సోమవారం మహిళా గర్జన సభావేదికపై కాంగ్రెస్ నేతలు ఉబేదుల్లా కొత్వాల్, డీకే అరుణ, కుంతియా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుస్మితాదేవ్, జైపాల్‌రెడి, మధుయాష్కీ, గీతారెడ్డి తదితరులు
సాక్షి వనపర్తి: కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం లభించిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన మహిళా గర్జన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్‌లో స్థానం కల్పించకపోవడం సిగ్గు చేటన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళలను అన్ని రకాలుగా అణచివేతకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వకపోగా, చెల్లించిన వడ్డీ డబ్బులను తిరిగి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలు, స్వయం ఉపాధి సంఘాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. 2019లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
టీఆర్‌ఎస్‌కు మహిళలంటే చిన్నచూపు: సుస్మితాదేవ్
కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు సముచిత గౌరవం లభిస్తుందని ఏఐసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్ అన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మహిళలు అంటే చిన్నచూపు ఉందని.. కేసీఆర్ కుమార్తె కవిత రూ.30 వేల చీర కట్టుకుని తిరుగుతుంటే.. రాష్ట్రంలోని మహిళలకు రూ.30 చీర కట్టబెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు.
కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని మహిళ పేరిటే ఇచ్చామని గుర్తు చేశారు. సభలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు డీ.కే అరుణ, సంపత్ కుమార్, గీతారెడ్డి, పార్టీ నేతలు మల్లు రవి, మధుయాష్కీ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.
ఇదీ మహిళా డిక్లరేషన్
- రివాల్వింగ్ ఫండ్ క్రింద ప్రతీ సంఘానికి లక్ష తగ్గకుండా.. నగదును గ్రాంట్ రూపంలో ఇస్తాం.
- ఇవి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.
- అభయహస్తం పథకానికి పూర్వ వైభవం తెచ్చి పింఛన్‌ను రూ.500 నుంచి రూ.వెయ్యికి పెంచుతాం
- 1.10 లక్షల మందికి ఈ పథకాన్ని విస్తరించి ఇన్సూరెన్స్‌ను వర్తింపజేస్తాం.
- సహజ మరణానికి రూ.30 వేల నుంచి రూ.2.50 లక్షలకు, ప్రమాద మరణమైతే రూ.5 లక్షలు.
- వడ్డీ లేని రుణం బకాయిలు చెల్లించడంతో పాటు సంఘాల రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతాం.
- గ్రామైక్య సంఘాలకు రూ.15 లక్షలతో, మండల సమాఖ్యలకు రూ.30 లక్షలతో భవనాలు నిర్మిస్తాం
- మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం
- సెర్ప్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం తో పాటు విలేజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీల వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతాం.
Comments
Please login to add a commentAdd a comment