
రఘు (ఫైల్), ఏరియా ఆస్పత్రికి చేరుకున్న యువకులు, సర్దిచెబుతున్న సీఐ సూర్యనాయక్
సాక్షి, వనపర్తి క్రైం: ఇద్దరి మధ్య కొనసాగిన ఆధిపత్య పోరు చివరికి ఒకరి హత్యకు దారితీసింది. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి వనపర్తిలో చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వనపర్తిలోని పీర్లగుట్లకు చెందిన బల్‌రాం కుమారుడు రాఘవేంద్ర అలియాస్ రఘు (28), సాయినగర్‌కాలనీకి చెందిన అరుణ్‌యాదవ్ గతంలో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. గత ఆరు నెలల నుంచి ఎవరికి వారుగా విడిపోయి.. ఆధిపత్య పోరును కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్‌లో వేడుకలకు వేర్వేరుగా హాజరయ్యారు. అక్కడ వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో అరుణ్‌యాదవ్‌తోపాటు ఉన్న మరికొందరు రఘుపై దాడిచేశారు. అక్కడి నుంచి బైక్‌పై తీసుకువచ్చి రామాలయం వద్ద పడేశారు. అంతటితో ఆగక పెద్దబండ రాయితో అతని తలపై మోదారు. వెంటనే చుట్టు పక్కల వారు రఘును ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. అపంతనం అరుణ్‌యాదవ్ తనంత తానుగా పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. హత్య సంఘటనలో నిందితుడితోపాటు.. అతని సోదరుడు, మరో నలుగురు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడి ఇంట్లో వస్తువుల ధ్వంసం
రఘును హత్య చేశాడనే కోపంతో వనపర్తి పట్ట ణం సాయినగర్‌కాలనీలో ఉన్న నిందితుడు అరుణ్‌యాదవ్ ఇంట్లో ఉన్న వస్తువులను మంగళవా రం రాత్రి పలువురు ధ్వంసం చేశారు. ఓ ఇన్నోవా, కారు అద్దాలు పగులగొట్టారు. అనంతరం రఘు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆస్పత్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో డీఎస్పీ సృజన, సీఐ సూర్యానాయక్ అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. బుధవారం రఘు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనలో అనుమానం ఉన్న పలువురిని పోలీసులు విచారిస్తున్నారు. రఘు తల్లి మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
లీడర్లుగా ఎదగాలనే ఆశతో..
లీడర్లుగా ఎదగాలనే ఆశతో వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఒకరి మధ్య ఒకరికి మనస్పర్థలు పెరిగాయి. అది కాస్త హత్యకు దారితీశాయి. ఈ హత్య ప్రమేయంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. 2018 డిసెంబర్ 31న అర్ధరాత్రి పట్టణంలోని సంతబజార్ దగ్గర ఒక యువకుడిని కొందరు హత్య చేశారు. అది మరవక ముందే మరో హత్య సంఘటన జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.