వనపర్తి: గొర్రెను నోట కరుచుకుని నీటిలోకి జారుకుంటున్న మొసలితో పోరాడి తీవ్రంగా గాయపడ్డాడొక కాపరి. మొసలి దాడి చేసిన గొర్రె చిన్న గాయంతో ప్రాణాలు దక్కించుకోగా.. దాన్ని కాపాడిన కాపరి ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రాంపురం శివారు ప్రాంతంలోని కృష్ణా నదిలో జరిగిన ఈ సంఘటన వివరాలివి.
పెబ్బేరు మండలం రాంపురం గ్రామానికి చెందిన కొరి రాములు, బీసన్నలకు చెందిన 300 గొర్రెలను మేత కోసం నెల రోజుల క్రితం కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ పొలాల్లో గొర్రెలను మేపుకొని కృష్ణా నదిలోని గుంతల్లో నిల్వ ఉన్న నీటిని తాగిస్తుండేవారు. ఎప్పట్లాగే శుక్రవారం సాయంత్రం వేళ గొర్రెలను నదిలో నీరున్న గుంతల వద్దకు తీసుకెళ్లారు.
గుంపులోని ఒక గొర్రె నీటిని తాగేందుకు వెళ్లగా.. మడుగులోని మొసలి దానిపై దాడి చేసింది. గొర్రె అరుపులు విన్న కాపరి కొరి రాములు చేతిలోని కర్రతో మొసలిపై దాడి చేశాడు. దీంతో మొసలి గొర్రెను వదిలేసి కాపరిపై దాడి చేసి.. అతని రెండు చేతులు, కడుపు భాగంలో గాయపరిచింది. కాపరి చేతుల్ని నోట కరుచుకొని నీటిలోకి మొసలి లాక్కెళ్తుండగా.. రాములు అరుపులు విన్న సహచర కాపరి బీసన్న రాళ్లతో దానిపై దాడి చేశారు.
దీంతో మొసలి రాములును వదిలి నీటిలోకి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన రాములును 108 అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యానికి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం తన తండ్రి పరిస్థితి నిలకడగానే ఉందని రాములు కుమారుడు మల్లేశ్ తెలిపాడు. రాములు అధైర్యపడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సహచర కాపరి బీసన్న తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment