సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలో అడ్డగోలుగా నీటి బిల్లుల జారీపై జలమండలి ఆలస్యంగానైనా దృష్టి సారించింది. నీటి మీటర్లు తనిఖీ చేయకుండానే అవి పని చేయడం లేదంటూ అదనంగా బిల్లుల బాదుడుతో పాటు నూతనంగా నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు అయిన ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకుంటే చాలు.. వారికి సైతం బిల్లుల జారీ, డ్రైనేజీ వ్యవస్థ లేని ప్రాంతాల్లో మురుగు పన్ను పేరుతో నీటి బిల్లులో అదనంగా బాదుతున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు.
వేలాదిగా ఫిర్యాదులు..
ఈ నిర్వాకంపై ఇటీవల జలమండలికి వేలాదిగా ఫిర్యాదులు అందాయి. కాల్‌సెంటర్‌కు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నీటిబిల్లుల వసూలు కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఏజెన్సీల తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అధిక నీటిబిల్లుల మోత, తప్పుడు బిల్లుల జారీపై నివేదిక అందించాలని జనరల్ మేనేజర్లను కోరినట్లు సమాచారం.
ఫిర్యాదు అందిన 24గంటల్లోనే పరిష్కరించాలి..
అధిక నీటిబిల్లుల జారీతో సతమతమవుతున్న వినియోగదారుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలోని మేనేజర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించాలని సిటిజన్లు కోరుతున్నారు. వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహించుకునే వారికి ఇబ్బందులు లేకుండా ఉదయం 7 నుంచి 10గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8గంటల వరకు ఈ శిబిరాలు నిర్వహించి అక్కడికక్కడే ఈ సమస్యలను పరిష్కరించాలంటున్నారు. జలమండలి కాల్‌సెంటర్‌కు అందిన ప్రతి ఫిర్యాదును 24 గంటల్లోగా పరిష్కరించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
కమీషన్ ముట్టజెప్పుతూ.. అదనంగా బాదుతూ..
నగరంలో సుమారు 12 లక్షల వరకు నల్లా నీటి కనెక్షన్లు ఉన్నాయి. నీటి బిల్లుల వసూలు ప్రక్రియను పలు ఔట్‌సోర్సింగ్, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని వినియోగదారులు పేర్కొంటున్నారు. వసూలు చేసిన మొత్తంపై సంబంధిత అధికారులకు కమీషన్ ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. దీంతో అదనంగా బిల్లులు వసూలు చేయాలన్న లక్ష్యంతో నీటి మీటర్లను తనిఖీ చేయకుండానే అడ్డగోలుగా బిల్లులు జారీ చేస్తున్నారు. వినియోగదారుల ఇళ్లకు వెళ్లకుండానే డోర్ లాక్ పని చేస్తున్నా.. నీటి మీటర్ ఉన్నప్పటికీ అది పని చేయడంలేదనే సాకుతో బిల్లులు ఇస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment