సాక్షి, హైదరాబాద్: మహి ళలంతా ఒక్కటైతే కాంగ్రెస్‌దే అధికారం అని జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఎంపీ సుస్మితా దేవ్ ధీమా వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్‌ను ఎలా బలోపేతం చేయాలో ప్రతి మహిళా కాంగ్రెస్ కార్యకర్త ఆలోచించాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఆదివారం గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టలేక పోతోందని విమర్శించారు.
ప్రతి జిల్లా మహిళా అధ్యక్షురాలు, జిల్లాలో జరిగే ఏదైనా సంఘటనను తీసుకుని ఆందోళనలు చేయాలని సూచించారు. మంత్రిగా ఉండటం వల్ల మాత్రమే సమస్యలను పరిష్కరించవచ్చనేది తప్పని, క్షేత్ర స్థాయిలో ప్రజలతో ఉండి కూడా సమస్యలను పరిష్కరించ వచ్చని పేర్కొన్నారు. వార్తా పత్రికల్లో న్యూస్ తక్కువగా, మోదీ ప్రకటనలు ఎక్కువగా ఉంటున్నాయని ఆమె ఎద్దేవా చేశారు.
బూత్ స్థాయిలో కూడా పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి మాట్లాడే సంస్కృతి ఒక్క కాంగ్రెస్‌లోనే ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు 30 రూపాయల చీరలు ఇచ్చిందని, కానీ సీఎం కేసీఆర్ కూతురు కవిత మాత్రం పార్లమెంటుకు లక్షల రూపాయల విలువ చేసే చీరల్లో వస్తున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వంపైనే తాము యుద్ధం చేస్తున్నామని, తెలంగాణలో కేసీఆర్ ఎంత అని ఆమె వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment