్థులు సాగిస్తున్నారు. కళా శాల విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన నాలుగు హాస్టళ్లలో 500మంది విద్యార్థులు చదువుతున్నా రు. రోజువారీగా విద్యార్థుల హాజరుతో పాటు అ ల్పాహారం, రాత్రి భోజనం, ట్యూషన్ల పనితీరును తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించారు. అంతేకాకుండా నిత్యకృత్యాలు, ఆటాపాటలతో పాటు విద్యార్థు లు గొడవపడుతున్న తీరును నేరుగా తెలుసుకుని మానిటరింగ్ చేసేందుకు వార్డెన్లకు అవకాశం ఉంటుంది. హాస్టల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరా అక్రమాలకు చెక్‌పడేనా? హాస్టళ్లలో రోజువారీగా విద్యార్థులు హాజరయ్యే సంఖ్యను బట్టి వారికి వండిపెట్టేందుకు బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె తదితర వాటిని సరఫరా చేస్తారు. అయితే గతంలో ఈ సరుకులు సగం పక్కదారిపట్టేవి. విద్యార్థుల సంఖ్యను త ప్పుగా చూపుతూ అక్రమాలకు పాల్పడేవారు. ప్ర భుత్వం సరఫరా చేసిన ఆహారధాన్యాలు వసతి గృహాల నుంచి బయటికి వెళ్లకుండా వ్యవస్థ ద్వా రా కట్టుదిట్టమైంది. గతంలో విద్యార్థుల సంఖ్యను బేరీజు వేసుకుని తూతూమంత్రంగా హాస్టళ్ల నిర్వహణను కొనసాగించిన పలువురు వార్డెన్లకు సీసీ కెమెరాల ఏర్పాటు, బయోమెట్రిక్ విధానం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లయింది. వసతులు బాగున్నాయి.. అమరచింత ఎస్సీ హాస్టల్లో 10వ తరగతి చదువుకుంటున్నాను. గతనెలలో హాస్టల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. సిబ్బంది పనితీరులో మార్పులు రావడంతో సకాలంలో ఆహారం అందిస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో ట్యూషన్లు, చదువులు కొనసాగుతున్నారు. – నాగరాజు, హాస్టల్ విద్యార్థి, రాంపూర్ ప్రహరీ లేక ఇబ్బందులు అమరచింత ఎస్సీ హాస్టల్లో 10వ తరగతి చదువుకుంటున్నాను. గతేడాది బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సీసీకెమెరాలను ఏర్పాటు చేయడం బాగుంది. రాత్రివేళ హాస్టల్లో విషపురుగులతో పాటు పశుసంచారం ఎక్కువగా ఉంది. అధికారులు స్పందించి ప్రహరీ ఏర్పాటుచేయాలి. – సాయికుమార్,హాస్టల్ విద్యార్థి, కిష్ణంపల్లి మానిటరింగ్ పెరిగింది.. హాస్టళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా మానిటరింగ్ వ్యవస్థ తీరు మెరుగుపడింది. కార్యాలయం నుంచే టీవీలో సీసీకెమెరాల ద్వారా వస్తున్న దృశ్యాలను చూస్తూ విద్యార్థులను దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించగలుగుతున్నాం. – బెనర్జీ, హాస్టల్ వార్డెన్, అమరచింత సత్ఫలితాలు సాధించడానికి కోసమే.. సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్లో గతనెల సీసీ కెమెరాలను ఏర్పాటుచేశాం. కలెక్టర్ ఆదేశాలతో 18 వసతిగృహాల్లో వాటిని బిగించాం. పదో తరగతి విద్యార్థుల ఫలితాలతో పాటు కళాశాల విద్యార్థుల ఫలితాలను పెంపొందించడానికి నిత్యసాధన చేయిస్తున్నాం. -జీపీ వెంకటస్వామి, ఏఎస్ఈడీఓ, వనపర్తి -
‘నిర్భయ’ షార్ట్ ఫిలింకు అవార్డు
వనపర్తి క్రైం : వనపర్తికి చెందిన రహీం రూపొందించిన ‘నిర్భయ చట్టం’ షార్ట్ ఫిలింకు అవార్డు లభించింది. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలకు 72 షార్ట్ ఫిలింలు రాగా, అందులో ఖదీర్ నిర్మాణ సారథ్యంలో రహీం రూపొందించిన చిత్రం అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కాచం ఫౌండేషన్ నిర్వాహకులు కాచం సత్యనారాయణ గుప్తా చేతులమీదుగా రహీం అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు రేలంగి నరసింహరావు గేయ రచయిత చంద్రబోస్, ఆర్ఎక్స్ 100 సినిమా హీరో కార్తీకేయరెడ్డి పాల్గొన్నారు. -
సాగునీటికి కయ్యం!
సాక్షి, మూసాపేట (దేవరకద్ర) : సాగునీరు మాకు కావాలంటే.. మాకే ముందు కావాలని మూసాపేట, అడ్డాకుల మండలాల రైతులు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. పూర్తి వివరాలిలా.. మూసాపేట మండలంలోని మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న మక్ మల్లాయకుంటకు గత సంవత్సరం వనపర్తి జిల్లా ఘనపూర్ మండలంలోని ఘణప సముద్రం పెద్ద చెరువు నుంచి సాగునీరు వదిలారు. ఇందుకు రెండో తూము ద్వారా వచ్చే నీటి కోసం గ్రామస్తులంతా కలిసి చందాలు వేసుకుని కాలువలు తవ్వి కుంటకు రెండు పక్కల పొర్లు దిండ్లను కట్టుకున్నారు. అయితే ఖరీఫ్‌లో నీరు విడుదల కావడంతో చెరువు కింద 360 ఎకరాల్లో వరినాట్లు వేశారు. అయితే రెండు రోజులుగా అడ్డాకుల మండలం కందూరు గ్రామానికి చెందిన దాదాపు వంద మంది రైతులు మక్మల్లాయ కుంటకు ఘణపసముద్రం నుంచి వచ్చే దారిలో ఉన్న దిండును పగలగొట్టడంతో రెండు గ్రామాల మధ్య చిచ్చు రగులుకుంది. వాదోపవాదనలు లేకలేక చెరువుకు నీళ్లు వస్తే చెరువు కింద భూమిని అంతా శిస్తు చేశామని, ఉన్నట్టుండి దిండును పగలగొడితే ఎలాగని మహ్మదుస్సేపల్లి రైతులు కందూరు గ్రామస్తులను నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరో పక్క చెరువు కింద ఉన్న పాటు కాలువలను రెండు జేసీబీలతో తవ్వడంతో ఇరు గ్రామాల ప్రజలు చెరువు కట్టపై మొహరించి నీరు తీసుకెళతామని ఒకరు, ఇవ్వలేమని మరొకరు వాదిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం మక్మల్లయ కుంట నిండిన అనంతరం మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న లోక సముద్రానికి నీరు వదులుతామని అక్క డి నుంచి మొత్తం మీ శివారుకే నీరు వస్తాయని పలువురుపెద్దలు సూచించినా వినకపోవడంతో రాజకీయ నాయకులు సైతం ఈ విషయంలో జో క్యం చేసుకుంటున్నారు. కందూరు మాజీ సర్పంచు నాగిరెడ్డి తమ గ్రామానికి చెందిన రైతులకు నచ్చజెప్పి ఘణపురం చెరువు కుడి కాలువ ద్వారా నీరు విడుదల చేయించడానికి వెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. ఊరంతా శిస్తు కట్టాం కొన్నేళ్ల తర్వాత కుంటకు నీళ్లు వస్తే ఊరు ఊరంతా శిస్తు కట్టాం. ఓర్వలేని కందూరు గ్రామరైతులు రాత్రికిరాత్రే దిండుని పగలగొట్టిండ్రు. అంతటితో ఆగకుండా ఘణపురం చెరువు నుంచి వచ్చే నీళ్లను కూడా దారిమళ్లించడానికి చూసిండ్రు. ఇది మంచి పద్ధతి కాదు. – మోహన్‌రెడ్డి, రైతు, మహ్మదుస్సేన్‌పల్లి సమంజసం కాదు మా ఊరి చెరువు నుంచి దౌర్జన్యం చేసి నీటిని తీసుకెళ్లడం సబబా. ఈ ఏడు కుంట కింద ఉన్న 320 ఎకరాల సంగతేంకావాలి. వరి పంట ఎదుగుతున్న వేళ చెప్పాపెట్టకుండా నీళ్లను మళ్లించడం మానుకోండి. – కిష్టారెడ్డి, రైతు, మహ్మదుస్సేన్‌పల్లి నా చేనంతా నాశనంమైంది కందూరు రైతులు నీళ్ల కోసం కట్ట దిండును ధ్వంసం చేసిండ్రు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ దగ్గరుండి దిండును పగలగొట్టడమే కాక నా పంటకు నష్ట పరిహారం ఇస్తానడం బెదిరించడమే కదా. పద్ధతి మార్చుకోకపోతే ఊరంతా కట్ట దగ్గరే కూర్చోవాల్సి వస్తది. – నరేశ్, రైతు, మహ్మదుస్సేన్‌పల్లి మాకూ నీళ్లు కావాలి మా ఊరికి కూడా నీళ్లు కావాలి. సరిగ్గా వర్షాలు కురవక మొక్కలన్నీ ఎండుతున్నా యి. మహ్మదుస్సేన్పల్లిలో కుంట కింద ఉన్న భూమం తా శిస్తు చేశారు. కనీసం తుకాలనైనా ఎండిపోకుండా కాపాడుదామంటే వినడంలేదు. అందుకే మా ఊరి రైతులు దానికి ఉన్న రెండు వరస రాళ్లను తొలగించారు. – నాగిరెడ్డి, మాజీ సర్పంచ్, కందూరు