సాక్షి, కల్వకుర్తి :అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం మొదలైంది. మొదటిరోజు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కల్వకుర్తి మినహా ఎక్కడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయలేదు. కల్వకుర్తిలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ తరుఫునా నామినేషన్ వేశారు. మొదటి సెట్ కావడంతో ఇరువురు నాయకులు సాదాసీదాగా వచ్చి నామినేషన్ పత్రాలు అధికారులకు అందించి వెళ్లారు.
కల్వకుర్తిలో రెండు
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా నామినేషన్ల దాఖలు హడావిడి కనిపించలేదు. కానీ కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మొదటి రోజే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ తరఫున, టీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేష్‌కుమార్‌కు అందజే«శారు. ఇరువురు మొదటి సెట్ మాత్రం అందజేసి వెళ్లిపోయారు.
మరోరోజు భారీ ర్యాలీలతో మరోసారి నామినేషన్ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జైపాల్ యాదవ్ తన నామినేషన్ పత్రాన్ని మధ్యాహ్నం 1.15 గంటలకు పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్, విజితారెడ్డిలతో కలిసి తహసీల్దారు కార్యాలయానికి వెళ్లారు. రెండో విడత పత్రాలను మంత్రి హరీశ్‌రావు, టీఆర్‌ఎస్ ముఖ్యనాయకులతో కలిసి మరోమారు నామినేషన్ వేసేందుకు రానున్నారు. మెదటి సెట్ నామినేషన్ పత్రాల్లో ఎడ్మ కిష్టారెడ్డి.. జైపాల్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే చల్లావంశీచంద్‌రెడ్డి మధ్యాహ్నం 12.15 గంటలకు తన కుటంబ సభ్యులతో కలిసి వచ్చి మొదటి సెట్ నామినేసన్ పత్రాలను దాఖలు చేశారు. తండ్రి రాంరెడ్డి, తల్లి శోభారెడ్డిలతో పాటు భార్య ఆశ్లేషారెడ్డి, కూతురు మహాక్షారెడ్డిలతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. రెండో విడతలో సీనియర్ నాయకులు జైపాల్‌రెడ్డితో రానున్నట్లు తెలిసింది. వంశీచంద్‌రెడ్డి భార్య ఆశ్లేషారెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు.
నాగర్‌కర్నూల్‌లో నిల్..
నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయగా మొదటిరోజు సోమవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఏ అభ్యర్థి కూడా నామినేషన్ వేయడానికి రాలేదు. స్థానిక ఆర్డీఓ (రిటర్నింగ్ అధికారి) కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించేందుకు అందుబాటులో ఉన్నారు. కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా ఉదయం 11గంటలకు నామినేషన్ పత్రాల స్వీకరణకు ముందే బాంబ్ స్క్వాడ్‌తో కార్యాలయ ఆవరణ మొత్తం తనిఖీలు నిర్వహించారు.
అచ్చంపేటలోనూ నిల్
అచ్చంపేట: ఎన్నికల ప్రక్రియలో కీలకఘట్టమైన నామినేషన్ల దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభించగా మొదటిరోజు ఏ అభ్యర్థి కూడా దాఖలు చేయలేదు. ప్రచారంలో మునిగి తేలు తున్న అభ్యర్థులు నామినేషన్లకు ముహూర్తాలను వెతుక్కుంటున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నారు. ఆయన ఆర్భాటంగా ఈనెల 14న నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే మహాకూటమి అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ కా>ంగ్రెస్ పార్టీ నుంచి భీఫామ్ ఇంకా అందుకోలేదు. అలాగే బీజేపీ అభ్యర్థి మల్లేశ్వర్‌తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు ముహూర్తం చూసుకుని నామినేషన్ వేయాలని చూస్తున్నారు. అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ నర్సింహులు మొదటిరోజు రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీఐ రామకృష్ణ, ఎస్‌ఐలు పరుషరామ్, రమేష్ బందో బస్తును పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment