సీఆర్‌డీఏ కొత్త కమిషనర్‌గా శ్రీధర్
సాక్షి, విజయవాడ బ్యూరో : సీఆర్‌డీఏ కమిషనర్ నాగులాపల్లి శ్రీకాంత్ బదిలీ చర్చనీయాంశంగా మారింది. రాజధాని వ్యవహారాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నా ఆయనను ఉన్నట్టుండి బదిలీ చేయడం వెనుక రాజకీయ కారణాలున్నాయని తెలుస్తోంది. సీఆర్‌డీఏ ఆవిర్భావం నుంచి దానికి ఒక రూపు తీసుకురావడంతోపాటు రాజధానిలో భూసమీకరణ, సింగపూర్ మాస్టర్‌ప్లాన్, స్విస్ ఛాలెంజ్ విధానం వంటి అంశాల్లో కీలకపాత్ర పోషించిన శ్రీకాంత్‌ను రెండేళ్ల క్రితం ఏరికోరి ప్రభుత్వం ఆ పోస్టులో కూర్చోబెట్టింది.
నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను కావాలని సీఆర్‌డీఏ కమిషనర్‌గానియమించారు. సీఆర్‌డీఏ స్వరూపం ఎలా ఉండాలనే దానిపై ఆయన భారీ కసరత్తు చేసి కొత్త విభాగాలను ఏర్పాటు చేశారు. వీజీటీఎం ఉడాలో కేవలం నాలుగు విభాగాలే ఉండగా అది సీఆర్‌డీఏగా మారిన తర్వాత 18 విభాగాలు ఏర్పాటు చేయించారు. రైతుల వ్యతిరేకతతో కత్తిమీద సాములా మారిన భూసమీకరణలోనూ కీలకంగా వ్యవహరించారు. కొత్త రాజధాని ఎలా ఉండాలనే దానిపై పలు దేశాల్లో పర్యటించి నివేదికలు సమర్పించారు. సింగపూర్, జపాన్, చైనా తదితర దేశాల నుంచి వచ్చిన పలు కంపెనీలను ఆయన సీఆర్‌డీఏ కార్యాలయంలోనే పనిచేయించి తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. వాస్తవానికి కొద్ది రోజుల నుంచి కమిషనర్ బదిలీ అవుతారని సీఆర్‌డీఏలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల నెలరోజులపాటు శ్రీకాంత్ ముస్సోరి శిక్షణకు వెళ్లినప్పుడే ఆయన బదిలీ అవుతారనే ప్రచారం జరిగింది. మూడురోజుల క్రితం శిక్షణ ముగించుకుని వచ్చి ఆయన విధుల్లో చేరారు. ఆ తర్వాత వెంటనే బదిలీ కావడం గమనార్హం. రాజధాని వ్యవహారాలు రోజురోజుకూ కీలకంగా మారుతున్న సమయంలో ఆయన్ను ఎందుకు మార్చారనే దానిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. రాజకీయ కారణాలే ఆయన బదిలీకి కారణమనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఆయన స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టర్, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా ఉన్న చెరుకూరి శ్రీధర్ నియమించారు. రాజధాని భూసమీకరణలో కీలక భూమిక నిర్వహించిన శ్రీధర్‌కు కొద్దికాలంగా ఇతర సీఆర్‌డీఏ వ్యవహారాల్లోనూ ప్రాధాన్యత పెరిగింది. శ్రీకాంత్ శిక్షణలో ఉన్న సమయంలో ఆయనే ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు పూర్తిస్థాయి కమిషనర్‌గా నియమితులు కావడం విశేషం.
భూసమీకరణలో కీలకంగా...
సాక్షి, అమరావతి : సీఆర్‌డీఏ కమిషనర్‌గా నియమితులైన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి 2014 అక్టోబర్ మూడున జేసీగా బాధ్యతలు స్వీకరించారు. రాజధానికి భూసమీకరణలో అన్నీ తానై రైతులను ఒప్పించి భూములను రాజధానికి ఇప్పించడంలో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రంలో మీ ఇంటికి – మీ భూమి కార్యక్రమాన్ని మొట్టమొదట గుంటూరు జిల్లా నుంచే ప్రారంభింపజేయటంలో కృషి చేశారు. మిర్చి యార్డులో కీలక సంస్కరణలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన బదిలీ కావటంతో ఆ స్థానంలో జాయింట్ కలెక్టర్‌గా ఇంకా ఎవరినీ నియమించలేదు.