సాక్షి, మహబుబ్‌నగర్ : అమ్మాయిలా బుర్ఖా ధరించి ఓ యువకుడు బాలికల వసతిగృహంలోకి వెళ్లి.. హాస్టల్ సిబ్బందికి పట్టుబడ్డాడు. వారు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబుబ్‌నగర్‌లోని పాలమురులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలమూరు యూనివర్శిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రి ద్వితీయ సంవత్సరం చదువుతున్న సద్దాం హుస్సేన్ అనే యువకుడు ఈ నెల 16న రాత్రి 11 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి ఆమె ఉండే హాస్టల్‌కు వెళ్లాడు.
ఎవరికి అనుమానం రాకుండా అమ్మాయిలాగా బుర్ఖా ధరించాడు. పక్క గదులలో ఉన్న విద్యార్థినులు గమనించి హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. వార్డెన్ అతడ్ని పట్టుకుని మందలించారు. అతడ్ని వెంటతీసుకొచ్చిన యువతిని కూడా మందలించారు. మళ్లీ ఇలాంటి పనులు చేయొద్దంటూ చెప్పి.. అతని సెల్‌ఫోను తీసుకుని మరుసటి రోజు వచ్చి తీసుకోవాల్సిందిగా సూచించారు. అతనితో ఒక లేఖ కూడా రాయించుకున్నారు. అయితే మనస్తాపానికి గురైన సద్దాం మరుసటి రోజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ విషయం శుక్రవారం వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్న సద్దాం తల్లిదండ్రులు గురువారం ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. తమ కుమారుడి మృతిపై పూర్తి విచారణ జరిపించాల్సిందిగా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని రైల్వే ఎస్.ఐ రాఘవేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment