కొత్త తరహా దోపిడీకి బిల్‌ కలెక్టర్ల తెర | Wanaparthy Bill Collectors Finding New Ways To Exploit | Sakshi
Sakshi News home page

కొత్త తరహా దోపిడీకి బిల్‌ కలెక్టర్ల తెర

Published Tue, Sep 17 2019 10:18 AM | Last Updated on Tue, Sep 17 2019 10:18 AM

Wanaparthy Bill Collectors Finding New Ways To Exploit - Sakshi

రూ.8,700 చెల్లించినట్లు ఇచ్చిన రశీదు (నంబర్‌ 005560); రూ.200 మాత్రమే నమోదు చేసిన అధికారుల వద్దఉన్న మరో రశీదు (నంబర్‌ 005560)

సాక్షి, వనపర్తి: వనపర్తి పురపాలికలో కుళాయి బిల్లుల చెల్లింపులో కొత్త తరహా దోపిడీకి కొందరు మున్సిపల్‌ అధికారులు తెరలేపారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా రూ.వేలకు వేలు కాజేస్తున్నారు. పుర ఆదాయానికి గండికొడుతూ తమ జేబులను నింపుకుంటున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వనపర్తి పురపాలికలో కుళాయి బిల్లుల చెల్లింపులో కొత్త తరహా దోపిడీకి కొందరు మున్సిపల్‌ అధికారులు తెరలేపారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా రూ.వేలకు వేలు కాజేస్తున్నారు. పుర ఆదాయానికి గండికొడుతూ కొందరు అధికారులు తమ జేబులను నింపుకుంటున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమాయక ప్రజలే లక్ష్యంగా ప్రతినెలా రూ.వేలల్లో పుర ఆదాయానికి గండికొడుతున్నారు. నల్లా కనెక్షన్‌ తీసుకున్న వారు ప్రతినెలా రూ.100 మునిసిపాలిటీకి విధిగా చెల్లించాలి. కానీ పురపాలక అధికారులు బకాయి వసూళ్లలో ఆలసత్వం ప్రదర్శించడం వల్ల ఏళ్ల తరబడి పేరుకుపోయాయి. ఈనేపథ్యంలోనే ఒకేసారి రూ.5వేలు, రూ.10వేలు, రూ.20వేలు చెల్లించేందుకు వస్తుంటారు. తప్పుడు లెక్కలతో ఈ ఆదాయాన్ని కొందరు పురపాలికకు దక్కకుండా చేస్తున్నారు. ఈ వ్యవహారం ‘సాక్షి’ నిఘాతో బయటపడింది.   

దోపిడీ ఇలా..  
నల్లా యజమానులు 2, 5, 10, 15ఏళ్ల నల్లా బకాయి చెల్లించేందుకు మునిసిపాలిటీకి వస్తే బిల్లు స్వీకరించే అధికారులు మాయ చేస్తున్నారు. 2019మార్చి నుంచి బిల్లు ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి వచ్చిందని చెబుతున్నారు. ఏప్రిల్‌ నుంచి 2020 మార్చివరకు బిల్లును ఆన్‌లైన్‌లోనే తీసుకుంటామని అంటున్నారు. డబ్బుచెల్లిస్తే రశీదు కూడా ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ట్విస్ట్‌ ఇక్కడే మొదలవుతోంది. ఈ ఏడాది కంటే ముందు మీరు నల్లా కనెక్షన్‌ తీసుకున్నారు కాబట్టి అంతకుముందు సంవత్సరాల బిల్లులను మ్యాన్‌వల్‌ రశీదులో రాసిస్తామంటూ డబ్బులు తీసుకుంటున్నారు. ఎంత చెల్లించారో అంత రశీదు కూడా ఇస్తున్నారు. కానీ అధికారుల వద్ద ఉన్న మ్యాన్‌వల్‌ రికార్డుల్లో రూ.వేలల్లో బిల్లు తీసుకుని రూ.వందల్లో నమోదు చేస్తున్నారు. మిగతా డబ్బులను కాజేస్తున్నారు. ఒకే నంబర్లతో ఉండే రెండు బిల్లు బుక్కులు వారివద్ద పెట్టుకుంటున్నారు. వాస్తవంగా అధికారులు ఒకేసారి కార్బన్‌ సాయంతో బిల్లు రాయాల్సి ఉంటుంది. కానీ అలా రాయడం లేదు. ఇలా కొత్తదందాకు తెరలేపారు.  

భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బందులే..  
ఈ వ్యవహారం వల్ల ఇప్పటికే బిల్లులు చెల్లించిన వారికి భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవనున్నాయి. బిల్లు చెల్లించినట్లు రశీదుతో ప్రజలు పుర కార్యాలయానికి వచ్చి చూడలేరనే ధైర్యంతో ప్రజలకు ఇచ్చే రశీదులో ఒకలా, అధికారుల వద్ద ఉండే రశీదులో మరోలా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం నల్లాబిల్లుల చెల్లింపు కౌంటర్‌ వద్ద వసూలు చేసే అధికారులు భవిష్యత్‌లో బదిలీ అయినా లేదా మరో ఏదైనా సమస్య ఉత్పన్నం అయినా ప్రజలకే ఇబ్బందులు రానున్నాయి. నల్లా బిల్లుల కౌంటర్‌ వద్ద ఉండే అధికారులు కొందరు గ్రూప్‌గా ఏర్పడి ఈ తంతంగం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వనపర్తిలో మొత్తం 10వేల వరకు నల్లా కనెక్షన్‌లు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 7,500 ఆన్‌లైన్‌ అయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా వాటి వివరాలు సరిగా లేకపోవడంతో వాటి నమోదుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  

వెలుగులోకి వచ్చింది ఇలా  
వనపర్తికి చెందిన తెలుగు సుకన్య 2012 సంవత్సరం నుంచి నల్లాబిల్లు చెల్లించలేదు. నెలకు రూ.100 చొప్పున మొత్తం రూ.9,600 బిల్లు చెల్లించేందుకు ఈనెల 5న మునిసిపాలిటీకి వచ్చింది. అధికారులు 2019 ఏప్రిల్‌ నుంచి  2020 మార్చివరకు రూ.1,300 బిల్లు రశీదును ఆన్‌లైన్‌ ద్వారా కట్‌ చేశారు. మిగతా రశీదులో గత సంవత్సరాలకు సంబంధించి రూ.8,700 ముట్టినట్లు రశీదు నంబర్‌ 005560 రాసి ఇచ్చారు. అధికారుల వద్దఉన్న బిల్‌బుక్కులో అదే నంబర్‌ రశీదులో మాత్రం రూ.200 మాత్రమే ముట్టినట్లు రాసుకున్నారు. రికార్డులోనూ రూ.200 రాశారు.  

విచారిస్తాం..  
నల్లా బకాయిల సేకరణలో పూర్తిగా డబ్బులు తీసుకుని, రికార్డులో తక్కువగా నమోదు చేయడం వంటివాటికి తావుండదు. ఒకవేళ పూర్తిగా డబ్బులు తీసుకుని తక్కువగా నమోదు చేస్తే తప్పకుండా విచారణ చేస్తాం. వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటాం. 
– రజినీకాంత్‌రెడ్డి, పుర కమిషనర్, వనపర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement