కరోనాకు నో ఎంట్రీ.. | Cases Not Found in Wanaparthy Strictly Implemented Lockdown | Sakshi
Sakshi News home page

కరోనాకు నో ఎంట్రీ..

Published Mon, Apr 27 2020 11:18 AM | Last Updated on Mon, Apr 27 2020 11:18 AM

Cases Not Found in Wanaparthy Strictly Implemented Lockdown - Sakshi

డ్రోన్‌ కెమెరాతో జిల్లాపై ప్రత్యేక నిఘా

వనపర్తి క్రైం: ఎవరి నోట విన్నా.. ఎక్కడ చూసినా కరోనా.. కరోనా.. ఈ పేరు వింటేనే హడలెత్తిపోయే పరిస్థితి దాపురించింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ వైరస్‌.. ఎవరి నుంచి ఎప్పుడెలా వ్యాప్తిస్తుందో అర్థం కాక నిత్యం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో వనపర్తి జిల్లాలో మొదటి నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాకుండా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేస్తున్నారు. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పక్క జిల్లా అయిన జోగుళాంబ గద్వాలలో వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వనపర్తి జిల్లా మాత్రం పటిష్ట చర్యలు చేపడుతూ గ్రీన్‌జోన్‌ దిశగా అడుగులు వేస్తోంది. 

నమోదు కాని కేసులు..
జిల్లాలో ఇప్పటికే విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల ను ంచి, మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారిని గుర్తించి, అనుమా నం ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మ ర్కజ్‌ వెళ్లి జిల్లాకు వచ్చిన 10మందికి రెండుసార్లు క రోనా పరీక్షలు నిర్వహించగా,  నెగిటివ్‌ అని తేలింది. అయినప్పటికీ వారిని హోంక్వారంటైన్‌లో ఉంచి వై ద్యులచే పర్యవేక్షిస్తున్నారు. శనివారం మహరాష్ట్ర నుంచి జిల్లాలోని తండాకు వచ్చిన 6మందిని అధికారులు గుర్తించి, హోం క్వారంటైన్‌లో ఉంచారు. కరోనా కేసు లు నమోదుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

పక్కా ప్రణాళికతో..
జిల్లాకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారిని గ్రామ టీం సభ్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ, జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఒక టాస్క్‌ఫోర్సుటీం, 14 మండల టీంలు, 349 గ్రామ టీంలు పనిచేస్తున్నారు. వైద్యాధికారి, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 62మంది వైద్యులు, 75మంది నర్సులు, 817మంది పారామెడికల్‌ సిబ్బంది కరోనా నియంత్రణ కోసం పని చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఏరియా ఆస్పత్రిలో 20బెడ్లతో ఐసోలేషన్, 5బెడ్లతో ఐసీయూ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే నాగవరం దగ్గర ఉన్న ఐటీసీ భవనంలో 100 బెడ్లతో, మర్రికుంట గిరిజన జూనియర్‌ కళాశాల భవనంలో 50 బెడ్లతో క్వారంటైన్లు ఏర్పాటు చేయగా, శ్రీరంగాపురంలో 20బెడ్లతో ఐసోలేషన్‌ ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు తెలిపారు. నాగవరం ఐటీసీ, మర్రికుంట గిరిజన భవనంలోని క్వారంటైన్‌లో 15మంది ఉంచి, వారికి వైద్యులచే చికిత్సలు అందిస్తున్నారు. అలాగే వారికి మూడు పూటలా భోజన వసతి కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 2,117మంది హోంక్వారంటైన్‌లో ఉన్నారు. జిల్లాకు 30వేల మాస్కులు రాగా, అన్ని పీహెచ్‌సీలకు పంపించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి గుర్తింపు..
జిల్లాకు ఇతర రాష్ట్రాలు, పక్కా జిల్లాల నుంచి వచ్చిన వారిని అధికారులు గుర్తించారు. గద్వాల నుంచి 70మంది జిల్లాకు రాగా, కర్నూల్‌ నుంచి 10మంది వచ్చారు. అలాగే మహరాష్ట్ర, కేరళ, గోవా, పూణే నుంచి 2 వేల మంది జిల్లాకు రాగా,  ఒక్క మహరాష్ట్ర నుంచి జిల్లాలోని 40 తండాలకు 1,500 మంది వచ్చారు. వారిని అధికారులు గుర్తించి హోంక్వారంటైన్‌లో ఉండేలా చూస్తున్నారు. శనివారం మహరాష్ట్ర నుంచి జిల్లాలోని ఓ తండాకు 6మంది నడుచుకుంటూ, వాహనాల్లో వచ్చారు. వారిని అధికారులు గుర్తించి.. 14రోజుల పాటు ఇంట్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 

నిరంతరం నిఘా..
కలెక్టర్‌.యాస్మిన్‌ భాష పర్యవేక్షణలో నిరంతరం గ్రామాల్లో కరోనా కేసులపై వాచ్‌ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారిని గుర్తించి, వారిని హోంక్వారంటైన్‌లో 14రోజుల పాటు ఉండేలా చూస్తున్నాం. అనుమానం ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలి.      – డాక్టర్‌ శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ  

సేఫ్‌ జోన్‌గా జిల్లా..
మొదటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడంతో ప్రజలు ఊపిరి పిల్చుకుంటున్నారు. కానీ పక్క జిల్లాలైన గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లాకు ఎవరూ వచ్చిన వారిని వెంటనే గుర్తిస్తున్నారు. అనంతరం వారిని హోంక్వారంటైన్‌లో ఉండేలా చూస్తున్నారు. ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లిన 10మందికి రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. అలాగే వారి 63మంది ప్యామిలీ సభ్యులు, వారితో కాంటాక్టు అయిన 193మందికి కరోనా పరీక్షలు నిర్వహించినా నెగెటివ్‌ అని తేలింది. మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లిన ఓ వ్యక్తి భార్య, పిల్లలు 46మందిని కలిశారు. వారిని ఇంట్లోనే ఉండేలా చూస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన 63మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 2,117మంది 14రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement