municipal corporation employees
-
AP: మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో బుధవారం సాయంత్రం మంత్రి వర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయిన వెంటనే సమ్మె విరమణ ప్రకటన చేశాయి సంఘాలు. దీంతో.. రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు యధావిధిగా తమ విధులకు కార్మికులు హాజరు కానున్నారు. పలు డిమాండ్ల సాధనతో మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారు. అయితే గత చర్చల్లో ప్రభుత్వం వాళ్ల డిమాండ్‌కు సానుకూలంగా స్పందించినప్పటికీ.. కొన్ని విషయాలపై స్పష్టత రాలేదు. దీంతో నేడు మరోసారి భేటీ కావాల్సి వచ్చింది. చివరకు చర్చలు సఫలం కావడం.. సమ్మె విరమణకు కార్మిక సంఘాలు అంగీకరించడంతో.. ముగింపు పడినట్లయ్యింది. మున్సిపల్ కార్మికులు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. 21 వేల వేతనంతో పాటు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని,. సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు. వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తామన్నారు. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికునికి కొత్త బట్టల కోసం వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. చనిపోయిన కార్మికులు కుటుంబాలకు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం నష్టపరిహారం అందిస్తామని మంత్రి బొత్స అన్నారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే అందించే సాయాన్ని అయిదు నుంచి ఏడు లక్షలకు పెంచినట్లు తెలిపారు. 2019 నుంచి దరఖాస్తు చేసుకోని మృతుల కుటుంబాలు ఇప్పుడు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. జీవో ఇచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే రెండు నెలల్లో ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. -
‘అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం’
ఉప్పల్: ఉప్పల్ సర్కిల్ మున్సిపల్ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హబ్సిగూడలోని వివేకానందనగర్‌లో గత నెల 25వ తేదీన రేకుల షెడ్డును మున్సిపల్ అధికారులు నోటీసు గడువు ముగియక ముందే తొలగించారు. దీన్ని సవాల్ చేస్తూ బాధితుడు పి.నర్సింహరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ అనంతరం మున్సిపల్ అధికారుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూల్చివేతలో పాల్గొన్న అధికారులపై చర్యలు తీసుకుని, బాధితునికి నష్టపరిహారం ఇవ్వాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు బుధవారం బాధితుడు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కక్షపూరితంగానే ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ తమ కార్యాలయ షెడ్డును కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
పారిశుద్ధ్య సిబ్బందికి సరుకులు అందజేసిన మంత్రి
-
ఆఫీస్‌కు వచ్చి కొడతాను: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట
సాక్షి, అనంతపురం: కదిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బరి తెగింపు చర్యలకు పాల్పడ్డాడు. ఆక్రమణలు తొలగించేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులను అడ్డుకుని కొడతానంటూ బెదిరించడమే కాక అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ వివరాలు.. మున్సిపల్ అధికారులు సోమవారం కదిరిలో కాలేజ్ సర్కిల్ నుంచి కోనేరు వరకు గల ఆక్రమణల తొలగింపునకు మార్కింగ్ చేశారు. విషయం తెలుసుకున్న కందికుంట వెంటకప్రసాద్ అక్కడకు చేరుకుని మున్సిపల్ అధికారులను అడ్డుకున్నాడు. అంతటితో ఊరుకోక... ఆఫీస్‌కు వచ్చి కొడతానంటూ అధికారులను బెదిరించాడు. అధికారులపై అసభ్య పదజాలం వాడుతూ రెచ్చిపోయాడు. కందికుంట రౌడీయిజంపై స్థానికులు మండి పడుతున్నారు. -
నగ్నంగా నిల్చోబెట్టి వైద్య పరీక్షలు
సూరత్: ‘పీరియడ్స్’లో ఉన్న విద్యార్థినులను గుర్తించేందుకు కాలేజ్ హాస్టల్లో వారి లోదుస్తులను విప్పించిన అమానవీయ ఘటన మరవకముందే.. అదే రాష్ట్రంలో మరో ఘటన జరిగింది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్ఎంసీ)లోని ట్రైనీ మహిళా క్లర్క్‌లను అందరినీ ఒకే చోట నగ్నంగా నిల్చోబెట్టి అవమానించారు. దీనిపై శుక్రవారం సూరత్ మున్సిపల్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్క్‌లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది మహిళలు, నిబంధనల్లో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి గైనకాలజీ విభాగంలో వైద్యులు, సిబ్బంది వారిని ఒకే గదిలో వివస్త్రలుగా నిల్చోబెట్టి పరీక్షించారు. అవివాహితులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిని అభ్యంతరకర ప్రశ్నలతో అవమానించారు. ఈ ఘటన ‘సూరత్ మున్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో గురువారం జరిగింది. దీనిపై వారు సూరత్ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో, విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కమిషనర్ కమిటీని నియమించారు. ట్రైనీ క్లర్క్‌లపై జరిగిన ఈ అమానవీయ ఘటన∙విమర్శలకు కారణమైంది. శిక్షణ అనంతరం విధులను నిర్వర్తించేందుకు అవసరమైన శారీరక సామర్ధ్యం వారికి ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఎస్ఎంసీలో క్లర్క్‌లుగా ఎంపికైనవారికి తప్పని సరిగా చేస్తారు. అయితే, వైద్య పరీక్షలకు తాము వ్యతిరేకం కాదని, కానీ పరీక్షలు జరిపిన తీరే అభ్యంతరకరంగా ఉందని ఎస్ఎంసీ ఉద్యోగ సంఘం విమర్శించింది. ప్రతీ మహిళకు ప్రత్యేకంగా, ఒంటరిగా పరీక్షలు జరపడం పద్ధతి. అక్కడి డాక్లర్లు అభ్యంతరకర రీతిలో గర్భధారణపై ప్రశ్నలు అడిగారని సంఘం ప్రధాన కార్యదర్శి చెప్పారు. -
కొత్త తరహా దోపిడీకి బిల్ కలెక్టర్ల తెర
సాక్షి, వనపర్తి: వనపర్తి పురపాలికలో కుళాయి బిల్లుల చెల్లింపులో కొత్త తరహా దోపిడీకి కొందరు మున్సిపల్ అధికారులు తెరలేపారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా రూ.వేలకు వేలు కాజేస్తున్నారు. పుర ఆదాయానికి గండికొడుతూ తమ జేబులను నింపుకుంటున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వనపర్తి పురపాలికలో కుళాయి బిల్లుల చెల్లింపులో కొత్త తరహా దోపిడీకి కొందరు మున్సిపల్ అధికారులు తెరలేపారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా రూ.వేలకు వేలు కాజేస్తున్నారు. పుర ఆదాయానికి గండికొడుతూ కొందరు అధికారులు తమ జేబులను నింపుకుంటున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమాయక ప్రజలే లక్ష్యంగా ప్రతినెలా రూ.వేలల్లో పుర ఆదాయానికి గండికొడుతున్నారు. నల్లా కనెక్షన్ తీసుకున్న వారు ప్రతినెలా రూ.100 మునిసిపాలిటీకి విధిగా చెల్లించాలి. కానీ పురపాలక అధికారులు బకాయి వసూళ్లలో ఆలసత్వం ప్రదర్శించడం వల్ల ఏళ్ల తరబడి పేరుకుపోయాయి. ఈనేపథ్యంలోనే ఒకేసారి రూ.5వేలు, రూ.10వేలు, రూ.20వేలు చెల్లించేందుకు వస్తుంటారు. తప్పుడు లెక్కలతో ఈ ఆదాయాన్ని కొందరు పురపాలికకు దక్కకుండా చేస్తున్నారు. ఈ వ్యవహారం ‘సాక్షి’ నిఘాతో బయటపడింది. దోపిడీ ఇలా.. నల్లా యజమానులు 2, 5, 10, 15ఏళ్ల నల్లా బకాయి చెల్లించేందుకు మునిసిపాలిటీకి వస్తే బిల్లు స్వీకరించే అధికారులు మాయ చేస్తున్నారు. 2019మార్చి నుంచి బిల్లు ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిందని చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి 2020 మార్చివరకు బిల్లును ఆన్లైన్లోనే తీసుకుంటామని అంటున్నారు. డబ్బుచెల్లిస్తే రశీదు కూడా ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ట్విస్ట్ ఇక్కడే మొదలవుతోంది. ఈ ఏడాది కంటే ముందు మీరు నల్లా కనెక్షన్ తీసుకున్నారు కాబట్టి అంతకుముందు సంవత్సరాల బిల్లులను మ్యాన్వల్ రశీదులో రాసిస్తామంటూ డబ్బులు తీసుకుంటున్నారు. ఎంత చెల్లించారో అంత రశీదు కూడా ఇస్తున్నారు. కానీ అధికారుల వద్ద ఉన్న మ్యాన్వల్ రికార్డుల్లో రూ.వేలల్లో బిల్లు తీసుకుని రూ.వందల్లో నమోదు చేస్తున్నారు. మిగతా డబ్బులను కాజేస్తున్నారు. ఒకే నంబర్లతో ఉండే రెండు బిల్లు బుక్కులు వారివద్ద పెట్టుకుంటున్నారు. వాస్తవంగా అధికారులు ఒకేసారి కార్బన్ సాయంతో బిల్లు రాయాల్సి ఉంటుంది. కానీ అలా రాయడం లేదు. ఇలా కొత్తదందాకు తెరలేపారు. భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బందులే.. ఈ వ్యవహారం వల్ల ఇప్పటికే బిల్లులు చెల్లించిన వారికి భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవనున్నాయి. బిల్లు చెల్లించినట్లు రశీదుతో ప్రజలు పుర కార్యాలయానికి వచ్చి చూడలేరనే ధైర్యంతో ప్రజలకు ఇచ్చే రశీదులో ఒకలా, అధికారుల వద్ద ఉండే రశీదులో మరోలా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం నల్లాబిల్లుల చెల్లింపు కౌంటర్ వద్ద వసూలు చేసే అధికారులు భవిష్యత్‌లో బదిలీ అయినా లేదా మరో ఏదైనా సమస్య ఉత్పన్నం అయినా ప్రజలకే ఇబ్బందులు రానున్నాయి. నల్లా బిల్లుల కౌంటర్ వద్ద ఉండే అధికారులు కొందరు గ్రూప్‌గా ఏర్పడి ఈ తంతంగం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వనపర్తిలో మొత్తం 10వేల వరకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 7,500 ఆన్లైన్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా వాటి వివరాలు సరిగా లేకపోవడంతో వాటి నమోదుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వెలుగులోకి వచ్చింది ఇలా వనపర్తికి చెందిన తెలుగు సుకన్య 2012 సంవత్సరం నుంచి నల్లాబిల్లు చెల్లించలేదు. నెలకు రూ.100 చొప్పున మొత్తం రూ.9,600 బిల్లు చెల్లించేందుకు ఈనెల 5న మునిసిపాలిటీకి వచ్చింది. అధికారులు 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చివరకు రూ.1,300 బిల్లు రశీదును ఆన్లైన్ ద్వారా కట్ చేశారు. మిగతా రశీదులో గత సంవత్సరాలకు సంబంధించి రూ.8,700 ముట్టినట్లు రశీదు నంబర్ 005560 రాసి ఇచ్చారు. అధికారుల వద్దఉన్న బిల్బుక్కులో అదే నంబర్ రశీదులో మాత్రం రూ.200 మాత్రమే ముట్టినట్లు రాసుకున్నారు. రికార్డులోనూ రూ.200 రాశారు. విచారిస్తాం.. నల్లా బకాయిల సేకరణలో పూర్తిగా డబ్బులు తీసుకుని, రికార్డులో తక్కువగా నమోదు చేయడం వంటివాటికి తావుండదు. ఒకవేళ పూర్తిగా డబ్బులు తీసుకుని తక్కువగా నమోదు చేస్తే తప్పకుండా విచారణ చేస్తాం. వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటాం. – రజినీకాంత్‌రెడ్డి, పుర కమిషనర్, వనపర్తి -
‘నువ్వు నా కోడలు ఫ్రెండ్ కదా?’
సమయం: శనివారం సాయంత్రం 4.23 గంటలు ప్రాంతం: అనంతపురంలోని సాయినగర్ మూడో క్రాస్ ఏం జరిగింది: ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తోంది. అయితే.. : అప్పుడే ఓ 50 ఏళ్ల వ్యక్తి బైక్‌పై వచ్చి ఆ అమ్మాయితో మాట కలిపాడు. సంభాషణ సాగిందిలా: ‘నువ్వు నా కోడలు ఫ్రెండ్ కదా? కాదంకుల్. నీవెక్కడ చదివావు. నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజ్. అదే కాలేజీలోనే నా కోడలు చదువుకుంది. నువ్వు మా అమ్మాయి ఫ్రెండే కదా? హా.. అయుండొచ్చేమో అంకుల్. ఎక్కడికి వెళ్తున్నావు. బస్టాండ్‌కు అంకుల్. అవునా.. నేనూ అటువైపే వెళ్తున్నా. నా బైక్‌లో డ్రాప్ చేస్తా పదా? అంటూ అమ్మాయిని బైక్‌పై తీసుకెళ్లాడు. ఆ తర్వాత : అమ్మాయ్.. భోజనం చేశావా? చేశానంకుల్.. అవునా, అయితే స్నాక్స్ తిందాం అని కమలానగర్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయమని చెప్పి పంపించేశాడు. ఇదేం బుద్ధి: అవును. నగరపాలక సంస్థలో ఉద్యోగి బాగోతమిది. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు.. మాట కలిపి ముగ్గులోకి దించడమే ఇతని పని. ప్రధానంగా హాస్టళ్ల వద్ద కాపు కాసి ట్రాప్ చేయడంలో ఇతను దిట్ట. ఎవరికీ తెలియదా: ఆ శాఖలో ఇతని వ్యవహారం తెలియని వారుండరు. గతంలో ఓ సారి ఇతనిపై చర్యలు తీసుకున్నా మళ్లీ అదే వేటలో పడ్డాడు. అనంతపురం న్యూసిటీ: అవినీతి, అక్రమాలకు చిరునామాగా మారిన నగరపాలక సంస్థలో ఓ ఉద్యోగి బాగోతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒంటరి మహిళలైనా.. ఏదైనా పని మీద నగరానికి వచ్చే విద్యార్థినులైనా ఇతని కంటపడితే అంతే సంగతులు. ఇతని వయస్సు దాదాపు 50 ఏళ్లు. అయినప్పటికీ తన కూతురు వయస్సు ఉన్న పిల్లల వెంటపడి మరీ మాట కలుపుతాడు. అసలు విషయం తెలుసుకొని.. మాయ మాటలతో వారి జీవితాలతో ఆడుకుంటాడు. ఇలా ట్రాప్ చేసిన అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు చర్చ జరుగుతోంది. మహిళా చైర్పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నగరపాలక సంస్థలో ఈ కామాంధుడి వ్యవహారం ఆనోటా ఈనోటా నానుతున్నా ఎవ్వరూ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం విధులకు కూడా సక్రమంగా హాజరు కాని ఈ ఉద్యోగి పట్ల అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫీసుకు ఎప్పుడొస్తాడో తెలియదు.. ఎప్పుడు వెళ్తాడో తెలియదు.. బైక్ వేసుకొని తన వేటలో నిమగ్నమయ్యే ఈ ఉద్యోగిని కనీసం ప్రశ్నించే సాహసం కూడా అధికారులు చేయకపోవడం గమనార్హం. శనివారం ఇతను ట్రాప్ చేయబోయిన విద్యార్థి విషయానికొస్తే.. పక్క జిల్లాలో చదువుతున్న ఈ అమ్మాయి నగరంలో వైద్యం చేయించుకుని అక్కడికి వెళ్లే ఉద్దేశంతో సొంతూరు నుంచి వచ్చింది. ఇలాంటి అమాయక అమ్మాయిలు.. తోడు లేకుండా నగరానికి వచ్చే విద్యార్థినులు కనిపిస్తే చాలు నగరపాలక సంస్థకు చెందిన ఆ ఉద్యోగిలోని మరో మనిషి మేల్కొంటాడు. ప్రస్తుతం ఈ అమ్మాయితో మొదటి పరిచయం కావడంతో.. ఫోన్ నెంబర్ తీసుకొని వదిలేశాడు. ‘సాక్షి’ శనివారం ఈ ఉద్యోగిని ఫాలో చేయడంతో పాటు.. చివరగా ఆ అమ్మాయితో మాట్లాడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిమూర్తినగర్, ఆర్టీఏ కార్యాలయం, విద్యుత్‌నగర్, ఎస్వీ డిగ్రీ కళాశాల, సాయినగర్ హాస్టళ్ల వద్ద స్కూటీ వేసుకొని తిరిగే ఈ కామంధుడి విషయంలో కనీసం పోలీసులైనా ఓ కన్నేస్తారని ఆశిద్దాం. ఫిర్యాదు చేస్తే చర్యలు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తప్పుదోవపట్టించే పనులు చేస్తే ఉపేక్షించేది లేదు. అలాంటి వాళ్లు నగరపాలక సంస్థలో ఎవరున్నా సరే వదిలేది లేదు. ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే వివరాలు గోప్యంగా ఉంచి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – పీవీవీఎస్ మూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ -
కొనసాగుతున్న సమ్మె
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్న సమ్మె శుక్రవారం రెండోరోజుకు చేరింది. రెండోరోజుకు సమ్మెలో పాల్గొనే వారి సంఖ్య మరింత పెరిగింది. విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు విధులను బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు రిక్షా తొక్కి నిరసన తెలిపారు. సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో కోర్టుల నుంచి ఈ కార్యక్రమం జరిగింది. మహిళా న్యాయవాదులు కూడా రిక్షా తొక్కి తమ నిరసన తెలియజేశారు. పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మూయించిన ఎన్జీఓ నాయకులు అనంతరం అక్కడ ధర్నా చేశారు. ఎపీఎన్జీవో పశ్చిమకృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే తమ ఉద్యమం మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు. కైకలూరులో జేఏసీ ఆధ్వర్యంలో తాలూకా సెంటర్లో ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు. అనంతరం జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా కలిదిండి సెంటరులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను శుక్రవారం జేఏసీ నాయకులు దహనం చేశారు. నూజివీడులో సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా కోర్టు సెంటరులో చేపట్టిన రిలేదీక్షలు శుక్రవారం నాటికి రెండోరోజుకు చేరాయి. ఈ దీక్షలలో న్యాయవాదులు పుట్టా లక్ష్మణరావు, అక్కినేని రమాకుమారి, న్యాయవాద గుమాస్తా కొత్తపల్లి వెంకటేశ్వరరావు కూర్చున్నారు. ముత్తంశెట్టి ట్రస్టు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా చిన్నగాంధీబొమ్మ సెంటరులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరాయి. ఈ దీక్షలను ప్రారంభించిన మున్సిపల్ మాజీ చైర్మన్ కణతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుజాతిని ఒక్కటిగా ఉంచాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా స్థానిక చిన్నగాంధీబొమ్మ సెంటర్లో సెయింట్‌ఆన్స్ హైస్కూల్ విద్యార్థులు శుక్రవారం మానవహారం నిర్వహించారు. అనంతరం రాస్తారోకో జరిపారు. కంచికచర్లలో స్థానిక సబ్‌ట్రెజరీ కార్యాలయం వద్ద ఎన్జీవోలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పామర్రు జెడ్పీ పాఠశాల విద్యార్థులు సమైక్యాంధ్ర కావాలి, విభజన వద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలికి చేరుకుని మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్‌ను స్తంభింపజేసి తమ నిరసన తెలిపారు. ఈ నెల 9న విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి ప్రారంభం కానున్న సమైక్య రన్‌కు మద్దతుగా శుక్రవారం కంచికచర్ల శ్రీరాజ్యలక్ష్మీ గ్యాస్ కంపెనీ వద్ద నుంచి 65వ నంబరు జాతీయ రహదారి గుండా నెహ్రూ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు, వివిధ ప్రైవేటు విద్యాసంస్థల అధినేతలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సమైక్య రన్ నిర్వహించారు. కొండపల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. దీనిలో భాగంగా కొండపల్లి ప్రధాన కూడళ్లలోని మార్కెట్ సెంటర్, బ్యాంక్ సెంటర్, రైల్వే స్టేషన్ సెంటర్, బీ కాలనీలలో ప్రజలను, ప్రయాణికులను కలుసుకుని రాష్ట్ర విభజన వలన జరిగే నష్టాలు వివరిస్తూ వారితోనే కార్డులు రాయించి రాష్ట్రపతికి పంపారు.