Palamuru University
-
బీఈడీ పూర్తి .. ఉద్యోగ శిక్షణకు డబ్బు లేదని.. ‘ఎంతపని చేస్తివి కొడుకా..’
కొత్తకోట రూరల్: ఆ యువకుడు రెండేళ్ల క్రితమే బీఈడీ పూర్తి చేశాడు. ప్రస్తుతం పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. త్వరలో ఉద్యోగ ప్రకటన వస్తుందని భావించి శిక్షణ తీసుకోవాలనుకున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో డబ్బుల్లేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేన్‌కు చెందిన సంద కురుమూర్తి (25) పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కరోనా కారణంగా కళాశాల మూసివేయడంతో తల్లిదండ్రులు వెంకటమ్మ, సంద పెద్దబాలయ్యతో కలిసి గ్రామంలోనే ఉంటున్నాడు. తల్లిదండ్రులు గ్రామంలో వ్యవసాయంతో పాటు రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటుందని కురుమూర్తి భావించాడు. అందుకు శిక్షణ తీసుకోవడానికి డబ్బుల్లేవన్న ఆవేదనతో శుక్రవారం ఉదయం కొత్తకోట శివారు వెంకటగిరి ఆలయం సమీపంలోకి చేరుకుని పురుగు మందు తాగాడు. వెంటనే హైదరాబాద్‌లో ఉంటున్న తమ్ముడు మహేష్‌కు వీడియో కాల్ చేసి చెప్పాడు. అతనిచ్చిన సమాచారంతో హుటాహుటిన తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని కురుమూర్తిని బైక్‌పై కొత్తకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. ఎంతపని చేస్తివి కొడుకా.. ‘కూలీనాలీ చేసి పెద్ద చదువులు చదివిస్తే కుటుంబానికి అండగా ఉంటావనుకుంటే ఇలా చేస్తివి కొడుకా..’అంటూ తల్లిదండ్రు లు రోదించడం అక్కడి వారిని కలచివేసిం ది. ‘ఇలా అయితదనికుంటే అప్పోసప్పో చేసి డబ్బులు తెచ్చిచ్చే వాళ్లం. ఎంత పని చేస్తివి..’అంటూ కన్నీరు మున్నీరయ్యారు. -
పాలమూరు యూనివర్సిటీకి బంపర్ ఆఫర్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: వెనుకబడిన పాలమూరు జిల్లాలో అక్షర జ్యోతులు వెలిగించాలన్న ఉద్దేశ్యంతో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పాలమూరు యూనివర్సిటీ దినదినాభివృద్ధి చెందుతోంది. పదేళ్లనుంచి కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులతో సర్దుకుపోతుండగా ఇప్పడు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వచ్చేందుకు ద్వారాలు తెరుచుకున్నాయి. రాష్ట్రీయ ఉచ్చాచితర్ శిక్షా అభియాన్ (రూసా) కింద కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.20 కోట్ల నిధులను కేటాయించింది. న్యాక్ గుర్తింపుతోనే.. పాలమూరు యూనివర్సిటీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌంన్సిల్ (న్యాక్) గుర్తింపు వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే పీయూకు న్యాక్‌లో పీయూ 2.31 స్కోర్ చేయడంతో బీ గ్రేడ్‌ను సొంతం చేసుకుంది. పీయూతో పాటు ఇదే గ్రేడింగ్ సాధించిన మహాత్మాగాందీ యూనివర్సిటీ, నల్లగొండకు కూడా ఇవే నిధులుకేటాయించింది. అయితే సాధారణంగా రూసా నిధులు మంచి గ్రేడింగ్ వచ్చిన యూనివర్సీటీలకు మాత్రమే కేటాయిస్తుండగా ఈ సంవత్సరం సాధారణ గ్రేడింగ్ సాధించిన యూనివర్సిటీలకు నిధులను కేటాయిస్తే త్వరతగతిన అభివృద్ధి సాధిస్తారని భావించి ఈ నిధులను కేటాయించినట్లు తెలిసింది. పెరగనున్న వసతులు సాధారణంగా యూనివర్సిటీలకు న్యాక్ గుర్తింపు వస్తే వసతులు పెరిగి మెరుగైన విద్య, వసతుల అభివృద్ధి సాధిస్తే రాష్ట్రీయ ఉచ్చాచితర్ శిక్షా అభియాన్, న్యాక్, కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి ప్రత్యేక నిధులు అందుతాయి. వీటిలో యూనివర్సిటీలో నాణ్యత, ప్రమాణాల ఆధారంగా ఏ,బీ,సీ వంటి గ్రేడులను ఆధారం చేసుకుని నిధులు అందిస్తుంది. 2016లో బాధ్యతలు స్వీకరించిన యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ రాజరత్నం కృషి ఎంతో ఉందని, అ«ధికారులు, విద్యార్థులు అభిప్రాయ పడుతున్నారు. న్యాక్ గుర్తింపు కోసం వసతుల కల్పన, విద్యలో నాణ్యత, భవనాల నిర్మాణం వంటి అనేక అంశాలపై ఆయన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని, పకడ్బందీగా న్యాక్ దరఖాస్తు చేయడంతో ఈ నిధులు వచ్చినట్లు తెలుస్తోంది. న్యాక్ బృందం పీయూలోని వివిధ వసతులను పరిశీలించేందుకు 2018 సెప్టెంబర్ 18న పీయూను సందర్శంచి, మూడురోజుల పర్యటన చేశారు. అనంతరం 2019 ప్రారంభంలో న్యాక్ గుర్తింపు ఇస్తూ బి–గ్రేడ్‌ను కేటాయిస్తూ ప్రకటన జారీ చేశారు. ఇందులో బీ గ్రేడ్ వచ్చిన కళాశాలలకు నిధులు వచ్చేందుకు అవకాశం ఉంది. శాతాల వారీగా నిధుల వినియోగం న్యాక్ గ్రేడింగ్ వచ్చిన కళాశాలలకు నిధులు కేటాయించే క్రమంలో వీటిని వినియోగానికి సంబంధించి కచ్చితమైన పరిధులు ఉంటాయి. ఇందులో అకాడమిక్ డెవలప్మెంట్ నుంచి ఇఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వరకు ప్రతిఅంశం కూడా రూసా నిబంధనల మేరకు మాత్రమే వినియోగించాల్సి ఉంటంది. మొత్తం రూ.20 కోట్లలో 50 శాతం నిధులు యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులు, వివిధ భవనాల నిర్మాణం, చేపట్టేందుకు కేటాయించాల్సి ఉంది. 20శాతం నిధులను యూనివర్సిటీలోని గతంలో నిర్మించిన వివిధ భవనాలకు రీపేర్లు చేసేందుకు కేటాయించాలి. 20 శాతం నిధులు డిపార్ట్మెంట్ల వారీగా విద్యార్థులకు అవసరమయ్యే ఎక్యూప్మెంట్ కోసం కేటాయించాలి. 10 శాతం నిధులు సైన్స్ విధులు చేసే ప్రయోగాల కోసం వినియోగించే కెమికల్స్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. రూ.20 కోట్ల ఖర్చుకు ప్రతిపాదనలు నిధుల కేయింపునకు ముందు ప్రభుత్వం అందుకు సంబంధించి ప్రతిపాదనలను యూనివర్సిటీ అధికారుల నుంచి కోరుతుంది. పీయూ అధికారులు కూడా చేపట్టబోయే పనులకు సంబంధించిన పూర్తి వివరాలను పంపించారు. ఇందులో మొదటగా యూనివర్సిటీలో చదువుతున్న బాలికలు, ఆర్ట్స్, సైన్స్, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఫార్మసీ విద్యార్థునులు ఒకే హాస్టల్లో సంఖ్యకు మించి ఉంటున్నారు. బాలికలకు నూతన భవనం నిర్మించనున్నారు. అంతేకాకుండా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు, సిబ్బంది ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఆస్పత్రి నిర్మాణం కూడా చేయనున్నారు. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న సైన్స్, ఆర్ట్స్ అకాడమిక్ భవనాలతో పాటు అధనంగా మరో అకాడమిక్ బిల్డిండ్ నిర్మించనున్నారు. విద్యార్థులకు ఆడుకునేందుకు సౌకర్యంగా రన్నింగ్ ట్రాక్, ఫుట్‌బాల్ గ్రౌండ్, ఫీల్డ్ ట్రాక్‌లు నిర్మించనున్నారు. అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరం నుంచి రీసెర్చ్‌కు సంబంధించి పెద్ద సంఖ్యలో స్కాలర్స్‌ను భర్తీ చేయనున్నారు. అందుకోసం వివిధ డిపార్ట్మెంట్ల వారీగా రీసెర్చ్ ఎక్యూప్మెంట్, ల్యాబ్‌లను పెద్ద ఎత్తున సమకూరుస్తారని తెలుస్తోంది. వీటితో పాటు పీయూకు అనుబంధ పీజీ సెంటర్లలో కూడా వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అందరి సహకారంతోనే.. పాలమూరు యూనిర్సిటీ ప్రతి సంవత్సరం కొత్త పంథాను అనుసరిస్తోంది. అందుకు ప్రధాన కారణం యూనివర్సిటీ అధికారుల సమిష్టి కృషియే. ప్రస్తుతం ఉన్న న్యాక్–బీ గ్రేడ్ ద్వారా వచ్చిన నిధుల ద్వారా పీయూను మరింత అభివృద్ధి చేసి భవిష్యత్‌లో ఏ–గ్రేడ్ సా«ధించే విధంగా కృషిచేస్తూ రాష్ట్రంలోనే మంచి యూనివర్సిటీగా పీయూ పేరును నిలబెడతాం. – పిండి పవన్‌కుమార్, పాలమూరు యూనివర్సిటీ, రిజిస్ట్రార్ నిధులు రావడం సంతోషకరం పాలమూరు యూనివర్సిటీ ఇప్పటివరకు కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులతోనే నడిచేది. న్యాక్ గుర్తింపు ద్వారా రూసా నిధులు కూడా రావడం సంతోషంగా ఉంది. ఈ నిధుల ద్వారా యూనివర్సిటీలో వసతులు పెరగడంతో పాటు, పీయూ పరిధిలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు అవకాశం ఉంటుంది. – మధుసూదన్‌రెడ్డి, పాలమూరు యూనివర్సిటీ, కోఆర్డినేటర్ -
పీయూకు నిధుల కేటాయింపు అరకొరే
సాక్షి, మహబూబ్‌నగర్ : ప్రస్తుతం పాలమూరు యూనివర్సిటీ పరిధిలో వివిధ అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొత్త భవనాల నిర్మాణం, సదుపాయాల కల్పన, కొత్త కోర్సుల ఏర్పాట్లు, పీజీ కళాశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి నిధులు అవసరం. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ పనులకు రూపాయైనా కేటాయించలేదు. కేవలం శాశ్వత ప్రతిపాదికన పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు ఇచ్చేందుకు మాత్రమే రూ.6.63 కోట్లు మంజూరు చేసింది. కాగా తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న వారికి వేతనాలను పీయూకి వచ్చే ఆర్థిక వనరుల నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.119 కోట్లతో ప్రతిపాదనలు వివిధ అభివృద్ధి పనులు, సిబ్బంది వేతనాలను దృష్టిలో ఉంచుకుని పీయూ అధికారులు మొత్తం రూ.119 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వానాకి గతంలోనే ప్రతిపాదనలు పంపించారు. ఇందులో రూ.85 కోట్లు పీయూతో పాటు అనుబంధ పీజీ సెంటర్లలో కొనసాగుతున్న పనులకు కావాలని విన్నవించారు. మిగతా రూ.25 కోట్లు పీయూలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలకు అవసరమని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత బడ్జెట్లో రూ.6.63 కోట్లను మాత్రమే కేటాయించింది. వచ్చే ఆరు నెలల వరకు కొత్త పనులు ప్రారంభించేందుకు అవకాశం లేకుండా పోయింది. అంతేగాక గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేటాయించిన బడ్జెట్లో పూర్తిస్థాయిలో నిధులను ఇంకా విడుదల చేయలేదు. దీంతో వివిధ అభివృద్ధి పనుల అంచనాలు తలకిందులయ్యాయి. అంతేగాక గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన పలు పనులు పూర్తికాని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి ప్రశ్నార్థకమే.. పాలమూరు యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిధులను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. చివరకు అభివృద్ధి పనులు ప్రశ్నార్థకంగా మారాయి. రెండేళ్ల నుంచి పరీక్షల విభాగం భవనం, వీసీ రెసిడెన్సీ, గెస్టుహౌస్ నిర్మిస్తున్నారు. వీటి కోసం రూ.17 కోట్లు కేటాయించినా అందులో ఇంకా నిధులు రావాల్సి ఉంది. ఇక పీయూలో చదువుతున్న బాలికలకు కేవలం ఒకే హాస్టల్ మాత్రమే ఉంది. విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా మరోటి నిర్మించాలని, విద్యార్థులకు ప్రత్యేక ఆస్పత్రి, మరిన్ని కోర్సులు ప్రారంభించాలంటే కొత్త కళాశాలల భవనాలు అవసరం. గద్వాల, కొల్లాపూర్ జీపీ సెంటర్లను బలోపేతం చేసేందుకు ఎక్కడిక్కడ శాశ్వత భవనాలు నిర్మించాలని గ తంలో అధికారులు రూ.ఎనిమిది కోట్లతో ప్రతి పాదనలు చేశారు. ముఖ్యంగా కళాశాల భవనాలు, బాలబాలికలకు ప్రత్యేక హాస్టళ్లు అవసరం. ఈ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. నిధులు వస్తేనే అభివృద్ధి సాధ్యం మిగతా యూనివర్సిటీలతో పోల్చితే పీయూకు ఆదాయ వనరులు తక్కువ. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే వసతుల కల్పన చాలా ముఖ్యం. అందుకు మరిన్ని నిధులు కేటాయిస్తేనే త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తవుతాయి. – కుమారస్వామి, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ అంతర్గత నిధులు కేటాయిస్తాం రాష్ట్ర బడ్జెట్లో కొత్త యూనివర్సిటీలకు నిధులు తక్కువ కేటాయించడంతో భవనాల నిర్మాణం, కొత్త కోర్సుల ఏర్పాటు, ఇతర వసతుల కల్పనపై ప్రభావం పడుతుంది. విద్యార్థులకు క్వాలిటీ, ఇన్నోవేటివ్ విద్య, న్యాక్‌లో ఉన్నతమైన గ్రేడింగ్ కోసం వసతులు కల్పించడం చాలా అవసరం. కొత్త యూనివర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలి. ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు పీయూ అంతర్గత నిధులు కేటాయిస్తాం. – పిండి పవన్‌కుమార్, పీయూ రిజిస్ట్రార్ -
స్నాతక సంబురం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ఉన్నత విద్యా ప్రదాయినీ అయిన పాలమూరు యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవ (కాన్వకేషన్) కార్యక్రమానికి సిద్ధమవుతోంది. మొదటి స్నాతకోత్సవం 2014లో నిర్వహించగా, ప్రస్తుతం రెండో స్నాతకోత్సవం నిర్వహించేందుకు పీయూ అతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా పీయూ పరిధిలో ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సులు పూర్తి చేసి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈనెల 6న జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో గోల్డ్‌మెడల్, పట్టాల ప్రదానోత్సవం చేస్తారు. అతిథిగా గవర్నర్ రాక రెండో స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్, యూనివర్సిటీ చాన్స్‌లర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా రానున్నారు. వీరితో పాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శులను సైతం అధికారులుఆహ్వానించారు. యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం స్నాతకోత్సవం నిర్వహించి ఆ సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయడం ఆనవాయితీ. కానీ కొన్ని కారణాల వల్ల ఈ పదేళ్ల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించారు. చకచకా సాగుతున్న పనులు స్నాతకోత్సవ కార్యక్రమానికి యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వివిధ అంశాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ఐదు మంది సభ్యుల చొప్పున ఎంపిక చేసి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. గోల్డ్‌మెడల్స్, సర్టిఫికెట్ల నిర్వహణ, స్టేజ్ అతిథుల సీట్ల కేటాయింపు, పార్కింగ్, సీటింగ్, ఫైనాన్సరీ కమిటీల ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. గోల్డ్‌మెడల్స్ తీసుకునే 115 మంది విద్యార్థులకు పీయూ అధికారులు 6న జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని ఫోన్ ద్వారా, మెయిల్, పోస్టుల ద్వారా సమాచారం అందించారు. ఇందులో 30 మంది విద్యార్థులు ముందే కాన్వకేషన్ సర్టిఫికెట్లు తీసుకెళ్లగా తాజాగా 62 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాకుండా శనివారం వరకు 76 మంది విద్యార్థులు యూనివర్సిటీలో రిపోర్టు చేసి స్నాతకోత్సవానికి సంబంధించి పాస్‌లు తీసుకెళ్లారు. అభివృద్ధి ఆశలు యూనిర్సిటీలో నిర్వహించే స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్‌తో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, యువజన, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఆహ్వానించారు. అయితే వీరు పీయూలో ఉన్న పలు సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని అటు విద్యార్థులు, ఇటు వారి తల్లిదండ్రులు, పీయూ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా పీయూలో ప్రస్తుతమున్న బాలికల హాస్టల్లో దాని పరిమితికి మించి విద్యార్థులు ఉంటున్నారు. ప్రత్యేకంగా ఒక భవనం అవసరం కాగా పీయూలో ఉంటున్న దాదాపు 1500 మంది విద్యార్థులకు వైద్యసేవలు అందించేం దుకు ప్రత్యేక హాస్పిటల్‌ను ఏరా>్పటు చేయాల్సి ఉంది. అంతేకాకుండా క్రీడలకు ప్రత్యేక మైదానం, పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సదుపాయం అవసరం. ప్రస్తుతం ఎగ్జామినేషన్ బ్రాంచ్, గెస్ట్‌హౌస్, వీసీ గృహం వంటి వాటి పనులు కొనసాగుతున్నాయి. వీటికి పూర్తి స్థాయిలో నిధులు అవసరం. అంతేకాకుండా గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ పీజీ సెంటర్లలో పలు కళాశాలలు, హాస్టల్ భవనాలను అధికారులు నిర్మించ తలపెట్టారు. వీటికి నిధులు అవసరం. వీటిపై మంత్రులు అధికారులు దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు. ఏర్పాట్లు చేస్తున్నాం.. యూనివర్సిటీలో ఈనెల 6న నిర్వహించే స్నాతకోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నాం. గవర్నర్‌తోపాటు, మంత్రులు కూడా అతిథులుగా విచ్చేస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా పీజీ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి బంగారు పతకాలను అందిస్తాం. ఎంపకైన విద్యార్థులందరికీ సమాచారం చేరవేశాం. – ప్రొఫెసర్ రాజరత్నం, పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కమిటీలు ఏర్పాటుచేశాం రెండో స్నాతకోత్సవానికి పనులు పూర్తికావచ్చాయి. నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేశాం. వారి ఆధ్వర్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి. మంచి వాతావరణంలో కార్యక్రమం నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నాం. – ప్రొఫెసర్ గిరిజ, పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ -
పీయూలో అంతర్జాతీయ సదస్సు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఆగస్టు 7,8,9వ తేదీల్లో ‘కెమిస్ట్రీ ఫర్ సస్టెయినబుల్ ఫ్యూచర్’ అనే అంశంపై అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించను న్నట్లు పీయూ వైస్‌చాన్స్‌లర్ రాజరత్నం అన్నారు. పాలమూరు యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లో మంగళవారం సదస్సుకు సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సదస్సుల్లో ఫిజిక్స్ భవిష్యత్ తరాలకు అందించే సేవలపై విస్తృతమైన చర్చ ఉంటుందని, ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాల నుంచి సుప్రసిద్ధ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్, అధ్యాపకులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలన్నారు. ఫిజిక్సు సబ్జెక్టులో అనువజ్ఞను అందించే విషయాలను అర్థం చేసుకునేందుకు మంచి అవకాశమన్నారు. పీయూలో అంర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం మొదటి సారని, పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహించడానికి అందరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్, పాండురంగారెడ్డి, కన్వీనర్ మూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రకిరణ్, అధికారులు మధుసూధన్‌రెడ్డి, సీఓఈ గిరిజ, మనోజ, శ్రీధర్, రామ్మోహన్, ఆయేషాహస్మీ, ఉపేందర్, రవి, మాలతి తదితరులు పాల్గొన్నారు. -
బుర్ఖాతో అమ్మాయిల హాస్టల్లోకి.. ఆత్మహత్య..
సాక్షి, మహబుబ్‌నగర్ : అమ్మాయిలా బుర్ఖా ధరించి ఓ యువకుడు బాలికల వసతిగృహంలోకి వెళ్లి.. హాస్టల్ సిబ్బందికి పట్టుబడ్డాడు. వారు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబుబ్‌నగర్‌లోని పాలమురులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలమూరు యూనివర్శిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రి ద్వితీయ సంవత్సరం చదువుతున్న సద్దాం హుస్సేన్ అనే యువకుడు ఈ నెల 16న రాత్రి 11 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి ఆమె ఉండే హాస్టల్‌కు వెళ్లాడు. ఎవరికి అనుమానం రాకుండా అమ్మాయిలాగా బుర్ఖా ధరించాడు. పక్క గదులలో ఉన్న విద్యార్థినులు గమనించి హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. వార్డెన్ అతడ్ని పట్టుకుని మందలించారు. అతడ్ని వెంటతీసుకొచ్చిన యువతిని కూడా మందలించారు. మళ్లీ ఇలాంటి పనులు చేయొద్దంటూ చెప్పి.. అతని సెల్‌ఫోను తీసుకుని మరుసటి రోజు వచ్చి తీసుకోవాల్సిందిగా సూచించారు. అతనితో ఒక లేఖ కూడా రాయించుకున్నారు. అయితే మనస్తాపానికి గురైన సద్దాం మరుసటి రోజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ విషయం శుక్రవారం వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్న సద్దాం తల్లిదండ్రులు గురువారం ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. తమ కుమారుడి మృతిపై పూర్తి విచారణ జరిపించాల్సిందిగా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని రైల్వే ఎస్.ఐ రాఘవేందర్ తెలిపారు. -
పీయూ డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : పాలమూరు యూనివర్సిటీ పరిధిలో వివిధ కళాశాలల్లో చదువుతున్న డిగ్రీ సప్లి్లమెంటరీ ఫలితాలలను వీసీ రాజరత్నం శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మొదటి సంవత్సరంలో 6,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,446 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక 1,929 మంది ఫెయిల్ కాగా, 2,608 మంది విద్యార్థులు పైతరగతులకు ప్రమోట్ అయ్యారని, కొందరు మాల్ ప్రాక్టీస్, డీటెయిన్డ్ కింద ఉన్నారని పేర్కొన్నారు. రెండో సంవత్సరంలో 11,515 మందికి 3,255 మంది ఉత్తీర్ణత సాధించగా, 2,926 మంది ఫెయిల్ అయ్యారని, 4,688 మంది ప్రమోట్ అయ్యారని తెలిపారు. మూడో సంవత్సరంలో 7,898 మందికి 2,362 మంది ఉత్తీర్ణత సా«ధించగా, 5,482 ఫెయిల్ అయ్యారు. 51 మంది మాల్‌ప్రాక్టీస్‌లో బుక్ అయ్యారని వీసీ పేర్కొన్నారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ గిరిజ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 106 మంది విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్ కింద్ బుక్ అయ్యారని, వారు ఈనెల 14న కమిటీ ముందు హాజరుకావాలని సూచించారు. అలాగే, విద్యార్థులు పరీక్ష పత్రాల రీ వాల్యుయేషన్ కోసం 19 లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు నాగభూషణం, అధ్యాపకులు మనోజ, పవన్‌కుమార్, నూర్జహాన్, జైపాల్‌రెడ్డి, కిశోర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నతవిద్యకు అవరోధాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో ఉన్నత విద్యకు అడుగడునా అవరోదాలు ఎదురవుతున్నా యి. అక్షరాస్యతలో అత్యంత వెనకబడిన ఈ ప్రాంత విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న పాలమూరు యూనివర్సిటీ పలు సమస్యలతో సతమతమవుతోంది. ముఖ్యంగా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పీజీ కాలేజీల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. యూనివర్సిటీ పరిపాలన విభాగం పర్యవేక్షణలో విఫలం కావడంతో ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోంది. ముఖ్యంగా పీజీ కళాశాలల్లో కొలిక్కిరాని వివాదాలు కూడా ప్రధాన సమస్యగా మారింది. వనపర్తి పీజీ కాలేజీలో రెండు నెలల క్రితం జరగాల్సిన ప్రాక్టికల్స్ ఇప్పటివరకు నిర్వహించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. పాలనా యంత్రాంగం జాప్యం ప్రభుత్వం 2008లో పాలమూరు యూనివర్సిటీని నెలకొల్పింది. విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసేందుకు నాలుగు చోట్ల పీజీ సెంటర్లను నియమించింది. అం దుకు అనుగుణంగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో వనపర్తి, గద్వాల, కొల్లాపూర్‌లలో పీజీ సెంటర్లను ఏ ర్పాటు చేసింది. మౌళిక వసతుల కల్పన అటుంచితే కనీస సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు ఇబ్బంది ప డుతున్నారు. సైన్స్ ప్రాక్టికల్స్, సీబీసీఎస్ (చాయస్బే స్డ్ క్రెడిట్ సిస్టం) నిర్వీర్యమవుతున్నాయి. సీబీసీఎ స్ విధానంలో విద్యార్థులకు వారు పీజీలో ఎం చుకున్న సబ్జెక్టుతో పాటు ఈ విధానం ద్వారా అద నంగా సబ్జెక్టులు చదువుకునేందుకు వీలుంటుంది. వేధిస్తున్న అధ్యాపకుల కొరత పీజీ కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేకపోగా చాలా మంది అధ్యాపకులు కాంట్రాక్టు పద్ధతిలోనే పనిచేస్తున్నారు. ప్రతి పీజీ కోర్సులో కనీసం ఐదు సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జక్టులకు అధ్యాపకులు ఉండాలి. కానీ పొలిటికల్ సైన్స్ విభాగంలో కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. మొదట్లో ఆరు మంది అధ్యాపకులు ఉండగా వారిలో ఇద్దరిని తొలగించడంతో ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారు. దీంతో విద్యార్థులకు సబ్జెక్టులు ఎంపిక చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అధ్యాపకులు సూచించిన ఐదు సబ్జెక్టులను మాత్రమే విద్యార్థులు చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు కళాశాలల్లో చదవుతున్న విద్యార్థులకు కూడా ఇవే సమస్యలు ఎదురవుతున్నాయి. వనపర్తి పీజీ కాలేజీలో వివాదం వనపర్తిలో ఉన్న పీజీ కళాశాలకు కనీసం సొంత భవనం కూడా లేదు. కొన్నేళ్లుగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలోనే నిర్వహణ సాగిస్తున్నారు. డిగ్రీ కళాశాలకు చెందిన తరగతి గదులు, ల్యాబ్‌లు, స్టాఫ్రూంలలోనే పీజీ కళాశాల సిబ్బంది సర్దుకుంటున్నారు. డిగ్రీ కళాశాల సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు ఉండడంతో పీజీ కళాశాల తరగతులను మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.30 గంటల వరకు కొనసాగిస్తున్నారు. గతంలో పీజీ తరగతులు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో అధ్యాపక సిబ్బంది లేక డిగ్రీ కళాశాల అధ్యాపకులు పీజీ తరగతులు, ల్యాబ్ పాఠాలు బోధించే వారు. దాంతోపాటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రఘునాథ్‌రెడ్డి పీజీ కళాశాల వ్యవహారాలను చూసుకోవాలని పీయూ అధికారులు మౌఖికంగా ఆదేశించడంతో పీజీ కళాశాల తరగతులను పర్యవేక్షణ చేస్తున్నారు. కొంతకాలంగా పీయూ అధికారులు ప్రిన్సిపాల్, అధ్యాపకులు, కంప్యూటర్ ఆపరేటర్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు ఇతర సిబ్బందికి కొంత నగదు చొప్పున ప్రతీనెల గౌరవవేతనం చెల్లించారు. ప్రస్తుతం పీజీ కళాశాలకు పూర్తి స్థాయిలో అధ్యాపక సిబ్బంది రావడంతో ఏడాది కాలంగా నిలిపి వేశారు. ఇటీవల వీసీ రాజరత్నం కళాశాలను సందర్శించి ల్యాబ్‌లకు హెచ్ఓడీలుగా పీజీ అధ్యాపకులే వ్యవహరించాలని ఆదేశించారు. దీంతో కాలేజీలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డిగ్రీ కాలేజీ సిబ్బంది పూర్తిగా సహాయ నిరాకరణ చేపట్టారు. దీంతో సాయంత్రం 3.30 కాగానే డిగ్రీ సిబ్బంది మొత్తం కాలేజీకి తాళాలు వేసుకొని వెళ్తున్నారు. అటు యూనివర్సిటీ అధికారులు, ఇటు డిగ్రీ కళాశాల సిబ్బంది వైఖరి వల్ల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 4వ సెమిస్టర్ తరగతులు ప్రారంభమైనా ప్రాక్టికల్స్‌కు దిక్కేలేదు. ప్రాక్టికల్స్ జరగలేదు మా కాలేజీలో కొన్ని నెలలుగా ప్రాక్టికల్స్ తరగతులు జరగలేదు. ఒకప్పుడు డిగ్రీ కళాశాల ల్యాబ్‌లోనే పీజీ విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించారు. కానీ ఇప్పుడు అవికూడా నిలిచిపోయాయి. – అశోక్, ఎంఎస్సీ, సెకండియర్, వనపర్తి అధికారులు స్పందించాలి ఫోర్త్ సెమిస్టర్ తరగతులు కూడా మొదలయ్యాయాయి. మా కాలేజీలో ఇంతకు సైన్స్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారో లేదో యూనివర్సిటీ అధికారులు చెప్పాలి. సైన్స్ గ్రూప్‌లో ప్రాక్టికల్స్ చాలా ముఖ్యం. వివాదాలు పక్కనబెట్టి తరగతులు నిర్వహించాలి. – కృష్ణవేణి, ఎంఎస్సీ, సెకండియర్, వనపర్తి సమస్యలు పరిష్కరిస్తున్నాం యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లోని సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. వనపర్తి పీజీ కాలేజీలో ప్రాక్టికల్స్ జరగడం లేదన్న విషయం నాకు తెలియదు. ఎగ్జామ్స్ షెడ్యూల్స్ అంతా రిజిస్ట్రార్ చూసుకుంటారు. విచారణ చేసి వనపర్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తాం. – రాజారత్నం, పాలమూరు యూనివర్సిటీ వీసీ -
అంతా ఓకే.. కానీ!
పాలమూరు: ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం మాదిరిగానే పాలమూరులోని మెడికల్ కళాశాలలో నాలుగో సంవత్సరం తరగతుల నిర్వహణకు కూడా అనుమతి లభించే అవకాశముందని తెలుస్తోంది. ఎంసీఐ బృందం శుక్రవారం చేపట్టిన తనిఖీల అనంతరం అధికారులు వెల్లడించిన అభిప్రాయమిది. అయితే, అధికారులు మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలో కొన్ని సమస్యలను గుర్తించినా వాటిని సరి చేసుకుంటామని వారు చెబుతున్నారు. పాలమూరు మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రితో ఉన్న వసతులు, సౌకర్యాలను ఎంసీఐ బృందం శుక్రవారం పరిశీలించింది. ఎంసీఐ బృందం సభ్యులు డాక్టర్ సయ్యద్, డాక్టర్ అభయ్‌కుమార్, డాక్టర్ మమత రాగా, డీఎంఈ రమేష్‌రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్‌రెడ్డి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ వారి వెంట ఉండి ఇక్కడి సౌకర్యాలను వివరించారు. విడివిడిగా.. ఎంసీఐ బృందం సభ్యులు మొదట విడివిడిగా జనరల్ ఆస్పత్రిని, మెడికల్ కళాశాలలో అన్ని విభాగాలను క్షుణంగా పరిశీలించారు. బృందం సభ్యుల్లో ఒకరు వైద్య కళాశాల, మరొకరు ల్యాబ్‌లు, వసతి గృహాలను పరిశీలించగా.. ఇంకొకరు జనరల్ ఆస్పత్రిలో పరిశీలించారు. ఆ తర్వాత తాము గుర్తించిన అంశాలపై నివేదికలు రూపొందించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ థియేటర్, పిడియాట్రిక్, ఆర్థో, జనరల్ వార్డు, గైనిక్, లేబర్ రూం, డయాలసిస్, కంటి విభాగాలను తనిఖీ చేసిన వారు నూతన వైద్యుల పనితీరు, హాజరు, ల్యాబ్‌లు, తరగతి గదులు, ఇతర సౌకర్యాలపై ఆరా> తీశారు. ఆ తర్వాత సర్జికల్ వార్డులో గత పది రోజులుగా ఎన్ని కేసులు వచ్చాయి, ఎందరికి చికిత్స అందజేశారో తెలుసుకున్నారు. ఈక్రమంలోనే కేస్‌షీట్లు సక్రమంగా లేవని గుర్తించిన ఎంసీఐ బృందం అక్కడ విధుల్లో ఉన్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆనంతరం ఐసీయూ, చిన్న పిల్లల విభాగం, స్కానింగ్ సెంటర్లు, శిశు సంజీవని, రక్త పరీక్షల విభాగం, ల్యాబ్‌ను తనిఖీ చేశారు. జనరల్ వార్డులో పరిశీలన సందర్భంగా ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎందరు రోగులు ఉన్నారని అడిగితే సిబ్బంది సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇక కొన్ని వార్డుల దగ్గర నర్సులు లేకపోవడతో ఎంసీఐ బృందం సభ్యులు.. సరిపడా సిబ్బంది లేరా అని ప్రశ్నించారు. కేవలం ప్రసవాలేనా? జనరల్ ఆస్పత్రి పరిశీలన సందర్భంగా ఎంసీఐ బృందం సభ్యులు ఒక్కో వైద్యుడితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి వసతులు ఉన్నాయి. ఇంకా ఏమేం కావాలని చర్చించారు. ఆస్పత్రి పరిశీలన సందర్భంగా.. ఇక్కడ కేవలం ప్రసవాలే తప్ప ఇతర వ్యాధులకు చికిత్స అందించడం లేదని వారు గుర్తించారు. దీంతో ‘మీ సేవలు ఇంతేనా’ అని ప్రశ్నించినట్లు సమాచారం. ఇంత పెద్ద ఆస్పత్రి ఒక ముఖ్య శస్త్రచికిత్స కూడా జరగకపోవడం ఆశ్చర్యకంగా ఉందని పేర్కొంటూ.. సర్జికల్ వార్డులు ఉన్నా ముఖ్యమైన సర్జరీలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఆ తర్వాత వారు ఎదిర శివారులో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవనాలు, ఎదిర పీహెచ్‌సీతో పాటు రామయ్యబౌళి అర్బన్ హెల్త్ సెంటర్‌ను పరిశీలించారు. -
పీయూకు ఖాళీల సెగ!
♦ పాలమూరు యూనివర్సిటీలోని బోధన విభాగంలో ఖాళీలు ♦ మన యూనివర్సిటీలు పీయూకు పోస్టుల మంజూరు.. ♦ 17 ప్రొఫెసర్లు 34అసోసియేట్ ప్రొఫెసర్లు ♦ 68అసిస్టెంట్ ప్రొఫెసర్లు 16ప్రొఫెసర్లు ♦ 30అసోసియేట్ ప్రొఫెసర్లు 50అసిస్టెంట్ ప్రొఫెసర్లు ♦ 96మొత్తం ఖాళీలు.. మహబూబ్‌నగర్ నుంచి గంగాపురం ప్రతాప్‌రెడ్డి : వెనుకబడిన పాలమూరు జిల్లాలో విద్యార్థులకు నాణ్య మైన విద్యను అందించేందుకు ఉన్న ఏకైక విశ్వవిద్యాలయంపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. ఏళ్లుగా విద్యాలయాన్ని అధ్యాపకుల కొరత వేధిస్తున్నా.. పట్టించుకునేవారు లేరు. యూనివర్సిటీ ప్రారంభించి తొమ్మిదేళ్లయినా రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో సీబీసీఎస్ (చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) అమలు చేయడం సవాలుగా మారింది. ‘న్యాక్’ దూరం నిబంధనల ప్రకారం అధ్యాపకుల భర్తీ లేకపోవడంతో న్యాక్ గుర్తింపు రాలేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు అందక యూనివర్సిటీ అభివృద్ధి కుంటుపడింది. అంతంతే సిబ్బంది.. ప్రస్తుతం 125 మంది కాంట్రాక్టు అధ్యాపకులు అకాడమిక్ కన్సల్టెంట్లుగా పనిచేస్తున్నారు. సాధారణంగా అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫె సర్లు నిర్దేశించిన విధంగా తక్కువ తరగతులు బోధిస్తారు. కానీ ఇక్కడ ఎక్కువ తరగతులు బోధిస్తున్నారు. యూనివర్సిటీ ప్రారంభం నాటి నుంచి అధికారులు ప్రభుత్వానికి ఏటా అధ్యాపకుల కొరత విషయమై ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 125 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 23 మంది రెగ్యులర్ అ«ధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ అధ్యాపకుల్లో ఒక ప్రొఫెసర్, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 18 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఇక గద్వాల పీజీ సెంటర్లో ఇద్దరు, కొల్లాపూర్ పీజీ సెంటర్లో ఒకరు, యూనివర్సిటీ కళాశాలలో 20 మంది మాత్రమే రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు. మిగతా వారంతా కాంట్రాక్టు సిబ్బందే. 23 నియామకాలే.. ఒక యూనివర్సిటీలో పీజీతో పాటు పలు పరిశోధన కోర్సు లు ప్రవేశపెడితే కచ్చితంగా ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసి యేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫె సర్లతో ఒక రీడర్ అవసరం. ఇలా ఒక డిపార్ట్ మెంట్‌కు దాదాపు ఏడుగురు అధ్యాపకులు అవసరం ఉంటారు. అయితే ఇక్కడి పరిస్థితు లు భిన్నంగా ఉన్నాయి. పీయూ ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు కేవలం 23 మంది రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలే జరి గాయి. యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెంటర్ల యిన గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్‌లలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఫార్మసీ, ఎంఈడీ విభాగాల్లోనూ.. పీయూకు అనుబంధంగా ఫార్మసీ, ఎంఈడీ కళాశాలలు న్నాయి. యూనివర్సిటీ పరిధి లో 119 రెగ్యులర్ పోస్టులతో పాటు ఫార్మసీ, ఎంఈడీ విభాగాలను కలుపు కుంటే 172 మంది అధ్యాపకులు అవసరం. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వంటి 17 విభాగాల్లో పీయూ కళాశాలలో 700 మంది విద్యార్థినులు ఉండగా, దాదాపు 1000 మందికిపైగా విద్యార్థులు ఉంటారు. -
రోడ్డు ప్రమాదంలో పీయూ సెక్యూరిటీగార్డు దుర్మరణం
మహబూబ్‌నగర్ క్రైం: రోడ్డు దాటుతుంటే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పీయూలో పీయూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. రూరల్ ఎస్ఐ రాజేశ్వర్‌గౌడ్ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ మండలం ధర్మపూర్‌కి చెందిన వాకిటి రాజు(40) గతేడాది నుంచి పీయూలో ఔట్‌సోర్సింగ్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి విధుల్లోకి వచ్చాడు. గురువారం తెల్లవారుజామున టాయిలెట్ కోసం రోడ్డు దాటì వెళ్లి, తిరిగి వస్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో, తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. మృతుడు రాజుకు భార్య యశోద, ఇద్దరు పిల్లలు విజయలక్ష్మి, మౌనిక ఉన్నారు. సంఘటన స్థలాన్ని రూరల్ పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. విద్యార్థి సంఘాలు ఆందోళన సెక్యూరిటీగార్డు రాజు మృతదేహంతో పీయూ విద్యార్థి సంఘాల నాయకులు పీయూలో ఆందోళన చేశారు. అప్పడే అక్కడికి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, వీసీ భూక్యా రాజారత్నంకు వినతిపత్రం ఇచ్చారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు పిల్లల చదువు అయ్యే ఖర్చు, నష్టపరిహారం చెల్లించాలని కోరారు. స్పందించిన వీసీ భూక్యా రాజారత్నం పీయూలో ఒకరికి ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మంత్రి జూపల్లి, నిరంజన్‌రెడ్డిలు ఇరువురు కలిసి రూ.50వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పీయూలో పని చేస్తున్న ఆచార్యులు, అధ్యాపకులు ఒకరోజు జీతం చెల్లిస్తామని తెలిపారు. -
ఫలించిన కల!
ఉద్యమాలు, ధర్నాలకుదక్కిన ప్రతిఫలం ఎంతోమంది విద్యార్థులకు లబ్ధి పాలమూరు యూనివర్సిటీ : పాలమూరు యూనివర్సిటీ (పీయూ)కు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) గుర్తింపు లభించింది. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీ నుంచి యూనివర్సిటీకి లేఖ పంపారు. ఇక నుంచి దేశంలో ఉన్న అతి ముఖ్యమైన యూనివర్సిటీల సరసన పీయూ నిలవనుంది. దీంతో పాటు ఇక్కడ చదివిన వి ద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉండనుంది. పీసీఐ గు ర్తింపు వచ్చినట్లు లేక రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పీసీఐ గుర్తింపు కోసం పీయూ విద్యార్థులు ఏడేళ్ల కాలం నుంచి రోజుల తరబడి ఎన్నో ఉద్యమాలు.. పరీక్షల బహిష్కరణ..ధర్నాలు.. రాస్తారోకోలు చేశారు. దీంతో వాటికి ప్రతిఫలం దక్కింది. పాలమూరు యూనివర్సిటీ 2008 ఆగస్టులో ప్రారంభం కాగా, ఇందులో ఫార్మసీ కళాశాల 2009లో ఏర్పాటు చేశారు. కళాశాల ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌లు చదువు పూర్తి చేసుకున్నా బయటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం నాలుగో బ్యాచ్ నడుస్తోంది. పీసీఐ అంటే.. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)ని పార్లమెట్ నామినేట్ చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తుంది. దీనిని 1948లో ప్రారంభించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఫార్మసీ విద్య ఎలా కొనసాగుతుందో అనే విషయాన్ని పరిశీలన చేయడం పీసీఐ బాధ్యత. పీసీఐ గుర్తింపు లేని యూనివర్సిటీలను సందర్శించి అక్కడ కనీస సౌకర్యాలు ఉన్నాయా.. పీసీఐ గుర్తింపు ఇవ్వడానికి ఆ విశ్వవిద్యాలయానికి అర్హత ఉందో లేదో పరిశీలన చేస్తారు. అర్హత ఉంటే ఆ యూనివర్సిటీకి గుర్తింపు ఇస్తారు. గుర్తింపు ఇవ్వడం వల్ల యూనివర్సిటీ ఖ్యాతి పెరగడంతో పాటు అక్కడ చదువుకునే విద్యార్థులకు అన్ని రంగాల్లో అవకాశాలు ఉంటాయి. పీసీఐ వల్లే విద్యార్థులకు జరిగే మేలు.. పీసీఐ గుర్తింపు రావడం వల్ల స్థానికంగా చదువుకునే విద్యార్థులు ఎంతో మేలు చేకూరనుంది.. చదువు పూర్తయిన తర్వాత విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్టు ఉద్యోగ అవకాశం, డ్రగ్గిస్ట్ ఉద్యోగాలు, రైల్వే ఫార్మసిస్ట్, మిలిటరి ఫార్మసిస్టు, స్వతహాగా మెడికల్ దుకాణం పెట్టుకోవడానికి అవకాశం ఇలా ప్రతి ఉద్యోగానికి పీసీఐ గుర్తింపు ఉన్న సర్టిఫికెట్ చాలా ఉపయోగంగా ఉంటుంది. పీసీఐ గుర్తింపు లేకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి ఉద్యోగానికీ వారు అర్హులు కాదు. మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద పరిశ్రమలలో పీసీఐ గుర్తింపు ఉన్న కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. పీయూను రెండుసార్లు సందర్శించిన పీసీఐ పాలమూరు యూనివర్సిటీని పీసీఐ బృందం 2014 జనవరిలో మొదటిసారి పరిశీలించింది. ఇద్దరు సభ్యుల బృందం.. ఫార్మసీ కళాశాల, హాస్టల్, ఫార్మసీ ల్యాబ్‌లు, ఇతర సౌకర్యాలపై పరిశీలన చేసి వెళ్లింది. అప్పుడు పీసీఐ గుర్తింపు ఇవ్వాల్సిన సౌకర్యాలు స్థానికంగా లేవని నివేదిక ఇవ్వడంతో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 2015 డిసెంబర్లో మరోమారు ఇద్దరు సభ్యుల బృందం సందర్శించింది. సభ్యులు స్థానిక సౌకర్యాలపై కొంతవరకు తృప్తి చెంది వెళ్లారు. పీయూ నుంచి పీసీఐ గుర్తింపు కోసం అవసరం అయిన పత్రాలు పంపించడంతో దాదాపు మూడు నెలల తర్వాత గుర్తింపు ఇస్తూ లేఖ పంపించారు. ఫార్మసీలో 4వ బ్యాచ్ రన్నింగ్.. పీయూలో ఫార్మసీ కళాశాల 2009లో ఏర్పాటు చేశారు. మూడు బ్యాచ్‌లలో 180మంది విద్యార్థులు విద్యను పూర్తి చేసి బయటకు వెళ్లారు. ప్రస్తుతం ఫార్మసీలో 4వ బ్యాచ్ నడుస్తుంది. ఆ విద్యారుల్థ చదువు కూడా మేలో ముగుస్తుంది. దీంతో పీసీఐ వల్ల వెళ్లిపోయిన 180మందితో పాటు ప్రస్తుతం చదువుకుంటున్న 60మందికి కూడా పీసీఐ గుర్తింపు దక్కనుంది. -
వాడిపోతున్న విద్యావనాలు
నవ తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఉత్పత్తి కేంద్రాలుగా విలసిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు బోధకులు లేక వెలవెల బోతున్నాయి.. మౌలిక సదుపాయాలు లేక కునారిల్లిపోతున్నాయి.. రాష్ట్రంలో ఏడు వర్సిటీలు వైస్చాన్స్లర్లు లేకుండానే కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికీ చాలా వర్సిటీల్లో ఉండాల్సిన బోధన సిబ్బందిలో మూడో వంతు కూడా లేరు. దీంతో కోర్సుల నిర్వహణ కష్టతరమవుతోంది. ⇒ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా యూనివర్సిటీల పాలన ⇒ వీసీల నియామకం లేదు.. ప్రొఫెసర్ల భర్తీ లేదు ⇒ 8 మందితో నడుస్తోన్న పాలమూరు వర్సిటీ ⇒ మిగతా వర్సిటీల్లోనూ50 శాతం ఖాళీలే సాక్షి,హైదరాబాద్: గతమెంతో ఘన కీర్తి కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుతో సహా దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులను తీర్చిదిద్దిన ఓయూ క్రమం గా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. 100 ఏళ్ల సంబరానికి దగ్గరవుతున్న ఈ వర్సిటీలో ఏడు నెలల నుంచి వీసీ కూడా లేడు. ఓయూలో 1,230 బోధనా సిబ్బంది పోస్టులు ఉంటే వాటి లో 630 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదవీ విరమణ చేస్తున్నవారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. ఫలితంగా నాలుగేళ్లుగా వర్సిటీ పరిస్థితి దిగజారింది. ఇటీవల దాకా దేశంలో ఐఐటీల తరువాత స్థానాన్ని ఆక్రమించిన ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పుడు తన స్థానాన్ని మరింతగా దిగజార్చుకుంటోంది. ఫ్యాకల్టీ లేని కారణంగా ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పెంచేందుకు ఏఐసీటీఈ అంగీకరించడం లేదు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) డిపార్టుమెంట్ లేదు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు విస్తృతంగా ఉన్న తరుణంలో ముఖ్యమైన ఐటీ కోర్సును ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. సరైన బోధనా సిబ్బంది లేక ఓయూలో కొన్ని కోర్సులు ‘నాక్’ గుర్తింపు కోల్పోయినట్లు తెలిసింది. నాక్ గుర్తింపు కోల్పోయిన కోర్సుల వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్న అధికారులు ప్రస్తుతానికి ఆ సమస్యేమీ లేదని చెబుతున్నారు. ఏడు వర్సిటీల్లోనూ అదే పరిస్థితి తెలంగాణలోని 7 రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలకు 2,232 మంజూరైన పోస్టులు ఉంటే ప్రస్తుతం వాటిల్లో 1,122 మంది మాత్రమే బోధన సిబ్బంది ఉన్నారు. 1,110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త పోస్టులను మంజూరు చేయలేదు. పాలమూరు విశ్వ విద్యాలయం ప్రారంభంలో ఇచ్చిన 28 పోస్టులను కూడా పూర్తిగా భర్తీ చేయలేదు. శాతవాహన విశ్వవిద్యాలయంలో 44 బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరు చేసి 21 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ఓయూలో 1,230 వరకు మంజూరైన పోస్టులుంటే 600 మంది పనిచేస్తున్నారు. మహాత్మాగాంధీ వర్సిటీలో 14 పోస్టులు ఉంటే నలుగురే పనిచేస్తున్నారు. మిగతా వర్సిటీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇన్‌చార్జీలే దిక్కు: తెలుగు విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్‌లోని పాలమూరు, కరీంనగర్‌లోని శాతవాహన మినహా మిగతా అన్ని వర్సిటీలు ఇన్చార్జీల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఓయూ, కేయూ, నిజామాబాద్‌లోని తెలంగాణ, నల్లగొండలోని మహాత్మాగాంధీ, హైదరాబాద్‌లోని జేఎన్టీయూ(హెచ్), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు ఐఏఎస్ అధికారులు, వేరే యూనివర్సిటీల వీసీలే ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. పదిమందీ లేకుండా ‘పాలమూరు’ పాలన రాష్ట్రంలో అత్యంత వెనకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం కూడా విద్యా బోధనలో పూర్తిగా వెనక బడింది. ఇక్కడ బోధనా సిబ్బంది ఆరుగురు, బోధనేతర సిబ్బంది ఇద్దరు. మొత్తం 8 మందితో వర్సిటీ పాలన సాగుతోంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.డిగ్రీ కళాశాలలో ఉండే సిబ్బంది సంఖ్యలో పదో వంతు కూడా ఇక్కడ లేకపోవడం గమనార్హం. తెలంగాణలో రెండో అతిపెద్ద కాకతీయ విశ్వ విద్యాలయం పరిస్థితిలోనూ మార్పు లేదు. గడచిన ఏడాది కాలంగా వైస్ చాన్స్‌లర్ లేకుండానే కేయూలో పాలన నడుస్తోంది. నియామకాలు చేపట్టాలి ప్రపంచ బ్యాంకు ఒత్తిడి, ప్రైవేటీకరణలో భాగంగా ఈ పరిస్థితి దాపురించింది. చంద్రబాబు హయాం నుంచే వర్సిటీలు క్రమంగా తమ ప్రాభవాన్ని కోల్పోతూ వస్తున్నాయి. వర్సిటీల్లో లైబ్రరీలు లేవు, ల్యాబరేటరీలు లేవు. బ్లాక్ గ్రాంటు లేదు. ఇప్పటికైనా దూరదృష్టి కలిగిన వీసీలు, ఫ్యాకల్టీని నియమించాలి. - ప్రొ.హరగోపాల్, విద్యావేత్త వీసీలు లేకపోతే ఎలా? యూనివర్సిటీల్లో టీచింగ్, లెర్నింగ్, రీసెర్చ్లకు గెడైన్స్ ఇచ్చేది వీసీలే. వాళ్లే లేకుంటే ఇంకా వర్సిటీలు ఎలా మనుగడ సాగిస్తాయి..ప్రొఫెసర్ పరిశోధనను విస్తరించేందుకు మార్గదర్శనం చేస్తారు. కానీ, అలాంటి వారే లేకపోతే బోధించేదెవరు?.ఇప్పటికైనా పోస్టులను భర్తీ చేయాలి. - చుక్కా రామయ్య, విద్యావేత్త -
పట్టాల పండుగ
నేడు పీయూ స్నాతకోత్సవం పాలమూరు యూనివర్సిటీ: పాలమూరు విశ్వ విద్యాలయం తొలి స్నాతకోత్సవానికి యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ హాజరవుతున్నారు. యూనివర్సిటీ ఛాన్స్లర్ హోదాలో కార్యక్రమానికి గవర్నర్ అధ్యక్షత వహిస్తారు. బెంగళూరుకు చెందిన నేషనల్ అసెస్మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్)డెరైక్టర్ ప్రొఫెసర్ ఏ.ఎన్.రాయ్ స్నాతకోపన్యాసం చేయనున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో విద్యనభ్యసించి అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 65మంది విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. 2008లో యూని వర్సిటీ స్థాపితమైనా తొలిసారిగా స్నాతకోత్సవం జరుగుతుండడంతో యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. గవర్నర్ నరసింహన్ హాజరవుతుండడంతో పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించాయి. పీయూ ముఖద్వారం నుంచి కాన్వకేషన్ లైబ్రరిలో జరిగే భవనం వరకు రోడ్డుకు మరమ్మతులు చేశారు. ముఖద్వారం, భవనాలకు రంగులు వేసి యూనివర్సిటీ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. స్నాతకోత్సవం జరిగే యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రవేశానికి ప్రత్యేక పాసులు జారీ చేయడంతో పాటు సీటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమం అందరికీ కనిపించేలా యూనివర్సిటీ ఆవరణలో ప్రత్యేకంగా ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. యూనివర్సిటీ వీసీ జి.భాగ్యనారాయణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శివరాజు స్నాతకోత్సం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యుల రాక నేపథ్యంలో పోలీసు యంత్రాంగం బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే గవర్నర్ నరసింహన్ రాకపై ఇంకా స్పష్టత రాలేదని యూనివర్సిటీ, పోలీసు వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది. -
ఫలించిన కల
పాలమూరు యూనివర్సిటీ: ఆరేళ్ల కల ఫలించింది. పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ)స్నాతకోత్సవానికి ఎట్టకేలకు యూజీసీ నుంచి అనుమతి లభించింది. నవంబర్ 29న పీయూ జరిగే (స్నాతకోత్సవం)కాన్వకేషన్‌లో పట్టభద్రులైన విద్యార్థులు డిగ్రీ, పీజీ పట్టాలు అందుకోనున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా విద్యార్థుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా యూనివర్సిటీలో కాన్వకేషన్ నిర్వహించాల్సి ఉన్నా.. యూజీసీ నుంచి అనుమతి రాకపోవడంతో ఆలస్యమైంది. ఇదిలాఉండగా, అన్నిరంగాల్లో వెనుకబడిన పాలమూరు జిల్లాలోని గ్రామీణప్రాంత విద్యార్థులకు ఉన్నతచదువులు అందించాలనే సంకల్పంతో 2008లో జిల్లాకేంద్రంలో పాలమూరు యూనివర్సిటీని ప్రారంభించారు. 2010 వరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొనసాగింది. అయితే పీయూలో ఇప్పటివరకు స్నాతకోత్సవం నిర్వహించలేదు. దీంతో యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో చదివిన విద్యార్థులు ప్రొవిజినల్ సర్టిఫికెట్ మాత్రమే పొందుతున్నారు. ఈ సర్టిఫికెట్ కొద్దికాలం మాత్రమే చెల్లుబాటు అవుతుండడంతో ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగం సంపాదించే క్రమంలో పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక అన్ని అడ్డుంకులు దాటుకుని వచ్చేనెల 29న జరిగే మొదటి కాన్వకేషన్‌లో వీరంతా గవర్నర్ లేదా యూనివర్సిటీ ఉపకులపతి చేతులమీదుగా డిగ్రీపట్టా పుచ్చుకోనున్నారు. 50వేల మంది విద్యార్థులకు మేలు పీయూకు అనుబంధంగా 78 డిగ్రీ కళాశాలలు, 41 బీఈడీ, 12 పీజీ, ఒకటి ఎంఈడీ కళాశాల, ఒకటి ఎం ఫార్మసీ కళాశాల ఉంది. ఈ విద్యాలయాల పరిధిలో ఏటా 56,200మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. ఇప్పటివరకు చదువులు పూర్తిచేసుకున్న 8వేల మంది విద్యార్థులు పట్టా సర్టిఫికెట్‌ను అందుకోలేదు. పట్టభద్రులైన విద్యార్థులకు స్నాతకోత్సవం రోజున గవర్నర్ పట్టాలు అందజేస్తారు. లేదంటే యూనివర్సిటీ వీసీ పంపిణీచేస్తారు. స్థిరపడే అవకాశం దక్కింది.. పీయూ పరిధిలో ఉన్న కళాశాలలో పట్టభద్రులైన విద్యార్థులకు కాన్వకేషన్ నిర్వహించడం సంతోషకరం. ఏటా ఎంతో మంది విద్యార్థులు పట్టభద్రులై బయటికి వెళ్తున్నారు. అంతమందికి కాన్వకేషన్ సర్టిఫికేట్లు ఇవ్వడంతో ఎంతోమంది ఉద్యోగ రీత్యా స్థిరపడే అవకాశ ం ఉంది. - అయ్యప్ప, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఇబ్బంది తీరింది ఏటా ఎంతోమంది విద్యార్థులు డిగ్రీ, పీజీలు పూర్తిచేసుకుని బయటికిపోతున్నారు. ప్రొవిజినల్ సర్టిఫికెట్లు మాత్రమే తీసుకోవడంతో ఇబ్బందిపడేవారు. ఉద్యోగాల సమయంలో డిగ్రీపట్టా సమస్య తీరింది. - పవన్‌కుమార్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పీయూ అభివృద్ధికి కృషి పీయూకు స్నాతకోత్సవం రావడం సంతోషకరమైన విషయం. అలాగే యూజీసీ 12- బీ, పీసీఐలు కూడా వచ్చే విధంగా త్వరలోనే చొరవతీసుకుంటాం. ఏటా యూనివర్సిటీకి అరకొరగా నిధులు విడుదల చేస్తున్నారు. అయితే యూజీసీ 12-బీ ఉంటే నిధులు అధికంగా వచ్చేందుకు అవకాశం ఉంది. - ప్రొఫెసర్ శివరాజ్, పీయూ రిజిస్ట్రార్ విద్యార్థులకు మేలు భవిష్యత్‌లో పీయూ అభివృద్ధి కోసం మరిన్ని పనులు చేసేం దుకు కృషిచేస్తాను. గతంలో చెప్పిన విధం గా స్నాతకోత్సవానికి అనుమతి లభించింది. నవ ంబర్ 29న యూనివర్సిటీలో కాన్వకేషన్ నిర్వహిస్తున్నాం. దీనివల్ల ఎంతోమంది పేదవిద్యార్థులకు మేలు జరుగుతుంది. -జి భాగ్యనారాయణ, వీసీ