సుస్మితాదేవ్, రాజ్‌దీప్ రాయ్
అస్సాంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో కీలకమైనది సిల్చార్. కచార్ జిల్లాలోని ఈ నియోజకవర్గం అనాదిగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా గుర్తింపు పొందింది. ఈ నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉంది. సిట్టింగ్ ఎంపీ సుస్మితాదేవ్‌నే మళ్లీ ఇక్కడ నుంచి కాంగ్రెస్ బరిలో దించింది. ఇక్కడి నుంచి ఐదుసార్లు వరసగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె అయిన సుస్మిత 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కబీంద్రపై 1.20 లక్షలకు పైగా రికార్డు మెజారిటీతో గెలిచారు. ఈసారీ రికార్డు సృష్టించేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మూడుసార్లు ఈ నియోజకవర్గంలో పాగా వేసిన బీజేపీ మరోసారి గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. బీజేపీ తరఫున రాజ్‌దీప్ రాయ్ బెంగాలీ సుస్మితతో తలపడుతున్నారు. ఇంకా పోటీలో మరో 11 మంది ఉన్నారు. పోటీ ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంది.
తేయాకు కార్మికులే ఓటర్లు
సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు– సిల్చార్, సొనాయి, ధొలాయి, ఉధర్‌బంద్, లఖిపూర్, బర్కోలా, కటిగోర్– ఉన్నాయి. నియోజకవర్గంలోని బరక్‌లోయలో 104 తేయాకు తోటలు ఉన్నాయి. వాటిలో పనిచేసే కార్మికుల్లో దాదాపు 3.70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకోవడం ద్వారా గెలుపును సునాయాసం చేసుకోవచ్చని కాంగ్రెస్, బీజేపీ ఆశిస్తున్నాయి. సంప్రదాయకంగా తేయాకు తోటల కార్మికులంతా కాంగ్రెస్ మద్దతుదారులే.
2016లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, మోదీ సర్కారు ప్రవేశపెట్టిన నగదు రహిత చెల్లింపుల పథకాల వల్ల వీరి ఓట్లు తమకు మళ్లుతాయని కమలనాథులు భావిస్తున్నారు. బరక్ చ శ్రామిక్ యూనియన్ సహాయ ప్రధాన కార్యదర్శి దీనానాథ్ బరోయ్ కూడా తేయాకు కార్మికులు కాంగ్రెస్ ఓటు బ్యాంకేనని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం వీరి కోసం అనేక పథకాలు చేపట్టినా అవేవీ పూర్తిగా అమలు కాలేదని ఆయన ఆరోపిస్తున్నారు. లోయలో ఇంత వరకు ఒక్క ఏటీఎం కూడా లేకపోవడాన్ని ప్రభుత్వ వైఫల్యానికి ఉదాహరణగా ఆయన చెబుతున్నారు. సిల్చార్ కాంగ్రెస్ నేత సంజీవ్‌రాయ్ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శిస్తున్నారు.
అసంతృప్తిలో కార్మికులు
తేయాకు తోటల కార్మికుల కోసం రాష్ట్రంలో 100 లోయర్ ప్రైమరీ స్కూళ్లు ప్రారంభిస్తామని చెప్పిన బీజేపీ సర్కారు ఇంత వరకు ఒక్కటీ తెరవలేదనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తేయాకు కార్మికులకు తక్కువ ధరకు బియ్యం సరఫరా చేస్తే, బీజేపీ సర్కారు ఉచితంగా ఇస్తోంది. అయితే, బియ్యం ఒక్కటే ఉచితంగా లభిస్తున్నాయని, ఇతర సదుపాయాలేమీ అందడం లేదని, తమ జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల లేదని కార్మికులు వాపోతున్నారు. ఇంత వరకు రాజకీయ పార్టీలన్నీ తమను ఓటుబ్యాంకుగానే చూశాయని, ఈ సంగతి తాము గుర్తించామని, ఈసారి అలా వ్యవహరించబోమని దీనానాథ్ అంటున్నారు. సిచార్ నియోజకవర్గం ఉన్న కచార్ జిల్లాను కేంద్రం వెనకబడిన జిల్లాగా ప్రకటించింది. వెనుకబడిన ప్రాంతాల నిధుల కార్యక్రమం కింద కేంద్రం ఈ జిల్లాకు నిధులు అందజేస్తోంది.
‘పౌరసత్వ’ ప్రభావం..
కాంగ్రెస్ అభ్యర్థి సుస్మితకు ఈసారి గెలుపు కష్టసాధ్యమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా అయిన సుస్మిత నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్న భావన ఓటర్లలో బలంగా ఉందని వారంటున్నారు. జాతీయ పౌరసత్వ రిజిస్టరు ముసాయిదా వెలువడటం, దానిపై నిరసనలతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మారిపోయిందని దీని ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా పడుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.
కాగా, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు తమకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఈసారి లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని నియోజకవర్గ పరిధిలోని 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. ఏళ్ల తరబడి తాగునీరు, రహదారుల సదుపాయం లేక అల్లాడుతున్నామని, పదేళ్లుగా నేతలంతా హామీలిస్తున్నారే కాని సమస్యల్ని పరిష్కరించడం లేదని వారు ఆరోపించారు. సిల్చార్ నియోజకవర్గంలో బెంగాలీ మాట్లాడే వారు అధికం. నియోజకవర్గం జనాభాలో 81.2 శాతం గ్రామాల్లోనే నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 14.54 శాతం ఎస్సీలు, 1.03 శాతం ఎస్టీలు ఉన్నారు. మిజోరం, త్రిపుర, మణిపూర్‌కు నిత్యావసరాలు సిల్చార్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment