పట్టాల పండుగ
నేడు పీయూ స్నాతకోత్సవం
పాలమూరు యూనివర్సిటీ: పాలమూరు విశ్వ విద్యాలయం తొలి స్నాతకోత్సవానికి యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ హాజరవుతున్నారు. యూనివర్సిటీ ఛాన్స్‌లర్ హోదాలో కార్యక్రమానికి గవర్నర్ అధ్యక్షత వహిస్తారు. బెంగళూరుకు చెందిన నేషనల్ అసెస్‌మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్)డెరైక్టర్ ప్రొఫెసర్ ఏ.ఎన్.రాయ్ స్నాతకోపన్యాసం చేయనున్నారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీలో విద్యనభ్యసించి అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 65మంది విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. 2008లో యూని వర్సిటీ స్థాపితమైనా తొలిసారిగా స్నాతకోత్సవం జరుగుతుండడంతో యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. గవర్నర్ నరసింహన్ హాజరవుతుండడంతో పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించాయి.
పీయూ ముఖద్వారం నుంచి కాన్వకేషన్ లైబ్రరిలో జరిగే భవనం వరకు రోడ్డుకు మరమ్మతులు చేశారు. ముఖద్వారం, భవనాలకు రంగులు వేసి యూనివర్సిటీ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. స్నాతకోత్సవం జరిగే యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రవేశానికి ప్రత్యేక పాసులు జారీ చేయడంతో పాటు సీటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కార్యక్రమం అందరికీ కనిపించేలా యూనివర్సిటీ ఆవరణలో ప్రత్యేకంగా ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. యూనివర్సిటీ వీసీ జి.భాగ్యనారాయణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శివరాజు స్నాతకోత్సం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యుల రాక నేపథ్యంలో పోలీసు యంత్రాంగం బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే గవర్నర్ నరసింహన్ రాకపై ఇంకా స్పష్టత రాలేదని యూనివర్సిటీ, పోలీసు వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది.