ఎలి.. ఎంత తెలివైన స్టూడెంటో కదా! | Croc Whisperer By Janaki Lenin Translated By Rohini Chintha | Sakshi
Sakshi News home page

ఎలి.. ఎంత తెలివైన స్టూడెంటో కదా!

Published Fri, Nov 15 2024 9:59 AM | Last Updated on Tue, Nov 19 2024 1:13 PM

Croc Whisperer By Janaki Lenin Translated By Rohini Chintha

థాయ్‌తో పాటు అమెరికాకు చెందిన కుస్తీ వీరులు.. పదునైన పళ్ళతో  ఉన్న మొసళ్ళ దవడ మధ్య వాళ్ల తలను దూరుస్తూ కనిపించారు. “ఖచ్చితంగా ఆ జంతువులు శిక్షణ పొందినవి కదూ?” అని నేను రోమిని అడిగా నమ్మలేకపోతూ. అయితే ఆ విన్యాసంలో వారిని అవి నమిలేయకుండా ఉండేంతగా కుస్తీ వస్తాదులు మొసళ్ళని భయపెడతారని రోమ్ అనుకున్నారు. 

మనం అంగీకరించాల్సింది ఏమిటంటే?.. మొసళ్లకి శిక్షణ ఇవ్వలేము కానీ మచ్చిక చేసుకోవచ్చు. ఇండోనేషియా పడమర పపువాలో రోమ్ ఒక న్యూ గిని మంచినీటీ మొసలి ఒక చెక్క ఇంట్లో ఉండటం చూసాడు. ఆ మొసలి పొదిగిన పిల్లగా ఉన్నప్పటి నుంచి పిల్లల, మనుషులతో ఓ పెంపుడుకుక్కలా పెరిగి ఇప్పుడు ఐదడుగుల పొడుగయ్యింది. చల్లటి వర్షాకాలం రాత్రులలో అక్కడి సభ్యులతో కలిసి అది చలికాచుకుంటూ ఉంటుంది కూడా.

మద్రాస్‌ క్రొకడైల్‌ బ్యాంక్‌  డైరెక్టర్‌గా 2008వ సంవత్సరం మధ్యలో కొద్దికాలం పాటు పనిచేసిన రాల్ఫ్ సామెర్లడ్.. జర్మనీలో ఓ తోటమాలి దక్షిణ అమెరికా రకమైన కెమన్ అనే మొసలిని పెంచుకున్నట్లు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆ తోటమాలి మోకాళ్లపై కూర్చున్నప్పుడు, కుక్క పిల్లలా ఆ మొసలి అతని తలకూ, భుజాలకూ రాసుకునేదట. రాల్ఫ్ మద్రాస్ మొసళ్లకి శిక్షణ ఇచ్చే ఒక కార్యక్రమానికి నాంది పలికాడు. అప్పట్లో అసిస్టెంట్ క్యూరేటర్ అయిన సోహం ముఖర్జీ.. మాకు ఎంతో ఆశ్చర్యం కలిగించేలా, ఆ ఆలోచనను రాను రాను ఎంతో సరదాగా, ఆకర్షణీయమైన కార్యక్రమంగా అభివృద్ధి చేశారు.

ఎలి చిన్నపిల్లగా ఉన్నప్పుడు శిక్షణ ఇవ్వడం జరిగింది, కానీ, అది పెద్దయినప్పటి నుంచి ఆ అభ్యాసం ఇవ్వడం తగ్గించేశారు. ఎలికి తన పేరు ఇంకా గుర్తుంది. శిక్షణ పునః ప్రారంభించాడానికి ఇది ఒక మంచి విషయం. తను ఒక ఆదేశం పాటించిన ప్రతీసారి ఒక మాంసం ముక్క బహుకరించేవారు. అచ్చం ఒక కుక్కకి శిక్షణ ఇచ్చినట్లుగా. ఏటొచ్చి ఇది ఒక పెద్ద పోలుసులు కలది. అంతే. ఒక వారం తరువాత, ఎలికి శిక్షణ ఇస్తున్నప్పుడు, వెనుకన ఉన్న ఒక మగ్గర్ మొసలి ఆదేశాలకి చక్కగా స్పందించడం సోహం గమనించారు. 

ఆ మొసలి ఏ బహుమతి సహాయం లేకుండా, చూసి నేర్చుకుంటోంది. సోహం దానికి పింటూ అని పేరు పెట్టాడు. ఆ మొసలి వెంటనే ఆ కార్యక్రమంలో భాగమైంది. కాలక్రమేణా మరి నాలుగు మొసళ్లు చేరాయి. ప్రతీ మధ్యాహ్నం మూడింటికి శిక్షణ మొదలయ్యేది. దానికి పది నిముషాల ముందే ఆ ఆరుగురు శిష్యులు కొలను అంచున, సోహం గొంతు నుంచి విలువడే అతి చిన్న శబ్దం కోసం ఆత్రంగా ఎంతో అప్రమత్తతతో వేచి చూసేవి. 

అతను వచ్చాక వాటి ఆనందం మాములుగా లేదు. ఆ మొసలి శిష్యులకి వాటిని ఏ వరుసలో పిలుస్తారో తెలుసు. ఇక వారి వంతు కోసం ఎంతో సహనంతో వేచి ఉండేవి. ఆచ్చం నా కుక్కలలాగే వాటికి ఆదేశల వరుస ఎంత బాగా తెలుసంటే, అవి ముందస్తుగానే ఆ విన్యాసాలు చేసేసేవి. కనుక సోహం ఆదేశాలను తారుమారు చేయాల్సొచ్చేది. ఆ మొసలి శిష్యులు వారంలో ఏ రోజు శిక్షణ నుంచి సెలవు వస్తుందో కూడా తెలుసుకున్నాయి. పింటూ లాగే, వేరే మోసళ్లు కూడా శిక్షకుడి ఆదేశాల పట్ల ఎంతో శ్రద్ధ వహించి, చూసి నేర్చుకున్నాయి. 

త్వరలోనే కొమోడో, థాయ్ సాయమీస్, ఉప్పు నీటి మొసలి మిక్, మారియు నైల్ మొసలి అబూ, అన్ని జాతుల రంగురంగుల మొసళ్ళ కలగంపగా ఆ శిక్షణ పాఠశాలకు హాజరు అయ్యాయి. ఆఖరికి వయసులో పెద్దదైన మగ్గర్ రాంబో కూడా ఆ కార్యక్రమంలో చేరి, కొత్త విన్యాసాలు నేర్చుకోవడానికి వయసు అవరోధం కాదని నిరూపించింది. కానీ గారాల కూచి ఎలి మాత్రం రా, ఉండు, పైకి, కూర్చో, తిరుగు, నోరు తెరు వంటి పన్నెండు ఆదేశాలు తెలిసిన అత్యుత్తమ విద్యార్థి. ఒకసారి ఎలి శిక్షణ రాంప్ పై సగం దూరం వెళ్ళాక, సోహం తనని ‘గెంతు’ అని ఆదేశించారు. 

ఒక జారెడు బల్ల వంటి రాంప్ పైనుంచి గెంతటం ఎంత కష్టమో మీరు ఊహించగలరు, కానీ ఎలి బహుమతి పొందే అవకాశం వదులదలచలేదు. రాంప్ వదలకుండా ఎలి తన కాలివేళ్లపై నుంచుని పొట్ట కిందకి ఆంచి, మెల్లగా గెంతడానికి సిద్ధమవుతున్నట్టు అనుకరించింది. ఎంతో ఆశ్చర్యకరం. ఆ పాఠశాల, ఎనిమిది నెలల నుంచి నలభై ఏళ్లు ఉన్న వేర్వేరు జాతులకు చెందిన ముప్పై మొసళ్ళ ఉండేంతగా పెరిగి పెద్దదయ్యింది.

కెమన్ బల్లులు, అల్డబ్రా తాబేళ్లను కూడా శిష్యులుగా చేర్చుకోవడానికి వీలుగా ఉండేలా ఆ పాఠశాల పేరును రెప్టైల్ పాఠశాలగా మార్చారు. పాములు, మానిటర్ బల్లులు, తాబేళ్ళు పాఠశాలలో చేరడానికి వేచి ఉన్న జాబితాలో ఉన్నాయి. మరి స్పష్టంగా, గవర్నమెంట్ నిబంధనలకు కట్టుబడి, విద్యార్థులు చేరడానికి నిర్ణీత రుసుము కూడా లేదు!
 

::జానకి లెనిన్ రాసిన దానికి రోహిణి చింత అనువాదం

(చదవండి: యంగ్‌ టాలెంట్‌: బహుముఖ ప్రజ్ఞతో సత్తా చాటుతున్న చిచ్చర పిడుగులు)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement