బదిలీ తర్వాతా అధికారిక నంబర్..!
నెల్లూరు సిటీ: నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ కరణం వెంకటేశ్వర్లు గత నెల 29వ తేదీన బదిలీ అయిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు రాజకీయ హైడ్రామా నేపథ్యంలో చివరికి రిలీవయ్యారు. బదిలీ అయి 15 రోజులు గడుస్తున్నా కమిషనర్ అధికారిక నంబర్‌నే వినియోగించడం కార్పొరేషన్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు బదిలీ తర్వాత ఒకట్రెండు రోజుల్లో అధికారిక నంబర్‌ను కార్పొరేషన్ మేనేజర్‌కు అప్పగించేవారు. అయితే దీన్ని భిన్నంగా వెంకటేశ్వర్లు వ్యవహరిస్తుండటం విశేషం.
ఫైల్స్‌పై సంతకాలు కొనసాగుతున్నాయా..?
కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన కొన్ని ఫైళ్లపై కమిషనర్ సంతకాల అవసరం ఉండటంతో పాత తేదీలతో కమిషనర్ వెంకటేశ్వర్లు సంతకాలు చేస్తున్నారనే ప్రచారం కార్పొరేషన్లో జరుగుతుంది. ముఖ్యంగా రొట్టెల పండగకు సంబంధించి మేయర్ వర్గానికి చెందిన అనుచరుల ఫైళ్లపై కమిషనర్ సంతకాలు అవసరం ఉండటంతో పాత తేదీలతో ఇప్పటికే సంతకాలను పూర్తి చేశారు. ఈ క్రమంలో మరికొందరు కాంట్రాక్టర్లు తమ ఫైళ్లపై కూడా సంతకాల కోసం కమిషనర్‌ను కలుస్తున్నట్లు తెలుస్తోది. వీరి మధ్య కార్యాలయంలోని ఓ ఉద్యోగి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని సమాచారం.