commisionar
-
ఆత్మరక్షణకు గన్ లైసెన్స్ ఇవ్వండి
హన్మకొండ చౌరస్తా: ఇటీవల మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతోన్న నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం గన్ లైసెన్స్ మంజూరు చేయాలని ఓ అధ్యాపకురాలు పోలీసులకు అర్జీ పెట్టుకుంది. దీనికి సంబంధించిన విజ్ఞాపన పత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. గిరిజన సంక్షేమ మహిళల డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నా నంటూ.. తన పేరు నౌషీన్ ఫాతిమాగా కమిషనర్‌కు ఇచ్చిన అర్జీలో ఆమె పేర్కొంది. కేవలం ఈ–మెయిల్ ఐడీని మాత్రమే పేర్కొన్న నౌషీన్ ఫాతిమా ఇతర వివరాలను వెల్లడించలేదు. ఉద్యోగరీత్యా నిత్యం ఖమ్మం జిల్లాకు ఒంటరిగా ప్రయాణిస్తానని, తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరితే తిరిగి వచ్చేసరికి రాత్రి అవుతుందని పేర్కొంది. ఈ నెల 28న మానస హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలోనే తన ఇల్లు ఉందని, నిత్యం అదే మార్గంలో వెళ్తానంటూ తెలిపింది. ప్రియాంకారెడ్డి, మానసపై జరిగిన అఘాయిత్యాలు ఇతర మహిళలపైనా జరగొచ్చని, అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు ఫోన్ చేసినా, మొబైల్ యాప్ ద్వారా తక్షణ సహాయం కోరినా పోలీసులు రక్షిస్తారన్న నమ్మకం లేదని దరఖాస్తులో పేర్కొంది. మానవ మృగాల మధ్యలో ఉంటూ ప్రతిక్షణం నన్ను నేను కాపాడుకోవాలంటే రివాల్వర్ కలిగి ఉండటమే సురక్షిత మార్గమని నమ్ముతున్నట్లు వివరించింది. ‘అతడిని శిక్షించి ఉంటే ఈ ఘటనలు జరిగేవి కావు’ సాక్షి, హైదరాబాద్: హాజీపూర్ వరుస హత్యల నిందితుడిని కఠినంగా శిక్షించి ఉంటే ప్రియాంకారెడ్డి, మానస హత్యలు జరిగేవి కావని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహిళలు, బాలికల హత్యల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రియాంకారెడ్డి హత్యోదంతంపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించి నిందితులను బహిరంగంగా ఉరి తీయాలన్నారు. ఇకనైనా మద్య నిషేధం అమలు చేయాలని కోరారు. -
కల్వకుర్తిలో అభివృద్ధి అంతంతే!
సాక్షి, కల్వకుర్తి టౌన్: పట్టణంలో సమస్యలు తిష్టవేశాయి. కనీస వసతులు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనులకు రూ.కోట్లు వెచ్చించామని చెబుతున్నా కనీస సదుపాయాలు పట్టణవాసులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. కల్వకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా 2013 మార్చి 23న ప్రభుత్వ ఉత్తర్వులతో కల్వకుర్తి నగరపంచాయితీగా రూపాంతరం చెందింది. తదనంతరం మున్సిపాలిటీగా మారింది. నగరపంచాయతీకి జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులతో 2014 జూలై 3న పాలకవర్గం కొలువుతీరింది. పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు పట్టణంలో అభివృద్ధి పనులు అంతంతమాత్రంగానే జరిగాయి. అభివృద్ధి పనులకు రూ.12.94కోట్లు పట్టణంలో ఇప్పటివరకు రూ.12.94కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనుల కోసం నిధులు ఖర్చుచేశారు. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పట్టణంలో అభివృద్ధి పనులను చేపట్టినా కనీస సదుపాయాల కల్పన జరగలేదు. మున్సిపాలిటీ అయినా అందుకు అభివృద్ధి పనులు చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇంటి పన్నులు, నల్లా బిల్లుల, భవన నిర్మాణాలకు అనుమతులు తదితర వాటిని పెంచారు. అయితే అందుకు తగిన వసతులు కల్పించడం లేదన్నారు. వివిధ పనుల కోసం.. పట్టణంలో పలు అభివృద్ధి, నిర్మాణ పనుల కోసం నగరపంచాయతీ జనరల్ నిధుల ద్వారా రూ.5.18 కోట్లు వెచ్చించారు. నగర పంచాయితీ నూతన భవన నిర్మాణానికి రూ.1.65కోట్లు, 14 ఆర్ధిక సంఘం నిధులతో పట్టణంలో శ్మశాన వాటికల నిర్మాణానికి రూ.1.37కోట్లు, స్టాటప్ గ్రాంట్స్ 2012–13 ద్వారా రూ.1.36 కోట్లు ఖర్చు చేశారు. అలాగే 14వ ఆర్ధిక సంఘం నిధులు రూ.91.40లక్షలు, 2013–14, 2014–15లో రోడ్డు గ్రాంటుల ద్వారా రూ.64.85లక్షలు, 2016–16 టీఎస్పీ గ్రాంట్ ద్వారా రూ.50.20లక్షలు, 13వ ఆర్ధిక సంఘం నిధులు రూ. 71.63లక్షలు, 2013–14, 2015–16 ఏఎస్సీ గ్రాంట్స్ ద్వారా రూ.42.20లక్షలు, 2015–16 ఎస్సీ ఎస్టీ గ్రాంట్స్ రూ.16లక్షలు, నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణానికి రూ.32.5 లక్షలు పట్టణ అభివృద్ధి పనుల కోసం వెచ్చించారు. ఖర్చు సరే.. అభివృద్ధి ఏది? పట్టణంలో రూ.కోట్లు ఖర్చుల చేశామని పాలకులు, అధికారులు చెబుతున్నారు. అయితే పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లపై చెత్త దర్శనమిస్తున్న పట్టించుకునే వారు కరువయ్యారు. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. ఐదు రోజులకోసారి తాగునీరు వస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో చేపట్టిన పనులు తూతూ మంత్రంగా చేపట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. టీఎస్ఎఫ్యూఐడీసీ నిధుల ద్వారా రూ.15 కోట్లు వచ్చినా ఎన్నికల కోడ్ ఆటంకంతో అది జరగలేదు. పాలక వర్గం సమయం గడువు ముగుస్తున్నా పాలకులు, అధికారులు పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కోడ్ రావడంతో పనులకు ఆటంకం కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు చాలా వరకు నిధులు ఖర్చుచేశాం. అయితే ఇంకా అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. రూ.15కోట్లు ప్రత్యేక నిధులు వచ్చాయి. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆ నిధుల ద్వారా పనులు ప్రారంభించలేదు. పట్టణంలో అభివృద్ధి పనులు చేపడతాం. తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. – ప్రవీణ్‌కుమార్ రెడ్డి, కమిషనర్, మున్సిపల్, కల్వకుర్తి -
బదిలీ తర్వాతా అధికారిక నంబర్..!
నెల్లూరు సిటీ: నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ కరణం వెంకటేశ్వర్లు గత నెల 29వ తేదీన బదిలీ అయిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు రాజకీయ హైడ్రామా నేపథ్యంలో చివరికి రిలీవయ్యారు. బదిలీ అయి 15 రోజులు గడుస్తున్నా కమిషనర్ అధికారిక నంబర్‌నే వినియోగించడం కార్పొరేషన్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు బదిలీ తర్వాత ఒకట్రెండు రోజుల్లో అధికారిక నంబర్‌ను కార్పొరేషన్ మేనేజర్‌కు అప్పగించేవారు. అయితే దీన్ని భిన్నంగా వెంకటేశ్వర్లు వ్యవహరిస్తుండటం విశేషం. ఫైల్స్‌పై సంతకాలు కొనసాగుతున్నాయా..? కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన కొన్ని ఫైళ్లపై కమిషనర్ సంతకాల అవసరం ఉండటంతో పాత తేదీలతో కమిషనర్ వెంకటేశ్వర్లు సంతకాలు చేస్తున్నారనే ప్రచారం కార్పొరేషన్లో జరుగుతుంది. ముఖ్యంగా రొట్టెల పండగకు సంబంధించి మేయర్ వర్గానికి చెందిన అనుచరుల ఫైళ్లపై కమిషనర్ సంతకాలు అవసరం ఉండటంతో పాత తేదీలతో ఇప్పటికే సంతకాలను పూర్తి చేశారు. ఈ క్రమంలో మరికొందరు కాంట్రాక్టర్లు తమ ఫైళ్లపై కూడా సంతకాల కోసం కమిషనర్‌ను కలుస్తున్నట్లు తెలుస్తోది. వీరి మధ్య కార్యాలయంలోని ఓ ఉద్యోగి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని సమాచారం. -
సీఆర్డీఏ కొత్త కమిషనర్‌గా శ్రీధర్
సాక్షి, విజయవాడ బ్యూరో : సీఆర్డీఏ కమిషనర్ నాగులాపల్లి శ్రీకాంత్ బదిలీ చర్చనీయాంశంగా మారింది. రాజధాని వ్యవహారాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నా ఆయనను ఉన్నట్టుండి బదిలీ చేయడం వెనుక రాజకీయ కారణాలున్నాయని తెలుస్తోంది. సీఆర్డీఏ ఆవిర్భావం నుంచి దానికి ఒక రూపు తీసుకురావడంతోపాటు రాజధానిలో భూసమీకరణ, సింగపూర్ మాస్టర్‌ప్లాన్, స్విస్ ఛాలెంజ్ విధానం వంటి అంశాల్లో కీలకపాత్ర పోషించిన శ్రీకాంత్‌ను రెండేళ్ల క్రితం ఏరికోరి ప్రభుత్వం ఆ పోస్టులో కూర్చోబెట్టింది. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను కావాలని సీఆర్డీఏ కమిషనర్‌గానియమించారు. సీఆర్డీఏ స్వరూపం ఎలా ఉండాలనే దానిపై ఆయన భారీ కసరత్తు చేసి కొత్త విభాగాలను ఏర్పాటు చేశారు. వీజీటీఎం ఉడాలో కేవలం నాలుగు విభాగాలే ఉండగా అది సీఆర్డీఏగా మారిన తర్వాత 18 విభాగాలు ఏర్పాటు చేయించారు. రైతుల వ్యతిరేకతతో కత్తిమీద సాములా మారిన భూసమీకరణలోనూ కీలకంగా వ్యవహరించారు. కొత్త రాజధాని ఎలా ఉండాలనే దానిపై పలు దేశాల్లో పర్యటించి నివేదికలు సమర్పించారు. సింగపూర్, జపాన్, చైనా తదితర దేశాల నుంచి వచ్చిన పలు కంపెనీలను ఆయన సీఆర్డీఏ కార్యాలయంలోనే పనిచేయించి తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. వాస్తవానికి కొద్ది రోజుల నుంచి కమిషనర్ బదిలీ అవుతారని సీఆర్డీఏలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల నెలరోజులపాటు శ్రీకాంత్ ముస్సోరి శిక్షణకు వెళ్లినప్పుడే ఆయన బదిలీ అవుతారనే ప్రచారం జరిగింది. మూడురోజుల క్రితం శిక్షణ ముగించుకుని వచ్చి ఆయన విధుల్లో చేరారు. ఆ తర్వాత వెంటనే బదిలీ కావడం గమనార్హం. రాజధాని వ్యవహారాలు రోజురోజుకూ కీలకంగా మారుతున్న సమయంలో ఆయన్ను ఎందుకు మార్చారనే దానిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. రాజకీయ కారణాలే ఆయన బదిలీకి కారణమనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఆయన స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ అదనపు కమిషనర్‌గా ఉన్న చెరుకూరి శ్రీధర్ నియమించారు. రాజధాని భూసమీకరణలో కీలక భూమిక నిర్వహించిన శ్రీధర్‌కు కొద్దికాలంగా ఇతర సీఆర్డీఏ వ్యవహారాల్లోనూ ప్రాధాన్యత పెరిగింది. శ్రీకాంత్ శిక్షణలో ఉన్న సమయంలో ఆయనే ఇన్చార్జి కమిషనర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు పూర్తిస్థాయి కమిషనర్‌గా నియమితులు కావడం విశేషం. భూసమీకరణలో కీలకంగా... సాక్షి, అమరావతి : సీఆర్డీఏ కమిషనర్‌గా నియమితులైన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి 2014 అక్టోబర్ మూడున జేసీగా బాధ్యతలు స్వీకరించారు. రాజధానికి భూసమీకరణలో అన్నీ తానై రైతులను ఒప్పించి భూములను రాజధానికి ఇప్పించడంలో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రంలో మీ ఇంటికి – మీ భూమి కార్యక్రమాన్ని మొట్టమొదట గుంటూరు జిల్లా నుంచే ప్రారంభింపజేయటంలో కృషి చేశారు. మిర్చి యార్డులో కీలక సంస్కరణలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన బదిలీ కావటంతో ఆ స్థానంలో జాయింట్ కలెక్టర్‌గా ఇంకా ఎవరినీ నియమించలేదు.