
నీటి బిల్లు బకాయిదారుల్లో సచిన్, ఠాక్రే
ముంబై: ముంబైలో నీటి బిల్లులు చెల్లించని వారి జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ నేత అబూ అజ్మీ తదితర ప్రముఖులున్నారు. ఈ మేరకు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) రెండు లక్షల మంది డిఫాల్టర్లతో ఓ జాబితాను తన వెబ్‌సైట్‌లో పెట్టింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏఆర్ అంతూలేను కూడా జాబితాలో పేరు చేర్చింది. జనవరి 16, 2014 నాటికి బీఎంసీ రెండు లక్షల మంది డిఫాల్టర్ల నుంచి సుమారు రూ. వెయ్యి కోట్లు బకాయిలు వసూలు చేసింది.
24 వార్డుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా.. వాణిజ్య, పారిశ్రామిక, గృహ అవసరాల కేటగిరీల వారీగా ఈ జాబితాను రూపొందించినట్టు బీఎంసీ అధికారి ఒకరు వెల్లడించారు. డిఫాల్టర్లు చెల్లించాల్సిన బకాయి మొత్తం ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై థాకరే కుటుంబ సన్నిహితులను ప్రశ్నించగా.. బిల్లులను సరిచూసుకుంటామని చెప్పారు. ఎస్‌పీ నేత అబూ అజ్మీ స్పందిస్తూ.. ‘నేను ఎలాంటి బిల్లులు చెల్లించవలసిన అవసరం లేదు. బీఎంసీలో నిర్వహణ లోపాల వల్ల నాకు బిల్లు రాకపోయి ఉండొచ్చు. నా చేతికి బిల్లు వస్తే ఆ రోజే చెల్లించేస్తా’ అని చెప్పారు. తనను డిఫాల్టర్ల జాబితాలో చేర్చినందుకు బీఎంసీకి నోటీసులు ఇస్తానన్నారు.