
స్కూటీలో దూరిన పామును బయటకు తీస్తున్న దృశ్యం
కొత్త జిల్లాలు ఏర్పడటంతో ఆయా జిల్లాకేంద్రాల్లో నివసించేవారి సంఖ్య అధికమైంది. దీంతో శివారు ప్రాంతాలు కూడా ఆయా పట్టణాల్లో కలిసిపోయాయి. చెట్టు, గుట్ట, పుట్టా అనే తేడా లేకుండా కొత్త వెంచర్లు వెలుస్తుండటం, నిర్మాణాలు చేపడుతుండటంతో పాములు ఇళ్లల్లోకి దూరుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోనిజనం భయపడుతున్నారు.వనపర్తిలో స్నేక్ సొసైటీ ఉండటంతో ఆ ప్రాంత వాసులు సొసైటీ సభ్యులను ఆశ్రయిస్తున్నారు. గతేడాది వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు జనావాసాల్లోకి వచ్చిన 836 పాములను స్నేక్ సొసైటీ వారు పట్టుకొని సురక్షితంగా అడవిలో వదిలేశారు. పూరి గుడిసెలు, కొత్త నిర్మాణాలు, ఇటుక బట్టీలు, ఫంక్షన్ హాళ్లు, బైక్‌లు, కార్లు, ట్రాక్టర్లలో దూరిన పాములను పట్టుకోగా.. అందులో ఎక్కువశాతం నాగుపాములే ఉండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత విష పూరితమైన సాస్కెల్డ్ వైపర్ పామును కూడా పట్టుకొన్నారు.
వర్షాకాలంలో..
వర్షాకాలంలో అధికంగా పాములు బయటకు వస్తుంటాయి. పట్టణ శివారు ప్రాంతాల్లో చాలాచోట్ల ఇళ్ల నడుమ ఖాళీ స్థలాలు ఉండటం.. అవి పొదలు, రాళ్లు, పుట్టలతో నిండిపోతున్నాయి. నిర్మానుష్యంగా ఉన్న సమయంలో అవి బయటికి వస్తున్నాయి. కనిపిస్తే స్నేక్ సొసైటీకి సమాచారం ఇవ్వడం, లేదంటే అప్పుడప్పుడు పాముకాటుకు గురవుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
వర్షాకాలం ప్రారంభమైనందున పొలాలకు వెళ్లే రైతులు, ప్రజలు రాత్రిళ్లు చెప్పులు, టార్చిలైట్‌తో వెళ్లడం మంచిది. పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు. తీవ్ర ఒత్తిడికి లోనైతే రక్తపోటు పెరగటంతో పాటు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. నాటు వైద్యం, మంత్రాలు అంటూ సమయం వృథా చేస్తే ప్రాణాలకే ప్రమాదం. పాముకాటుకు గురికాగానే పైభాగం గుడ్డతో కట్టాలి. అయిదు నిమిషాలకు ఓసారి విప్పి మళ్లీ కట్టాలి. త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లేలా చూడాలి. సొసైటీ ఆధ్వర్యంలో విషపూరితమైన సాస్కెల్డ్ వైపర్ పామును మూడు సార్లు పట్టుకున్నాం. ఎవరికైనా పాము కనిపిస్తే చంపకుండా 9985545526 నంబర్‌ను సంప్రదించాలి.– కృష్ణాసాగర్, స్నేక్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి
స్నేక్ సొసైటీ సహకారంతో..
జనావాసాల్లోకి వచ్చిన 836 పాములను జిల్లా స్నేక్ సొసైటీ సభ్యులు పట్టుకున్నారు. అందులో 406 నాగు, 70 కట్ల పాములు, 6 రక్తపింజరిలు, 3 సాస్కెల్ వైపర్, 115 జెర్రిపోతులు, 80 నీరుకట్టలు, 40 ట్రీస్నేక్, 111 పుడుపాములున్నాయి. వీటిని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో వదిలేశారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన సాస్కెల్డ్ వైపర్ పాము వనపర్తి శివారులోని గిరిజన బాలికల కళాశాల మరుగుదొడ్డిలోకి దూరింది. చూసిన విద్యార్థినులు స్నేక్ సొసైటీకి సమాచారమిచ్చారు. వారు సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలారు. అలాగే తిరుమలయ్య గుట్టలో ఫారెస్ట్ అధికారులు ఎండిపోయిన చెట్లను లెక్కించే క్రమంలో చెట్టు తొర్రలో ఉన్న పామును పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment