పోషం, మాంతయ్య
భీమారం(చెన్నూర్): మంచిర్యాల జిల్లా భీమారం మండలం నర్సింగాపూర్‌లోని చెరువులో ఇద్దరు అన్నదమ్ములు గురువారం గల్లంతయ్యారు. నర్సింగాపూర్ గ్రామంలో ఇటీవల చనిపోయిన సండ్ర బుచ్చయ్య తొమ్మిదోరోజు కర్మకాండకు అదే గ్రామానికి చెందిన పెద్దల మాంతయ్య(42) బంధువులతోసహా గురువారం హాజరయ్యాడు. మరో ఇద్దరితో కలిసి మాంతయ్య స్నానానికని చెరువు వద్దకు వచ్చాడు.
నీటిలోకి దిగి ఈతకొడుతూ కొంతదూరం వెళ్లాక గల్లంతయ్యాడు. వెంటనే ఈ విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన అతడి అన్న పోషం(48) తమ్ముడిని వెతికేందుకని చెరువులోకి దూకాడు. కొంతసేపటి తర్వాత పోషం కూడా నీటిలో కనిపించకుండాపోయాడు. జాలర్లు ఎంత గాలించినా అన్నదమ్ముల జాడ లభించలేదు. శుక్రవారం సింగరేణి రెస్క్యూ టీంలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
అన్నకు పిల్లలు లేరు.. తమ్ముడికి పెళ్లికాలేదు
చెరువులో గల్లంతైన పోషంకు భార్య లక్ష్మి ఉండగా, వారికి సంతానం లేదు. లక్ష్మి కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. గేదెల కాపరిగా ఉన్న పోషం ప్రతిరోజు ఉదయాన్నే భార్యకు సపర్యలు చేసి గేదెలు మేపేందుకు అడవికి వెళ్లేవాడు. పోషం గల్లంతుతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మాంతయ్యకు వివాహం కాలేదు. అన్నదమ్ముల గల్లంతుతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment