పల్నాడు జిల్లాలో అటవీ భూములను తనిఖీ చేసిన అధికారులు
సరస్వతీ భూములు వీటికి దూరంగా ఉన్నట్లు వెల్లడి
మాచవరం: పల్నాడు జిల్లాలో సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో ఫారెస్ట్ లాండ్స్ లేవని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో అటవీ భూములున్నాయోమో పరిశీలించాలని డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు అటవీ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు ఇక్కడి భూమలను శనివారం పరిశీలించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు మాచవరం మండలం చెన్నయపాలెం, దాచేపల్లి మండలం తంగెడ శివారు అటవీ భూములను, సరిహద్దు రాళ్లను పరిశీలించారు.
అటవీ భూములు ఏవీ అన్యాక్రాంతం కాలేదని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు చెప్పారు. అటవీ భూములకు ఎనిమిది మీటర్ల దూరంలోనే సరస్వతీ భూములు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అయినా మరో రెండు రోజులు మాచవరం మండలం భీమవరం, పిన్నెల్లి గ్రామాల సరిహద్దు భూములను కూడా పరిశీలిస్తామన్నారు. ఆయన వెంట డీఆర్వో విజయలక్ష్మి, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు.
రెవెన్యూ భూముల పరిశీలన
మండలంలోని చెన్నయపాలెం, వేమవరం గ్రామాల పరిధిలో ఉన్న రెవెన్యూ భూములను తహసీల్దార్ క్షమారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరస్వతీ సంస్థకు చెందిన కొంత భూమి వెబ్‌ల్యాండ్ చేయడం జరిగిందని, మరికొంత భూమి వెబ్‌ల్యాండ్ చేయాల్సి ఉందని చెప్పారు.
రికార్డులను తనిఖీ చేసి ప్రభుత్వ భూములు ఏమైనా అన్యాక్రాంతం అయ్యాయా లేదా అనే విషయాన్ని తేలుస్తామని చెప్పారు. వార్తా కథనాలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజులు ఆ గ్రామాల్లోని భూములలో సర్వే చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment