Water Bills
-
బాదుడే బాదుడు! తప్పుడు నీటి బిల్లుల జారీపై జలమండలి నజర్
సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలో అడ్డగోలుగా నీటి బిల్లుల జారీపై జలమండలి ఆలస్యంగానైనా దృష్టి సారించింది. నీటి మీటర్లు తనిఖీ చేయకుండానే అవి పని చేయడం లేదంటూ అదనంగా బిల్లుల బాదుడుతో పాటు నూతనంగా నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు అయిన ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకుంటే చాలు.. వారికి సైతం బిల్లుల జారీ, డ్రైనేజీ వ్యవస్థ లేని ప్రాంతాల్లో మురుగు పన్ను పేరుతో నీటి బిల్లులో అదనంగా బాదుతున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు. వేలాదిగా ఫిర్యాదులు.. ఈ నిర్వాకంపై ఇటీవల జలమండలికి వేలాదిగా ఫిర్యాదులు అందాయి. కాల్‌సెంటర్‌కు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నీటిబిల్లుల వసూలు కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఏజెన్సీల తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అధిక నీటిబిల్లుల మోత, తప్పుడు బిల్లుల జారీపై నివేదిక అందించాలని జనరల్ మేనేజర్లను కోరినట్లు సమాచారం. ఫిర్యాదు అందిన 24గంటల్లోనే పరిష్కరించాలి.. అధిక నీటిబిల్లుల జారీతో సతమతమవుతున్న వినియోగదారుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలోని మేనేజర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించాలని సిటిజన్లు కోరుతున్నారు. వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహించుకునే వారికి ఇబ్బందులు లేకుండా ఉదయం 7 నుంచి 10గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8గంటల వరకు ఈ శిబిరాలు నిర్వహించి అక్కడికక్కడే ఈ సమస్యలను పరిష్కరించాలంటున్నారు. జలమండలి కాల్‌సెంటర్‌కు అందిన ప్రతి ఫిర్యాదును 24 గంటల్లోగా పరిష్కరించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కమీషన్ ముట్టజెప్పుతూ.. అదనంగా బాదుతూ.. నగరంలో సుమారు 12 లక్షల వరకు నల్లా నీటి కనెక్షన్లు ఉన్నాయి. నీటి బిల్లుల వసూలు ప్రక్రియను పలు ఔట్సోర్సింగ్, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని వినియోగదారులు పేర్కొంటున్నారు. వసూలు చేసిన మొత్తంపై సంబంధిత అధికారులకు కమీషన్ ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. దీంతో అదనంగా బిల్లులు వసూలు చేయాలన్న లక్ష్యంతో నీటి మీటర్లను తనిఖీ చేయకుండానే అడ్డగోలుగా బిల్లులు జారీ చేస్తున్నారు. వినియోగదారుల ఇళ్లకు వెళ్లకుండానే డోర్ లాక్ పని చేస్తున్నా.. నీటి మీటర్ ఉన్నప్పటికీ అది పని చేయడంలేదనే సాకుతో బిల్లులు ఇస్తుండటం గమనార్హం. -
టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
-
జీహెచ్ఎంసీ ఎన్నికలు.. టీఆర్ఎస్ వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవరం ప్రగతి భవన్లో విడుదల చేశారు. 10 లక్షల మంది నల్లా వినియోగదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. 20 వేల లీటర్ల లోపు నీటి వినియోగదారులు డిసెంబరు నుంచి నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మంచినీటి కొరత సమస్యను పరిష్కరించామన్నారు కేసీఆర్. పెట్టుబడుల విషయంలో హైదరాబాద్ దేశంలో నంబర్.2గా ఉందని తెలిపారు. కేసీఆర్ మాట్లాడుతూ.. ‘సెలూన్లకు, లాండ్రీలకు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. కరోనా కాలానికి సంబంధించి మోటారు వాహన పన్ను రద్దు చేస్తాం. సినిమా థియేటర్లకు విద్యుత్ కనీస డిమాండ్ ఛార్జీలు రద్దు చేస్తాం. 10 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ సినిమాలకు ఎస్జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌తో సాయం చేస్తాం. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అధిక షోలు ప్రదర్శించేందుకు అనుమతిస్తాం. కొన్ని రాష్ట్రాల మాదిరి టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటు కల్పిస్తాం. తాగునీరు కోసం కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాము’ అని తెలిపారు. (6 ఏళ్లు.. 60 తప్పులు) సీనియర్ సిటిజన్లకు ఫ్రీ బస్ పాస్‌లు హైదరాబాద్ మెట్రోను మరింత విస్తరిస్తామన్నారు సీఎం కేసీఆర్. రాయదుర్గం-ఎయిర్పోర్ట్, బీహెచ్ఈఎల్-మెహిదీపట్నం వరకు మెట్రోని విస్తరిస్తామన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వేగంగా వెళ్లేందుకు త్వరలో ఎక్స్‌ప్రెస్ మెట్రోరైలు ప్రారంభిస్తామన్నారు. మరో 90 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ విస్తరణ చేపడతామన్నారు. ప్రజారోగ్యానికి ప్రత్యేక దావాఖానాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరం నలువైపులా మరో 3 టిమ్స్ ఆస్పత్రులు నిర్మిస్తామన్నారు. అలానే ఉన్నచోటే అన్ని వసతులు సమకూరేలా "మైక్రోసిటీ" కాన్సెప్ట్ అమలు చేస్తామన్నారు. హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు అండర్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. బస్తీల్లో ప్రభుత్వ మోడల్ స్కూళ్లు (ఇంగ్లీష్), విద్యార్థులు, నిరుద్యోగుల సౌకర్యార్థం ఈ-లైబ్రరీలు ఏర్పాటు చేస్తామన్నారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రతి డివిజన్లో లైబ్రరీ, క్లబ్, యోగా, జిమ్ సెంటర్లు ఏర్పాటు చేయడమే కాక వారికి ఉచితంగా బస్ పాసులు ఇస్తామన్నారు. త్వరలో కొత్త జీహెచ్ఎంసీ చట్టం తీసుకొస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్ ‘గత నెలల వచ్చిన భారీ వరదల వల్ల నగరం అతలాకుతలమయ్యింది. భవిష్యత్తులో వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నాము. ప్రణాళిక అమలు కోసం 12వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం. హైదరాబాద్ మహానగరానికి సమగ్ర సీవరేజి మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తాం. మురుగు శుద్ధి, డ్రైనేజీ పనులకు 13వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేస్తాం. గోదావరితో మూసీ నదీని అనుసంధానం చేస్తాం. బాపుఘాట్ నుంచి నాగోల్ వరకు నది మధ్యలో బోటింగ్.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు గోదావరి నుంచి నీళ్లు తరలిస్తాం’ అన్నారు కేసీఆర్. అలానే 250 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీలో 20 చెరువుల సుందరీకరణ పనులు.. హెచ్ఎండీఏలో 120 కోట్ల రూపాయలతో 20 చెరువుల సుందరీకరణ పనులు ప్రారంభిమస్తామని తెలిపారు. ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ విశ్వనగరంలో ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేసీఆర్. ఇందుకు గాను త్వరలో ఫుట్‌పాత్‌లు, స్కైవాక్‌లు, సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్‌గా హైదరాబాద్ మారిందన్నారు. ఏరోస్పేస్, లాజిస్టిక్స్, ఫార్మా, ఐటీ, ఎలక్ట్రికల్, రియల్ రంగాలు మరింత విస్తరిస్తామన్నారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో మరో 5 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ జాగాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్దీకరణ చేస్తామని.. స్థలాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం 5లక్షల రూపాయల వరకు సాయం చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీలో అన్నపూర్ణ క్యాంటీన్లు పెంచుతామన్నారు. నగరానికి వచ్చే వారి కోసం షెల్టర్ హోమ్స్ విస్తరిస్తామన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు కేసీఆర్ తీపికబురు చెప్పారు. హెచ్డీ, ఎల్టీ కేటగిరిలకు కనీస డిమాండ్ ఛార్జీలు మినహాయింపు ఇస్తామన్నారు. మేనిఫెస్టో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అసలు మాత్రమే చెల్లించండి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: జలమండలి బిల్లు బకాయిదారులకు సువర్ణావకాశం కల్పించామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ చేశామని, కేవలం అసలు మాత్రమే చెల్లించాలని కేటీఆర్ తెలిపారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో జలమండలి వన్ టైం సెటిల్మెంట్ పథకం కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల ఒకటి నుంచి సెప్టెంబర్ 15 వరకు 45 రోజుల పాటు అమలులో ఉంటుందన్నారు. జలమండలికి బిల్లులు క్రమంగా చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. -
కొత్త తరహా దోపిడీకి బిల్ కలెక్టర్ల తెర
సాక్షి, వనపర్తి: వనపర్తి పురపాలికలో కుళాయి బిల్లుల చెల్లింపులో కొత్త తరహా దోపిడీకి కొందరు మున్సిపల్ అధికారులు తెరలేపారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా రూ.వేలకు వేలు కాజేస్తున్నారు. పుర ఆదాయానికి గండికొడుతూ తమ జేబులను నింపుకుంటున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వనపర్తి పురపాలికలో కుళాయి బిల్లుల చెల్లింపులో కొత్త తరహా దోపిడీకి కొందరు మున్సిపల్ అధికారులు తెరలేపారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా రూ.వేలకు వేలు కాజేస్తున్నారు. పుర ఆదాయానికి గండికొడుతూ కొందరు అధికారులు తమ జేబులను నింపుకుంటున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమాయక ప్రజలే లక్ష్యంగా ప్రతినెలా రూ.వేలల్లో పుర ఆదాయానికి గండికొడుతున్నారు. నల్లా కనెక్షన్ తీసుకున్న వారు ప్రతినెలా రూ.100 మునిసిపాలిటీకి విధిగా చెల్లించాలి. కానీ పురపాలక అధికారులు బకాయి వసూళ్లలో ఆలసత్వం ప్రదర్శించడం వల్ల ఏళ్ల తరబడి పేరుకుపోయాయి. ఈనేపథ్యంలోనే ఒకేసారి రూ.5వేలు, రూ.10వేలు, రూ.20వేలు చెల్లించేందుకు వస్తుంటారు. తప్పుడు లెక్కలతో ఈ ఆదాయాన్ని కొందరు పురపాలికకు దక్కకుండా చేస్తున్నారు. ఈ వ్యవహారం ‘సాక్షి’ నిఘాతో బయటపడింది. దోపిడీ ఇలా.. నల్లా యజమానులు 2, 5, 10, 15ఏళ్ల నల్లా బకాయి చెల్లించేందుకు మునిసిపాలిటీకి వస్తే బిల్లు స్వీకరించే అధికారులు మాయ చేస్తున్నారు. 2019మార్చి నుంచి బిల్లు ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిందని చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి 2020 మార్చివరకు బిల్లును ఆన్లైన్లోనే తీసుకుంటామని అంటున్నారు. డబ్బుచెల్లిస్తే రశీదు కూడా ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ట్విస్ట్ ఇక్కడే మొదలవుతోంది. ఈ ఏడాది కంటే ముందు మీరు నల్లా కనెక్షన్ తీసుకున్నారు కాబట్టి అంతకుముందు సంవత్సరాల బిల్లులను మ్యాన్వల్ రశీదులో రాసిస్తామంటూ డబ్బులు తీసుకుంటున్నారు. ఎంత చెల్లించారో అంత రశీదు కూడా ఇస్తున్నారు. కానీ అధికారుల వద్ద ఉన్న మ్యాన్వల్ రికార్డుల్లో రూ.వేలల్లో బిల్లు తీసుకుని రూ.వందల్లో నమోదు చేస్తున్నారు. మిగతా డబ్బులను కాజేస్తున్నారు. ఒకే నంబర్లతో ఉండే రెండు బిల్లు బుక్కులు వారివద్ద పెట్టుకుంటున్నారు. వాస్తవంగా అధికారులు ఒకేసారి కార్బన్ సాయంతో బిల్లు రాయాల్సి ఉంటుంది. కానీ అలా రాయడం లేదు. ఇలా కొత్తదందాకు తెరలేపారు. భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బందులే.. ఈ వ్యవహారం వల్ల ఇప్పటికే బిల్లులు చెల్లించిన వారికి భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవనున్నాయి. బిల్లు చెల్లించినట్లు రశీదుతో ప్రజలు పుర కార్యాలయానికి వచ్చి చూడలేరనే ధైర్యంతో ప్రజలకు ఇచ్చే రశీదులో ఒకలా, అధికారుల వద్ద ఉండే రశీదులో మరోలా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం నల్లాబిల్లుల చెల్లింపు కౌంటర్ వద్ద వసూలు చేసే అధికారులు భవిష్యత్‌లో బదిలీ అయినా లేదా మరో ఏదైనా సమస్య ఉత్పన్నం అయినా ప్రజలకే ఇబ్బందులు రానున్నాయి. నల్లా బిల్లుల కౌంటర్ వద్ద ఉండే అధికారులు కొందరు గ్రూప్‌గా ఏర్పడి ఈ తంతంగం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వనపర్తిలో మొత్తం 10వేల వరకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 7,500 ఆన్లైన్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా వాటి వివరాలు సరిగా లేకపోవడంతో వాటి నమోదుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వెలుగులోకి వచ్చింది ఇలా వనపర్తికి చెందిన తెలుగు సుకన్య 2012 సంవత్సరం నుంచి నల్లాబిల్లు చెల్లించలేదు. నెలకు రూ.100 చొప్పున మొత్తం రూ.9,600 బిల్లు చెల్లించేందుకు ఈనెల 5న మునిసిపాలిటీకి వచ్చింది. అధికారులు 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చివరకు రూ.1,300 బిల్లు రశీదును ఆన్లైన్ ద్వారా కట్ చేశారు. మిగతా రశీదులో గత సంవత్సరాలకు సంబంధించి రూ.8,700 ముట్టినట్లు రశీదు నంబర్ 005560 రాసి ఇచ్చారు. అధికారుల వద్దఉన్న బిల్బుక్కులో అదే నంబర్ రశీదులో మాత్రం రూ.200 మాత్రమే ముట్టినట్లు రాసుకున్నారు. రికార్డులోనూ రూ.200 రాశారు. విచారిస్తాం.. నల్లా బకాయిల సేకరణలో పూర్తిగా డబ్బులు తీసుకుని, రికార్డులో తక్కువగా నమోదు చేయడం వంటివాటికి తావుండదు. ఒకవేళ పూర్తిగా డబ్బులు తీసుకుని తక్కువగా నమోదు చేస్తే తప్పకుండా విచారణ చేస్తాం. వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటాం. – రజినీకాంత్‌రెడ్డి, పుర కమిషనర్, వనపర్తి -
బడా కాంప్లెక్స్‌ల అక్రమనల్లాల గుట్టు రట్టు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో బడా కాంప్లెక్స్లకున్న అక్రమ నల్లాల భాగోతం.. జలమండలి విజిలెన్స్ పోలీసుల తనిఖీల్లో రోజుకొకటి చొప్పున బయటపడుతుండడం కలకలం సృష్టిస్తోంది. జలమండలి పైపులైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన ఓ బహుళఅంతస్తుల భవన యాజమానిపై విజిలెన్స్ పోలీసులు మంగళవారం క్రిమినల్ కేసు నమోదు చేశా రు. కేపీహెచ్‌బీ సెక్షన్ పరిధిలోని కూకట్పల్లి, ధర్మారెడ్డి కాలనీలో ఇంటి నెం.15–31–83/ఎన్ఆర్ భవనానికి రెండు లక్షలకు పైగా నీటిబిల్లు బకాయిపడడంతో సదరు భవనానికున్న (క్యాన్ నెం. 091543800) నల్లా కనెక్షన్‌ను 2017 డిసెంబర్ 12న జలమండలి అధికారులు తొలగించారు. అయినా తిరిగి బోర్డు అధికారు ల అనుమతి లేకుండా తొలగించిన నల్లా కనెక్షన్ అక్రమంగా ఏర్పాటు చేసు కున్నారు. దీనిని గుర్తించిన జలమండలి విజిలెన్స్ అధికారులు జలమండలి ఎండీ ఆదేశాల మేరకు ఈ నల్లా కనెక్షన్ తొలగించారు. సద రు భవన యజమానిపై కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 269,430, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు జలమండలి విజిలెన్స్ విభా గం ఏసీపీ రవిచంద్రారెడ్డి తెలిపారు. జలమండలి అధికారుల అనుమతులు లేకు ండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. గ్రేటర్లో సుమారు లక్ష అక్రమ నల్లాలు..? మహానగర పరిధిలోని పలు బహుళఅంతస్తుల భవనాలు, కాంప్లెక్స్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆస్పత్రులు, ఫంక్షన్‌హాళ్లు, పాఠశాలలు, మాల్స్‌లకు అక్రమనల్లాలు సుమారు లక్ష వరకు ఉన్నట్లు జలమండలి వర్గాల్లో బహిరంగ రహస్యమే. అయితే విజిలెన్స్ పోలీసులు తనిఖీలు జరిపినప్పుడే ఈ గుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతుండడం గమనార్హం. ఈ అక్రమనల్లాల గుట్టు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్మెన్లు, మీటర్రీడర్లు, మేనేజర్లు, డీజీఎంలకు తెలిసినప్పటికీ ఆయా భవనాల యజమానులతో ఉన్న మామూళ్లబంధం, సత్సంబంధాల కారణంగా అక్రమనల్లాల గుట్టు ను విజిలెన్స్ పోలీసులకు చేరవేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.విజిలెన్స్ పోలీసులు అడిగిన సమాచారం ఇచ్చేందుకు సైతం సదరు క్షేత్రస్థాయి అధికారులు విముఖత చూపుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. -
బిల్లులు కట్టకపోతే పోటీకి అనర్హులు: ఈసీ
న్యూఢిల్లీ: విద్యుత్, నీరు వంటి పౌరసేవల బకాయిలను చెల్లించని వారిని లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల సంఘం కేంద్ర న్యాయశాఖకు ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని ఎన్నికల నేరాలకు సంబంధించిన మూడో అధ్యాయాన్ని సవరించాలని, పౌర సేవల బిల్లులను చెల్లించకపోతే పోటీకి అనర్హులనే కొత్త నిబంధన చేర్చాలని సూచించింది. ఈ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. -
నీటి చార్జీలు ఔట్ సోర్సింగ్!
⇒ తొలుత గ్రేటర్ వరంగల్‌లో అమలు ⇒ పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ⇒ నల్లా బిల్లుల వసూళ్లు ⇒ 6.90 శాతానికి తగ్గడమే కారణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నల్లా బిల్లుల వసూళ్ల బాధ్యతను ఔట్సోర్సింగ్ సంస్థలకు అప్పగించనున్నారా..? నగరాలు, పట్టణాల్లో నల్లా బిల్లుల వసూళ్లు అంతంత మాత్రంగా ఉండటంతో ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలి స్తోందా..? దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. నీటి బిల్లుల వసూళ్లలో పురపాలక సంఘాలు విఫలమవుతున్న నేపథ్యంలో ఆ బాధ్యతలను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ మినహా.. రాష్ట్రంలోని ఇతర నగర, పట్టణాల్లో బిల్లుల వసూళ్లు ఇప్పటివరకూ 6.90 శాతమే వసూలవ్వడంతో ప్రభుత్వం ఔట్ సోర్సింగ్‌పై దృష్టి సారించినట్టు సమాచారం. 1 నుంచి ‘రెవెన్యూ’ పర్యవేక్షణ జనాభా ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఉన్న గృహాల సంఖ్యతో పోలిస్తే అధికారిక నల్లా కనెక్షన్ల సంఖ్య తక్కువగా ఉంది. ఉన్న అధికారిక కనెక్షన్ల నుంచి సైతం సక్రమంగా బిల్లుల వసూళ్లు లేవు. నీటి బిల్లుల వసూళ్లను పర్యవేక్షిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది ఇతర బాధ్యతలు, పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పురపాలక శాఖ జరిపిన అంతర్గత సమీక్షలో నల్లా బిల్లుల వసూళ్ల బాధ్యతను రెవెన్యూ వి భాగాలకు బదలాయించారు. సెప్టెంబర్ 1 నుంచి నల్లా బిల్లుల బాధ్యతలను మున్సిపాలిటీల రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షించనున్నారు. నల్లా చార్జీల వసూళ్లను ఔట్ సోర్సింగ్‌కు అప్పగిస్తే బిల్లుల ఎగవేతలను నివారించవచ్చనే అంశంపైనా ఈ సమీక్షలో చర్చించినట్లు తెలిసింది. తొలుత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దీనిని అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇక ఆన్లైన్లో నల్లా బిల్లులు.. నల్లా బిల్లుల వసూళ్లు, బకాయిలకు సంబంధించిన సరైన రికార్డులు మున్సిపాలిటీల వద్ద లేవు. బిల్లుల వసూళ్లలో లొసుగులను దాచిపెట్టేందుకు స్థానిక సిబ్బందే రికార్డులను మాయం చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఇకపై ఇలా జరగకుండా నల్లా బిల్లుల వసూళ్లను సైతం ఆన్లైన్ చేయాలని నిర్ణయించారు. అక్రమాలను నియంత్రించడానికి ఆస్తి పన్నులు, ఇతరత్రా వసూళ్లను ఏ రోజుకు ఆరోజు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి నీటి బిల్లుల వసూళ్లను సైతం ఆన్లైన్లో ఎంట్రీ చేయనున్నారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదు నల్లా బిల్లులను ఔట్ సోర్సింగ్ చేయాలన్న అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిగిన బిల్లుల చెల్లింపులు, బకాయిల రికార్డులను ఆన్లైన్ వెబ్సైట్లో పొందుపరుస్తున్నాం. ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. - శ్రీనివాస్‌రెడ్డి జాయింట్ డెరైక్టర్, పురపాలక శాఖ -
అధికారులకు ‘క్రమబద్ధీకరణ’ పరేషాన్
స్థలాల క్రమబద్ధీకరణలో చెక్మెమోతో తంటాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో చెక్‌మెమో వ్యవహారం రెవెన్యూ అధికారులను పరేషాన్‌కి గురిచేస్తోంది. ఉచిత, చెల్లింపు కేటగిరీల కింద వచ్చిన సుమారు మూడున్నర లక్షల దరఖాస్తుల పరిశీలనలో చెక్‌మెమోను తప్పనిసరిగా పాటించాలని భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీచేశారు. చెక్మెమోలోని 32 అంశాలను విచారణాధికారి, మండల తహశీ ల్దారు స్వయంగా పరిశీలించి ధ్రువీకరించాలని అం దులో పేర్కొన్నారు. అలాగే.. ఏవైనా తప్పిదాలు జరి గితే సంబంధిత మండల తహశీల్దార్లను బాధ్యులుగా పరిగణిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు సిబ్బంది కొరత, మరోవైపు అధికమైన పనిభారంతో తహశీల్దార్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుకు పది దరఖాస్తులు గగనమే.. క్రమబద్ధీకరణ దరఖాస్తుల్లో దరఖాస్తుదారు పేర్కొన్న స్థలం వివరాలను క్షేత్రస్థాయిలో విచారణాధికారితో పాటు తహశీల్దారు కూడా పరిశీలించాలి. దీంతో పాటు దరఖాస్తుదారుని వృత్తి, మతం, కులం, వీధి, వార్డు, గ్రామం, కుటుంబ సభ్యుల వివరాలను కూడా ధ్రువీకరించాలి. విద్యుత్, నీటి బిల్లులు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డులు సరైనవో కావో సంబంధిత విభాగాల అధికారులతో సంప్రదించి నిర్ధారించుకోవాలి. దరఖాస్తులో పేర్కొన్న ఇంటి నిర్మాణం, ఖాళీ జాగాలను పరిశీలించి సర్వే చేయించాలి. ఇలా చెక్మెమోలో పేర్కొన్న 32 అంశాలను స్వయంగా తహశీల్దార్లు ధ్రువీకరించాలని సీసీఎల్ఏ జారీచేసిన చెక్మెమోలో పేర్కొన్నారు. వీటన్నింటిని నేరుగా తామే వెళ్లి పరిశీలించడమంటే సాధ్యమయ్యే పనికాదని అధికారులు అంటున్నారు. రోజుకు 50 దరఖాస్తులు పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా, 32 అంశాలను నిశితంగా పరిశీలించాల్సి వస్తున్నందున రోజుకు పది దరఖాస్తులు కూడా క్లియర్ చేయలేకపోతున్నట్లు అధికారులు వాపోతున్నారు. పరిశీలన ప్రక్రియ ఇదేవిధంగా కొనసాగితే.. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ నెల 20నుంచి పట్టాల పంపిణీ సాధ్యం కాకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. -
నీటి బిల్లు బకాయిదారుల్లో సచిన్, ఠాక్రే
ముంబై: ముంబైలో నీటి బిల్లులు చెల్లించని వారి జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ నేత అబూ అజ్మీ తదితర ప్రముఖులున్నారు. ఈ మేరకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) రెండు లక్షల మంది డిఫాల్టర్లతో ఓ జాబితాను తన వెబ్సైట్లో పెట్టింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏఆర్ అంతూలేను కూడా జాబితాలో పేరు చేర్చింది. జనవరి 16, 2014 నాటికి బీఎంసీ రెండు లక్షల మంది డిఫాల్టర్ల నుంచి సుమారు రూ. వెయ్యి కోట్లు బకాయిలు వసూలు చేసింది. 24 వార్డుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా.. వాణిజ్య, పారిశ్రామిక, గృహ అవసరాల కేటగిరీల వారీగా ఈ జాబితాను రూపొందించినట్టు బీఎంసీ అధికారి ఒకరు వెల్లడించారు. డిఫాల్టర్లు చెల్లించాల్సిన బకాయి మొత్తం ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై థాకరే కుటుంబ సన్నిహితులను ప్రశ్నించగా.. బిల్లులను సరిచూసుకుంటామని చెప్పారు. ఎస్పీ నేత అబూ అజ్మీ స్పందిస్తూ.. ‘నేను ఎలాంటి బిల్లులు చెల్లించవలసిన అవసరం లేదు. బీఎంసీలో నిర్వహణ లోపాల వల్ల నాకు బిల్లు రాకపోయి ఉండొచ్చు. నా చేతికి బిల్లు వస్తే ఆ రోజే చెల్లించేస్తా’ అని చెప్పారు. తనను డిఫాల్టర్ల జాబితాలో చేర్చినందుకు బీఎంసీకి నోటీసులు ఇస్తానన్నారు. -
ఆన్లైన్లో నీటి బిల్లుల చెల్లింపులు
నోయిడా: ఆన్లైన్లో నీటి బిల్లుల చెల్లింపు ప్రక్రియ పనులను నోయిడా ప్రాధికార సంస్థ ప్రారంభిం చింది. ఈ సదుపాయం వచ్చే ఏడాది వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ప్రస్తుతం కేవలం రెండు బ్యాంక్‌ల ద్వారానే నీటి బిల్లులు చెల్లిస్తున్నారు. దీనివల్ల వారు బిల్లింగ్ కౌంటర్ల వద్ద పొడవాటి క్యూలో నిలబడి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్లో నీటి బిల్లులు చెల్లించే విధానానికి శ్రీకారం చుట్టామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విద్యుత్ బిల్లుల విధానం సఫలీకృతమైన తర్వాతనే ఈ ప్రక్రియను మొదలెట్టామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఆన్లైన్లో నీటి బిల్లుల చెల్లింపులో రాష్ట్రంలోని అగ్ర నగరాల్లో నోయిడా ఉందని వెల్లడైందని వివరించారు. అలాగే నీటి బిల్లుల చెల్లింపులో ఎదురవుతున్న సమస్యల గురించి నగరవాసులు ఇప్పటికే నోయిడా ప్రాధికార సంస్థకు అనేకసార్లు ఫిర్యాదు చేశారని చెప్పారు. ‘ఆన్లైన్ విధానం వినియోగదారుల చెల్లింపులకు సులభంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు బిల్లుల రికార్డులు అప్డేట్ అవుతాయి. ఒక్క క్లిక్‌తో పూర్తి సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంటుంద’ని ఆయన వెల్లడించారు. -
తాగునీటిపై ‘తోడేయండి’!
-
తాగునీటిపై ‘తోడేయండి’!
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా సేవా చార్జీల మోత మోగిపోనుంది. మంచినీటి, మురుగునీటి పారుదల సేవల చార్జీలు పెంచేయాల్సిందిగా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది మరి! ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుధీర్ కృష్ణన్ ఇటీవలే లేఖ రాశారు. దేశంలో మంచినీటి, మురుగునీటి పారుదల సేవలకు వసూలు చేసే చార్జీలపై పూర్తిస్థాయిలో అధ్యయనం అనంతరం ఆయన ఈ లేఖ రాశారు. చేస్తున్న వ్యయాన్ని రాబట్టుకోలేకపోతే పథకం మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని అందులో హెచ్చరించారు. స్థానిక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. పథకాల వ్యయాన్ని పూర్తిగా రాబట్టుకోలేకపోయినా కనీసం అమలు, నిర్వహణ (ఓ అండ్ ఎం) వ్యయాలనైనా పూర్తిగా రాబట్టాల్సిందేనని స్పష్టం చేశారు. అందులో రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలివీ... ప్రతి కనెక్షన్‌కూ విధిగా మీటర్లు ఏర్పాటు చేయాలి దేశంలోని మొత్తం 7,935 పట్టణాలు/నగరాల్లో కేవలం 5 పట్టణాలు మాత్రమే తాగునీటి సరఫరా వ్యయాన్ని చార్జీల రూపంలో పూర్తిగా వసూలు చేస్తున్నాయి. 16 నగరాల్లో 65 శాతం వసూలవుతోంది. మంచినీటి చార్జీల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉండేందుకు వీలుగా పురపాలక సేవల నియంత్రణ సంస్థ (మున్సిపల్ సర్వీస్ రెగ్యులేటర్ అథారిటీ)ని ఏర్పాటు చేసుకోండి మీటర్లు లేని చోట ఇంటి స్థల విస్తీర్ణం ఆధారంగా చార్జీలు వసూలు చేయండి. 100 చదరపు గజాల్లోపు విస్తీర్ణం, 900 చదరపు అడుగుల ఇల్లుంటే నెలకు రూ.60, 100-200 చ.గ.లోపు విస్తీర్ణం, 1,000 చ.అ. లోపు బిల్టప్ ఏరియా ఉంటే రూ.150, 200 చ.గ. కంటే ఎక్కువ విస్తీర్ణం, 1,500 చ.అ. లోపు బిల్టప్ ఏరియా ఉంటే రూ.250, 300 చ.గ. విస్తీర్ణంలో 1,500 చ.అ.. కంటే ఎక్కువ బిల్టప్ ఏరియా ఉంటే రూ.400 చొప్పున ప్రతి కనెక్షన్‌కూవసూలు చేయాలని స్పష్టం చేశారు. వాణిజ్య, పరిశ్రమలకైతే ఈ చార్జీలు మరీ అధికంగా ఉండాలని పేర్కొన్నారు. నీటి వాడకం ఒక శ్లాబు నుంచి మరో శ్లాబుకు పెరిగితే మొత్తం వినియోగంపైనా అధిక చార్జీలను వసూలు చేయాలని తెలిపారు. ప్లాటు విస్తీర్ణం లాగే మంచినీటి కనెక్షన్ తీసుకున్న పైపు పరిమాణం ఆధారంగా కూడా చార్జీలు వసూలు చేయవచ్చన్నారు. 15 ఎంఎం కనెక్షన్‌కు నెలకు రూ. 50, 20 ఎంఎం అయితే రూ. 75 వసూలు చేసుకోవచ్చు. మురుగునీటి పారుదల సేవల చార్జీలను మంచినీటి చార్జీల్లో కనీసం 50 శాతం చొప్పున వసూలు చేయండి. వీటిని ఆస్తి పన్నులో భాగంగానే వసూలు చేస్తున్నారు. అలాకాకుండా విడిగా వసూలు చేయాలి నీటి చార్జీలు పెంచడం వల్ల పెరుగుతున్న మంచినీటి వినియోగాన్ని తగ్గించవచ్చు