జిల్లా ఆస్పత్రి వద్ద వలస జంట
వనపర్తి క్రైం: పొట్ట కూటి కోసం వలస వచ్చిన జంటతో ఓ యజమాని నాలుగు నెలలు పని చేయించుకొని డబ్బులివ్వకుండా ముఖం చాటేశాడు. లాక్‌డౌన్ సమయంలో పని లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక.. తినడానికి తిండి లేక నానా అవస్థలు పడ్డారు. తీవ్ర అనారోగ్యానికి గురైన భార్యను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు భర్త. పరిస్థితి విషమంగా ఉంది.. పట్టణానికి తీసుకెళ్లండని వైద్యులు సూచించటంతో ఏం చేయాలో పాలుపోక ఆస్పత్రి బయట చెట్టుకింద కూర్చొని భార్యను పట్టుకొని భర్త కన్నీరుమున్నీరుగా విలపించిన సంఘటన జిల్లాకేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్ జిల్లా పలమనేరు మండలం గంటావురు గ్రామానికి చెందిన శ్యామల, నరేశ్ దంపతులు జిల్లాలోని పెబ్బేరు మండలం చెలిమిళ్ల సమీపంలో బాతులను మేపడానికి జంటకు నెలకు రూ.10 వేల వేతనానికి వచ్చారు.
యజమాని గణేశ్ మాయమాటలు నమ్మి అడ్వాన్స్ కూడా తీసుకోలేదు. నాలుగు నెలలుగా పని చేయించుకొని వారికి డబ్బులివ్వకుండా ముఖం చాటేశాడు. లాక్‌డౌన్ సమయంలో శ్యామల అనారోగ్యం బారిన పడటంతో 20 రోజుల కిత్రం జిల్లా ఆస్పత్రిలో చేర్పించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. చేతిలో డబ్బులు, తినడానికి తిండిలేక ఏం చేయాలో పాలుపోక గుత్తేదారుకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఊరుగాని ఊరిలో ఏం చేయలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, కళ్ల ముందే చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్న భార్యను చూస్తూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ‘నా భార్యను కాపాడండి..’ అంటూ రోదించడం కనిపించింది.
ఆదుకున్న దాతలు..
వలస జంట సొంత గ్రామానికి వెళ్లడానికి పట్టణ ఎస్‌ఐ వెంకటేశ్‌గౌడ్ రూ.5 వేలు, రూరల్ ఎస్‌ఐ రూ. 1,000, కౌన్సిలర్ బ్రహ్మంచారి రూ.2,500, బీజేపీ నాయకుడు నారాయణ రూ.రెండు వేలు, కౌన్సిలర్ పరశురాం రూ.రెండు వేలు, జనతాల్యాబ్ రాహూల్ రూ.1,000, అంబులెన్స్ రఘు రూ.రెండు వేలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment