నిందితులు శ్రీశైలం, శివ
రాజేంద్రనగర్/మైలార్‌దేవ్‌పల్లి/ఖిల్లా ఘనపురం: పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలు సాయిప్రియ(20)ను చంపి, కేఎల్‌ఐ కాల్వలో పూడ్చిపెట్టిన కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సాయిప్రియను ప్రియుడు శ్రీశైలం అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు తేలింది. మాట్లాడుకుందామని తన స్వగ్రామం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటకు పిలిపించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
నిందితుడితో పాటు సహకరించిన వ్యక్తిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా మానాజీపేట ప్రాంతానికి చెందిన బత్తిని అంజన్న 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం శంషాబాద్‌కు వలసవచ్చారు. డెయిరీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన చిన్న కుమారుడు బత్తిని శ్రీశైలం(23) ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ కావడంతో మానాజీపేటలో డెయిరీ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
శ్రీశైలానికి మిత్రుల ద్వారా హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు చెందిన కావటి వెంకటేశ్ కూతురు సాయిప్రియ(20)తో పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని శ్రీశైలం ఇరు కుటుంబాలకు చెప్పాడు. దీనికి అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు. అమ్మాయి ఉన్నత చదువులు చదవాల్సి ఉందని ఇప్పుడే పెళ్లి చేసే ఆలోచన లేదని తెలిపారు.
చంపి.. కాల్వలో పూడ్చి..
ఇదిలా ఉండగా, కరోనా కాలంలో ప్రేమికుల మధ్య సంబంధాలు తెగిపోయాయి. మళ్లీ మూడు నెలల క్రితం సాయిప్రియ, శ్రీశైలంల మధ్య సెల్‌ఫోన్ సంభాషణలు, చాటింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 5న మాట్లాడుకుందామని చెప్పి సాయిప్రియను శ్రీశైలం మానాజీపేటకు రమ్మన్నాడు. సాయిప్రియ కళాశాలకు వెళ్తున్నానని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వరకు రాగా.. అక్కడి నుంచి శ్రీశైలం బైక్‌పై మధ్యాహ్నం మానాజీపేటలోని తన షెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అనంతరం సమీపంలోని మబ్బు గుట్ట దగ్గరికి తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. ఆపై చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి తన మేనత్త కుమారుడు శివతో కలిసి గుట్ట దగ్గరకు చేరుకుని కేఎల్‌ఐ కాల్వ దగ్గర గుంత తవ్వి అందులో పూడ్చిపెట్టారు. సాయిప్రియ బ్యాగ్‌ను షెడ్‌లోనే భద్రపరిచారు. అనంతరం ఎవరికి ఇంటికి వారు వెళ్లారు.
తండ్రి ఫిర్యాదుతో..
సాయిప్రియ సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్‌లో ఆమె తండ్రి వెంకటేష్ ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులతో వివరాలు సేకరించగా.. శ్రీశైలంపై అనుమానం ఉన్నట్లు చెప్పారు. దీంతో పోలీసులు బుధవారం ఖిల్లాఘనపురం పోలీసుల సహకారంతో శ్రీశైలంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తానే చంపానని అంగీకరించాడు.
గురువారం సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక తహసీల్దార్ భానుప్రకాష్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం చేశారు. నిందితుడు శ్రీశైలం, అతడికి సహకరించిన శివను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కాగా, నిందితులిద్దరిని కస్టడీ కోరుతూ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి..
అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురిని దారుణంగా హత్య చేసిన నిందితుడితో పాటు సహకరించిన వారందరిని ఉరి తీయాలని సాయిప్రియ కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. విదేశాల్లో ఉన్నత చదువు చదవాలని సాయిప్రియ లక్ష్యం అని అందుకు అనుగుణంగా తాము ప్రయత్నిస్తున్న దశలో ప్రేమ పేరుతో శ్రీశైలం మోసం చేసి హత్య చేశాడని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment