
వనపర్తి జిల్లా కడుకుంట్లలో స్తంభంపైనే మృతి చెందిన వెంకటేశ్వర్లు
వనపర్తి రూరల్: వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. వనపర్తి మండంలోని కడుకుంట్లలో ఆంజనేయులు అనే రైతు సోమవారం ఉదయం గ్రామ శివారులోని తన పొలంలో మోటర్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని కోరడంతో స్థానికంగా హౌస్‌వైరింగ్, ప్లంబింగ్ పనిచేసే వారాల వెంకటేశ్వర్లు (48) సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేసి స్తంభం ఎక్కాడు. అయితే ఈ స్తంభానికి మరో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా అవుతున్న విషయం తెలియక వెంకటేశ్వర్లు, కనెక్షన్ ఇచ్చే ప్రయత్నంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలు ఇది గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని కిందకు దించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ షేక్‌షఫీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలో వెంకటేశ్వర్లుతోనే స్థానిక లైన్‌మాన్ అశోక్ చాలాసార్లు స్తంభాలను ఎక్కించి విద్యుత్ పనులు చేయించినట్టు గ్రామస్తులు తెలిపారు. దీనిపై లైన్‌మాన్ అశోక్‌ను వివరణ కోరగా.. తనకు సమాచారం ఇవ్వకుండా స్తంభం ఎక్కడంతోనే ఈ సంఘటన చోటుచేసుకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment