![Relative Molestation on Dementia Woman in Anantapur - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/14/molestation.jpg.webp?itok=gkDLgS_p)
అనంతపురం, గుంతకల్లు: అసహాయురాలిపై ఇద్దరు మృగాళ్లు తెగబడ్డారు. బుద్ధిమాంద్య వికలాంగురాలిని ఆదరించే పేరుతో సమీప బంధువు ఒకరు లోబర్చుకుని తల్లిని చేశాడు. ఆ తర్వాత మరొకరు ఆమెకు సహాయం చేస్తున్నట్టుగా దగ్గరికి చేరి తనూ కామవాంఛ తీర్చుకున్నాడు. దిక్కూమొక్కూలేని ఆమె తమ మధ్య జీవించడానికి వీలు లేదని తండావాసులు గెంటేశారు. వీరి దీనస్థితి తెలుసుకున్న పాత్రికేయులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారమందించి బాధితులను వృద్ధాశ్రమంలో చేర్పించారు. వివరాల్లోకెళ్తే... గుంతకల్లు మండలంలోని ఓ తండాకు చెందిన వ్యక్తి కుమార్తె పుట్టకతోనే బుద్ధిమాంద్య వికలాంగురాలు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయిన ఈమెకు కష్టాలు మొదలయ్యాయి.
ఆదరించేవారు లేకపోవడంతో యాచించుకుని పొట్టపోసుకునేది. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గుంతకల్లులో యాచన చేసి రాత్రికి ఇంటికి చేరుకునేది. ఈ క్రమంలోనే వరుసకు బాబాయ్ అయ్యే ఓ వ్యక్తి ఆమె పాలిట రాబందువయ్యాడు. మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఫలితంగా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తదనంతర క్రమంలో నరసాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కన్ను ఆమెపై పడింది. సహాయం పేరిట ఆమె వద్దకు వచ్చే ఆ వ్యక్తి తరచూ లైంగిక వాంఛ తీర్చుకునేవాడు. అలా సమీప బంధువు, పరాయి వ్యక్తి చేతిలో మోసపోయింది. ఇటువంటి మహిళ తండాలో ఉండేందుకు వీలు లేదంటూ స్థానికులు గ్రామబహిష్కరణ చేశారు. తననెందుకు చీదరించుకుంటున్నారో.. తను చేసిన తప్పేమిటో కూడా తెలియని రేణుక గుంతకల్లు మున్సిపల్ కార్యాలయ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మెట్లపై కుమారుడితో కలిసి దిగాలుగా కూర్చుండిపోయింది. సొంతూరికి వెళ్లలేక.. నిలువ నీడలేక చివరకు సొమ్మసిల్లి పడిపోయింది. విషయం తెలుసుకున్న విలేకరులు ఆమెను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. వారు తల్లీకుమారుడిని వృద్ధాశ్రమంలో చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment