సాక్షి, కల్వకుర్తి టౌన్: పట్టణంలో సమస్యలు తిష్టవేశాయి. కనీస వసతులు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనులకు రూ.కోట్లు వెచ్చించామని చెబుతున్నా కనీస సదుపాయాలు పట్టణవాసులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. కల్వకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా 2013 మార్చి 23న ప్రభుత్వ ఉత్తర్వులతో కల్వకుర్తి నగరపంచాయితీగా రూపాంతరం చెందింది.
తదనంతరం మున్సిపాలిటీగా మారింది. నగరపంచాయతీకి జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులతో 2014 జూలై 3న పాలకవర్గం కొలువుతీరింది. పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు పట్టణంలో అభివృద్ధి పనులు అంతంతమాత్రంగానే జరిగాయి.
అభివృద్ధి పనులకు రూ.12.94కోట్లు
పట్టణంలో ఇప్పటివరకు రూ.12.94కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనుల కోసం నిధులు ఖర్చుచేశారు. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పట్టణంలో అభివృద్ధి పనులను చేపట్టినా కనీస సదుపాయాల కల్పన జరగలేదు. మున్సిపాలిటీ అయినా అందుకు అభివృద్ధి పనులు చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇంటి పన్నులు, నల్లా బిల్లుల, భవన నిర్మాణాలకు అనుమతులు తదితర వాటిని పెంచారు. అయితే అందుకు తగిన వసతులు కల్పించడం లేదన్నారు.
వివిధ పనుల కోసం..
పట్టణంలో పలు అభివృద్ధి, నిర్మాణ పనుల కోసం నగరపంచాయతీ జనరల్ నిధుల ద్వారా రూ.5.18 కోట్లు వెచ్చించారు. నగర పంచాయితీ నూతన భవన నిర్మాణానికి రూ.1.65కోట్లు, 14 ఆర్ధిక సంఘం నిధులతో పట్టణంలో శ్మశాన వాటికల నిర్మాణానికి రూ.1.37కోట్లు, స్టాటప్ గ్రాంట్స్ 2012–13 ద్వారా రూ.1.36 కోట్లు ఖర్చు చేశారు.
అలాగే 14వ ఆర్ధిక సంఘం నిధులు రూ.91.40లక్షలు, 2013–14, 2014–15లో రోడ్డు గ్రాంటుల ద్వారా రూ.64.85లక్షలు, 2016–16 టీఎస్పీ గ్రాంట్ ద్వారా రూ.50.20లక్షలు, 13వ ఆర్ధిక సంఘం నిధులు రూ. 71.63లక్షలు, 2013–14, 2015–16 ఏఎస్సీ గ్రాంట్స్ ద్వారా రూ.42.20లక్షలు, 2015–16 ఎస్సీ ఎస్టీ గ్రాంట్స్ రూ.16లక్షలు, నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణానికి రూ.32.5 లక్షలు పట్టణ అభివృద్ధి పనుల కోసం వెచ్చించారు.
ఖర్చు సరే.. అభివృద్ధి ఏది?
పట్టణంలో రూ.కోట్లు ఖర్చుల చేశామని పాలకులు, అధికారులు చెబుతున్నారు. అయితే పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లపై చెత్త దర్శనమిస్తున్న పట్టించుకునే వారు కరువయ్యారు. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. ఐదు రోజులకోసారి తాగునీరు వస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
పట్టణంలో చేపట్టిన పనులు తూతూ మంత్రంగా చేపట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. టీఎస్‌ఎఫ్‌యూఐడీసీ నిధుల ద్వారా రూ.15 కోట్లు వచ్చినా ఎన్నికల కోడ్ ఆటంకంతో అది జరగలేదు. పాలక వర్గం సమయం గడువు ముగుస్తున్నా పాలకులు, అధికారులు పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కోడ్ రావడంతో పనులకు ఆటంకం
కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు చాలా వరకు నిధులు ఖర్చుచేశాం. అయితే ఇంకా అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. రూ.15కోట్లు ప్రత్యేక నిధులు వచ్చాయి. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆ నిధుల ద్వారా పనులు ప్రారంభించలేదు. పట్టణంలో అభివృద్ధి పనులు చేపడతాం. తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.
– ప్రవీణ్‌కుమార్ రెడ్డి, కమిషనర్, మున్సిపల్, కల్వకుర్తి
Comments
Please login to add a commentAdd a comment