తాళ్లచెరువులో కొనసాగుతున్న మట్టి తవ్వకాలు
సాక్షి, వనపర్తి: ఓవైపు చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి నాటి గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేస్తుంటే, కొందరు చెరువుల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారు. ఇటీవల మరమ్మతు చేసిన వనపర్తి జిల్లా కేంద్రంలోని తాళ్ల చెరువు ఓ వైపు ఆక్రమణకు గురైంది. మరోవైపు అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కొందరు రియల్ వ్యాపారులు చెరువులోని మట్టిని తరలించుకుపోయి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషమై స్థానికులు అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పొంచి ఉన్న ముప్పు
చిన్ననీటి పారుదల నిబంధనల ప్రకారం చెరువు కట్టకు పదిమీటర్ల దూరం వరకు కనీసం పూడికతీత పనులు చేపట్టనివ్వరు. చెరువుకట్టకు సమీపంలో గోతి ఎక్కువగా చేస్తే నీరు నిల్వ అయిన సమయంలో కట్ట కిందభాగం నుంచి అవతలికి నీరు వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీంతో క్రమక్రమంగా కట్టబలహీనపడి తెగిపోయే పరిస్థితులు వస్తాయి. ఇంత ప్రమాదం ఉన్నా.. అధికారులతో ఎలాంటి అనుమతి తీసుకోకుండా ప్రభుత్వ ఆధీనంలోని చెరువులో నుంచి కొందరు రియల్ వ్యాపారులు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ చెరువు కింద ప్రస్తుతం ఆయకట్టు చాలా తక్కువగా ఉంది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చిన్నపాటి తాళ్ల చెరువును మినీ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని ఏడాది పొడవునా.. నీటితో నిల్వ ఉంచి భూగర్భజలాలను పునఃరుద్ధరించాలని అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది. తాళ్ల చెరువు అభివృద్ధి పనుల కోసం ఎస్టిమేట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులకు మౌకిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్షం రోజుల్లో ఎస్టిమేట్ సిద్ధమయ్యే సమయంలో రియల్ వ్యాపారులు చెరువులో మట్టితవ్వకాలకు తెగబట్టారు. సుమారు 2వేల ట్రాక్టర్ల వరకు మట్టిని తరలించినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది.
ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యమే
తాళ్ల చెరువులో కొందరు ఓ ప్రొక్లెయినర్, సుమారు పది ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని చెరువుకు సమీపంలో నివాసం ఉండేవారు చిన్ననీటి పారుదలశాఖ అధికారులకు ఫోన్‌లో సమాచారం అందించారు. దీనికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఓ ఉన్నతస్థాయి అధికారి సమాధానం ఇచ్చారని సదరు వ్యక్తి తెలిపారు. సమాచారం ఇచ్చిన వారిని ప్రశ్నలతో ఎదురుదాడి చేయటానికి ప్రయత్నించటం విస్మయానికి గురిచేసిందని ‘సాక్షి’తో వాపోయారు.
అక్రమణల పర్వం ఇలా..
ఇప్పటికే తాళ్ల చెరువు వాగు ఆక్రమణకు గురైంది. 1999, 2008లో రెండుసార్లు కురిసిన భారీ వర్షాలకు నీరంతా నిండి ఇళ్లలోకి, రోడ్లపైకి వచ్చాయి. 1999లో చోటుచేసుకున్న సంఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు గతంలో చోటుచేసుకున్న విషయం తెలిసినా.. అధికారులు చెరువుల విషయంలో అలసత్వం ప్రదర్శించటం ఏమిటని పలువురు అసహనం వ్యక్తంచేశారు. గతంలో చెరువులో నుంచి అలుగుపారడంతో పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్, శ్వేతానగర్, దామోదర్ కాలనీ, బ్రహ్మంగారివీధి, శంకర్‌గంజ్, రాంనగర్ కాలనీ, రామాటాకీస్, బంగారం దుకాణాలు, ఆర్‌అండ్‌బీ కార్యాలయం, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, టౌన్‌పోలీస్‌స్టేషన్ జలమయం అయ్యాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం రియల్ వ్యాపారులు చేసిన తవ్వకాలతో భవిష్యత్‌లో కట్టకు ఏదైనా ప్రమాదం జరిగితే సంభవించే నష్టాన్ని ఊహించటం కష్టమే.
వెంటనే చర్యలు తీసుకుంటాం
తాళ్ల చెరువులో మట్టి తవ్వకాల గురించి ఇప్పటికే స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే చెరువును సందర్శిస్తాం. అక్రమ మట్టి తరలింపును అడ్డుకుంటాం. మినీట్యాంక్‌బండ్ తరహాలో తాళ్ల చెరువును అభివృద్ధి చేసేందుకు ఎస్టిమేట్లు త్వరలో పూర్తి చేస్తాం.
– భరత్, అసిస్టెంట్ ఇంజనీర్, వనపర్తి
Comments
Please login to add a commentAdd a comment