జనరల్ ఆస్పత్రిలో సౌకర్యాలపై ఆరా తీస్తున్న ఎంసీఐ బృందం సభ్యురాలు
పాలమూరు: ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం మాదిరిగానే పాలమూరులోని మెడికల్ కళాశాలలో నాలుగో సంవత్సరం తరగతుల నిర్వహణకు కూడా అనుమతి లభించే అవకాశముందని తెలుస్తోంది. ఎంసీఐ బృందం శుక్రవారం చేపట్టిన తనిఖీల అనంతరం అధికారులు వెల్లడించిన అభిప్రాయమిది. అయితే, అధికారులు మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలో కొన్ని సమస్యలను గుర్తించినా వాటిని సరి చేసుకుంటామని వారు చెబుతున్నారు. పాలమూరు మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రితో ఉన్న వసతులు, సౌకర్యాలను ఎంసీఐ బృందం శుక్రవారం పరిశీలించింది. ఎంసీఐ బృందం సభ్యులు డాక్టర్ సయ్యద్, డాక్టర్ అభయ్‌కుమార్, డాక్టర్ మమత రాగా, డీఎంఈ రమేష్‌రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్‌రెడ్డి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ వారి వెంట ఉండి ఇక్కడి సౌకర్యాలను వివరించారు.
విడివిడిగా..
ఎంసీఐ బృందం సభ్యులు మొదట విడివిడిగా జనరల్ ఆస్పత్రిని, మెడికల్ కళాశాలలో అన్ని విభాగాలను క్షుణంగా పరిశీలించారు. బృందం సభ్యుల్లో ఒకరు వైద్య కళాశాల, మరొకరు ల్యాబ్‌లు, వసతి గృహాలను పరిశీలించగా.. ఇంకొకరు జనరల్ ఆస్పత్రిలో పరిశీలించారు. ఆ తర్వాత తాము గుర్తించిన అంశాలపై నివేదికలు రూపొందించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ థియేటర్, పిడియాట్రిక్, ఆర్థో, జనరల్ వార్డు, గైనిక్, లేబర్ రూం, డయాలసిస్, కంటి విభాగాలను తనిఖీ చేసిన వారు నూతన వైద్యుల పనితీరు, హాజరు, ల్యాబ్‌లు, తరగతి గదులు, ఇతర సౌకర్యాలపై ఆరా> తీశారు. ఆ తర్వాత సర్జికల్ వార్డులో గత పది రోజులుగా ఎన్ని కేసులు వచ్చాయి, ఎందరికి చికిత్స అందజేశారో తెలుసుకున్నారు. ఈక్రమంలోనే కేస్‌షీట్లు సక్రమంగా లేవని గుర్తించిన ఎంసీఐ బృందం అక్కడ విధుల్లో ఉన్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆనంతరం ఐసీయూ, చిన్న పిల్లల విభాగం, స్కానింగ్ సెంటర్లు, శిశు సంజీవని, రక్త పరీక్షల విభాగం, ల్యాబ్‌ను తనిఖీ చేశారు. జనరల్ వార్డులో పరిశీలన సందర్భంగా ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎందరు రోగులు ఉన్నారని అడిగితే సిబ్బంది సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇక కొన్ని వార్డుల దగ్గర నర్సులు లేకపోవడతో ఎంసీఐ బృందం సభ్యులు.. సరిపడా సిబ్బంది లేరా అని ప్రశ్నించారు.
కేవలం ప్రసవాలేనా?
జనరల్ ఆస్పత్రి పరిశీలన సందర్భంగా ఎంసీఐ బృందం సభ్యులు ఒక్కో వైద్యుడితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి వసతులు ఉన్నాయి. ఇంకా ఏమేం కావాలని చర్చించారు. ఆస్పత్రి పరిశీలన సందర్భంగా.. ఇక్కడ కేవలం ప్రసవాలే తప్ప ఇతర వ్యాధులకు చికిత్స అందించడం లేదని వారు గుర్తించారు. దీంతో ‘మీ సేవలు ఇంతేనా’ అని ప్రశ్నించినట్లు సమాచారం. ఇంత పెద్ద ఆస్పత్రి ఒక ముఖ్య శస్త్రచికిత్స కూడా జరగకపోవడం ఆశ్చర్యకంగా ఉందని పేర్కొంటూ.. సర్జికల్ వార్డులు ఉన్నా ముఖ్యమైన సర్జరీలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఆ తర్వాత వారు ఎదిర శివారులో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవనాలు, ఎదిర పీహెచ్‌సీతో పాటు రామయ్యబౌళి అర్బన్ హెల్త్ సెంటర్‌ను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment