భూత్పూర్, న్యూస్‌లైన్ : పాఠశాల యాజమాన్యం మానసిక ఒత్తిడి కారణంగానే తన కూ తురు క్షోభకు గురై మృతి చెందిందంటూ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే అమిస్తాపూర్‌కు చెందిన అరుణ, భాస్కర్‌రావు దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలోచిన్న కుమార్తె సాహితీ (సోని) భూత్పూర్‌కు సమీపంలోని పంచవటి విద్యాలయంలో మూడో తరగతి చదువుతోంది.
ఇక్కడే సోదరీమణులు సాయిప్రియ ఏడో, నీరజ ఐదో తరగతి చదువుతున్నా రు. అయితే ఫీజులు చెల్లించలేదని సాహితిని రెండు రోజులుగా తరగతి నుంచి యాజమాన్యం బయటకు పంపించి ఎండలో నిలబెట్టి పనిష్‌మెంట్ ఇచ్చారు. గురువారం నుంచి అర్ధవార్షిక పరీక్షలు ప్రారంభం కానుండటంతో పరీక్షలు రాయిస్తోరో లేదోనని తీవ్రంగా మానసికక్షోభ కు గురైంది.
ఉదయం తొమ్మిది గంటలకు సోద రీమణులతో కలిసి ఆటోలో పాఠశాలకు చేరుకున్న వెంటనే తల తిరిగినట్లవుతున్నదని క్లాసు టీచర్‌కు చెప్పింది. దీంతో తల్లికి ఫోన్లో సమాచారమివ్వగా తన కూతురిని అమిస్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ వైద్యుని వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. పాఠశాల యాజమాన్యం మానసిక ఒత్తిడి కారణంగానే తన కూతురు క్షోభకు గురై అస్వస్థతతో ప్రాణం పోగొట్టుకుందని తండ్రి భాస్కర్‌రావు ఆరోపించారు.
పాఠశాల కరస్పాండెంట్‌తో వాగ్వాదం
అనంతరం తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు కలిసి వివిధ పార్టీల నాయకులు పాఠశాల వద్దకు సాహితి మృతదేహంతో ఉదయం 10.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆందోళన చేశారు. సంఘటన స్థలానికి డీఈఓ చంద్రమోహన్ వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఎంఈఓ కృష్టయ్యను ఆదేశించారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్‌రెడ్డితో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు.
‘ముగ్గురు పిల్లలను మీ పాఠశాలలోనే చదివిస్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా విద్యార్థిని మానసిక క్షో భకు గురి చేసినందునే అస్వస్థతకు గురై మృతి చెందింది..’ అని మండిపడ్డారు. ట్రెయినీ డీఎస్పీ పూజిత, సీఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, నష్ట పరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.
పునరావృతం కాకుండా చూస్తాం
పాఠశాలలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని పంచవటి విద్యాలయ కరస్పాండెంట్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. విద్యార్థి సాహితి మృతి దురదృష్టకరమన్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
పీయూ విద్యార్థుల దాడి
గురువారం రాత్రి పంచవటి విద్యాలయంపై పాలమూర్ యూనివర్సిటీ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఆవరణలోని ఫర్నిచర్‌ను చిందరవందర చేశారు. ఇంతలో అక్కడికి కారులో వచ్చిన సింగిల్‌విండో అధ్యక్షుడు నర్సింహారెడ్డి కారుపై రాళ్లతో దాడి చేసి అద్దాలను పగులగొట్టారు. ఈ కార్యక్రమంలో పీయూ విద్యార్ధి జేఏసీ చైర్మన్ ప్రకాశ్‌తో పాటు మరో నలభై మంది విద్యార్థులు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని బయటకు పంపించి వేశారు. అనంతరం పది మంది విద్యార్థులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
సాహితీ.. ఎక్కడకు పోయావురా
Published Fri, Jan 3 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement