మహబూబ్ నగర్: జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోజూపల్లి 119 పోలింగ్ బూత్ లో సోమవారం రీ పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. నిన్నటి నుంచి ఈవీఎం మొరాయించడంతో ఆ ఫలితాన్ని అధికారులు పెండింగ్ లో పెట్టారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఒక నివేదికను ఈసీకి అందజేశారు. దీంతో జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తేలడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తీవ్రంగా శ్రమించిన అధికారులు తిరిగి ఈ రోజు ఈవీఎంను ఓపెన్ చేయడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
దీన్ని ఓపెన్ చేయడానికి ఈసీఎల్ ఇంజినీర్లు రంగంలోకి దిగినా.. చివరకు వారు చేతులెత్తేశారు. ఈవీఎంను ఓపెన్ చేయడం తమవల్ల కాదంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు తేల్చిచెప్పేశారు. దీంతో ఇక్కడ తాజాగా ఎన్నిక నిర్వహించాలని భన్వర్ లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేశారు. ఈ బూత్ లో రీ పోలింగ్ నిర్వహించాలంటూ సిఫారుసు చేశారు.
కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన వంశీచంద్రెడ్డికి తన సమీప ప్రత్యర్థి అచారిపై167 ఓట్లు ఆధిక్యంగా పోలైయ్యాయి. ఆ దశలో ఈవీఎం మొరాయించింది. దాంతో ఎన్నికల అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. అనంతరం ఈవీఎం మొరాయించిందని ఎన్నికల అధికారులు ఈసీ ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ ఈవీఎంను ఓపెన్ చేయడం కష్టసాధ్యంగా మారడంతో తిరిగి ఈ బూత్ కు సంబంధించి ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత వైఎస్సార్ సీపీ నేత భూమా శోభానాగిరెడ్డి విజయంపై కూడా ఈసీకి భన్వర్ లాల్ నివేదిక అందజేశారు.