
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ, రవి ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ప్రత్యక్షమయ్యారు. అక్కడికి వారిని త్రీ టౌన్ పోలీసులు తీసుకొచ్చి విచారించారు. వారి నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు. సాయిసుప్రియ, రవి మాట్లాడుతూ తామిద్దరం కలిసి బతుకుతామని, ఇక ఇంటికి వెళ్లమని, తల్లిదండ్రుల వద్ద ఉండమని స్పష్టం చేశారు.
తొలి భర్త ఇచ్చిన గాజులను అమ్మలేదని, తమ వద్దే ఉన్నాయని వారు చూపించారు. ముందుగా కుమార్తె సాయిప్రియతో తల్లిదండ్రులు మాట్లాడారు. తమ పరువు తీశావంటూ రోదించారు. తాను రవితో ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. తమ వల్ల ప్రభుత్వానికి కోటి రూపాయలు ఖర్చయినందుకు క్షమించమని రవి కోరాడు. మీడియాతో మాట్లాడుతుండగా సాయిప్రియ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకు సపర్యలు చేయగా తేరుకుంది. కొద్దిసేపటి తర్వాత వారిని ప్రైవేటు కారులో త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం.