
కురుమూర్తి (ఫైల్)
కొత్తకోట రూరల్: ఆ యువకుడు రెండేళ్ల క్రితమే బీఈడీ పూర్తి చేశాడు. ప్రస్తుతం పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. త్వరలో ఉద్యోగ ప్రకటన వస్తుందని భావించి శిక్షణ తీసుకోవాలనుకున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో డబ్బుల్లేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేన్‌కు చెందిన సంద కురుమూర్తి (25) పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
కరోనా కారణంగా కళాశాల మూసివేయడంతో తల్లిదండ్రులు వెంకటమ్మ, సంద పెద్దబాలయ్యతో కలిసి గ్రామంలోనే ఉంటున్నాడు. తల్లిదండ్రులు గ్రామంలో వ్యవసాయంతో పాటు రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటుందని కురుమూర్తి భావించాడు. అందుకు శిక్షణ తీసుకోవడానికి డబ్బుల్లేవన్న ఆవేదనతో శుక్రవారం ఉదయం కొత్తకోట శివారు వెంకటగిరి ఆలయం సమీపంలోకి చేరుకుని పురుగు మందు తాగాడు. వెంటనే హైదరాబాద్‌లో ఉంటున్న తమ్ముడు మహేష్‌కు వీడియో కాల్ చేసి చెప్పాడు. అతనిచ్చిన సమాచారంతో హుటాహుటిన తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని కురుమూర్తిని బైక్‌పై కొత్తకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు.
ఎంతపని చేస్తివి కొడుకా..
‘కూలీనాలీ చేసి పెద్ద చదువులు చదివిస్తే కుటుంబానికి అండగా ఉంటావనుకుంటే ఇలా చేస్తివి కొడుకా..’అంటూ తల్లిదండ్రు లు రోదించడం అక్కడి వారిని కలచివేసిం ది. ‘ఇలా అయితదనికుంటే అప్పోసప్పో చేసి డబ్బులు తెచ్చిచ్చే వాళ్లం. ఎంత పని చేస్తివి..’అంటూ కన్నీరు మున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment