అమెరికాలో రింగులు మార్చుకుంటున్న అమ్మాయి, అబ్బాయి
మదనాపురం (కొత్తకోట): పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి పెళ్లి సంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో.. ఉద్యోగం చేసేందుకు అమెరికాకు వెళ్లిన ఓ అమ్మాయి, అబ్బాయి నిశ్చితార్థం వేడుకలను అక్కడ స్నేహితుల సమక్షంలో రింగులు మార్చుకున్నారు. అదే సమయంలో ఇక్కడ వారి తల్లిదండ్రులు తాంబూలాలు పుచ్చుకున్నారు. వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన అనురాధ, జక్కుల నాగన్న యాదవ్ దంపతుల కుమార్తె సావ్వీశృతి 2013 నుంచి అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ కాలనీకి చెందిన శ్రీవాణి, ఐలయ్యయాదవ్ దంపతుల కుమారుడు వంశీకృష్ణ కూడా అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. (ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి)
తాంబూలాలు మార్చుకుంటున్న తల్లిదండ్రులు
ఇద్దరూ తెలుగువారు కావడంతో ఇటీవల ఇరు కుటుంబాల తల్లిదండ్రులు అక్కడికి వెళ్లినప్పుడు పెళ్లి సంబంధం కుదిర్చారు. సంప్రదాయాల ప్రకారం నిశ్చితార్థం చేయాలనుకున్నారు. అయితే అక్కడ ఇద్దరికీ ఉద్యోగరీత్యా సెలవులు దొరకలేదు. దీంతో అనుకున్న సమయానికి భారత కాలమాన ప్రకారం గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు గురుస్వామి గోపాలకృష్ణ వేద మంత్రాలను సెల్‌ఫోన్‌లో చదువుతుండగా.. అమెరికాలో ఇద్దరూ రింగులు మార్చుకున్నారు. ఆ దృశ్యాలను ఇక్కడి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు తిలకించారు. అదే సమయంలో ఇరు కుటుంబాల తల్లిదండ్రులు, బంధువులు తాంబూలాలను మార్చుకుని, లగ్నపత్రిక రాసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment