Sushmita Dev
-
స్టాండింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించండి
న్యూఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న పార్లమెంటు స్టాండింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు మంగళవారం లేఖ రాశారు. 31 మంది సభ్యులున్న ఈ స్థాయీ సంఘంలో ఒకే ఒక్క మహిళా ఎంపీ (టీఎంసీకి చెందిన సుస్మితా దేవ్) ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు సంబంధించిన కీలక బిల్లును పరిశీలించడానికి సగం కంటే ఎక్కువమంది మహిళలను స్టాండింగ్ కమిటీలో నియమించాలని కోరారు. అలాగే ఈ కమిటీ మహిళా ఎంపీనే చైర్మన్‌గా నియమించాలని స్వాతి డిమాండ్ చేశారు. చదవండి: వాళ్లు అగాథం పెంచితే.. మేం అభివృద్ధి చేశాం -
స్త్రీలకు ఏ హక్కులుండాలో ఇంకా పురుషులే నిర్ణయిస్తారా?
ఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న స్టాండింగ్ కమిటీలో ఒక్కరే మహిళ ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీజేపీ నేత వినయ్ సహస్రబుద్దే నేతృత్వంలోని 31 మందితో కూడిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ ఒక్కరే మహిళ అనే విషయం విదితమే. దీనిపై డీఎంకే ఎంపీ కనిమొళి సోమవారం తీవ్రంగా స్పందించారు. ‘ప్రస్తుతం పార్లమెంటులో మొత్తం 110 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును 30 మంది పురుషులు, ఒక మహిళ ఉన్న ప్యానెల్ (కమిటీ)కి అప్పగించాలని నిర్ణయించింది. దేశంలోని ప్రతీ యువతిపై ప్రభావం చూపే కీలకాంశమిది. స్త్రీలకు ఏ హక్కులుండాలనేది ఇంకా మగవాళ్లే నిర్ణయిస్తున్నారు. మహిళలను మౌనప్రేక్షకుల్లా మార్చేస్తున్నారు’ అని ట్విట్టర్ వేదికగా కనిమొళి ధ్వజమెత్తారు. ‘స్రీలకు, భారత సమాజానికి సంబంధించిన అంశంపై మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉన్న కమిటీ అధ్యయనం చేస్తుందనే విషయం తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. అందువల్ల ఈ బిల్లుపై జరిగే చర్చల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం, భాగస్వామ్యం ఉండేలా చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను. భాగస్వామ్యపక్షాలందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం అత్యంత ముఖ్యం. అందరి వాదనలూ... ముఖ్యంగా మహిళల అభిప్రాయాలను స్టాండింగ్ కమిటీ వినాలి.. అర్థం చేసుకోవాలి’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు రాసిన లేఖలో శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. మహిళా ఎంపీల అందరి అభిప్రాయాలు వినండి: సుస్మితా దేవ్ కనీస వివాహ వయసు పెంపుపై మహిళా ఎంపీలు అందరి అభిప్రాయాలను స్టాండింగ్ కమిటీ వినాలని సుస్మితా దేవ్ కమిటీ చైర్మన్ సహస్రబుద్దేకు లేఖ రాశారు. ‘రాజ్యసభ నియమావళిలోని 84(3), 275 నిబంధనల కింద కమిటీ ఎదుట ప్రత్యక్షంగా హాజరయ్యి లేదా రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశాన్ని మహిళా ఎంపీలకు కల్పించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. దానికోసం కమిటీ ఛైర్మన్‌గా మీకున్న అధికారాలను ఉపయోగించండి. మహిళా ఎంపీలకు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు తగిన సమయాన్ని కేటాయించండి. రాజ్యసభలో 29 మంది, లోక్‌సభలో 81 మంది మహిళా ఎంపీలున్నారు’ అని సుస్మిత లేఖలో పేర్కొన్నారు. -
ఆమె ఒక్కరే!
న్యూఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన చారిత్రక బిల్లును లోతుగా పరిశీలించే స్టాండింగ్ కమిటీ (స్థాయీ సంఘం)లో ఒకే ఒక్క మహిళా ఎంపీ ఉన్నారనే విషయం తాజాగా వెలుగులో వచ్చింది. విప్లవాత్మకమైన, మహిళల జీవితాలకు సంబంధించిన అత్యంత కీలకాంశంపై చర్చ జరిగే సమయంలో అతివలకు ఇంత తక్కువ భాగస్వామ్య ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలపై... ఉన్న శాఖాపరమైన స్టాండింగ్ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులుండగా దీంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (రాజ్యసభ) సుస్మితా దేవ్ ఒక్కరే మహిళ. బీజేపీ సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నరసారావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు (వైఎస్సార్సీసీ) ఒక్కరికే దీంట్లో ప్రాతినిధ్యం ఉంది. అమ్మాయిల కనీసం వివాహ వయసు పెంపుపై సమతా పార్టీ మాజీ ఎంపీ జయా జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహ నిషేధ చట్టం–2006కు మార్పులు తలపెట్టింది. యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్ల పెంచడానికి ఉద్దేశించిన బాల్య వివాహ నిషేధ (సవరణ) చట్టం–2021 బిల్లును కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డిసెంబరు 21న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. హడావుడిగా బిల్లు తెచ్చారని, లోతైన పరిశీలన అవసరమని విపక్షాలు కోరడంతో ప్రభుత్వం దీనిని స్టాండింగ్ కమిటీకి పంపింది. కమిటీలోని 31 సభ్యుల్లో మీరొక్కరే మహిళ అనే విషయాన్ని సుస్మితా దేవ్ దృష్టికి తీసుకెళ్లగా ‘ఈ బిల్లును పరిశీలించేటపుడు మరింత మంది మహిళా ఎంపీలు ఉంటే బాగుండేది. అయితే ఇదివరకే చెప్పినట్లు భాగస్వామ్యపక్షాల అందరి వాదనలూ వింటాం’ అని ఆమె ఆదివారం స్పందించారు. ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే... అమ్మాయి కనీస వివాహ వయసు విషయంలో ఏ మతానికి చెందిన ‘పర్సనల్ లా’ కూడా వర్తించదు. కనీస వివాహ వయసు 21 ఏళ్లు అన్ని మతాలకూ సమానంగా వర్తిస్తుంది. ఏకరూపత వస్తుంది. మతపరమైన ‘పర్సనల్ లా’ల్లో ఏం నిర్దేశించినా అది ఇక చెల్లుబాటు కాదు. ద ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ద పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్, ద ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్, ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ద హిందూ మ్యారేజ్ యాక్ట్, ద ఫారిన్ మ్యారేజ్ యాక్ట్‌లకు... బాల్య వివాహ నిషేధ (సవరణ)–2021 సవరణలు చేస్తుంది. ఏకరూపత ఉండేలా కనీస వివాహ వయసును 21 ఏళ్లుగా నిర్దేశిస్తుంది. స్టాండింగ్ కమిటీలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడం గమనార్హం. కొత్తగా నియమించలేదు నిజానికి ఈ స్టాండింగ్ కమిటీ బిల్లును పరిశీలించేందుకు ప్రత్యేకంగా నియమించిన కమిటీ కాదు. పార్లమెంటులో మొత్తం 24 శాఖాపరమైన కమిటీలు ఉన్నాయి. ఇవి శాశ్వత కమిటీలు. వీటిల్లో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలిద్దరూ సభ్యులుగా ఉంటారు. ఆయా పార్టీలు తమకు పార్లమెంటులో ఉన్న బలానికి అనుగుణంగా స్టాండింగ్ కమిటీలకు సభ్యుల పేర్లను సిఫారసు చేస్తాయి. కొన్నింటిని లోక్‌సభ, మరికొన్నింటిని రాజ్యసభ పర్యవేక్షిస్తుంది. సెలక్ట్ కమిటీ, జాయింట్ (సంయుక్త) కమిటీలను ఏదైనా అంశంపై చర్చించాల్సిన వచ్చినపుడు ప్రత్యేకంగా దాని కోసమే ఏర్పాటు చేస్తారు. మహిళల వివాహ వయసును పెంచే బిల్లును పరిశీలించనున్న కమిటీలో 2021 సెప్టెంబరులో రెండు విడతలుగా సభ్యులను నియమించారు. 10 లోక్‌సభ ఎంపీలు, 21 మంది రాజ్యసభ ఎంపీలు దీనిలో సభ్యులుగా ఉన్నారు. కమిటీలో నియామకాలు జరిగిన తర్వాత మహిళలకు సంబంధించిన ఈ కీలక బిల్లును డిసెంబరు 21 లోక్‌సభ స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయడం గమనార్హం. సమంజసం కాదు ప్రతిపాదిత బిల్లును పరిశీలించే స్టాండింగ్ కమిటీలో 50 శాతం మంది మహిళలు లేకపోతే అది సమంజసం అనిపించుకోదు. నిబంధనలు అనుమతిస్తే.. ఈ ప్యానెల్‌లోని తమ పురుష ఎంపీలను మార్చి వారి స్థానంలో మహిళా ఎంపీలను నామినేట్ చేయాలని నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలా కుదరని పక్షంలో ఈ కీలకమైన బిల్లుపై చర్చించేటపుడు తమ పార్టీలోని మహిళా ఎంపీలను సంప్రదించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా. – జయా జైట్లీ మరింత మంది ఉండాలి నారీమణులకు సంబంధించిన అంశాలపై చర్చించే ఈ స్టాండింగ్ కమిటీలో మరింత మంది మహిళా ఎంపీలకు ప్రాతినిధ్యం ఉండాలి. సభ్యులు కాని వారినీ చర్చకు పిలిచే అధికారం కమిటీ ఛైర్మన్‌కు ఉంటుంది. భాగస్వామ్యపక్షాలందరినీ కలుపుకొని పోతూ, విస్తృత చర్చ జరగాలంటే ఛైర్మన్ మహిళా ఎంపీలను ఆహ్వానించవచ్చు. ఈ కీలక చర్చలో మహిళా ఎంపీల భాగస్వామ్యం మరింత ఉండాలని కోరుకుంటున్నాను. – సుప్రియా సూలే, లోక్‌సభ ఎంపీ -
తెలంగాణలో తృణమూల్ కాంగ్రెస్!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తెలంగాణలో అడుగుపెట్టే యోచనలో ఉంది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తృతం చేసే ఆలోచనతో ముందుకెళ్తున్న ఆ పార్టీ ఇప్పుడు రాష్ట్రంపైనా దృష్టి సారించింది. ఇందులోభాగంగా కొద్దిమంది కాంగ్రెస్ కీలక నేతలతోపాటు టీఆర్ఎస్ అసంతృప్త నేతలతో జాబితా రూపొందిస్తున్నట్టు తెలిసింది. పార్టీని విస్తృతం చేసే బాధ్యతలను మమతా బెనర్జీ ఇటీవల కీలక నేతలకు అప్పగించా రు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీల బలాలు, వాటి బలహీనతలు తదితర అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో బ్యాక్ఎండ్ వర్క్ చేస్తున్న ఓ ఏజెన్సీకి ఈ బాధ్యత అప్పగించినట్టు చర్చ జరుగుతోంది. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల పరిస్థితిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ఈనెల మొదటి వారంలో అధినేత్రికి నివేదికివ్వనున్నట్టు తెలిసింది. ఇప్పటికే అస్సాం, త్రిపుర, గోవా, యూపీలో.. గోవా, అస్సాం, త్రిపుర, హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్, మేఘాలయా రాష్ట్రాల్లో తృణమూల్ కాం గ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవా, యూపీ తదితర రాష్ట్రాల్లో పోటీకి సిద్ధవుతోంది. ఇందులో భాగంగా దక్షిణాన తెలంగాణలో పార్టీ విస్తరణకు అవకాశాలున్నట్టు గుర్తించారని, అందుకే ఇక్కడ పార్టీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలతో తృణమూల్ సీనియర్ నేత ఒకరు చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీలోకి వెళ్తారని భావిస్తున్న కొంతమంది అధికార పార్టీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి వ్యూహం అవలంబించాలన్న దానిపైనా వారితో మాట్లాడినట్లు తెలిసింది. ఇటీవలి హుజురాబాద్ ఎన్నికలపైనా తృణమూల్ అధినేత్రికి సంబంధిత ఏజెన్సీ పూర్తి నివేదిక అందించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ సాధించిన ఓట్ల విషయంలోనూ లోతైన అధ్యయనం చేసి మరీ నివేదిక అందించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మరోపార్టీకి వెసులుబాటు ఉంటుందని బెంగాల్ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగానే..: సుస్మిత దేవ్, టీఎంసీ ఎంపీ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పార్టీ విస్తరణపై మమతా బెనర్జీ దృష్టి సారించినట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. భావసారూప్యత ఉన్న నేతలు ఎవరొచ్చినా పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తృణమూల్ రాజ్యసభ ఎంపీ సుస్మిత దేవ్ ‘సాక్షి’తో చెప్పారు. ‘మమతా బెనర్జీ జాతీయ భావజాలంతో ముందుకెళ్తున్నందున బీజేపీని సమర్థవంతంగా ఢీకొట్టేందుకు పార్టీని విస్తృతం చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ.. ఇలా ఏ పార్టీ నేతలైనా మాతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉంటే తప్పకుండా ఆహ్వానిస్తాం. తెలంగాణలోనూ పార్టీ విస్తరణ ఉంటుంది. అయితే, ఇందుకు మరికొంత సమయం ఉంది’అని ఆమె పేర్కొన్నారు. -
30 ఏళ్లలో ఏమీ ఆశించలేదు.. ఇప్పుడు కూడా అంతే
న్యూఢిల్లీ: తాను పదవులు ఆశించడం లేదని, అధిష్టానం ఆదేశాలను శిరసా వహించడమే తన కర్తవ్యమని మాజీ ఎంపీ సుస్మితా దేవ్ అన్నారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తానేమీ ఆశించలేదని, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోనూ అదే విధంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడిన సుస్మితా దేవ్ సోమవారం తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్ సమక్షంలో టీఎంసీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన సుస్మితా దేవ్.. ‘‘టీఎంసీలో చేరడం ద్వారా నా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మనసు చంపుకొన్నట్లు కాదు. ఎప్పుడూ నేను పదవులు ఆశించలేదు. మమతా బెనర్జీ ఏ బాధ్యతను అప్పగించినా దానిని సక్రమంగా నెరవేర్చడమే నా ముందున్న పని’’ అని పేర్కొన్నారు. కాగా అసోంకు చెందిన సుస్మితా దేవ్ గతంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేశారు. అయితే, ఆ పార్టీని వీడటానికి గల ప్రధాన కారణాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. చదవండి: Afghanistan: ‘వాళ్ల కోసమే వెయిటింగ్.. వచ్చి నన్ను చంపేస్తారు’ -
టీఎంసీ గూటికి కాంగ్రెస్ మాజీ ఎంపీ సుస్మితా దేవ్
కోలకతా: అంచనాలకనుగుణంగానే టీఎంసీ గూటికి మాజీ ఎంపీ సుస్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుస్మితా దేవ్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సుస్మితా దేవ్ టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్ సమక్షంలో సోమవారం టీఎంసీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు సుస్మితాతో పాటు, టీఎంసీ ట్విటర్ ఖాతాల ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. తన శక్తి సామర్థ్యాలను సంపూర్తిగా కేటాయిస్తానంటే ట్విట్ చేసిన సుస్మిత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు ఖేలా హోబ్ హ్యాష్ ట్యాగ్‌ను కూడా యాడ్ చేశారు. కాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సుస్మితా దేవ్ లేఖ రాశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. పార్టీతో మూడు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆమె ఈ సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ నేతలు, సభ్యులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఎందుకు పార్టీని వీడుతున్నదీ ఆమె వెల్లడించలేదు. ప్రజా సేవలో మరో నూతన అధ్యాయం అని మాత్రమే వెల్లడించారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, ఈ వార్తలను కాంగ్రెస్ ఖండించింది. మరోవైపు ఇదే నిజమైతే చాలా దురదృష్టకరమంటూ కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ట్వీట్ చేశారు. Listen to @sushmitadevinc share her experience after meeting our National General Secretary @abhishekaitc & the Hon'ble Chief Minister of WB @MamataOfficial along with Parliamentary Party Leader RS @derekobrienmp. She will address the Media in Delhi, tomorrow. Stay tuned! pic.twitter.com/LOUPyF7Ez7 — All India Trinamool Congress (@AITCofficial) August 16, 2021 Will give it all I have got…. @MamataOfficial thank you🙏🏻#KhelaHobe https://t.co/aa0ijNrhOk — Sushmita Dev (@SushmitaDevAITC) August 16, 2021 If this is true it is most unfortunate Why @sushmitadevinc ? Your erstwhile colleagues & friends especially the person who was National President of @nsui when you contested your first @DUSUofficial elections back in 1991 deserve a better explanation than this laconic letter? pic.twitter.com/0thBTVFCmY — Manish Tewari (@ManishTewari) August 16, 2021 -
తేయాకు తోట.. కాంగ్రెస్ కోట
అస్సాంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో కీలకమైనది సిల్చార్. కచార్ జిల్లాలోని ఈ నియోజకవర్గం అనాదిగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా గుర్తింపు పొందింది. ఈ నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉంది. సిట్టింగ్ ఎంపీ సుస్మితాదేవ్నే మళ్లీ ఇక్కడ నుంచి కాంగ్రెస్ బరిలో దించింది. ఇక్కడి నుంచి ఐదుసార్లు వరసగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె అయిన సుస్మిత 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కబీంద్రపై 1.20 లక్షలకు పైగా రికార్డు మెజారిటీతో గెలిచారు. ఈసారీ రికార్డు సృష్టించేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మూడుసార్లు ఈ నియోజకవర్గంలో పాగా వేసిన బీజేపీ మరోసారి గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. బీజేపీ తరఫున రాజ్‌దీప్ రాయ్ బెంగాలీ సుస్మితతో తలపడుతున్నారు. ఇంకా పోటీలో మరో 11 మంది ఉన్నారు. పోటీ ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంది. తేయాకు కార్మికులే ఓటర్లు సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు– సిల్చార్, సొనాయి, ధొలాయి, ఉధర్బంద్, లఖిపూర్, బర్కోలా, కటిగోర్– ఉన్నాయి. నియోజకవర్గంలోని బరక్లోయలో 104 తేయాకు తోటలు ఉన్నాయి. వాటిలో పనిచేసే కార్మికుల్లో దాదాపు 3.70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకోవడం ద్వారా గెలుపును సునాయాసం చేసుకోవచ్చని కాంగ్రెస్, బీజేపీ ఆశిస్తున్నాయి. సంప్రదాయకంగా తేయాకు తోటల కార్మికులంతా కాంగ్రెస్ మద్దతుదారులే. 2016లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, మోదీ సర్కారు ప్రవేశపెట్టిన నగదు రహిత చెల్లింపుల పథకాల వల్ల వీరి ఓట్లు తమకు మళ్లుతాయని కమలనాథులు భావిస్తున్నారు. బరక్ చ శ్రామిక్ యూనియన్ సహాయ ప్రధాన కార్యదర్శి దీనానాథ్ బరోయ్ కూడా తేయాకు కార్మికులు కాంగ్రెస్ ఓటు బ్యాంకేనని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం వీరి కోసం అనేక పథకాలు చేపట్టినా అవేవీ పూర్తిగా అమలు కాలేదని ఆయన ఆరోపిస్తున్నారు. లోయలో ఇంత వరకు ఒక్క ఏటీఎం కూడా లేకపోవడాన్ని ప్రభుత్వ వైఫల్యానికి ఉదాహరణగా ఆయన చెబుతున్నారు. సిల్చార్ కాంగ్రెస్ నేత సంజీవ్రాయ్ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శిస్తున్నారు. అసంతృప్తిలో కార్మికులు తేయాకు తోటల కార్మికుల కోసం రాష్ట్రంలో 100 లోయర్ ప్రైమరీ స్కూళ్లు ప్రారంభిస్తామని చెప్పిన బీజేపీ సర్కారు ఇంత వరకు ఒక్కటీ తెరవలేదనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తేయాకు కార్మికులకు తక్కువ ధరకు బియ్యం సరఫరా చేస్తే, బీజేపీ సర్కారు ఉచితంగా ఇస్తోంది. అయితే, బియ్యం ఒక్కటే ఉచితంగా లభిస్తున్నాయని, ఇతర సదుపాయాలేమీ అందడం లేదని, తమ జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల లేదని కార్మికులు వాపోతున్నారు. ఇంత వరకు రాజకీయ పార్టీలన్నీ తమను ఓటుబ్యాంకుగానే చూశాయని, ఈ సంగతి తాము గుర్తించామని, ఈసారి అలా వ్యవహరించబోమని దీనానాథ్ అంటున్నారు. సిచార్ నియోజకవర్గం ఉన్న కచార్ జిల్లాను కేంద్రం వెనకబడిన జిల్లాగా ప్రకటించింది. వెనుకబడిన ప్రాంతాల నిధుల కార్యక్రమం కింద కేంద్రం ఈ జిల్లాకు నిధులు అందజేస్తోంది. ‘పౌరసత్వ’ ప్రభావం.. కాంగ్రెస్ అభ్యర్థి సుస్మితకు ఈసారి గెలుపు కష్టసాధ్యమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా అయిన సుస్మిత నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్న భావన ఓటర్లలో బలంగా ఉందని వారంటున్నారు. జాతీయ పౌరసత్వ రిజిస్టరు ముసాయిదా వెలువడటం, దానిపై నిరసనలతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మారిపోయిందని దీని ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా పడుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు తమకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఈసారి లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని నియోజకవర్గ పరిధిలోని 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. ఏళ్ల తరబడి తాగునీరు, రహదారుల సదుపాయం లేక అల్లాడుతున్నామని, పదేళ్లుగా నేతలంతా హామీలిస్తున్నారే కాని సమస్యల్ని పరిష్కరించడం లేదని వారు ఆరోపించారు. సిల్చార్ నియోజకవర్గంలో బెంగాలీ మాట్లాడే వారు అధికం. నియోజకవర్గం జనాభాలో 81.2 శాతం గ్రామాల్లోనే నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 14.54 శాతం ఎస్సీలు, 1.03 శాతం ఎస్టీలు ఉన్నారు. మిజోరం, త్రిపుర, మణిపూర్‌కు నిత్యావసరాలు సిల్చార్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. -
కేసీఆర్ పాలనలో మహిళలకు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో మహిళలకు తీరని అన్యాయం జరిగిందని ఏఐ సీసీ మహిళా అధ్యక్షురాలు, ఎంపీ సుస్మితాదేవి విమర్శించారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా ప్రాతినిధ్యం కల్పించలేదని, మహిళా కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి మాట దేవుడెరుగు, ఈ ప్రభుత్వంలో కనీ సం మహిళలకు రక్షణ కూడా లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారదతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంతో మంది త్యాగాలుచేస్తే ఈ రాష్ట్రం ఏర్పడిందని, ఉద్యోగాలు, ఉపాధి అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో నాలుగున్నరేళ్లలో అవి పూర్తిగా విస్మరించబడ్డాయన్నారు. తెలంగాణ సాధనకోసం ఉద్యమించిన ఉస్మానియా విద్యార్థులకూ టీఆర్ఎస్ అన్యాయం చేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఒక్కహామీ కూడా నెరవేర్చలేదని, విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ సైతం పూర్తిగా పెండింగ్‌లో పడేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌పై విమర్శలా.. తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని సుస్మిత అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే, ప్రజలను మభ్యపెట్టి మోసపూరితమైన వాగ్దానాలతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ పాలనతో ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్‌కు పట్టం కట్టడం ఖాయమన్నారు. మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవిధంగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని సుస్మిత అన్నారు. తెలంగాణకు మహిళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా లేకపోలేదన్నారు. మహిళల హక్కులకోసం టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా నేరెళ్ల శారద పోరాడుతున్నారని ప్రశంసించారు. -
మహిళలకు సముచిత స్థానం
సాక్షి వనపర్తి: కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం లభించిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన మహిళా గర్జన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్లో స్థానం కల్పించకపోవడం సిగ్గు చేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను అన్ని రకాలుగా అణచివేతకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వకపోగా, చెల్లించిన వడ్డీ డబ్బులను తిరిగి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలు, స్వయం ఉపాధి సంఘాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. 2019లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్కు మహిళలంటే చిన్నచూపు: సుస్మితాదేవ్ కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు సముచిత గౌరవం లభిస్తుందని ఏఐసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్ అన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మహిళలు అంటే చిన్నచూపు ఉందని.. కేసీఆర్ కుమార్తె కవిత రూ.30 వేల చీర కట్టుకుని తిరుగుతుంటే.. రాష్ట్రంలోని మహిళలకు రూ.30 చీర కట్టబెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని మహిళ పేరిటే ఇచ్చామని గుర్తు చేశారు. సభలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు డీ.కే అరుణ, సంపత్ కుమార్, గీతారెడ్డి, పార్టీ నేతలు మల్లు రవి, మధుయాష్కీ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. ఇదీ మహిళా డిక్లరేషన్ - రివాల్వింగ్ ఫండ్ క్రింద ప్రతీ సంఘానికి లక్ష తగ్గకుండా.. నగదును గ్రాంట్ రూపంలో ఇస్తాం. - ఇవి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. - అభయహస్తం పథకానికి పూర్వ వైభవం తెచ్చి పింఛన్‌ను రూ.500 నుంచి రూ.వెయ్యికి పెంచుతాం - 1.10 లక్షల మందికి ఈ పథకాన్ని విస్తరించి ఇన్సూరెన్స్‌ను వర్తింపజేస్తాం. - సహజ మరణానికి రూ.30 వేల నుంచి రూ.2.50 లక్షలకు, ప్రమాద మరణమైతే రూ.5 లక్షలు. - వడ్డీ లేని రుణం బకాయిలు చెల్లించడంతో పాటు సంఘాల రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతాం. - గ్రామైక్య సంఘాలకు రూ.15 లక్షలతో, మండల సమాఖ్యలకు రూ.30 లక్షలతో భవనాలు నిర్మిస్తాం - మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం - సెర్ప్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం తో పాటు విలేజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీల వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతాం. -
మహిళలంతా ఒక్కటైతే కాంగ్రెస్ ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్: మహి ళలంతా ఒక్కటైతే కాంగ్రెస్‌దే అధికారం అని జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఎంపీ సుస్మితా దేవ్ ధీమా వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్‌ను ఎలా బలోపేతం చేయాలో ప్రతి మహిళా కాంగ్రెస్ కార్యకర్త ఆలోచించాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఆదివారం గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టలేక పోతోందని విమర్శించారు. ప్రతి జిల్లా మహిళా అధ్యక్షురాలు, జిల్లాలో జరిగే ఏదైనా సంఘటనను తీసుకుని ఆందోళనలు చేయాలని సూచించారు. మంత్రిగా ఉండటం వల్ల మాత్రమే సమస్యలను పరిష్కరించవచ్చనేది తప్పని, క్షేత్ర స్థాయిలో ప్రజలతో ఉండి కూడా సమస్యలను పరిష్కరించ వచ్చని పేర్కొన్నారు. వార్తా పత్రికల్లో న్యూస్ తక్కువగా, మోదీ ప్రకటనలు ఎక్కువగా ఉంటున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. బూత్ స్థాయిలో కూడా పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి మాట్లాడే సంస్కృతి ఒక్క కాంగ్రెస్‌లోనే ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు 30 రూపాయల చీరలు ఇచ్చిందని, కానీ సీఎం కేసీఆర్ కూతురు కవిత మాత్రం పార్లమెంటుకు లక్షల రూపాయల విలువ చేసే చీరల్లో వస్తున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వంపైనే తాము యుద్ధం చేస్తున్నామని, తెలంగాణలో కేసీఆర్ ఎంత అని ఆమె వ్యాఖ్యానించారు. -
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుష్మితా దేవ్
న్యూఢిల్లీ: ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపీ సుష్మితా దేవ్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. ప్రస్తుత మహిళా అధ్యక్షురాలు శోభా ఓజా స్థానంలో ఆమెను నియమిస్తూ పార్టీ శనివారం ఓ ప్రకటన చేసింది. అలాగే ఆల్ ఇండియా ఏఐసీసీ మధ్యప్రదేశ్ జనరల్ సెక్రటరీగా దీపక్ బబారియా, కార్యదర్శులుగా జబైర్ ఖాన్, సంజయ్ కపూర్ నియమితులయ్యారు.