sai priya
-
అమ్మలోని "అ" నాన్న లోని "నా" కలిపితే మీరు జగనన్న విద్యార్థిని ఎమోషనల్ స్పీచ్
-
మాట్లాడుకుందామని పిలిచి.. అత్యాచారం.. ఆపై హత్య
రాజేంద్రనగర్/మైలార్‌దేవ్‌పల్లి/ఖిల్లా ఘనపురం: పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలు సాయిప్రియ(20)ను చంపి, కేఎల్ఐ కాల్వలో పూడ్చిపెట్టిన కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సాయిప్రియను ప్రియుడు శ్రీశైలం అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు తేలింది. మాట్లాడుకుందామని తన స్వగ్రామం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటకు పిలిపించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడితో పాటు సహకరించిన వ్యక్తిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా మానాజీపేట ప్రాంతానికి చెందిన బత్తిని అంజన్న 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం శంషాబాద్‌కు వలసవచ్చారు. డెయిరీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన చిన్న కుమారుడు బత్తిని శ్రీశైలం(23) ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ కావడంతో మానాజీపేటలో డెయిరీ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శ్రీశైలానికి మిత్రుల ద్వారా హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు చెందిన కావటి వెంకటేశ్ కూతురు సాయిప్రియ(20)తో పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని శ్రీశైలం ఇరు కుటుంబాలకు చెప్పాడు. దీనికి అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు. అమ్మాయి ఉన్నత చదువులు చదవాల్సి ఉందని ఇప్పుడే పెళ్లి చేసే ఆలోచన లేదని తెలిపారు. చంపి.. కాల్వలో పూడ్చి.. ఇదిలా ఉండగా, కరోనా కాలంలో ప్రేమికుల మధ్య సంబంధాలు తెగిపోయాయి. మళ్లీ మూడు నెలల క్రితం సాయిప్రియ, శ్రీశైలంల మధ్య సెల్‌ఫోన్ సంభాషణలు, చాటింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 5న మాట్లాడుకుందామని చెప్పి సాయిప్రియను శ్రీశైలం మానాజీపేటకు రమ్మన్నాడు. సాయిప్రియ కళాశాలకు వెళ్తున్నానని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వరకు రాగా.. అక్కడి నుంచి శ్రీశైలం బైక్‌పై మధ్యాహ్నం మానాజీపేటలోని తన షెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అనంతరం సమీపంలోని మబ్బు గుట్ట దగ్గరికి తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. ఆపై చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి తన మేనత్త కుమారుడు శివతో కలిసి గుట్ట దగ్గరకు చేరుకుని కేఎల్ఐ కాల్వ దగ్గర గుంత తవ్వి అందులో పూడ్చిపెట్టారు. సాయిప్రియ బ్యాగ్‌ను షెడ్లోనే భద్రపరిచారు. అనంతరం ఎవరికి ఇంటికి వారు వెళ్లారు. తండ్రి ఫిర్యాదుతో.. సాయిప్రియ సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్లో ఆమె తండ్రి వెంకటేష్ ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులతో వివరాలు సేకరించగా.. శ్రీశైలంపై అనుమానం ఉన్నట్లు చెప్పారు. దీంతో పోలీసులు బుధవారం ఖిల్లాఘనపురం పోలీసుల సహకారంతో శ్రీశైలంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తానే చంపానని అంగీకరించాడు. గురువారం సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక తహసీల్దార్ భానుప్రకాష్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం చేశారు. నిందితుడు శ్రీశైలం, అతడికి సహకరించిన శివను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కాగా, నిందితులిద్దరిని కస్టడీ కోరుతూ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి.. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురిని దారుణంగా హత్య చేసిన నిందితుడితో పాటు సహకరించిన వారందరిని ఉరి తీయాలని సాయిప్రియ కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. విదేశాల్లో ఉన్నత చదువు చదవాలని సాయిప్రియ లక్ష్యం అని అందుకు అనుగుణంగా తాము ప్రయత్నిస్తున్న దశలో ప్రేమ పేరుతో శ్రీశైలం మోసం చేసి హత్య చేశాడని ఆరోపించారు. -
విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: గత నెల 25న భర్తను ఏమార్చి ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియ ఉదంతంలో ఆమె తండ్రి రాపిరెడ్డి అప్పలరాజుపై 3వ పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. గత జులై 25న పెళ్లి రోజు నేపథ్యంలో భర్త శ్రీనివాస్‌తో కలిసి సాయిప్రియ ఆర్కేబీచ్కు విహారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు భర్త ఏమరపాటుగా వున్న సమయంలో ముందస్తు ప్రణాళికతో సాయిప్రియ తన ప్రియుడు రవితేజతో పరారైంది. అయితే ఈ ఘటనలో సాయిప్రియ బీచ్‌లో గల్లంతైనట్లు ఆమె తండ్రి రాపిరెడ్డి అప్పలరాజు 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన జిల్లా యత్రాంగం, పోలీసులు పెద్ద ఎత్తున బీచ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం భారీగా ప్రభుత్వ వనరులను వినియోగించిన విషయం తెలిసిందే. అయితే సాయిప్రియకు గతంలో రవితేజ అనే యువకుడితో ప్రేమాయనం ఉన్నట్లు ఆమె తండ్రికి ముందే తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా పోలీసులను, జిల్లా యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించడంపై అతనిపై కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రామారావు వెల్లడించారు. చదవండి: (ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్) -
ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: గత నెల 25న భర్తను ఏమార్చి ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియపై 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. గత జులై 25న పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాస్‌తో కలిసి ఆమె ఆర్కేబీచ్కు విహారానికి వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు భర్త ఏమరపాటుగా వున్న సమయంలో ప్రియుడు రవితో కలిసి సాయిప్రియ పరారైన విషయం తెలిసిందే. అయితే సాయిప్రియ కోసం జిల్లా యత్రాంగం పెద్ద ఎత్తున బీచ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం సాయిప్రియ ప్రియుడితో కలిసి వెళ్లిపోయినట్లు బయటపడటంతో అంతా అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో సాయిప్రియ భర్త శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. తనని ఉద్దేశపూర్వకంగా మోసం చేయడంతోపాటు జిల్లా యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో సాయిప్రియపై కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ రామారావు వెల్లడించారు. చదవండి: (నేను రవితోనే ఉంటా..సాయిప్రియ) -
నేను రవితోనే ఉంటా..సాయిప్రియ
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ, రవి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ప్రత్యక్షమయ్యారు. అక్కడికి వారిని త్రీ టౌన్ పోలీసులు తీసుకొచ్చి విచారించారు. వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారు. సాయిసుప్రియ, రవి మాట్లాడుతూ తామిద్దరం కలిసి బతుకుతామని, ఇక ఇంటికి వెళ్లమని, తల్లిదండ్రుల వద్ద ఉండమని స్పష్టం చేశారు. తొలి భర్త ఇచ్చిన గాజులను అమ్మలేదని, తమ వద్దే ఉన్నాయని వారు చూపించారు. ముందుగా కుమార్తె సాయిప్రియతో తల్లిదండ్రులు మాట్లాడారు. తమ పరువు తీశావంటూ రోదించారు. తాను రవితో ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. తమ వల్ల ప్రభుత్వానికి కోటి రూపాయలు ఖర్చయినందుకు క్షమించమని రవి కోరాడు. మీడియాతో మాట్లాడుతుండగా సాయిప్రియ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకు సపర్యలు చేయగా తేరుకుంది. కొద్దిసేపటి తర్వాత వారిని ప్రైవేటు కారులో త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. -
విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్
సాక్షి, బెంగళూరు: వైజాగ్ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన వివాహిత సాయిప్రియ కేసులో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఇప్పటిjకే భర్త శ్రీనివాస్‌కు మస్కా కొట్టి లవర్‌తో పరారైన సాయిప్రియ తాజాగా తను క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులకు వెల్లడించింది. అంతేగాక ప్రియుడు రవిని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. తాళిబొట్టుతో ఉన్న ఫోటోను తల్లిదండ్రులకు వాట్సప్‌లో పంపించింది. అలాగే ఓ వాయిస్ మెసెజ్ పంపింది. ‘నాన్న.. నేను సాయిని మాట్లాడుతున్నాను. నేనేం చచ్చిపోలేదు. బతికే ఉన్నాను. నేను రవితోనే ఉన్నాను. నన్నేం రవి బలవంతంగా తీసుకెళ్లలేదు. మా ఇద్దరికీ పెళ్లి కూడా అయిపోయిది. దయచేసి నాకోసం వెతకొద్దు నాన్న నీకు పుణ్యం ఉంటది. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు. చావు అయినా బతుకైనా రవితోనే ఉంటాను. ప్లీజ్ మమ్మల్ని వెతకద్దు ఒకవేళ నా కోసం వెతికితే చనిపోతా. రవి పేరెంట్స్‌ను ఏమీ చేయొద్దు’ అంటూ వాయిస్ మెసేజ్ చేసింది. ఇక సముద్రంలో గల్లంతైందని భావించి రెండు రోజులుగా భార్య కోసం ఎదురు చూస్తున్న శ్రీనివాస్‌కు, ఆయన తల్లిదండ్రులకు సాయిప్రియ పెద్ద షాక్ ఇచ్చినట్లు అయ్యింది. సంబంధిత వార్త: ఆర్కే బీచ్‌లో వివాహిత అదృశ్యం కేసులో ఊహించని ట్విస్టు కాగా సాయి ప్రియ, శ్రీనివాస్ భార్యభర్తలు. విశాఖపట్నంలోని సంజీవ నగర్లో ఉంటున్నారు. అయితే సాయిప్రియ కొంతకాలంగా శాంతినగర్‌కు చెందిన రవితో ప్రేమాయణం సాగిస్తోంది. సోమవారం పెళ్లి రోజు కావడంతో భర్త శ్రీనివాస్‌తో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లింది. అక్కడ భర్త కళ్లు గప్పి సాయిప్రియ ప్రియుడితో కలిసి బీచ్ నుంచి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో సముంద్రంలో కోట్టుకుపోయి ఉంటుందని కంగారు పడి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వివాహిత కోసం రెండు కోస్ట్ గార్డ్ షిప్‌లతో పాటు ఓ హెలికాప్టర్‌తో సముద్రం మొత్తం గాలించారు. అయినా ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం సాయిప్రియ బెంగళూరులో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. -
విశాఖలో అదృశ్యమైన సాయిప్రియ కేసులో కొత్త ట్విస్ట్
-
ఆర్కే బీచ్‌లో వివాహిత అదృశ్యం.. భర్త కళ్లుగప్పి ప్రియుడితో..
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ ఆర్కే బీచ్‌లో రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అధికారులు, పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన వివాహిత అదృశ్యం వెనుక పక్కా ప్లాన్ బయటపడింది. సోమవారం ఆర్కే బీచ్‌లో కనిపించకుండా పోయిన వివాహిత సాయిప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది. ఆమె ఆఖరి ఫోన్‌కాల్‌ను పోలీసులు కావలిలో ట్రేస్ చేశారు. ప్రియుడితో కలిసి సాయిప్రియ రైల్లో నెల్లూరు జిల్లాకు పరారైనట్లు తేలింది. సాయిప్రియ అదృశ్యమైన సమయంలో బీచ్ రోడ్లోనే ఆమె ప్రియుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే భర్తను బురిడి కొట్టించి లవర్ సాయితో పరారైనట్లు బయటపడింది. చదవండి: బీచ్‌లో గల్లంతయ్యిందా..? లేక ఇంకేమైనా జరిగిందా..? అసలేం జరిగిందంటే చిరిగిడి సాయి ప్రియ, శ్రీనివాస్ భార్యభర్తలు. కానీ సాయి ప్రియ కొంతకాలంగా రవితో ప్రేమాయణం సాగిస్తోంది. సోమవారం పెళ్లి రోజు కావడంతో భర్త శ్రీనివాస్‌తో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లింది. శ్రీనివాస్ ఫోన్లో మెసెజ్‌లు చూస్తుండగా.. అలలు దగ్గరకు వెళ్తానని చెప్పింది. దీన్నే అవకాశంగా భావించిన సాయిప్రియ రాత్రి 7.30 గంటల సమయంలో ప్రియుడితో కలిసి బీచ్ నుంచి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో సముద్రంలో కొట్టుకుపోయి ఉంటుందని కంగారు పడిన శ్రీనివాస్ వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పక్కా స్కెచ్ ప్రమాదవశాత్తు సాయిప్రియ సముద్రంలో పడిపోయి ఉంటుందని భావించిన అధికారులు.. వివాహిత ఆచూకీ కోసం సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ముందుగా గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో నావీ సాయం కోరారు. దీంతో రెడు కోస్ట్ గార్డ్ షిప్‌లతో పాటు ఓ హెలికాప్టర్‌తో సముద్రం మొత్తం గాలించారు. అయినా జాడ దొరకలేదు. అయితే చివరకు అమ్మాయి సముద్రంలో గల్లంతు కాలేదని, ప్రియుడితో కలిసి నెల్లూరుకు చెక్కేసినట్లు తేలింది. ఎంతోమందిని టెన్షన్ పెట్టిన సాయిప్రియ మిస్సింగ్ చివరకు డ్రామాగా తేలడంతో అందరూ విస్తుపోయారు. -
బీచ్‌లో గల్లంతయ్యిందా..? లేక ఇంకేమైనా జరిగిందా..?
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): రెండు రోజులు గడుస్తున్నా వివాహిత మిస్సింగ్ మిస్టరీ వీడలేదు. పెళ్లి రోజు సందర్భంగా సాగరతీరంలో సరదాగా గడిపిన ఆ జంట... ఇంటికి వెళ్లిపోయేందుకు సిద్ధమైన సమయంలో బీచ్‌లో అసలేం జరిగిందో అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం భర్తతోపాటు కుటుంబ సభ్యులు, పోలీసులు, నగర వాసుల మదిలో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. వెనక్కి తిరిగి చూస్తే కనిపించలేదని ఫిర్యాదు సాయిప్రియ మిస్సింగ్‌పై ఆమె భర్త శ్రీనివాస్ సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం వారి పెళ్లి రోజు కావడంతో ఆమెతో కలిసి ఆర్కేబీచ్కు విహారానికి వచ్చినట్లు తెలిపాడు. తాను హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా భార్య విశాఖ ఎన్ఏడీలోని వాళ్ల అమ్మవారి ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నట్లు శ్రీనివాస్ తెలిపాడు. అయితే ఆదివారం పెళ్లిరోజు కావడంతో రెండు రోజుల క్రితమే విశాఖ వచ్చినట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం సాయిప్రియతో కలిసి ఆర్కేబీచ్కు వచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నామన్నారు. అయితే రాత్రి 7.30 సమయంలో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమవగా... తన ఫోన్‌కు మెసేజ్ రావడంతో చూసుకుంటూ రోడ్డు వైపు వచ్చినట్లు శ్రీనివాస్ ఫిర్యాదులో వివరించాడు. ఆ సమయంలో కాళ్లు కడుక్కోవడానికి సముద్రంవైపు వెళ్లిన తన భార్య సాయిప్రియ వెనుక వస్తుందని భావించినట్లు తెలిపాడు. అయితే కొంతసేపటి తర్వాత వెనక్కి తిరిగి చూడగా ఆమె కనిపించలేదన్నాడు. అనంతరం తీరంలో వెతగ్గా ఎక్కడా కనిపించలేదని వెల్లడించాడు. అయితే సోమవారం కూడా శ్రీనివాస్‌ని పలు విధాలుగా ప్రశ్నించినప్పటికీ తాను ఫిర్యాదులో మాదిరిగానే సమాధానం ఇచ్చినట్లు త్రీ టౌన్ సీఐ రామారావు వెల్లడించారు. అయితే సాయిప్రియ, శ్రీనివాస్ దంపతుల మధ్య ఎలాంటి గొడవలైనా ఉన్నాయా అనే అంశంపై సాయిప్రియ తండ్రి అప్పలరాజుతోపాటు కుటుంబ సభ్యులను ప్రశ్నించగా గొడవలు లేవని, వారు అన్యోన్యంగానే ఉంటున్నారని వెల్లడించినట్లు సీఐ తెలిపారు. అయితే సాయిప్రియ బీచ్‌లో గల్లంతై ఉంటే 24 గంటల నుంచి 36 గంటల్లోపు ఒడ్డుకు కొట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బీచ్ వెంబడి పోలీసు నిఘా ఉంచినట్లు తెలిపారు. తీరంలో విస్తృతంగా గాలింపు సాయిప్రియ బీచ్‌లో గల్లంతై ఉంటుందా..? అనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆర్కే బీచ్ తీరం వెంబడి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో కోస్ట్‌గార్డ్స్, నేవీ అధికారుల సహాయం కోరడంతో 11 గంటల ప్రాంతంలో రెండు కోస్ట్‌గార్డ్ గస్తీ నౌకలతోపాటు హెలికాప్టర్ ద్వారా ముమ్మరంగా గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతోపాటు మంగళవారం మధ్యాహ్నం నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ శ్రీధర్ తదితరులు ఆర్కేబీచ్కు వచ్చారు. సాయిప్రియ గల్లంతైనట్లుగా భావిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. దర్యాప్తుపై పోలీసుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ హరివెంకటకుమారి కలెక్టర్ మల్లికార్జునతో ఫోన్లో మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన సహకారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. దీంతోపాటు తీరప్రాంతం వెంబడి గస్తీ పెంచాలని, హెచ్చరిక బోర్డులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని సూచించారు. కమ్యునిటీ గార్డుల ఏర్పాటుపైనా చర్చించినట్లు మేయర్ తెలిపారు. కార్యక్రమంలో పోలీసు, ఇతర ఉన్నతాధికారులతోపాటు సాయిప్రియ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంజీవయ్యనగర్‌లో విషాదం గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ఆర్కే బీచ్‌లో సాయిప్రియ గల్లంతైన ఘటనతో జీవీఎంసీ 52వ వార్డు సంజీవయ్యనగర్‌లో విషాదం నెలకొంది. సాయిప్రియ కుటుంబం శోకసంద్రంలో మునిగి పోయింది. సోమవారం సాయంత్రం గల్లంతైనప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. విజయనగరం జిల్లా కందివలసకు చెందిన శ్రీనివాసరావుకు సాయిప్రియకు వివాహమై రెండేళ్లయింది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త శ్రీనివాసరావు పెళ్లి రోజు కానుకగా బంగారు చేతి గాజులు చేయించి బహుమతిగా తీసుకొచ్చాడు. అల్లుడూ, కుమార్తెది అన్యోన్యమైన దాంపత్యమని గుర్తు చేసుకుంటూ తల్లి విలపించిన తీరు చూపరులకు కన్నీరుతెప్పిస్తోంది. త్వరలో భార్యను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోవాలనుకున్నంతలో ఘోరం జరిగిపోయిందని వాపోతున్నారు. -
పెళ్లిరోజు నాడే విషాదం.. ఆర్కే బీచ్‌లో వివాహిత గల్లంతు..
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): భర్తతోపాటు విహారానికి వచ్చిన ఓ వివాహిత ఆర్కేబీచ్లో గల్లంతైంది. ఈ ఘటనపై త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్ఏడీ ప్రాంతానికి చెందిన ఎన్.సాయిప్రియ భర్త శ్రీనివాస్‌తో కలిసి సోమవారం రాత్రి ఆర్కేబీచ్కు విహారానికి వచ్చింది. తీరంలో కొంతసేపు గడిపిన అనంతరం 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కాళ్లు కడుక్కోవడానికి సాయిప్రియ తీరానికి వెళ్లినట్లు భర్త శ్రీనివాస్ పోలీసులకు తెలిపారు. ఆ సమయంలో తాను సరిగ్గా వెనుకవైపు గమనించలేదని, కొంతసేపటికి తిరిగి చూస్తే తాను కనిపించలేదని అతను వెల్లడించినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో ఆమె బీచ్‌లో గల్లంతై వుంటుందని భావిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిన్న గల్లంతు అయిన వివాహిత సాయి ప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాసుతో కలిసి సాయి ప్రియ నిన్న ఆర్కే బీచ్ కు వెళ్లారు. అయితే విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని త్రీటౌన్ సీఐ రామారావు తెలిపారు. -
నేను అందరికీ కోపం తెప్పిస్తున్నా..
నాగోలు: కుటుంబ సభ్యులు మందలించారని ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నాగోలు జైపురికాలనీకి చెందిన భూపాల్‌రెడ్డి కుమార్తె సాయిప్రియ (18) గాయత్రి కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. పరీక్షలు ముగియడంతో ఖాళీగా ఉంటోంది. తరచూ వాట్సాప్‌లో తన సోదరితో చాటింగ్ చేస్తుండటంతో ఆమె మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సాయిప్రియ గురువారం రాత్రి బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి ఆమె సుప్రజ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటర్ పరీక్షలు సరిగా రాయలేకపోయాననే బాధతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి భూపాల్‌రెడ్డి ఇచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని వద్ద లభించిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘నేను అందరికీ కోపం తెప్పిస్తున్నాను... నేను ఎందుకు ఉన్నాననే బాధ... నేను చచ్చిపోతే పనైపోతుంది కదా... డాడీ సారీ... ఐ లవ్ మమ్మీ,డాడీ... ఇన్ని రోజులు ఎందుకు ఆగానంటే అందరూ ఇంటర్ పరీక్షలు అనే అనుకుంటారు.... నేను పరీక్షలన్నీ మంచిగా రాశాను... అందుకే పరీక్షలు ముగిసాక చచ్చిపోవాల ని డిసైడయ్యా... మా అన్న, అక్కకి హ్యాపీ నేను చచ్చిపోతే...’’ అంటూ అందులో పేర్కొంది. -
సాహితీ.. ఎక్కడకు పోయావురా
భూత్పూర్, న్యూస్‌లైన్ : పాఠశాల యాజమాన్యం మానసిక ఒత్తిడి కారణంగానే తన కూ తురు క్షోభకు గురై మృతి చెందిందంటూ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే అమిస్తాపూర్‌కు చెందిన అరుణ, భాస్కర్‌రావు దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలోచిన్న కుమార్తె సాహితీ (సోని) భూత్పూర్కు సమీపంలోని పంచవటి విద్యాలయంలో మూడో తరగతి చదువుతోంది. ఇక్కడే సోదరీమణులు సాయిప్రియ ఏడో, నీరజ ఐదో తరగతి చదువుతున్నా రు. అయితే ఫీజులు చెల్లించలేదని సాహితిని రెండు రోజులుగా తరగతి నుంచి యాజమాన్యం బయటకు పంపించి ఎండలో నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు. గురువారం నుంచి అర్ధవార్షిక పరీక్షలు ప్రారంభం కానుండటంతో పరీక్షలు రాయిస్తోరో లేదోనని తీవ్రంగా మానసికక్షోభ కు గురైంది. ఉదయం తొమ్మిది గంటలకు సోద రీమణులతో కలిసి ఆటోలో పాఠశాలకు చేరుకున్న వెంటనే తల తిరిగినట్లవుతున్నదని క్లాసు టీచర్‌కు చెప్పింది. దీంతో తల్లికి ఫోన్లో సమాచారమివ్వగా తన కూతురిని అమిస్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ వైద్యుని వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. పాఠశాల యాజమాన్యం మానసిక ఒత్తిడి కారణంగానే తన కూతురు క్షోభకు గురై అస్వస్థతతో ప్రాణం పోగొట్టుకుందని తండ్రి భాస్కర్‌రావు ఆరోపించారు. పాఠశాల కరస్పాండెంట్‌తో వాగ్వాదం అనంతరం తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు కలిసి వివిధ పార్టీల నాయకులు పాఠశాల వద్దకు సాహితి మృతదేహంతో ఉదయం 10.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆందోళన చేశారు. సంఘటన స్థలానికి డీఈఓ చంద్రమోహన్ వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఎంఈఓ కృష్టయ్యను ఆదేశించారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్‌రెడ్డితో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. ‘ముగ్గురు పిల్లలను మీ పాఠశాలలోనే చదివిస్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా విద్యార్థిని మానసిక క్షో భకు గురి చేసినందునే అస్వస్థతకు గురై మృతి చెందింది..’ అని మండిపడ్డారు. ట్రెయినీ డీఎస్పీ పూజిత, సీఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, నష్ట పరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. పునరావృతం కాకుండా చూస్తాం పాఠశాలలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని పంచవటి విద్యాలయ కరస్పాండెంట్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. విద్యార్థి సాహితి మృతి దురదృష్టకరమన్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పీయూ విద్యార్థుల దాడి గురువారం రాత్రి పంచవటి విద్యాలయంపై పాలమూర్ యూనివర్సిటీ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఆవరణలోని ఫర్నిచర్‌ను చిందరవందర చేశారు. ఇంతలో అక్కడికి కారులో వచ్చిన సింగిల్‌విండో అధ్యక్షుడు నర్సింహారెడ్డి కారుపై రాళ్లతో దాడి చేసి అద్దాలను పగులగొట్టారు. ఈ కార్యక్రమంలో పీయూ విద్యార్ధి జేఏసీ చైర్మన్ ప్రకాశ్‌తో పాటు మరో నలభై మంది విద్యార్థులు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని బయటకు పంపించి వేశారు. అనంతరం పది మంది విద్యార్థులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.