పురపాలికల్లో ‘స్వచ్ఛ సర్వేక్షన్‌’  | Urban Survey - 2012 will be undertaken by the Ministry of Urban Development | Sakshi
Sakshi News home page

పురపాలికల్లో ‘స్వచ్ఛ సర్వేక్షన్‌’ 

Published Mon, Dec 10 2018 11:49 AM | Last Updated on Mon, Dec 10 2018 11:49 AM

 Urban Survey - 2012 will be undertaken by the Ministry of Urban Development - Sakshi

సాక్షి, కల్వకుర్తి టౌన్‌: కేంద్ర స్వచ్ఛ భారత్‌ మిషన్, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న స్వచ్ఛ సర్వేక్షన్‌ –2019 పోటీలకు పురపాలికలు ముస్తాబవుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన కార్వే కన్సల్టెన్సీ బృందం సభ్యులు ఆయా మున్సిపాలిటీల్లో పర్యటిస్తూ, స్వచ్ఛతపై వివరాలు సేకరిస్తారు. ఈ బృందం కాలనీల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించడంతోపాటు స్థానికుల నుంచి వివరాలు తీసుకుని కేంద్రానికి పంపిస్తారు.

వీరు సేకరించే వివరాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్‌ ర్యాంక్‌లను ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షన్‌–2019 పోటీలకు తొమ్మిది పురపాలికలు, ఒక మేజర్‌ మున్సిపాలిటీలు సన్నద్ధం అవుతున్నాయి. పోటీల్లో అత్యుత్తమ ర్యాంక్‌ సాధించేందుకు అధికార యంత్రాగం కసరత్తు ప్రారంభించింది. స్వచ్ఛత ప్రణాళికపై దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల కేంద్రం థర్ట్‌ పార్టీ బృందం రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలలో సర్వే నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు స్వచ్ఛ సర్వేక్షన్‌లోని మార్గదర్శకాలపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లకు దిశానిర్దేశం చేశారు.

ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు స్వచ్ఛ సర్వేక్షన్‌లోని మార్గదర్శకాలపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లకు దిశానిర్దేశం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా నగరాలు, పట్టణాలను స్వచ్ఛమైన నివాస ప్రాంతాలుగా మార్చాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీలలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. గతంలో 2016, 2017, 2018లో సాధించిన ర్యాంకుల కంటే ఉత్తమంగా 2019 ఏడాదిలో ర్యాంకు సాధించాలన్న సాధనలో ప్రత్యేక ప్రణాళిక లక్ష్యాల తయారీలో నిమగ్నమయ్యారు. 


మిగిలింది 25 రోజులే.. 
దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షన్‌–2019 పోటీలో 4,231నగరాలు, పట్టణాలు పోటీపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోటీ పెరిగింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అధికారులు విరామం లేకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, శ్రమిస్తూ ఉత్తమ స్వచ్ఛ నగర కల సాకారం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వచ్చే జనవరి 4 నుంచి ఫిబ్రవరి 4వ తేదీలలో ఎప్పుడైనా స్వచ్ఛ సర్వేక్షన్‌ థర్డ్‌ పార్టీ క్యూసీఐ బృందాలు నగరాలు, పట్టణాలను తనిఖీ చేస్తాయి.

స్వచ్ఛ సర్వేక్షన్‌కు వస్తున్న బృందాల్లో అసెసర్లు, నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ప్రజల అభిప్రాయాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పబ్లిక్‌ టాయిలెట్ల పరిశుభ్రత, దేవాలయాలు, మసీదు, చర్చీలు, ఆర్టీసీ బస్‌ స్టేషన్లు, రైలు స్టేషన్లు, చెత్త సేకరిస్తున్న విధానం, అందుకు వినియోగిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, సేకరించిన చెత్త నిత్వ కేంద్రాలు, చెత్త ప్రాసెసింగ్‌ తదితర వివరాలను మదింపు చేస్తారు.

ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా ప్రజలను ప్రశ్నించి, వివరాలు రాబడుతారు. స్వచ్ఛ సర్వేక్షన్‌ నిర్వహించే అధికారులు, క్యూసీఐ అధికారులు ప్రతి మున్సిపాలిటీని నాలుగు విభాగాలుగా విభజించి, వాటికి తగిన మార్కులను కేటాయిస్తారు. అందులో సర్వీస్‌ లెవల్‌ చెంచ్‌ మార్కుకు 1,250 మార్కులు, థర్డ్‌ పార్టీ అసెసర్ల పరిశీలన ద్వారా 1,250 మార్కులు, సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ద్వారా 1,250 మార్కులు, సర్టిఫికెట్, ఓడీఎఫ్, గ్యార్బేజీ, ఫ్రీసిటీ, కెపాసిటీ బిల్డింగ్‌ ద్వారా 1,250మార్కులను కేటాయించి, ర్యాంకులు ప్రకటిస్తారు.  


ఉమ్మడి జిల్లాలో గతేడాది ర్యాంక్‌లు   
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మేజర్‌ మున్సిపాలిటీ మహబూబ్‌నగర్‌తో పాటు పురపాలికలు నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, నారాయణపేట, బాదేపల్లి, అయిజ, గద్వాల, షాద్‌నగర్‌ ఉన్నాయి. లక్ష జనాభాకు తక్కువ ఉన్న మున్సిపాలిటీలను జోనల్‌ ర్యాంకింగ్‌ ద్వారా, లక్ష జనాభాకు పైబడి ఉన్నవారిని నేషనల్‌ ర్యాంకింగ్‌ ద్వారా ప్రకటిస్తారు. 2018లో ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్‌లో మహబూబ్‌నగర్‌ మేజర్‌ మున్సిపాలిటీ జాతీయ ర్యాంకుల్లో 2,253.33 మార్కులతో 161 స్థానంలో నిలిచింది.

జోనల్‌ ర్యాంకింగ్‌లో ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న షాద్‌నగర్‌ మున్సిపాలిటీ 2,416 మార్కులతో 12ర్యాంకు సాధించింది. అలాగే నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ  2,207 మార్కులతో 33వ స్థానంలో, కొల్లాపూర్‌ 1,942 మార్కులతో 99వ ర్యాంక్, అచ్చంపేట 1814 మార్కులతో 161, గద్వాల 1,592 మార్కులతో 333, నారాయణపేట 1,577 మార్కులతో 352, బాదేపల్లి 1,50తో 409, వనపర్తి1,432 మార్కులతో 541, కల్వకుర్తి 1,363తో 635, అయిజ 1,224తో 818ర్యాంకుల్లో నిలిచాయి.  


ప్రజలను జాగృతం చేయాలి.. 
పురపాలికల్లో బహిరంగ మలమూత్ర విసర్జనను వంద శాతం నిషేధించాలి. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలి. వేరు చేసేలా పారిశుద్ధ్య కార్మికులు బాధ్యతగా తీసుకొని చేయించుకోవాలి. ప్రజల ఫీడ్‌బ్యాక్‌ నివాసాల పరిశుభ్రతపై అప్రమత్తం చేయాలి. గతేడాది కంటే బహిరంగ మలమూత్ర విసర్జనలో అన్ని మున్సిపాలిటీలు ఓడీఎఫ్‌ను ప్రకటించాయి. ఇంటింటా తడి, పొడి చెత్త వంద శాతం జరగడం లేదు. సేకరించిన తడిచెత్తను శుద్ధీకరణలో బాగా వెనకబడిపోయాం.

ప్లాంట్లు నిర్మించడంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శించారు. అంతేగాక ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలను ఓడీఎఫ్‌గా ప్రకటించినా, బహిరంగ మలమూత్ర విసర్జన మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది. చాలా మంది ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో ఇంకా బయటికే మలమూత్ర విసర్జనకు వెళుతున్నారు. అధికారులు మాత్రం గొప్పగా ఓడీఎఫ్‌ ప్రకటించామని చేతులు దులుపుకుంటున్నారు.సెఫ్టిక్‌ ట్యాంకులు లేకుండా చాలా ఇళ్ల నుంచి మలమూత్ర వ్యర్థాలు మురుగుకాల్వలోకి పారుతున్నాయి. ప్లాస్టిక్‌ వాడకం నిషేధంలో ఉంది. ఈ పరిమాణాలు మార్పులకు గండి కొట్టనున్నాయి. అందువల్ల అధికార యంత్రాంగం స్వచ్ఛ సర్వేక్షన్‌పై శ్రమించి, ప్రజలను జాగృతం చేయాల్సి అవనసరం ఎంతైనా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement