Kalwakurthy Constituency
-
కల్వకుర్తి: బీఆర్ఎస్కు మైనస్! కాంగ్రెస్ కంటే బీజేపీనే బలంగా..
నాగర్ కర్నూల్ జిల్లాలో చైతన్యవంతులైన ఓటర్లు ఉన్న నియోజకవర్గం కల్వకుర్తి. ఇక్కడి ప్రజలు విలక్షణ తీర్పునిస్తారు. టీడీపీ వ్యవస్దాపకుడు ఎన్టీఆర్‌ను సైతం ఓడించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్దితులు హాట్‌టాపిక్‌గా సాగుతున్నాయి. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో బహుముఖ పోటీ అనివార్యం కానుంది. నియోజకవర్గం పేరు: కల్వకుర్తి మండలాల సంఖ్య: 6 (కల్వకుర్తి , వెల్దండ, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్) మొత్తం గ్రామపంచాయతీలు: 164 మున్సిపాలిటీలు: కల్వకుర్తి, ఆమనగల్లు ప్రభావితం చూపే పంచాయితీ: మాడ్గుల మొత్తం ఓటర్లు: 2,17,042 పురుషులు: 1,10,975; మహిళలు: 1,06,061 2014లో కాంగ్రెస్ అభ్యర్ది వంశీ చందర్‌రెడ్డి కేవలం 78 ఓట్ల మెజార్టీతో సమీప బీజేపీ అభ్యర్ది ఆచారిపై గెలిచారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ 3447 ఓట్ల మెజార్టీలో సమీప బీజేపీ అభ్యర్ది ఆచారిపై గెలిచారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్దాయిలో ఉన్నాయి. గ్రూపు రాజకీయాలతో ఇక్కడ కూడా పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇదీ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోంది. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు.ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ది జైపాల్‌యాదవ్ మూడో స్దానం నిలిచారు. కసిరెడ్డికి స్దానికసంస్దల తరపున ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటంతో ఆయన గెలిచారు. 2018 ఎన్నికల్లో కసిరెడ్డి బీఆర్ఎస్ తరపున సీటు ఆశించారు. ప్రోటోకాల్ రగడ.. ఆధిపత్యపోరు కానీ పార్టీ మరోసారి జైపాల్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్దికి కసిరెడ్డి సహకరించలేదు. అయినా జైపాల్ యాదవ్ గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి సమావేశాల్లో ప్రోటోకాల్ రగడ.. ఆధిపత్యపోరు నడిచింది. విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిన పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి కసిరెడ్డి రెండవసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా గెలిచారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇద్దరి మధ్య అదే గ్యాప్ కొనసాగుతుంది. తిరిగి వచ్చే ఎన్నికల్లో కూడా కసిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. తన క్యాడర్‌ను కాపాడుకునేందుకు కావాల్సిన కసరత్తు చేస్తూనే ఉన్నారట. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సహజంగా ప్రజల్లో ఉండే వ్యతిరేకతతో పాటు వర్గపోరు కూడా తలనొప్పిగా మారనుంది. ఎవరికి సీటు ఇచ్చినా ఇంకోకరు ఎలా స్పందిస్తారో తెలియని అయోమయం పార్టీలో నెలకొంది. పార్టీలోని చిత్తరంజన్‌దాస్, ఉప్పల వెంకటేష్, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్లు కూడా జైపాల్ యాదవ్ అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకించటమే కాక ఆయనకు సీటు ఇస్తే సహకరించమని ఇటీవల కసిరెడ్డి నేతృత్వంలో ఓ ఫాంహౌజ్‌లో జరిగిన సమావేశంలో తేల్చిచెప్పారట. ఇక జైపాల్ యాదవ్ ఈ నాలుగేళ్లలో నియోజకవర్గంలో తన మార్క్ పని ఏది చేయలేదని..డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కల్వకుర్తిలో జరిగినా పంపిణీ చేయటంలో జాప్యం చేస్తుండటం మైనస్‌గా మారింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడ తీవ్ర జాప్యం వల్ల తనకోసం పనిచేసిన వారికి మేలు చేయలేక పోయారనే అపవాదు ఉంది. అదే జైపాల్ యాదవ్ ధీమా ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో ఈసారి కూడా తనకే సీటు వస్తుందనే ధీమాలో ఉన్నారు జైపాల్ యాదవ్. ఈ నియోజకవర్గం గుండా రెండు జాతీయరహదారులు హైదరాబాద్-శ్రీశైలం,జడ్చర్ల, కోదాడ ఉండగా కొత్తగా కొట్రనుంచి నంద్యాల వరకు మరో జాతీయరహదారి మంజూరయ్యింది. నిత్యం వేలాదిగా వాహనాల రాకపోకలతో అనేక ప్రమాదాలు జరుగుతున్నా ఎక్కడ ట్రామా కేర్ సెంటర్ లేదు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి వందపడకలు చేస్తామన్న హమీ నేటికీ నెరవేరకపోవటంతో జనాలు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టక తప్పటం లేదు. జైపాల్ యాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి తనయుడు మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం కూడ సీటు ఆశిస్తున్నారు. ఇక్కడ బీసీ, రెడ్డి సామాజికవర్గాల మధ్య అధిపత్యపోరు కూడా జరుగుతోంది. కేవలం ప్రభుత్వ పథకాలపైనే భరోసా పెట్టి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్దితి ఇక్కడి బీఆర్ఎస్ నేతల వంతవుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున వంశీచందర్ రెడ్డి 2014లో స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018లో ఆయన మూడోస్దానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత ఆయన నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలు సైతం చేయటం లేదట. ఆయన రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారని సొంత పార్టీనేతలు గుసగుసలాడుతున్నారు. దీంతో పార్టీ క్యాడర్ కూడ తమ దారితాము చూసుకుంటున్నారు. ఐక్యతా ఫౌండేషన్ పేరుతో ఎన్ఆర్ఐ రాఘవేందర్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ను నడిపించే నాయకుడే లేడా.. ఆయన కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. సీటు వస్తే కాంగ్రెస్ నుంచి లేకుంటే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాలనే అలోచనలో ఉన్నాడట. మరోవైపు తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేష్ కూడ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారట. సీటు కూడ కావాలని కోరుతున్నట్టు ప్రచారం సాగుతుంది. పార్టీ నేతలతో సంప్రదింపులు కూడ జరిగాయట. కానీ సీటు గ్యారెంటీ లేదని చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఆతని నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం కాంగ్రెస్ నడిపించే నాయకుడే కరువయ్యాడు. పారిశ్రామిక వేత్త జూపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రావు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈయన 2014లో వంశీచందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలువటంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏఐసీసీ వ్యవహారాల్లో బిజీబిజీగా ఉంటున్న వంశీచందర్‌రెడ్డి ఈసారి కల్వకుర్తి నుంచి పోటీ చేసే అవకాశంలేదనే ప్రచారం సాగుతుంది. అయితే ఆయన సూచించిన వ్యక్తికే సీటు ఇచ్చే అవకాశం మాత్రం లేకపోలేదు. అందుకే ఆయన వ్యూహత్మకంగా జూపల్లి భాస్కర్‌రావును ప్రోత్సహిస్తున్నట్టు పార్టీలో టాక్ నడుస్తోంది. ఎలాగైన వచ్చే ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత, రుణమాఫి, డబుల్ బెడ్రూం రూం ఇళ్ల నిర్మాణం వంటి అశలు తమకు కలిసివస్తాయని భావిస్తుంది. బీజేపీకి బలంగా మారిన అధికార పార్టీ గ్రూపు రాజకీయాలు ఇక బీజేపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది. రెండు ఎన్నికల్లో స్వల్ప తేడాలో ఆ పార్టీ అభ్యర్ది తల్లోజు ఆచారి ఓటమి చెందారు. తర్వాత ఆయన జాతీయ బీసీ కమీషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. మరోసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఈసారి ఇక్కడ గెలిచి తీరాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే ఇక్కడ బీజేపీ పాత నేతలు, కార్యకర్తలు కొత్తవారిని పార్టీలోకి రానివ్వటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆచారి నియోజకవర్గంలో ఆశించిన స్దాయిలో అందుబాటులో ఉండటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్ మండలాలు రంగారెడ్డి జిల్లాలో ఉండటంతో కొంత బీజేపీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత.. టీఆర్ఎస్లో గ్రూపు తగాదాలు..మోదీ చరిష్మా ఈ సారి తప్పకుండా బీజేపీని గెలిపిస్తోందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి సెగ్మెంట్ పోరు రసవత్తరంగా మారనుంది. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: ఈ నియోజకవర్గం ఇటు నాగర్‌కర్నూల్ అటూ రంగారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. హైదరాబాద్ -శ్రీశైలం,కోదాడ-జడ్చర్ల,కొట్ర-నంద్యాల మధ్య మూడు జాతీయ రహదారులు గల నియోజకవర్గంగా ఉంది. దుందుభీ నదీ ప్రవాహం ఉంటుంది. ఆలయాలు: రెండవ భద్రాదీగా పేరున్న సీతారామచంద్రస్వామి ఆలయం సిర్సనగండ్లలో ఉంది. కడ్తల్లో మైసిగండి ఆలయం ఉంది. ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తికాకపోవటం, నిర్వాసితులకు సరైన పరిహారం అందకపోవటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై ఉండే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాల కోసం ఎలాంటి పరిశ్రమల స్దాపన చేయకపోవటంతో ఆ వర్గం ఓట్లు కూడ బీఆర్ఎస్కు మైనస్ కానుంది. -
కల్వకుర్తి గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కల్వకుర్తి గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు జోరుగా సాగుతోంది. రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ నియోజకవర్గంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వర్గపోరు పతాక స్థాయికి చేరుకుంది. నువ్వా... నేనా.. అనేవిధంగా ఇద్దరు నేతలు బహిరంగంగా సవాలు చేసుకోకున్నా.. అంతర్గతంగా అదే తలపిస్తోంది. వీరిద్దరి గ్రూపులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్మెత్తి పోసుకుంటుండటం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ విభేదాలు.. తమ అనుయాముల నిరసనల రూపంలో బహిర్గతమవుతున్నాయి. దీనికి కొనసాగింపుగా పార్టీ శ్రేణులు సైతం రెండుగా విడిపోవడంతో వర్గపోరు రచ్చకెక్కిందని చెప్పవచ్చు. ఇటీవల స్థానికంగా చోటుచేసుకున్న పలు సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇరువర్గాల ప్రెస్మీట్లు, నిరసనలు, విమర్శలు, వ్యాఖ్యలు, ఆరోపణలతో కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇతర పార్టీల నేతలు, అధికార పార్టీలోని తటస్థులు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. చదవండి: లైసెన్సుల ‘లొల్లి’ యుద్ధం మొదలైందిలా... గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నాయకుల్లో జైపాల్‌యాదవ్,ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. చివరకు జైపాల్‌కు టికెట్ దక్కడం.. గెలవడం చకాచకా జరిగిపోయాయి. కొంతకాలంగా నియోజకవర్గంలో నారాయణరెడ్డి క్రియాశీలకంగా వ్యవహిస్తున్నారు. కాంగ్రెస్ పారీ్టకి చెందిన కడ్తాల ఎంపీపీ కమ్లి మోత్యానాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్ ఇటీవల ఆయన సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామంపై ఎమ్మెల్యే వర్గం నొచ్చుకుంది. నియోజవకర్గ బాస్‌గా ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారనేది ఆయన అనుయాయుల ప్రశ్న. దీనిపై ప్రెస్‌మీట్ పెట్టి... ఎమ్మెల్సీ తీరును సైతం ఎండగట్టి తప్పుబట్టారు. అయితే, ఆమనగల్లు మున్సిపాలిటీ టీఆర్ఎస్ కన్వినర్ వస్పుల జంగయ్యతోపాటు పలువురు ఎమ్మెల్యేకు కొన్ని రోజులుగా దూరం పాటిస్తూ.. తాజాగా ఎమ్మెల్సీకి దగ్గరయ్యారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఆమనగల్లు ఎంపీపీ అనితవిజయ్ కొన్ని రోజుల కిందట ఎమ్మెల్సీ వర్గం వైపు వచ్చారు. వీటన్నింటినీ గమనించిన ఎమ్మెల్యే వర్గం.. ఎమ్మెల్సీపై గుర్రుగాఉంది. చినికిచినికి గాలివాన.. ఇటీవల ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే.. ఎంపీపీ కుర్చీలో ఆసీనులయ్యారు. దీనిని స్థానిక ఎంపీపీ అనిత తీవ్రంగా తప్పుబట్టారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా కార్యాలయంలో సమావేశం నిర్వహించడమే కాకుండా ఎంపీపీ కుర్చీలో కూర్చోవడమేంటనేది ఆమె వాదన. ఒకరకంగా తనను అవమానించారని, గిరిజన ఎంపీపీ కావడంతోనే ఇలా చేశారని ఆమె మండిపడుతున్నారు. ఆమె ఆరోపణలు.. ఎమ్మెల్సీ ప్రోత్సాహ ఫలితమేనని ఎమ్మెల్యే వర్గం ప్రత్యారోపణ చేస్తోంది. గ్రూపు రాజకీయాలు చేస్తూ.. పార్టీని భ్రష్టు పటిస్తున్నారని బాహాటంగానే కసిరెడ్డిపై విమర్శల దాడికి దిగింది. మరోపక్క ఎమ్మెల్సీ వర్గం కూడా వీటిపై ఘాటుగానే స్పందిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీని ఆహ్వానించవద్దని అధికారులకు ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేస్తున్నారని మండిపడుతున్నాయి. రాజకీయం.. వ్యాపారం కాదు ఆమనగల్లు: రాజకీయం అంటే వ్యాపారం కాదని, సేవాభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యేగా తనకు ఉన్న అధికారాలను వినియోగించుకుంటున్నానే తప్పా ఇతర ప్రజాప్రతినిధులను కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. కల్వకుర్తిలో ఉన్న మంచి వాతావరణాన్ని కొందరు నేతలు స్వార్థ ప్రయోజనాల కోసం కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు వద్దూ.. అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. కులమతాలకు అతీతంగా తాను పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. 20 లక్షలతో సరుకుల పంపిణీ ఆమనగల్లు మండలంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో పది వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ చెప్పారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కడ్తాల్ మండలంలో రూ.20 లక్షలతో దాదాపు 4 వేల మంది ప్రైవేటు వాహనాల డ్రైవర్లు, వలస కార్మికులకు సరుకులు అందించామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు అనురాధ, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేశ్‌గుప్తా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నిట్టె నారాయణ, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ! పార్టీ బలోపేతం కోసమే.. ‘ఇతర పార్టీలోంచి టీఆర్ఎస్లోకి వస్తామంటే చేర్చుకున్నాం. ఒక ఎమ్మెల్సీగా పార్టీలో చేర్చుకునే హోదా నాకు లేదా? దీనిని తప్పు బట్టాల్సిన అవసరమేం ఉంది..? ఎంపీపీ అనిత వ్యాఖ్యలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అది ఆమె వ్యక్తిగతం. దీని వెనక నా ప్రమేయం ఉందని ఆరోపించడం.. నూరుపాళ్లు తప్పు. ఎన్నికల సమయంలో జైపాల్ యాదవ్ గెలుపునకు కృషి చేశా. నేను సహకరించలేదని ప్రచారం చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసమే తప్ప నాకు స్వార్థం లేదు’ అని ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. దురుద్దేశంతోనే ఆరోపణలు ‘ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఓ ఎమ్మెల్యేగా వమ్ము చేయలేను. రాజకీయం అంటే వ్యాపారం కాదు. సేవాభావంతో పనిచేసేవారే రాజకీయాల్లో ఉండాలి. కొందరు రాజకీయ దురుద్దేశంతో నాపై ఆరోపణలు చేస్తున్నారు. శాసనసభ్యునిగా నాకున్న అధికారాలను వినియోగించుకుంటున్నా. కుల, మతాలకు అతీతంగా పనిచేస్తున్నా. ఇతర ప్రజాప్రతినిధులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. కల్వకుర్తిలో కొందరు నేతలు స్వార్థం కోసం రాజకీయాలను కలుషితం చేస్తున్నారు’ అని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. -
పురపాలికల్లో ‘స్వచ్ఛ సర్వేక్షన్’
సాక్షి, కల్వకుర్తి టౌన్: కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న స్వచ్ఛ సర్వేక్షన్ –2019 పోటీలకు పురపాలికలు ముస్తాబవుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన కార్వే కన్సల్టెన్సీ బృందం సభ్యులు ఆయా మున్సిపాలిటీల్లో పర్యటిస్తూ, స్వచ్ఛతపై వివరాలు సేకరిస్తారు. ఈ బృందం కాలనీల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించడంతోపాటు స్థానికుల నుంచి వివరాలు తీసుకుని కేంద్రానికి పంపిస్తారు. వీరు సేకరించే వివరాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంక్‌లను ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షన్–2019 పోటీలకు తొమ్మిది పురపాలికలు, ఒక మేజర్ మున్సిపాలిటీలు సన్నద్ధం అవుతున్నాయి. పోటీల్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించేందుకు అధికార యంత్రాగం కసరత్తు ప్రారంభించింది. స్వచ్ఛత ప్రణాళికపై దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల కేంద్రం థర్ట్ పార్టీ బృందం రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలలో సర్వే నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు స్వచ్ఛ సర్వేక్షన్‌లోని మార్గదర్శకాలపై శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు స్వచ్ఛ సర్వేక్షన్‌లోని మార్గదర్శకాలపై శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లకు దిశానిర్దేశం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నగరాలు, పట్టణాలను స్వచ్ఛమైన నివాస ప్రాంతాలుగా మార్చాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీలలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. గతంలో 2016, 2017, 2018లో సాధించిన ర్యాంకుల కంటే ఉత్తమంగా 2019 ఏడాదిలో ర్యాంకు సాధించాలన్న సాధనలో ప్రత్యేక ప్రణాళిక లక్ష్యాల తయారీలో నిమగ్నమయ్యారు. మిగిలింది 25 రోజులే.. దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షన్–2019 పోటీలో 4,231నగరాలు, పట్టణాలు పోటీపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోటీ పెరిగింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అధికారులు విరామం లేకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, శ్రమిస్తూ ఉత్తమ స్వచ్ఛ నగర కల సాకారం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వచ్చే జనవరి 4 నుంచి ఫిబ్రవరి 4వ తేదీలలో ఎప్పుడైనా స్వచ్ఛ సర్వేక్షన్ థర్డ్ పార్టీ క్యూసీఐ బృందాలు నగరాలు, పట్టణాలను తనిఖీ చేస్తాయి. స్వచ్ఛ సర్వేక్షన్‌కు వస్తున్న బృందాల్లో అసెసర్లు, నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ప్రజల అభిప్రాయాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రత, దేవాలయాలు, మసీదు, చర్చీలు, ఆర్టీసీ బస్ స్టేషన్లు, రైలు స్టేషన్లు, చెత్త సేకరిస్తున్న విధానం, అందుకు వినియోగిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, సేకరించిన చెత్త నిత్వ కేంద్రాలు, చెత్త ప్రాసెసింగ్ తదితర వివరాలను మదింపు చేస్తారు. ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా ప్రజలను ప్రశ్నించి, వివరాలు రాబడుతారు. స్వచ్ఛ సర్వేక్షన్ నిర్వహించే అధికారులు, క్యూసీఐ అధికారులు ప్రతి మున్సిపాలిటీని నాలుగు విభాగాలుగా విభజించి, వాటికి తగిన మార్కులను కేటాయిస్తారు. అందులో సర్వీస్ లెవల్ చెంచ్ మార్కుకు 1,250 మార్కులు, థర్డ్ పార్టీ అసెసర్ల పరిశీలన ద్వారా 1,250 మార్కులు, సిటిజన్ ఫీడ్ బ్యాక్ ద్వారా 1,250 మార్కులు, సర్టిఫికెట్, ఓడీఎఫ్, గ్యార్బేజీ, ఫ్రీసిటీ, కెపాసిటీ బిల్డింగ్ ద్వారా 1,250మార్కులను కేటాయించి, ర్యాంకులు ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లాలో గతేడాది ర్యాంక్‌లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మేజర్ మున్సిపాలిటీ మహబూబ్‌నగర్‌తో పాటు పురపాలికలు నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, నారాయణపేట, బాదేపల్లి, అయిజ, గద్వాల, షాద్‌నగర్ ఉన్నాయి. లక్ష జనాభాకు తక్కువ ఉన్న మున్సిపాలిటీలను జోనల్ ర్యాంకింగ్ ద్వారా, లక్ష జనాభాకు పైబడి ఉన్నవారిని నేషనల్ ర్యాంకింగ్ ద్వారా ప్రకటిస్తారు. 2018లో ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్లో మహబూబ్‌నగర్ మేజర్ మున్సిపాలిటీ జాతీయ ర్యాంకుల్లో 2,253.33 మార్కులతో 161 స్థానంలో నిలిచింది. జోనల్ ర్యాంకింగ్‌లో ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న షాద్‌నగర్ మున్సిపాలిటీ 2,416 మార్కులతో 12ర్యాంకు సాధించింది. అలాగే నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ 2,207 మార్కులతో 33వ స్థానంలో, కొల్లాపూర్ 1,942 మార్కులతో 99వ ర్యాంక్, అచ్చంపేట 1814 మార్కులతో 161, గద్వాల 1,592 మార్కులతో 333, నారాయణపేట 1,577 మార్కులతో 352, బాదేపల్లి 1,50తో 409, వనపర్తి1,432 మార్కులతో 541, కల్వకుర్తి 1,363తో 635, అయిజ 1,224తో 818ర్యాంకుల్లో నిలిచాయి. ప్రజలను జాగృతం చేయాలి.. పురపాలికల్లో బహిరంగ మలమూత్ర విసర్జనను వంద శాతం నిషేధించాలి. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలి. వేరు చేసేలా పారిశుద్ధ్య కార్మికులు బాధ్యతగా తీసుకొని చేయించుకోవాలి. ప్రజల ఫీడ్‌బ్యాక్ నివాసాల పరిశుభ్రతపై అప్రమత్తం చేయాలి. గతేడాది కంటే బహిరంగ మలమూత్ర విసర్జనలో అన్ని మున్సిపాలిటీలు ఓడీఎఫ్‌ను ప్రకటించాయి. ఇంటింటా తడి, పొడి చెత్త వంద శాతం జరగడం లేదు. సేకరించిన తడిచెత్తను శుద్ధీకరణలో బాగా వెనకబడిపోయాం. ప్లాంట్లు నిర్మించడంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శించారు. అంతేగాక ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలను ఓడీఎఫ్‌గా ప్రకటించినా, బహిరంగ మలమూత్ర విసర్జన మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది. చాలా మంది ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో ఇంకా బయటికే మలమూత్ర విసర్జనకు వెళుతున్నారు. అధికారులు మాత్రం గొప్పగా ఓడీఎఫ్ ప్రకటించామని చేతులు దులుపుకుంటున్నారు.సెఫ్టిక్ ట్యాంకులు లేకుండా చాలా ఇళ్ల నుంచి మలమూత్ర వ్యర్థాలు మురుగుకాల్వలోకి పారుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం నిషేధంలో ఉంది. ఈ పరిమాణాలు మార్పులకు గండి కొట్టనున్నాయి. అందువల్ల అధికార యంత్రాంగం స్వచ్ఛ సర్వేక్షన్పై శ్రమించి, ప్రజలను జాగృతం చేయాల్సి అవనసరం ఎంతైనా ఉంది. -
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ
సాక్షి, వెల్దండ: అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించి ఆశీర్వదించాలని పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి కోరారు. మండలంలోని లింగారెడ్డి, పోతేపల్లి గ్రామాలకు చెందిన మైనార్టీ నాయకులు మంగళవారం టీఆర్ఎస్ నుంచి వంశీచంద్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వంశీచంద్‌రెడ్డి నాయకులకు కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ ద్వారా వివిధ అపరేషన్లు, విద్యార్థులకు పీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాలను అందజేసినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి భారీమెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ మైనార్టీ మండల అధ్యక్షుడు రషీద్, నాయకులు శ్రీనివాస్‌ముదిరాజ్, వెంకటయ్యగౌడు తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ సమగ్రాభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి, చంద్రాయణపల్లితండా, ముర్తుజపల్లి, ఆమనగల్లులో మంగళవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వంశీచంద్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించిన ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలతో మోసం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ధనుంజయ, వర్కింగ్ ప్రెసిడెంట్ మండ్లి రాములు, మా జీ ఎంపీటీసీ సభ్యుడు కాయితి చెన్నారెడ్డి, మాజీ సర్పంచ్ పర్వతాలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎండపల్లి నారాయణ, నాయకులు ఖలీల్, ఖాదర్, వస్పుల మానయ్య, జంతుక యాదయ్య, కృష్ణానాయక్, వస్పుల శ్రీశైలం, సురేశ్‌నాయక్, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌నాయక్, నర్సింహారెడ్డి, ఖాదర్, కిషన్ నాయక్, ఫిరోజ్, శ్రీకాంత్, రాఘవేందర్, అలీం, టీడీపీ నాయకులు గాజుల శ్రీనివాస్, కాలె మల్లయ్య, వెంకటేశ్‌లు పాల్గొన్నారు. కల్వకుర్తి రూరల్: మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మండలంలోని మార్చాల, తర్నికల్, ఎల్లికల్ గ్రామాల్లో ప్రజా కూటమి నాయకులు ప్రచారం కొనసాగించారు. కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. వంశీచంద్‌రెడ్డి తండ్రి రాంరెడ్డి మార్చాలలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. -
కల్వకుర్తిలో అభివృద్ధి అంతంతే!
సాక్షి, కల్వకుర్తి టౌన్: పట్టణంలో సమస్యలు తిష్టవేశాయి. కనీస వసతులు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనులకు రూ.కోట్లు వెచ్చించామని చెబుతున్నా కనీస సదుపాయాలు పట్టణవాసులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. కల్వకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా 2013 మార్చి 23న ప్రభుత్వ ఉత్తర్వులతో కల్వకుర్తి నగరపంచాయితీగా రూపాంతరం చెందింది. తదనంతరం మున్సిపాలిటీగా మారింది. నగరపంచాయతీకి జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులతో 2014 జూలై 3న పాలకవర్గం కొలువుతీరింది. పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు పట్టణంలో అభివృద్ధి పనులు అంతంతమాత్రంగానే జరిగాయి. అభివృద్ధి పనులకు రూ.12.94కోట్లు పట్టణంలో ఇప్పటివరకు రూ.12.94కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనుల కోసం నిధులు ఖర్చుచేశారు. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పట్టణంలో అభివృద్ధి పనులను చేపట్టినా కనీస సదుపాయాల కల్పన జరగలేదు. మున్సిపాలిటీ అయినా అందుకు అభివృద్ధి పనులు చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇంటి పన్నులు, నల్లా బిల్లుల, భవన నిర్మాణాలకు అనుమతులు తదితర వాటిని పెంచారు. అయితే అందుకు తగిన వసతులు కల్పించడం లేదన్నారు. వివిధ పనుల కోసం.. పట్టణంలో పలు అభివృద్ధి, నిర్మాణ పనుల కోసం నగరపంచాయతీ జనరల్ నిధుల ద్వారా రూ.5.18 కోట్లు వెచ్చించారు. నగర పంచాయితీ నూతన భవన నిర్మాణానికి రూ.1.65కోట్లు, 14 ఆర్ధిక సంఘం నిధులతో పట్టణంలో శ్మశాన వాటికల నిర్మాణానికి రూ.1.37కోట్లు, స్టాటప్ గ్రాంట్స్ 2012–13 ద్వారా రూ.1.36 కోట్లు ఖర్చు చేశారు. అలాగే 14వ ఆర్ధిక సంఘం నిధులు రూ.91.40లక్షలు, 2013–14, 2014–15లో రోడ్డు గ్రాంటుల ద్వారా రూ.64.85లక్షలు, 2016–16 టీఎస్పీ గ్రాంట్ ద్వారా రూ.50.20లక్షలు, 13వ ఆర్ధిక సంఘం నిధులు రూ. 71.63లక్షలు, 2013–14, 2015–16 ఏఎస్సీ గ్రాంట్స్ ద్వారా రూ.42.20లక్షలు, 2015–16 ఎస్సీ ఎస్టీ గ్రాంట్స్ రూ.16లక్షలు, నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణానికి రూ.32.5 లక్షలు పట్టణ అభివృద్ధి పనుల కోసం వెచ్చించారు. ఖర్చు సరే.. అభివృద్ధి ఏది? పట్టణంలో రూ.కోట్లు ఖర్చుల చేశామని పాలకులు, అధికారులు చెబుతున్నారు. అయితే పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లపై చెత్త దర్శనమిస్తున్న పట్టించుకునే వారు కరువయ్యారు. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. ఐదు రోజులకోసారి తాగునీరు వస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో చేపట్టిన పనులు తూతూ మంత్రంగా చేపట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. టీఎస్ఎఫ్యూఐడీసీ నిధుల ద్వారా రూ.15 కోట్లు వచ్చినా ఎన్నికల కోడ్ ఆటంకంతో అది జరగలేదు. పాలక వర్గం సమయం గడువు ముగుస్తున్నా పాలకులు, అధికారులు పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కోడ్ రావడంతో పనులకు ఆటంకం కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు చాలా వరకు నిధులు ఖర్చుచేశాం. అయితే ఇంకా అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. రూ.15కోట్లు ప్రత్యేక నిధులు వచ్చాయి. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆ నిధుల ద్వారా పనులు ప్రారంభించలేదు. పట్టణంలో అభివృద్ధి పనులు చేపడతాం. తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. – ప్రవీణ్‌కుమార్ రెడ్డి, కమిషనర్, మున్సిపల్, కల్వకుర్తి -
నిరుపేదల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం
సాక్షి, ఆమనగల్లు: నిరుపేద ప్రజల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి చ ల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మహాకూట మి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తలకొండపల్లి మండలంలోని గట్టుప్పలపల్లి, వెంకట్రావ్పేట, మెదక్‌పల్లి, రాంపూర్, జంగారెడ్డిపల్లి గ్రామాల్లో గురువారం వంశీచంద్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్లు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి వాటిని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. అదే విధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్లకు బుద్ధిచెప్పాలని ఆయన కోరారు. ప్రజాసంక్షేమం కోసం కాంగ్రెస్‌ను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, అంజయ్యగుప్త, కండె ఓంకారం, వెంకటమ్మ, అజీం, శ్యాంసుందర్‌రెడ్డి, లింగం, రవీందర్, నరేశ్, మహేశ్, ఎంపీటీసీ రాములు, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. చల్లా అశ్లేషారెడ్డి ఇంటింటి ప్రచారం.. ఆమనగల్లు పట్టణంలో గురువారం కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా ఆయన సతీమ ణి అశ్లేషారెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో వం శీచంద్రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు. ప్రజల కు అందుబాటులో ఉండి పనిచేస్తారని, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తారని ఆమె వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మండ్లి రాములు, నాయకులు ఖలీల్, ఖాదర్, వస్పుల మానయ్య, జంతుక యాదయ్య, కృష్ణా నాయక్, సురేశ్‌నాయక్, కరీం, వస్పుల శ్రీశైలం, గోపాల్, హరిలాల్, కిషన్‌నాయక్ పాల్గొన్నారు. -
ప్లీజ్.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి..!
సాక్షి, కల్వకుర్తి రూరల్: రాబోయే శాసనసభా ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా అన్ని పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి. ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. శుక్రవారం పట్టణంలోని మడేలయ్యస్వామి దేవస్థానం వద్ద రజక సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆచారి సంఘం నాయకులతోపాటు సభ్యులతో మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనకు ఒక్కసారి అవకాశమిస్తే అభివృద్ధికి బాటలు వేస్తానని చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనకు ఒక్క అవకాశమిచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు ఆచారికి మద్దతు తెలిపినట్లు పార్టీ నాయకులు విలేకరులకు వివరించారు. సమావేశంలో రజక సంఘం నాయకులు లింగమయ్య, విజయ్, నాగరాజు, పర్వతాలు, శ్రీధర్, మొగులయ్య, శ్రీను, శంకర్, సత్యనారాయణ, పెంటయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గెలుపే ధ్యేయమంటున్న తల్లోజి
సాక్షి,కల్వకుర్తి రూరల్: రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేయాలని పార్టీ రాష్త్ర ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తల్లోజు ఆచారి పిలుపునిచ్చారు. పట్టణంలోని సాయిబాలాజీ ఫంక్షన్హాల్లో మంగళవారం బీజేపీ పట్టణ, మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ అభ్యర్థి ఆచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆచారి సమక్షంలో గుండూరుకు చెందిన మాజీ సర్పంచ్ పర్వత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య, వారి అనుచరులు అధికసంఖ్యలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి ఆచారి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ జెండా పేద ప్రజలకు అండ అన్నారు. పేద ప్రజల సంక్షేమమే నరేంద్రమోదీ ఎజెండా అని చెప్పారు. రాబోయే 25 రోజులు ఎంతో కీలకమైనవని ప్రతి కార్యకర్త ప్రతినిత్యం ప్రతి క్షణం బీజేపీ గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలు వివరించడంతో పాటు సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదాన్ని విస్త్రృతంగా ప్రచారం చేసి కల్వకుర్తిపై కమలం జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉందని ఆచారి చెప్పారు. కార్యక్రమంలో నాయకులు శేఖర్‌రెడ్డి, నర్సిరెడ్డి, దుర్గాప్రసాద్, రాఘవేందర్‌గౌడ్, నర్సింహ, కృష్ణాగౌడ్, శేఖర్‌రెడ్డి, విజయ్, శ్రీకాంత్, దామోదర్, బాలకృష్ణ, పెద్దయ్య, అశోక్, సాయి, మల్లేశ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
కల్వకుర్తిలో బోణీ..
సాక్షి, కల్వకుర్తి :అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం మొదలైంది. మొదటిరోజు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కల్వకుర్తి మినహా ఎక్కడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయలేదు. కల్వకుర్తిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ తరుఫునా నామినేషన్ వేశారు. మొదటి సెట్ కావడంతో ఇరువురు నాయకులు సాదాసీదాగా వచ్చి నామినేషన్ పత్రాలు అధికారులకు అందించి వెళ్లారు. కల్వకుర్తిలో రెండు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా నామినేషన్ల దాఖలు హడావిడి కనిపించలేదు. కానీ కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మొదటి రోజే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ తరఫున, టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేష్‌కుమార్‌కు అందజే«శారు. ఇరువురు మొదటి సెట్ మాత్రం అందజేసి వెళ్లిపోయారు. మరోరోజు భారీ ర్యాలీలతో మరోసారి నామినేషన్ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జైపాల్ యాదవ్ తన నామినేషన్ పత్రాన్ని మధ్యాహ్నం 1.15 గంటలకు పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్, విజితారెడ్డిలతో కలిసి తహసీల్దారు కార్యాలయానికి వెళ్లారు. రెండో విడత పత్రాలను మంత్రి హరీశ్‌రావు, టీఆర్ఎస్ ముఖ్యనాయకులతో కలిసి మరోమారు నామినేషన్ వేసేందుకు రానున్నారు. మెదటి సెట్ నామినేషన్ పత్రాల్లో ఎడ్మ కిష్టారెడ్డి.. జైపాల్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే చల్లావంశీచంద్‌రెడ్డి మధ్యాహ్నం 12.15 గంటలకు తన కుటంబ సభ్యులతో కలిసి వచ్చి మొదటి సెట్ నామినేసన్ పత్రాలను దాఖలు చేశారు. తండ్రి రాంరెడ్డి, తల్లి శోభారెడ్డిలతో పాటు భార్య ఆశ్లేషారెడ్డి, కూతురు మహాక్షారెడ్డిలతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. రెండో విడతలో సీనియర్ నాయకులు జైపాల్‌రెడ్డితో రానున్నట్లు తెలిసింది. వంశీచంద్‌రెడ్డి భార్య ఆశ్లేషారెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. నాగర్‌కర్నూల్‌లో నిల్.. నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయగా మొదటిరోజు సోమవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఏ అభ్యర్థి కూడా నామినేషన్ వేయడానికి రాలేదు. స్థానిక ఆర్డీఓ (రిటర్నింగ్ అధికారి) కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించేందుకు అందుబాటులో ఉన్నారు. కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా ఉదయం 11గంటలకు నామినేషన్ పత్రాల స్వీకరణకు ముందే బాంబ్ స్క్వాడ్‌తో కార్యాలయ ఆవరణ మొత్తం తనిఖీలు నిర్వహించారు. అచ్చంపేటలోనూ నిల్ అచ్చంపేట: ఎన్నికల ప్రక్రియలో కీలకఘట్టమైన నామినేషన్ల దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభించగా మొదటిరోజు ఏ అభ్యర్థి కూడా దాఖలు చేయలేదు. ప్రచారంలో మునిగి తేలు తున్న అభ్యర్థులు నామినేషన్లకు ముహూర్తాలను వెతుక్కుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నారు. ఆయన ఆర్భాటంగా ఈనెల 14న నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే మహాకూటమి అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ కా>ంగ్రెస్ పార్టీ నుంచి భీఫామ్ ఇంకా అందుకోలేదు. అలాగే బీజేపీ అభ్యర్థి మల్లేశ్వర్‌తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు ముహూర్తం చూసుకుని నామినేషన్ వేయాలని చూస్తున్నారు. అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ నర్సింహులు మొదటిరోజు రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీఐ రామకృష్ణ, ఎస్ఐలు పరుషరామ్, రమేష్ బందో బస్తును పర్యవేక్షిస్తున్నారు. -
కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొడితే లక్ష ఉద్యోగాలు వస్తాయి..
సాక్షి, వంగూరు: త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ కోరారు. ఆదివారం మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. తుమ్మలపల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా తాను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామానికి అవసరమైన బీటీ రోడ్లు, అంతర్గత రోడ్లను సీసీరోడ్లుగా మార్చడంతోపాటు ప్రజలకు అవసరమైన ఇళ్లు, పింఛన్లు, సిలిండర్లు అందించామన్నారు. అలాగే స్కూల్ బిల్డింగ్లు, వాటర్‌ట్యాంక్‌తోపాటు అనేక అభివృద్ధి పనులు చేసిన తనకు ఓట్లు వేయాల్సిన బాధ్యత తుమ్మలపల్లి గ్రామస్తులపై ఉందని ఆయన అన్నారు. అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేయనుందని వంశీకృష్ణ తెలిపారు. రెండులక్షల రుణమాఫీ, వ్యక్తిగత ఇళ్ల నిర్మాణానికి రూ.ఐదు లక్షలు, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు అదనపు గదికోసం రూ.2లక్షల నగదు, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల నియామకం లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమై ఎన్నికల మేనిఫెస్టో ముందుకు తెచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొడితే రాష్ట్రంలోని లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ అనూరాధ, పార్టీ మండల అధ్యక్షుడు మల్లయ్యయాదవ్, పార్టీ నాయకులు అల్వాల్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, సత్యనారాయణ, విష్ణువర్ధన్‌రెడ్డి, శంకర్, బాలస్వామిగౌడ్, యాదగిరిరావు, మదన్‌కుమార్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు నారాయణరెడ్డి, రమేష్‌గౌడ్, షేర్‌ఖాన్, మల్లేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిక... మండలంలోని తుమ్మలపల్లి, రంగాపూర్, పోతారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన పలువురు టీడీపీ, టీఆర్ఎస్కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. -
కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం రివ్యూ
సాక్షి, మహబూబ్‌నగర్: టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ ఇంటింటి ప్రచారాన్ని తీవ్రం చేశారు. అందులో భాగంగా ప్రతీ ఓటరును కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం పట్టణంలోని పాతపాలమూర్లో ప్రచారం సాగింది. మార్గమధ్యలో ఓ ఇంటి ఎదుట కట్టెల పొయ్యి కనిపించగా.. కొద్దిసేపు గొట్టంతో ఊది మంట రగిలించారు. వంట త్వరగా పూర్తయ్యేలా మంట రగిలించిన తనకే ఓటు వేయాలని వారికి కోరారు. జెడ్పీ సెంటర్ (మహబూబ్‌నగర్) భాయ్.. జర దేఖో... ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను కలిసేందుకు అంది వచ్చే ఏ అవకాశాన్ని విడుచుకోవడం లేదు. శుక్రవారం ప్రార్థనలకు ముస్లింలు తప్పక మస్జీద్కు వస్తారని.. అక్కడైతే ఎక్కువ మందికి కలవొచ్చన భావనతో దేవరకద్ర టీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కొత్తకోటలోని మస్జీద్ దగ్గరకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రార్థన పూర్తిచేసుకుని బయటకు వస్తున్న ముస్లింలను కలిసి ఓటు అభ్యర్థించారు. – కొత్తకోట రూరల్ టీ బ్రేక్.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జడ్చర్ల టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన నవాబుపేట మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా ఎడ్లబండిపై ముందుకు సాగుతూ సందడి చేసిన ఆయన నవాబుపేట మండల కేంద్రంలో గోపాల్ టీ షాప్ కనిపించగానే కొద్దిసేపు ఆగారు. అక్కడ తనతో పాటు నాయకులు, కార్యకర్తలందరికీ టీ ఇప్పించి తాగాక మళ్లీ ప్రచారంలో నిమగ్నమయ్యారు. – నవాబుపేట (జడ్చర్ల) కుట్టు లాగే అభివృద్ధిలో తేడా రాదన్నా ! కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని నారాయణపేట టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డి తన ప్రచారంలో చెబుతున్నాఉ. ఈ మేరకు శుక్రవారం ఆయన దామరగిద్ద మండలంలోని కాన్కుర్తి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులతో పాటు కుల వృత్తుల్లో నిమగ్నమైన వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ క్రమంలో చెప్పులు కొడుతున్న ఓ వ్యక్తితో మాట్లాడారు. – దామరగిద్ద (నారాయణపేట) ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం ఈ నియోజకవర్గానికి 16 దఫాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 1962లో వెంకట్‌రెడ్డి, 1967లో ద్యాప గోపాల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే, ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వడంతో 1969లో ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడే ఎస్.జైపాల్‌రెడ్డి రాజకీయ అరగేట్రం చేసి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 1994లో ఎడ్మ కిష్టారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. నియోజకవర్గ ప్రత్యేకతలు నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి నెలవు. దీంతోపాటు కరవు, వలసలకు కూడా నిలయంగా నిలుస్తోంది. ఇక్కడ పెద్దగా ఎలాంటి పరిశ్రమలు లేవు. మూడు స్పిన్నింగ్ మిల్లులు, ఆరు జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. కడ్తాల్ మండలంలో మైసిగండి ఆలయం ప్రత్యేకత. ఇక్కడికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు వస్తుంటారు. ఇక కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సంబంధించి కాల్వలు పూర్తికావడంతో కొంత ప్రాంతానికి సాగునీరు అందుతోంది. గోకారం రిజర్వాయర్, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కాల్వలు తవ్వి నీరు పారించాల్సి ఉంది. గత ఎన్నికల్లో రీపోలింగ్ 2014లో జరిగిన ఎన్నికల సందర్బంగా కూడా అన్ని నియోజకవర్గాలతో పాటు 2014 మే 16న కల్వకుర్తి ఫలితం వెల్లడించలేకపోయారు. ఈ నియోజకవర్గ పరిధిలోని జూపల్లి గ్రామంలోని 119 నంబర్ పోలింగ్ బూత్‌కు చెందిన ఈవీఎం సాంకేతికత లోపంతో పనిచేయలేదు. దీంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. నిపుణులు వచ్చి సరిచేస్తారేమోనని రాత్రి 9.30 గంటలకు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో అప్పటికి వాయిదా వేశారు. అయితే, ఆ సమయానికి 28 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి 42,229 ఓట్లు, సమీప బీజేపీ అభ్యర్థి టి.ఆచారికి 42,197 ఓట్లు వచ్చాయి. అంటే వంశీకి 32 ఓట్ల ఆధిక్యం ఉంది. దీంతో చివరి 109 పోలింగ్ బూత్ ఓట్లు లెక్కిస్తే ఫలితం తేలేది. కానీ ఈవీఎంలో సాంకేతిక లోపంతో వాయిదా పడ్డాయి. ఇక 19వ తేదీన ఆ ఒక్క బూత్‌కు సంబంధించి రీ పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ బూత్‌కు సంబంధించి 1,140 ఓట్లలో 1,132 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మొత్తంగా వంశీకి 42,782 ఓట్లు, ఆచారికి 42,704 ఓట్లు వచ్చినట్లు తేలడంతో 78 ఓట్ల మెజార్టీతో వంశీచంద్‌రెడ్డి గెలిచినట్లు ప్రకటించారు. కాగా, 119 నంబర్ బూత్‌లో మొదటిసారి పోలింగ్‌లో 633 ఓట్లు పోల్ కాగా.. రీ పోలింగ్‌లో 1,132 ఓట్లు పోల్ కావడం విశేషం. ఎన్టీఆర్ ఓటమి ఓ సంచలనం జైపాల్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం ఇక్కడి నుంచే.. గత ఎన్నికల్లో రీ పోలింగ్ ద్వారా ఫలితాలు ముగ్గురు స్వతంత్రులకు దక్కిన విజయం.. ఇద్దరికి మంత్రి పదవులు కూడా... రెండు జిల్లాల పరిధిలో విస్తరించిన నియోజకవర్గం కరువుకు నిలయం కల్వకుర్తి నియోజకవర్గం రాజకీయాల్లో సంచలనం సృష్టించినట్లుగానే... కరువుకు కేరాఫ్‌గా నిలుస్తోంది. సాగు, తాగునీరు లేక కరవుతో రైతులు, ప్రజలు విలవిలలాడే ప్రాంతం. ఇక్కడి నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోయేవారు. ఈ ప్రాంత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అంజయ్య సీఎంగా ఉన్న సమయంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే, పనుల్లో జాప్యం.. పాలకుల నిర్లక్ష్యంతో కేఎల్ఐ పనులు ఎన్నికల హామీలుగా మిగిలిపోయాయి. అయితే, దివంగత మహానేత సీఎం రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో కాల్వలు తవ్వించారు. ఇక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నీళ్లు పారించి కొన్ని గ్రామాలకు సాగునీరు అందించడం ద్వారా రైతుల కళ్లలో ఆనందం నిండినట్లయింది. ఇక హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈ ప్రాంతం నిలయంగా మారింది. 1989లో సంచలనం కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి 1989లో పెను సంచలనం నమోదైంది. ఈ ఎన్నికల్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ.రామారావు పోటీకి దిగారు. ఎన్టీఆర్‌కు అప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జైపాల్‌రెడ్డి మద్దతు తెలిపి పోటీకి దింపారు. అంతకుమందు 1985 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన చిత్తరంజన్‌దాస్ 1989లో ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్టీఆర్‌కు పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్‌కు 50,786 ఓట్లు రాగా, చిత్తరంజన్‌దాస్‌కు 54,354 ఓట్లు రావడంతో.. ఎన్టీఆర్ 3,568 ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇక ఎన్టీఆర్ ఓడించడంతో చిత్తరంజన్‌దాస్‌కు అప్పట్లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా స్థానం దక్కింది. ఇద్దరికి మంత్రి యోగం ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారిలో కేవలం ఇద్దరికే మంత్రి పదవులు దక్కాయి. కల్వకుర్తి ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన తలకొండపల్లికి చెందిన మందుగుల నర్సింహరావు(ఎం.ఎన్.రావు)కు మంత్రి పదవి దక్కింది. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, రయత్ పత్రికా సంపాదకులు. ఆ తర్వాత ఎన్టీరామారావును ఓడించిన చిత్తరంజన్‌దాస్ కార్మిక శాఖ మంత్రిగా నియామకయ్యారు. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలను రాజకీయ చైతన్యానికి మారుపేరుగా చెప్పొచ్చు. ఈ నియోజకవర్గానికి అంతటి ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు విలక్షణమైన తీర్పునిస్తారని ప్రతీతి. ఉత్తమ పార్లమెంటేరియన్ అయిన కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ఇక్కడే రాజకీయ ఓనమాలు దిద్దింది. 1969 నుంచి వరసగా నాలుగు దఫాలు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే జనతా పార్టీ నుంచి జైపాల్‌రెడ్డి రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందటం మరో విశేషం! ఆ తర్వాత ఆయన మద్దతు ఇచ్చిన ఓ ప్రభంజనమైన నాయకుడు, రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చిన ఎన్టీ రామారావు బీసీ నాయకుడు చిత్తరంజన్ దాస్ చేతిలో ఓటమి చెందడంతో ఈ నియోజకవర్గం పేరు దేశ రాజకీయాల్లో మార్మోగింది. ఇక గత ఎన్నికల్లో ఒక ఈవీఎం తెరుచుకోక జూపల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ పరిధిలో రీపోలింగ్ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. 2014 ఎన్నికల్లో పోలైన ఓట్లు ; అభ్యర్థి పార్టీ లభించిన ఓట్లు చల్లా వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్ 42,782 తల్లోజి ఆచారి బీజేపీ 42,704 జి.జైపాల్‌యాదవ్ టీఆర్ఎస్ 29,844 కసిరెడ్డి నారాయణరెడ్డి స్వతంత్రం 24,095 1952 నుంచి 16 పర్యాయాలు ఎన్నికలు: కల్వకుర్తి నియోజకవర్గం 1952, 1957లో ద్విసభ్య స్థానంగా ఉండేది. ఆ తర్వాత 1962 నుంచి ఏకసభ్య స్థానంగా సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. 16 పర్యాయాలు ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా మూడు సార్లు స్వతంత్రులు, రెండు దఫాలు జనతాపార్టీ, రెండు దఫాలు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మొదట తాలూకాలోని పంచాయితీç సమితిలు కల్వకుర్తి, ఆమగనల్లు కలిపి ఎమ్మెల్యే ఎన్నికలు జరిగేవి. మండలాల తర్వాత ఈ నియోజకవర్గంలో మిడ్జిల్ మండలంతో పాటు కల్వకుర్తి, వంగూరు మండలాలకు చెందిన కొన్ని గ్రామాలతో కలిపి ఏడు మండలాలు ఉండేవి. 1999లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా మిడ్జిల్ మండలం జడ్చర్లకు వెళ్లగా.. వంగూరు మండలం పూర్తిగా అచ్చంపేట నియోజకవర్గంలో కలిసింది. కల్వకుర్తి మండలంలోని నాలుగు గ్రామాలే ఈ నియోజకవర్గంలో ఉండేవి. ఆ తర్వాత మండలం పూర్తిగా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఐదు మండలాలే పూర్తిగా నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక 2016లో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునఃర్విభజనలో నియోజకవర్గంలోని మూడు మండలాలు ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లగా... కల్వకుర్తి, వెల్దండ మాత్రమే నాగర్‌కర్నూల్ జిల్లాలో మిగిలాయి. ఇక నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని వెల్దండ, వంగూరు మండలాల నుంచి విడదీసిన గ్రామాలతో చారగొండ మండలాన్ని కొత్తగా ఏర్పాటుచేయగా.. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆమనగల్ మండలాన్ని విడదీసి కడ్తాల్ మండలాన్ని ఏర్పాటుచేశారు. దీంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు ఏడు మండలాలతో కొనసాగుతోంది. అంతేకాకుండా నూతనంగా గ్రామపంచాయతీలతో పాటు తండాలు ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పడ్డాయి. ఈ మార్పులతో మొదటి సారి ఎన్నికలు జరగడం ప్రత్యేకతను సంతరించుకుంది. కల్వకుర్తి ప్రొఫెల్: నియోజకవర్గం క్రమసంఖ్య 83 పోలింగ్ స్టేషన్లు 257 మండలాలు కల్వకుర్తి, వెల్దండ, చారగొండ, ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ 2014లో మొత్తం ఓటర్లు 1,99,714 పురుషులు 1,02,349 మహిళలు 97,350 ఇతరులు 15 ప్రస్తుతం మొత్తం ఓటర్లు 1,98,444 పురుషులు 1,01,956 మహిళలు 96,464 ఇతరులు 24 ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు వీరే సంవత్సరం విజేత పార్టీ 1952 (ద్విసభ) ఎం.ఎన్.రావు కాంగ్రెస్ కేఆర్.వీరస్వామి కాంగ్రెస్. 1957 (ద్విసభ) నాగన్నకాంగ్రెస్ శాంతాబాయి కాంగ్రెస్. 1962 వెంకట్‌రెడ్డి స్వతంత్ర 1964 (ఉ.ఎ.) శాంతాబాయి కాంగ్రెస్ 1967 ద్యాప గోపాల్‌రెడ్డి స్వతంత్రం 1969 (ఉ.ఎ) జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ 1972 ఎస్.జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ 1978 ఎస్.జైపాల్‌రెడ్డి జనతా పార్టీ 1983 ఎస్.జైపాల్‌రెడ్డి జనతాపార్టీ 1985 జె. చిత్తరంజన్‌దాస్ కాంగ్రెస్ 1989 జె.చిత్తరంజన్‌దాస్ కాంగ్రెస్ 1994 ఎడ్మ కిష్టారెడ్డి స్వతంత్రం 1999 జి.జైపాల్‌యాదవ్ టీడీపీ 2004 ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ 2009 జైపాల్‌యాదవ్ టీడీపీ 2014 చల్లా వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్ -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థికి తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి వద్ద ఓ టిప్పర్ వెనుక నుంచి వచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కారు మాత్రం పాక్షికంగా దెబ్బతింది. -
రాజన్న బిడ్డ వచ్చిందయ్యా.. మాట్లాడు...
* వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన ఓ అభిమాని భార్య ఆవేదన * కల్వకుర్తి నియోజకవర్గంలో 3 కుటుంబాలకు షర్మిల పరామర్శ * జగనన్న ఉన్నాడని భరోసా ఇచ్చిన షర్మిల * నేడు అచ్చంపేట, కొల్లాపూర్‌లో యాత్ర పరామర్శ యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అయ్యా! రాజన్న చనిపోయిండని మూడు రోజులు నిద్రాహారాలు మాని టీవీ చూస్తూనే ఉంటివి. ఆయన్ని సమాధి చేస్తుంటే చూసి ఏడుస్తూ అట్లనే పడిపోతివి. పేదోళ్లకు న్యాయమెవ్వరు చేస్తరని ఏడ్చి మాకు అన్యాయం చేసి పోతివి. నువ్వెళ్లిపోయినా జగనన్న మమ్ముల మరిచిపోలె. ఐదేండ్లయినా మర్వకుండ వాళ్ల చెల్లెను పంపిండు. రాజన్న బిడ్డ మనింటికి వచ్చిందయ్యా! మాట్లాడు...’’ కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండలం రెడ్డిపురం గ్రామంలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన రాయపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల వద్ద.. రాయపురెడ్డి భార్య స్లీవమ్మ విలపిస్తూ అన్న మాటలివి. స్లీవమ్మ ఆవేదన విన్న షర్మిలతో సహా గ్రామస్తుల గుండె బరువెక్కింది. ‘పరామర్శ యాత్ర’లో భాగంగా సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని రెడ్డిపురం, దేవుని పడకల్, వెలిజాల గ్రామాల్లోని మూడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. దేవుని పడకల్‌కు చెందిన తుమ్మల నర్సింహ, వెలిజాలలో మరణించిన సంతోజు అంజనమ్మ కుటుంబాలను ఆమె పరామర్శించి జగనన్న అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి.. రాయపురెడ్డి ఇంట్లో వారి కుటుంబంలో ఒకరిగా మారి ఓదార్చిన షర్మిల... జగనన్న ఉన్నాడని, త్వరలోనే మంచిరోజులు వస్తాయని వారికి భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికే చెందిన ఓ వికలాంగ యువకుడి చదువుకోవాలన్న ఆశను, కళాశాలకు వెళ్లలేని నిస్సహాయతను చూసిన షర్మిల.. ఆ యువకుడికి తగిన సహాయం అందించాల్సిందిగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వైఎస్సార్ సీపీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డికి సూచించారు. ఎంపీ విజిటింగ్ కార్డును అందించి, తన వ్యక్తిగత సహాయకుడి ఫోన్ నంబర్ కూడా వారికి ఇచ్చి ఏ సాయం కావాలన్నా ఫోన్ చేయి పెద్దమ్మా! అంటూ ఆమె ఆప్యాయతను పంచారు. వెలిజాలలో వైఎస్ మరణించారన్న బెంగతో టీవీ చూస్తూనే మరణించిన సంతోజు అంజనమ్మ భర్త మోహనాచారిని, వారి కుమారుడు, ఇద్దరు కుమార్తెలకు షర్మిల పరామర్శించారు. భార్య చనిపోయిన తరువాత కంసాలి వృత్తి చేసుకోవడం చేతకాక ఇంట్లోనే ఉంటున్న మోహనాచారికి ధైర్యం చెప్పారు. ‘‘ఆరోగ్యం జాగ్రత్త పెద్దయ్యా! ఆస్పత్రికి వెళ్లు. మానాన్నను తలుచుకొని నేను, నా కుటుంబం ఎంత బాధ పడుతున్నామో తెలుసు. మీరు మీ ఇంటి పెద్దతో పాటు మానాన్నను కూడా తలుచుకుంటున్నారు పెద్దయ్యా!’ అంటూ మోహనాచారి కళ్ల నీళ్లు తుడిచి ఓదార్చారు. దేవుని పడుకల్ గ్రామంలో చనిపోయిన తుమ్మల నర్సింహ భార్య నర్సమ్మ, కుమారులను చూసి చలించిపోయిన షర్మిల.. వారికి అండగా ఉంటామన్న భరోసా ఇచ్చారు. పింఛన్లు రావడం లేదని, బతుకు కష్టంగా మారిందని నర్సమ్మ ఆవేదన వ్యక్తం చేస్తే ‘‘మంచి కాలం వస్తుంది పెద్దమ్మా! ధైర్యంగా ఉండు..’’ అని ఓదార్చారు. మూడు కుటుంబాలను పరామర్శించేందుకు రోజంతా సమయం తీసుకున్న షర్మిల ఒక్కో ఇంట్లో గంటకు పైగా ఉన్నారు. పింఛన్లు రావడం లేదని వృద్ధులు, వితంతువులు చెబుతోంటే చలించిపోయారు. తగిన సహకారం అందించాలని పార్టీ నేతలకు సూచించారు. రాజకీయం కోసం రాలేదు..: షర్మిల కుర్మేడు, బ్రాహ్మణపల్లిలో పల్లె జనం విజ్ఞప్తి మేరకు షర్మిల మాట్లాడారు. వైఎస్ ఉంటే పేదలకు కష్టాలు ఉండేవి కావని ఆమె చెప్పారు. ఐదేళ్లలో ఏ ఒక్క చార్జీ కూడా పెంచకుండా జనరంజక పాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి రాజన్న అని, అందుకే ఆయన మరణిస్తే తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలొదిలారన్నారు. రాజకీయాల కోసం తాను రాలేదని, దివంగత నేత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన ప్రతి కుటుంబాన్ని కలిసి వారికి ధైర్యం చెప్పాలన్న జగనన్నమాట మీద వచ్చానని షర్మిల తెలిపారు. పేదలకు అండగా నిలవడమే తమ కుటుంబం లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. బ్రహ్మరథం పట్టిన పల్లె జనం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఉద్దేశించిన ఈ యాత్రను షర్మిల హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో తమ నివాసం నుంచి ప్రారంభించారు. తల్లి విజయమ్మ, సోదరుడు, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వదిన భారతి, వైవీ సుబ్బారెడ్డి దంపతుల ఆశీస్సులు తీసుకుని ఆమె బయలుదేరారు. షర్మిల పర్యటన సాగిన ప్రతి పల్లెలో పాలమూరు జనం నీరాజనాలు పట్టారు. ఈ తొలిరోజు పరామర్శ యాత్రలో పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, ఇతర నాయకులు శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్ రావు, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బీస్వ రవీందర్ ఉన్నారు. -
మొరాయించిన ఈవీఎం.. ఎల్లుండి రీ పోలింగ్ కు ఈసీ ఆదేశం
మహబూబ్ నగర్: జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోజూపల్లి 119 పోలింగ్ బూత్ లో సోమవారం రీ పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. నిన్నటి నుంచి ఈవీఎం మొరాయించడంతో ఆ ఫలితాన్ని అధికారులు పెండింగ్ లో పెట్టారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఒక నివేదికను ఈసీకి అందజేశారు. దీంతో జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తేలడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తీవ్రంగా శ్రమించిన అధికారులు తిరిగి ఈ రోజు ఈవీఎంను ఓపెన్ చేయడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఓపెన్ చేయడానికి ఈసీఎల్ ఇంజినీర్లు రంగంలోకి దిగినా.. చివరకు వారు చేతులెత్తేశారు. ఈవీఎంను ఓపెన్ చేయడం తమవల్ల కాదంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు తేల్చిచెప్పేశారు. దీంతో ఇక్కడ తాజాగా ఎన్నిక నిర్వహించాలని భన్వర్ లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేశారు. ఈ బూత్ లో రీ పోలింగ్ నిర్వహించాలంటూ సిఫారుసు చేశారు. కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన వంశీచంద్‌రెడ్డికి తన సమీప ప్రత్యర్థి అచారిపై167 ఓట్లు ఆధిక్యంగా పోలైయ్యాయి. ఆ దశలో ఈవీఎం మొరాయించింది. దాంతో ఎన్నికల అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. అనంతరం ఈవీఎం మొరాయించిందని ఎన్నికల అధికారులు ఈసీ ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ ఈవీఎంను ఓపెన్ చేయడం కష్టసాధ్యంగా మారడంతో తిరిగి ఈ బూత్ కు సంబంధించి ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత వైఎస్సార్ సీపీ నేత భూమా శోభానాగిరెడ్డి విజయంపై కూడా ఈసీకి భన్వర్ లాల్ నివేదిక అందజేశారు. -
ఈవీఎం మొరాయింపుపై ఈసీకి భన్వర్ లాల్ నివేదిక
మహబూబ్ నగర్: జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తేలడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి నుంచి కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో జూపల్లి 119 బూత్ లోని ఈవీఎం మొరాయించడంతో ఆ ఫలితాన్ని అధికారులు పెండింగ్ లో పెట్టారు. ఇప్పటికే తీవ్రంగా శ్రమించిన అధికారులు తిరిగి ఆ ఈవీఎంను ఓపెన్ చేయడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఓపెన్ చేయడానికి ఈసీఎల్ ఇంజినీర్లు రంగంలోకి దిగినా.. చివరకు వారు చేతులెత్తేశారు. ఈవీఎంను ఓపెన్ చేయడం తమవల్ల కాదంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు తేల్చిచెప్పేశారు. దీంతో ఇక్కడ తాజాగా ఎన్నిక నిర్వహించాలని భన్వర్ లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేశారు. ఈ బూత్ లో రీ పోలింగ్ నిర్వహించాలంటూ సిఫారుసు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన వంశీచంద్‌రెడ్డికి తన సమీప ప్రత్యర్థి అచారిపై167 ఓట్లు ఆధిక్యంగా పోలైయ్యాయి. ఆ దశలో ఈవీఎం మొరాయించింది. దాంతో ఎన్నికల అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. అనంతరం ఈవీఎం మొరాయించిందని ఎన్నికల అధికారులు ఈసీ ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ ఈవీఎంను ఓపెన్ చేయడం కష్టసాధ్యంగా మారడంతో తిరిగి ఈ బూత్ కు సంబంధించి ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత వైఎస్సార్ సీపీ నేత భూమా శోభానాగిరెడ్డి విజయంపై కూడా ఈసీకి భన్వర్ లాల్ నివేదిక అందజేశారు. -
కల్వకుర్తిలో ఇవిఎమ్ కొత్త పంచాయతీ
-
ఉత్కంఠలో కల్వకుర్తి అసెంబ్లీ ఫలితం
మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన వంశీచంద్‌రెడ్డికి తన సమీప ప్రత్యర్థి అచారిపై167 ఓట్లు ఆధిక్యంగా పోలైయ్యాయి. ఆ దశలో ఈవీఎం మొరాయించింది. దాంతో ఎన్నికల అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. ఈవీఎంను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. అనంతరం ఈవీఎం మొరాయించిందని ఎన్నికల అధికారులు ఈసీ ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. Techical problam in evm