సమయం: శనివారం సాయంత్రం 4.23 గంటలు
ప్రాంతం: అనంతపురంలోని సాయినగర్ మూడో క్రాస్ ఏం జరిగింది: ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తోంది.
అయితే.. : అప్పుడే ఓ 50 ఏళ్ల వ్యక్తి బైక్‌పై వచ్చి ఆ అమ్మాయితో మాట కలిపాడు.
సంభాషణ సాగిందిలా: ‘నువ్వు నా కోడలు ఫ్రెండ్ కదా? కాదంకుల్. నీవెక్కడ చదివావు. నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజ్. అదే కాలేజీలోనే నా కోడలు చదువుకుంది. నువ్వు మా అమ్మాయి ఫ్రెండే కదా? హా.. అయుండొచ్చేమో అంకుల్. ఎక్కడికి వెళ్తున్నావు. బస్టాండ్‌కు అంకుల్. అవునా.. నేనూ అటువైపే వెళ్తున్నా. నా బైక్‌లో డ్రాప్ చేస్తా పదా? అంటూ అమ్మాయిని బైక్‌పై తీసుకెళ్లాడు.
ఆ తర్వాత : అమ్మాయ్.. భోజనం చేశావా? చేశానంకుల్.. అవునా, అయితే స్నాక్స్ తిందాం అని కమలానగర్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయమని చెప్పి పంపించేశాడు.
ఇదేం బుద్ధి: అవును. నగరపాలక సంస్థలో ఉద్యోగి బాగోతమిది. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు.. మాట కలిపి ముగ్గులోకి దించడమే ఇతని పని. ప్రధానంగా హాస్టళ్ల వద్ద కాపు కాసి ట్రాప్ చేయడంలో ఇతను దిట్ట.
ఎవరికీ తెలియదా: ఆ శాఖలో ఇతని వ్యవహారం తెలియని వారుండరు. గతంలో ఓ సారి ఇతనిపై చర్యలు తీసుకున్నా మళ్లీ అదే వేటలో పడ్డాడు.
అనంతపురం న్యూసిటీ: అవినీతి, అక్రమాలకు చిరునామాగా మారిన నగరపాలక సంస్థలో ఓ ఉద్యోగి బాగోతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒంటరి మహిళలైనా.. ఏదైనా పని మీద నగరానికి వచ్చే విద్యార్థినులైనా ఇతని కంటపడితే అంతే సంగతులు. ఇతని వయస్సు దాదాపు 50 ఏళ్లు. అయినప్పటికీ తన కూతురు వయస్సు ఉన్న పిల్లల వెంటపడి మరీ మాట కలుపుతాడు. అసలు విషయం తెలుసుకొని.. మాయ మాటలతో వారి జీవితాలతో ఆడుకుంటాడు. ఇలా ట్రాప్ చేసిన అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు చర్చ జరుగుతోంది. మహిళా చైర్‌పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నగరపాలక సంస్థలో ఈ కామాంధుడి వ్యవహారం ఆనోటా ఈనోటా నానుతున్నా ఎవ్వరూ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
కనీసం విధులకు కూడా సక్రమంగా హాజరు కాని ఈ ఉద్యోగి పట్ల అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫీసుకు ఎప్పుడొస్తాడో తెలియదు.. ఎప్పుడు వెళ్తాడో తెలియదు.. బైక్ వేసుకొని తన వేటలో నిమగ్నమయ్యే ఈ ఉద్యోగిని కనీసం ప్రశ్నించే సాహసం కూడా అధికారులు చేయకపోవడం గమనార్హం. శనివారం ఇతను ట్రాప్ చేయబోయిన విద్యార్థి విషయానికొస్తే.. పక్క జిల్లాలో చదువుతున్న ఈ అమ్మాయి నగరంలో వైద్యం చేయించుకుని అక్కడికి వెళ్లే ఉద్దేశంతో సొంతూరు నుంచి వచ్చింది.
ఇలాంటి అమాయక అమ్మాయిలు.. తోడు లేకుండా నగరానికి వచ్చే విద్యార్థినులు కనిపిస్తే చాలు నగరపాలక సంస్థకు చెందిన ఆ ఉద్యోగిలోని మరో మనిషి మేల్కొంటాడు. ప్రస్తుతం ఈ అమ్మాయితో మొదటి పరిచయం కావడంతో.. ఫోన్ నెంబర్ తీసుకొని వదిలేశాడు. ‘సాక్షి’ శనివారం ఈ ఉద్యోగిని ఫాలో చేయడంతో పాటు.. చివరగా ఆ అమ్మాయితో మాట్లాడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిమూర్తినగర్, ఆర్‌టీఏ కార్యాలయం, విద్యుత్‌నగర్, ఎస్‌వీ డిగ్రీ కళాశాల, సాయినగర్ హాస్టళ్ల వద్ద స్కూటీ వేసుకొని తిరిగే ఈ కామంధుడి విషయంలో కనీసం పోలీసులైనా ఓ కన్నేస్తారని ఆశిద్దాం.
ఫిర్యాదు చేస్తే చర్యలు
అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తప్పుదోవపట్టించే పనులు చేస్తే ఉపేక్షించేది లేదు. అలాంటి వాళ్లు నగరపాలక సంస్థలో ఎవరున్నా సరే వదిలేది లేదు. ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే వివరాలు గోప్యంగా ఉంచి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– పీవీవీఎస్ మూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment