కలెక్టరేట్ ముట్టడిలో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట
సాక్షి, వనపర్తి: ఆర్టీసీకి చెందిన కోట్లాది ఆస్తులపై కేసీఆర్ కన్నేశారని, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ఆర్టీసీ వనరులను పంచిపెట్టేందుకే సంస్థలను నిర్వీర్యం చేస్తున్నా రని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక, ఆర్థిక విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు పట్టణంలోని ధర్నాచౌక్‌లో ఆందోళన చేపట్టి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆర్టీసీ చరిత్రలో ఇంత పెద్ద సమ్మె ఎప్పుడూ జరుగలేదని, ముందస్తు ప్రణాళికతో అన్ని లెక్కలు సరిచూసుకొని ఆర్టీసీని ప్రైవేటీకరణ చేపట్టి ఆ సంస్థ ఆస్తులను తనకు కావాల్సినవారికి కట్టబెట్టు కోవడమే లక్ష్యంగా కేసీఆర్ కుట్ర పన్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఆర్టీసీ కార్మికులను ఆ సంస్థను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ద్రోహులుగా చిత్రీకరించేందుకు
ప్రయత్నిస్తోందన్నారు.
హైకోర్టు హెచ్చరించినా వినరెందుకు?
ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టు పలు మార్లు ప్రభుత్వ తీరును, అధికారుల తీరును తప్పుబట్టినా తీరు మారడంలేదని చిన్నారెడ్డి విమర్శించారు. అలాగే కేంద్రంలో మోదీ సర్కార్ ఆర్థిక నిపుణులతో చర్చింకుండానే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందన్నారు. మాజీ ప్రధాని, ఆర్థిక నిపుణులు మన్మోహన్ అన్నట్లు దేశ జీడీపీ 3 శాతానికి పడిపోయిందని, మేకిన్ ఇండియా, ఇండియా స్టార్టప్ లాంటి నినాదాలతో హోరెత్తించడం తప్ప కేంద్రం చేసిందేమి లేదన్నారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు నిలువరించే యత్నంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం చిన్నారెడ్డితో పాటు పలువురుని మాత్రమే లోపలికి అనుమతించగా వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, వివిధ మండలాలు నాయకులు, పట్టణ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment