
వనపర్తి: ‘మా వార్డులో డ్రెయినేజీలు శిథిలమై పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మురికి కూపాలు ఎక్కువై దోమలు, పందులతో ఏగలేకపోతున్నాం.. విషజ్వరాలతో ప్రాణాలు పోతున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. అయినా మీరు పట్టించుకోరా’ అని జిల్లాకేంద్రంలోని 26వ వార్డుకు చెందిన పలువురు కలెక్టర్ శ్వేతామహంతిని ప్రశ్నించారు. సోమవారం ప్రజావాణిలో తమ ఇబ్బందులను విన్నవించేందుకు వచ్చారు. కాలనీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె అధికారులకు సిఫార్సు చేస్తామని చెప్పి బయటకు వెళ్లేందుకు ఎస్పీ రోహిణీ ప్రియదర్శినితో కలిసి కారులో ఎక్కారు.
ఒక్కసారిగా కాలనీ మహిళలు, యువకులు ‘మా ప్రాణాలు పోతున్నాయి.. బాధలు చెప్పేందుకు వస్తే.. సీరియస్‌గా స్పందించడం లేదు’ అంటూ కలెక్టర్ వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. ఇంతలో కలెక్టర్ మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్ వీరబుచ్చయ్యను పిలిచి వారి సమస్యను పరిష్కరించాలని గద్దించారు. పోలీసులు, కలెక్టర్, ఎస్పీల గన్‌మెన్‌లు మహిళలు, యువకులను శాంతింపజేశారు. మరో 20 నిమిషాల్లో కలెక్టర్ తిరిగి ఆఫీస్‌కు వచ్చి సమస్యను సావధానంగా వింటారని సూచించారు. ఇంతలో బయటకు వెళ్లి కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ కాలనీవాసుల సమస్యలను ఆరాతీశారు. మున్సిపల్ అధికారులను పంపించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment