రాజు మృతదేహం
రోడ్డు ప్రమాదంలో పీయూ సెక్యూరిటీగార్డు దుర్మరణం
Published Fri, Sep 16 2016 12:31 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
మహబూబ్‌నగర్ క్రైం: రోడ్డు దాటుతుంటే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పీయూలో పీయూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. రూరల్ ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ మండలం ధర్మపూర్‌కి చెందిన వాకిటి రాజు(40) గతేడాది నుంచి పీయూలో ఔట్‌సోర్సింగ్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి విధుల్లోకి వచ్చాడు. గురువారం తెల్లవారుజామున టాయిలెట్ కోసం రోడ్డు దాటì వెళ్లి, తిరిగి వస్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో, తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. మృతుడు రాజుకు భార్య యశోద, ఇద్దరు పిల్లలు విజయలక్ష్మి, మౌనిక ఉన్నారు. సంఘటన స్థలాన్ని రూరల్ పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
విద్యార్థి సంఘాలు ఆందోళన
సెక్యూరిటీగార్డు రాజు మృతదేహంతో పీయూ విద్యార్థి సంఘాల నాయకులు పీయూలో ఆందోళన చేశారు. అప్పడే అక్కడికి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, వీసీ భూక్యా రాజారత్నంకు వినతిపత్రం ఇచ్చారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు పిల్లల చదువు అయ్యే ఖర్చు, నష్టపరిహారం చెల్లించాలని కోరారు. స్పందించిన వీసీ భూక్యా రాజారత్నం పీయూలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ద్వారా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మంత్రి జూపల్లి, నిరంజన్‌రెడ్డిలు ఇరువురు కలిసి రూ.50వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పీయూలో పని చేస్తున్న ఆచార్యులు, అధ్యాపకులు ఒకరోజు జీతం చెల్లిస్తామని తెలిపారు.
Advertisement
Advertisement