కల్వకుర్తి గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు | Internal Conflicts In Kalwakurthy TRS | Sakshi
Sakshi News home page

కారులో పొగ!

Published Sun, May 31 2020 8:55 AM | Last Updated on Sun, May 31 2020 11:48 AM

Internal Conflicts In Kalwakurthy TRS - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కల్వకుర్తి గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు జోరుగా సాగుతోంది. రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ నియోజకవర్గంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వర్గపోరు పతాక స్థాయికి చేరుకుంది. నువ్వా... నేనా.. అనేవిధంగా ఇద్దరు నేతలు బహిరంగంగా సవాలు చేసుకోకున్నా.. అంతర్గతంగా అదే తలపిస్తోంది. వీరిద్దరి గ్రూపులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్మెత్తి పోసుకుంటుండటం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. స్థానిక ఎమ్మెల్యే జైపాల్ ‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ విభేదాలు.. తమ అనుయాముల నిరసనల రూపంలో బహిర్గతమవుతున్నాయి.

దీనికి కొనసాగింపుగా పార్టీ శ్రేణులు సైతం రెండుగా విడిపోవడంతో వర్గపోరు రచ్చకెక్కిందని చెప్పవచ్చు. ఇటీవల స్థానికంగా చోటుచేసుకున్న పలు సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇరువర్గాల ప్రెస్‌మీట్‌లు, నిరసనలు, విమర్శలు, వ్యాఖ్యలు, ఆరోపణలతో కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇతర పార్టీల నేతలు, అధికార పార్టీలోని తటస్థులు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. చదవండి: లైసెన్సుల ‘లొల్లి’

యుద్ధం మొదలైందిలా... 
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన నాయకుల్లో జైపాల్‌యాదవ్,ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. చివరకు జైపాల్‌కు టికెట్‌ దక్కడం.. గెలవడం చకాచకా జరిగిపోయాయి. కొంతకాలంగా నియోజకవర్గంలో నారాయణరెడ్డి క్రియాశీలకంగా వ్యవహిస్తున్నారు. కాంగ్రెస్‌ పారీ్టకి చెందిన కడ్తాల ఎంపీపీ కమ్లి మోత్యానాయక్, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌ ఇటీవల ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామంపై ఎమ్మెల్యే వర్గం నొచ్చుకుంది. నియోజవకర్గ బాస్‌గా ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారనేది ఆయన అనుయాయుల ప్రశ్న.

దీనిపై ప్రెస్‌మీట్‌ పెట్టి... ఎమ్మెల్సీ తీరును సైతం ఎండగట్టి తప్పుబట్టారు. అయితే, ఆమనగల్లు మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ కన్వినర్‌ వస్పుల జంగయ్యతోపాటు పలువురు ఎమ్మెల్యేకు కొన్ని రోజులుగా దూరం పాటిస్తూ.. తాజాగా ఎమ్మెల్సీకి దగ్గరయ్యారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఆమనగల్లు ఎంపీపీ అనితవిజయ్‌ కొన్ని రోజుల కిందట ఎమ్మెల్సీ వర్గం వైపు వచ్చారు. వీటన్నింటినీ గమనించిన ఎమ్మెల్యే వర్గం.. ఎమ్మెల్సీపై గుర్రుగాఉంది.  

చినికిచినికి గాలివాన..  
ఇటీవల ఆమనగల్లు మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే.. ఎంపీపీ కుర్చీలో ఆసీనులయ్యారు. దీనిని స్థానిక ఎంపీపీ అనిత తీవ్రంగా తప్పుబట్టారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా కార్యాలయంలో సమావేశం నిర్వహించడమే కాకుండా ఎంపీపీ కుర్చీలో కూర్చోవడమేంటనేది  ఆమె వాదన. ఒకరకంగా తనను అవమానించారని, గిరిజన ఎంపీపీ కావడంతోనే ఇలా చేశారని ఆమె మండిపడుతున్నారు. ఆమె ఆరోపణలు.. ఎమ్మెల్సీ ప్రోత్సాహ ఫలితమేనని ఎమ్మెల్యే వర్గం ప్రత్యారోపణ చేస్తోంది. గ్రూపు రాజకీయాలు చేస్తూ.. పార్టీని భ్రష్టు పటిస్తున్నారని బాహాటంగానే కసిరెడ్డిపై విమర్శల దాడికి దిగింది. మరోపక్క ఎమ్మెల్సీ వర్గం కూడా వీటిపై ఘాటుగానే స్పందిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీని ఆహ్వానించవద్దని అధికారులకు ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేస్తున్నారని మండిపడుతున్నాయి.  

రాజకీయం.. వ్యాపారం కాదు 
ఆమనగల్లు: రాజకీయం అంటే వ్యాపారం కాదని, సేవాభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యేగా తనకు ఉన్న అధికారాలను వినియోగించుకుంటున్నానే తప్పా ఇతర ప్రజాప్రతినిధులను కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. కల్వకుర్తిలో ఉన్న మంచి వాతావరణాన్ని కొందరు నేతలు స్వార్థ ప్రయోజనాల కోసం కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు వద్దూ.. అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. కులమతాలకు అతీతంగా తాను పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.   

20 లక్షలతో సరుకుల పంపిణీ  
ఆమనగల్లు మండలంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో పది వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కడ్తాల్‌ మండలంలో రూ.20 లక్షలతో దాదాపు 4 వేల మంది ప్రైవేటు వాహనాల డ్రైవర్లు, వలస కార్మికులకు సరుకులు అందించామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు అనురాధ, సింగిల్‌ విండో చైర్మన్‌ గంప వెంకటేశ్‌గుప్తా, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నిట్టె నారాయణ, వైస్‌ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ!    

పార్టీ బలోపేతం కోసమే.. 
‘ఇతర పార్టీలోంచి టీఆర్‌ఎస్‌లోకి వస్తామంటే చేర్చుకున్నాం. ఒక ఎమ్మెల్సీగా పార్టీలో చేర్చుకునే హోదా నాకు లేదా? దీనిని తప్పు బట్టాల్సిన అవసరమేం ఉంది..? ఎంపీపీ అనిత వ్యాఖ్యలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అది ఆమె వ్యక్తిగతం. దీని వెనక నా ప్రమేయం ఉందని ఆరోపించడం.. నూరుపాళ్లు తప్పు. ఎన్నికల సమయంలో జైపాల్‌ యాదవ్‌ గెలుపునకు కృషి చేశా. నేను సహకరించలేదని ప్రచారం చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసమే తప్ప నాకు  స్వార్థం లేదు’ అని ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.  

దురుద్దేశంతోనే ఆరోపణలు
‘ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఓ ఎమ్మెల్యేగా వమ్ము చేయలేను. రాజకీయం అంటే వ్యాపారం కాదు. సేవాభావంతో పనిచేసేవారే రాజకీయాల్లో ఉండాలి. కొందరు రాజకీయ దురుద్దేశంతో నాపై ఆరోపణలు చేస్తున్నారు. శాసనసభ్యునిగా నాకున్న అధికారాలను వినియోగించుకుంటున్నా. కుల, మతాలకు అతీతంగా పనిచేస్తున్నా. ఇతర ప్రజాప్రతినిధులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. కల్వకుర్తిలో కొందరు నేతలు స్వార్థం కోసం రాజకీయాలను కలుషితం చేస్తున్నారు’ అని ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement