
సాక్షి, వనపర్తి: పండగ పూట జిల్లాలోని గోపాల్‌పేట మండలం బుద్దారంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి పాత మట్టి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వనపర్తి జిల్లా ఇంచార్జ్ , నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సాయి శేఖర్, వనపర్తి ఏసీపీ షాకీర్ హుస్సేన్, సీఐ సూర్య నాయక్, ఎస్సై రామన్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇంటి యజమాని ఆయిన్ కోమటి చెవ్వ నరసింహ సంవత్సరం క్రితం మరణించడంతో తద్దినానికి శనివారం నలుగురు కుమారులు, నలుగురు కోడళ్లు, మనుమల్లు,మనుమరాళ్లు తమ ఇంటికి వచ్చారు.
శనివారం రాత్రి కుంటుంబ సభ్యులు మొత్తం పది మంది ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఇంటి మిద్దె కూలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు ఒకే కుంటుంబానికి చెందిన చెవ్వా మనెమ్మ (68), చెవ్వా సుప్రజ(38), వైష్ణవి(21), రింకి(18) ,చెవ్వా ఉమాదేవి(38)గా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment