సాగునీటికి కయ్యం! | Water War Between Moosapet And Addakula Mandals | Sakshi
Sakshi News home page

సాగునీటికి కయ్యం!

Published Mon, Aug 6 2018 8:52 PM | Last Updated on Mon, Aug 6 2018 8:53 PM

Water War Between Moosapet And Addakula Mandals - Sakshi

సాక్షి, మూసాపేట (దేవరకద్ర) : సాగునీరు మాకు కావాలంటే.. మాకే ముందు కావాలని మూసాపేట, అడ్డాకుల మండలాల రైతులు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. పూర్తి వివరాలిలా.. మూసాపేట మండలంలోని మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న మక్‌ మల్లాయకుంటకు గత సంవత్సరం వనపర్తి జిల్లా ఘనపూర్‌ మండలంలోని ఘణప సముద్రం పెద్ద చెరువు నుంచి సాగునీరు వదిలారు. ఇందుకు రెండో తూము ద్వారా వచ్చే నీటి కోసం గ్రామస్తులంతా కలిసి చందాలు వేసుకుని కాలువలు తవ్వి కుంటకు రెండు పక్కల పొర్లు దిండ్లను కట్టుకున్నారు. అయితే ఖరీఫ్‌లో నీరు విడుదల కావడంతో చెరువు కింద 360 ఎకరాల్లో వరినాట్లు వేశారు. అయితే రెండు రోజులుగా అడ్డాకుల మండలం  కందూరు గ్రామానికి చెందిన దాదాపు వంద మంది రైతులు మక్‌మల్లాయ కుంటకు ఘణపసముద్రం నుంచి వచ్చే దారిలో ఉన్న దిండును పగలగొట్టడంతో రెండు గ్రామాల మధ్య చిచ్చు రగులుకుంది.  

వాదోపవాదనలు 
లేకలేక చెరువుకు నీళ్లు వస్తే చెరువు కింద భూమిని అంతా శిస్తు చేశామని, ఉన్నట్టుండి దిండును పగలగొడితే ఎలాగని  మహ్మదుస్సేపల్లి రైతులు కందూరు గ్రామస్తులను నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరో పక్క చెరువు కింద ఉన్న పాటు కాలువలను రెండు జేసీబీలతో తవ్వడంతో ఇరు గ్రామాల ప్రజలు చెరువు కట్టపై మొహరించి నీరు తీసుకెళతామని ఒకరు, ఇవ్వలేమని మరొకరు వాదిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం మక్‌మల్లయ కుంట నిండిన అనంతరం మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న లోక సముద్రానికి నీరు వదులుతామని అక్క డి నుంచి మొత్తం మీ శివారుకే నీరు వస్తాయని పలువురుపెద్దలు సూచించినా వినకపోవడంతో రాజకీయ నాయకులు సైతం ఈ విషయంలో జో క్యం చేసుకుంటున్నారు. కందూరు మాజీ సర్పంచు నాగిరెడ్డి తమ గ్రామానికి చెందిన రైతులకు నచ్చజెప్పి ఘణపురం చెరువు కుడి కాలువ ద్వారా నీరు విడుదల చేయించడానికి వెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. 

ఊరంతా శిస్తు కట్టాం  
కొన్నేళ్ల తర్వాత కుంటకు నీళ్లు వస్తే  ఊరు ఊరంతా శిస్తు కట్టాం. ఓర్వలేని కందూరు గ్రామరైతులు రాత్రికిరాత్రే దిండుని పగలగొట్టిండ్రు. అంతటితో ఆగకుండా ఘణపురం చెరువు నుంచి వచ్చే నీళ్లను కూడా దారిమళ్లించడానికి చూసిండ్రు. ఇది మంచి పద్ధతి కాదు. – మోహన్‌రెడ్డి, రైతు, మహ్మదుస్సేన్‌పల్లి 

సమంజసం కాదు 
మా ఊరి చెరువు నుంచి దౌర్జన్యం చేసి నీటిని తీసుకెళ్లడం సబబా. ఈ ఏడు కుంట కింద ఉన్న 320 ఎకరాల సంగతేంకావాలి. వరి పంట ఎదుగుతున్న వేళ చెప్పాపెట్టకుండా నీళ్లను మళ్లించడం మానుకోండి.  – కిష్టారెడ్డి, రైతు, మహ్మదుస్సేన్‌పల్లి 

నా చేనంతా నాశనంమైంది 
కందూరు రైతులు నీళ్ల కోసం కట్ట దిండును ధ్వంసం చేసిండ్రు. ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ దగ్గరుండి దిండును పగలగొట్టడమే కాక నా పంటకు నష్ట పరిహారం ఇస్తానడం బెదిరించడమే కదా. పద్ధతి మార్చుకోకపోతే ఊరంతా కట్ట దగ్గరే కూర్చోవాల్సి వస్తది. – నరేశ్, రైతు, మహ్మదుస్సేన్‌పల్లి 

మాకూ నీళ్లు కావాలి 
మా ఊరికి కూడా నీళ్లు కావాలి. సరిగ్గా వర్షాలు కురవక మొక్కలన్నీ ఎండుతున్నా యి. మహ్మదుస్సేన్‌పల్లిలో కుంట కింద ఉన్న భూమం తా శిస్తు చేశారు. కనీసం తుకాలనైనా ఎండిపోకుండా కాపాడుదామంటే వినడంలేదు. అందుకే మా ఊరి రైతులు దానికి ఉన్న రెండు వరస రాళ్లను తొలగించారు.  – నాగిరెడ్డి, మాజీ సర్పంచ్, కందూరు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement