అమడబాకుల కస్తూర్బాలో బాలికలకు ఆరోగ్య పరిశుభ్రత కిట్ అందజేస్తున్న సిబ్బంది
వనపర్తి/కొత్తకోట: కస్తూర్బా విద్యాలయాల్లో చదువుతున్న బాలికలకు కొత్త సంవత్సరం కానుకగా ప్రతి మూడు నెలలకోసారి కాస్మొటిక్ కిట్టును సరఫరా చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘ఆరోగ్య పరిరక్షణ కిట్’ పేరిట 15 రకాల వస్తువులు అందజేయనుంది. ఇప్పటి దాకా ప్రభుత్వం కాస్మొటిక్ చార్జీల కింద నెలకు రూ.వంద చెల్లిస్తుండగా.. ఇవి ఏ మూలకూ సరిపోయేది కాదు. అవి కూడా సక్రమంగా వచ్చేవి కాదు. కానీ ప్రస్తుతం కిట్లు ఇవ్వనుండడం, అందులో సబ్బులు, షాంపూలు, పౌడర్ లాంటి సౌందర్య సాధనాలతోపాటు నాప్యెన్లు కూడా ఉండటంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ కిట్ల సరఫరా, పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా విద్యాశాఖకు అప్పగించింది.
ఫిబ్రవరి మొదటి వారంలో.. ‘ఆరోగ్య పరిశుభ్రత కిట్’లో నాలుగు స్నానం సబ్బులు, రెండు దుస్తుల సబ్బులు, 24 శాంపులు, 175 మి.లీ. కొబ్బరి నూనె, 50 గ్రాముల పౌడర్, వంద గ్రాముల టూత్ పేస్ట్, టూత్ బ్రెష్, టంగ్ క్లీనర్, దువ్వెన, స్టిక్కర్లు (బొట్టు బిళ్లలు), రెండు 2.5 మీటర్ల నైలాన్ రిబ్బన్లు, రెండు హెయిర్ బాండ్లు, 18 నాప్ కిన్స్, ఒక మస్కిటో కాయిల్, హ్యాండ్‌వాష్ బాటిల్ (182 మి.లీ.) ఇలా 15 రకాల వస్తువులున్నాయి. మొట్టమొదటగా ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాలోని ఆయా కస్తూర్బాల్లో ‘ఆరోగ్య పరిశుభ్రత కిట్’లను అధికారులు అందజేశారు. కస్తూర్బాలతోపాటు మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలల్లోని బాలికలకు సైతం ఈ కిట్‌లను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
విద్యార్థినులకు మేలు
వనపర్తి జిల్లాలో 15 కస్తూర్బా విద్యాలయాలున్నాయి. వీటిలో 6 నుంచి 10వ తరగతి వరకు సుమారు 2,500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వసతి సౌకర్యం కూడా పొందుతున్న విద్యార్థినులకు ఇప్పటి వరకు ప్రతినెలా కాస్మొటిక్ చార్జీల పేరిట రూ.వంద చెల్లించేవారు. 2017 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బులు సైతం రాలేదు. విద్యార్థినులందరికీ బ్యాంకు ఖాతాలు లేదనే కారణంతో డబ్బు జమ చేయలేనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో విద్యార్థినులకు కొబ్బరి నూనె, సబ్బులు, బాడీ లోషన్స్ క్రిములు అత్యవసరం. కానీ డబ్బు రాకపోవడంతో చాలామంది కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఆనందంగా ఉంది..
ఆరోగ్య పరిశుభ్రత కిట్‌లో ప్రతిరోజు ఉపయోగించే అన్ని రకాల వస్తువులున్నాయి. దువ్వెన నుంచి మేకప్ చేసుకునే వస్తువులు ఇచ్చారు. హాస్టల్‌లో ఉండే అందరికి ఈ వస్తువులు ఇవ్వడం ఆనందంగా ఉంది. ఒకరి వస్తువులు మరొకరు వాడుకునే పరిస్థితి పోయింది.
– స్వప్న, 9వ తరగతి, అమడబాకుల కేజీబీవీ
నిరుపేద విద్యార్థులే అధికం..
కస్తూర్బాల్లో ఎక్కువగా తల్లిదండ్రులు లేని వారు, నిరుపేదలైన బాలికలే చదువుకుంటున్నారు. ప్రభుత్వం వారి అభ్యున్నతికి ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు ఆరోగ్య పరిశుభద్రత కిట్ ఇవ్వడం మరీ మంచిది. ఆడపిల్లలకు వీటి అవసరం చాలా ఉంటుంది.
– శిరీష, ప్రిన్సిపాల్, అమడబాకుల, కేజీబీవీ
Comments
Please login to add a commentAdd a comment