సాయికుమార్, సంతోషమ్మ, పరిమళ
వనపర్తి/మదనాపురం: దసరా పండుగ కోసం తన ఇంటికి వచ్చిన చిన్నమ్మ, ఆమె కూతురిని బైక్‌పై దిగబెడుతున్న యువకుడు సహా మొత్తం ముగ్గురు సరళాసాగర్ దిగువ వంతెన వాగు ఉధృతికి గల్లంతయ్యారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రానికి సమీపంలో జరిగింది. మదనాపురం తహసీల్దార్ నరేందర్, ఎస్‌ఐ మంజునాథరెడ్డి తెలిపిన వివరాలివి.
ఈనెల 4వ తేదీన దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్లకి చెందిన సంతోషమ్మ (35), ఇంటర్ చదివే ఆమె కూతురు పరిమళ (17), కొత్తకోట పట్టణంలో వెల్డింగ్ పనిచేసే అక్క కుమారుడు సాయికుమార్ (25) ఇంటికి దసరా పండుగకు వచ్చారు. తిరిగి వారిని స్వగ్రామానికి పంపించేందుకు శుక్రవారం సాయికుమార్.. చిన్నమ్మ, చెల్లిని బైక్‌పై ఎక్కించుకుని బయల్దేరాడు. మదనాపురం రైల్వేగేట్ దాటాక సరళాసాగర్ సైఫన్ల నుంచి వచ్చే వరద నీరు ప్రవహించే లోలెవల్ వంతెన వరకు వచ్చారు.
రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయినా.. శుక్రవారం వరద ఉధృతి తగ్గటంతో రాకపోకలు ప్రారంభించారు. దీంతో సాయికుమార్ కూడా వాగు దాటేందుకు ప్రయత్నించాడు. కొంతదూరం వెళ్లాక.. వరద ఉధృతికి బైక్ వంతెన నుంచి వాగులోకి బైక్‌తో సహా ముగ్గురు పడిపోయారు. వారి ఆర్తనాదాలు విన్న కొందరు యువకులు వాగులోకి దిగి కాపాడేందుకు ప్రయత్నించారు.
కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారు తిరిగి ఒడ్డుకు చేరుకున్నారు. ఈ సంఘటనను ప్రత్యక్ష సాక్షులు ఫోన్‌లో వీడియో తీశారు. ఆత్మకూరు మండలానికి చెందిన జాలర్లను రప్పించి గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సంఘటనపై కలెక్టర్ షేక్ యాష్మిన్ బాషా అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment