కొనసాగుతున్న సమ్మె
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్న సమ్మె శుక్రవారం రెండోరోజుకు చేరింది. రెండోరోజుకు సమ్మెలో పాల్గొనే వారి సంఖ్య మరింత పెరిగింది. విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు విధులను బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు రిక్షా తొక్కి నిరసన తెలిపారు. సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో కోర్టుల నుంచి ఈ కార్యక్రమం జరిగింది. మహిళా న్యాయవాదులు కూడా రిక్షా తొక్కి తమ నిరసన తెలియజేశారు.
పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మూయించిన ఎన్‌జీఓ నాయకులు అనంతరం అక్కడ ధర్నా చేశారు. ఎపీఎన్జీవో పశ్చిమకృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే తమ ఉద్యమం మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు. కైకలూరులో జేఏసీ ఆధ్వర్యంలో తాలూకా సెంటర్‌లో ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు. అనంతరం జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా కలిదిండి సెంటరులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను శుక్రవారం జేఏసీ నాయకులు దహనం చేశారు. నూజివీడులో సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా కోర్టు సెంటరులో చేపట్టిన రిలేదీక్షలు శుక్రవారం నాటికి రెండోరోజుకు చేరాయి. ఈ దీక్షలలో న్యాయవాదులు పుట్టా లక్ష్మణరావు, అక్కినేని రమాకుమారి, న్యాయవాద గుమాస్తా కొత్తపల్లి వెంకటేశ్వరరావు కూర్చున్నారు. ముత్తంశెట్టి ట్రస్టు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా చిన్నగాంధీబొమ్మ సెంటరులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరాయి.
ఈ దీక్షలను ప్రారంభించిన మున్సిపల్ మాజీ చైర్మన్ కణతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుజాతిని ఒక్కటిగా ఉంచాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా స్థానిక చిన్నగాంధీబొమ్మ సెంటర్‌లో సెయింట్‌ఆన్స్ హైస్కూల్ విద్యార్థులు శుక్రవారం మానవహారం నిర్వహించారు. అనంతరం రాస్తారోకో జరిపారు. కంచికచర్లలో స్థానిక సబ్‌ట్రెజరీ కార్యాలయం వద్ద ఎన్జీవోలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పామర్రు జెడ్పీ పాఠశాల విద్యార్థులు సమైక్యాంధ్ర కావాలి, విభజన వద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలికి చేరుకుని మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్‌ను స్తంభింపజేసి తమ నిరసన తెలిపారు.
ఈ నెల 9న విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి ప్రారంభం కానున్న సమైక్య రన్‌కు మద్దతుగా శుక్రవారం కంచికచర్ల శ్రీరాజ్యలక్ష్మీ గ్యాస్ కంపెనీ వద్ద నుంచి 65వ నంబరు జాతీయ రహదారి గుండా నెహ్రూ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు, వివిధ ప్రైవేటు విద్యాసంస్థల అధినేతలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సమైక్య రన్ నిర్వహించారు. కొండపల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. దీనిలో భాగంగా కొండపల్లి ప్రధాన కూడళ్లలోని మార్కెట్ సెంటర్, బ్యాంక్ సెంటర్, రైల్వే స్టేషన్ సెంటర్, బీ కాలనీలలో ప్రజలను, ప్రయాణికులను కలుసుకుని రాష్ట్ర విభజన వలన జరిగే నష్టాలు వివరిస్తూ వారితోనే కార్డులు రాయించి రాష్ట్రపతికి పంపారు.